భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

4-3-1956  న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ కీట్స్ మహాకవి క్షయ వ్యాధి బారినపడినట్లే, ఈమెకూడా ఆ వ్యాధితోనే  చనిపోవటమూ యాదృచ్ఛి కమే .ఆమె పెద్దక్క ఆరు చనిపోయినప్పుడు  ఆమె నోటివెంట వచ్చిన మాటలు అత్యంత కవితాత్మకం గా ఉన్నాయి .సంస్కృతం ఇంగ్లీష్ ఫ్రెంచ్ మూడు భాషల్లో ఆమె సృజన వికసించింది .నిజంగా ఆమె ఇండో –ఆంగ్లికన్ సాహిత్యానికి మార్గ దర్శి .ఇంగ్లీష్ లో ఇండియన్లు రాసే కొత్త శకానికి తోరు దత్ తెర తీసింది   వికసించిన ఈ లేత పుష్పం అంత త్వరలో నే వాడి పోవటం దురదృష్టం .

భాషా శాస్త్ర పండితుడు ,కవి గోవిన్ చందర్ దత్ ,అత్యున్నత సంస్కారమున్న క్షేత్రమణి దంపతుల మేధో విలసిత కుటుంబం లో ,అపురూపమైన తోరు దత్  జన్మించింది .ఈ కుటుంబ నేపధ్యం తోరు దత్ సాహిత్యం పై అత్యంత ప్రభావాన్ని చూపింది .వారింటి ఉద్యానవనం గాలి లోనే కవిత్వపరిమళం విలసిల్లింది  .ఆమె బాబాయిలు ముగ్గురూ హరి చందర్ ,ఉమేష్ చందర్ ,గ్రీస్ చందర్ ‘’దత్ ఫామిలీ ఆల్బం ‘’లో కవిత్వం ఒలికి౦చినవారే .  సంతానం లో చిన్నపిల్ల తోరు అతి సుకుమారి ,మహా మేధో సంపన్నురాలు ..పైవాళ్ళి ద్దరూ అబ్జు ,ఆరు దత్ లు .తండ్రి తోరు పై చిన్నకవిత రాసి  ఆమె స్వభా వాన్ని  ఆవిష్కరించాడు –

 “Puny and elf-like, with disheveled tresses,

Self-willed and shy ne’er heeding that I call,

Intent to pay her tenderest addresses

To bird or cat, – but most intelligent…”

తండ్రి తన మానసిక బలం పై  చూపిన ప్రభావాన్ని తోరు గుర్తించింది .దానిని ఆమె జ్ఞాపకమూ చేసుకొన్నది –‘’నాన్న లేకపోతే నాకు మంచి కవిత్వానికి చెడు కవిత్వానికి మధ్య ఉన్న తేడా తెలిసేదికాదు .ఆయన అంత శ్రమపడి చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీర్చి దిద్దాడు .ఆయన లేకపోతె మా భవిష్యత్తు ఎలా ఉండేదో ‘’అన్నది .ఆమె జీవితం లో సంతోషం, బాధ ,ఎడబాటు  ,సృజన వగైరా సంఘటనలు తన ప్రమేయం లేకుండానే త్వరత్వరగా జరిగిపోయాయి .తోరు 6 ఏళ్ళ వయసులో కుటుంబం 1862 లో క్రిస్టియన్ మతం తీసుకొన్నది .దీనితో తాత్కాలికంగా తలిదండ్రుల మధ్యపొర పొచ్చాలొచ్చాయి .ఆమె తల్లి మనసు మార్చుకొని తండ్రిని చేరి ,క్రిస్టియానిటీ స్వీకరించటమే కాక ‘’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలి భాషలోకి అనువదించి రెండుభాషలలో తనకున్న సామర్ధ్యాన్ని తెలియ జేసింది .9 వ ఏట విధి బలీయమై ఆమె అన్న అబ్జు అకస్మాత్తుగా చనిపోయి మనసుపై తీవ్ర శరాఘాతం చేశాడు .ఇద్దరు ఆడపిల్లలు దీన్ని తట్టుకోలేక అల్లల్లాడి పోయారు. బాధఉపశామనానికి  ఆరు ,తోరు లిద్దరూ సాహిత్యం పై దృష్టి నిలిపి, మిల్టన్ మహాకవి రాసిన ‘’పేరడైజ్ లాస్ట్ ‘’పదేపదే చదివారు.

నాలుగేళ్లతర్వాత కుటుంబం కలకత్తా నుంచి యూరప్ వెళ్ళింది .అక్కడ సోదరి లిద్దరి మేధ బహు ముఖీనంగా వికసించి౦ది .మొదట్లో వాళ్ళు ఫ్రాన్స్ ఆగ్నేయభాగం నైస్ లో ఉన్నారు .అక్కడ స్కూల్ లో చేరి ఫ్రెంచ్ నేర్చి అందులో ప్రావీణ్యం సాధఛి సృజనకు ఉపయోగించుకొన్నారు .కొద్దికాలమే అక్కడ ఉండి ఇటలీకి,తర్వాత ఇంగ్లాండ్ కు  వెళ్ళారు .లండన్ లో సంగీతం నేరవటం తో  వారి లలిత కళాభిరుచి వేయి రెట్లు వికసించింది .ప్రపంచపు కొత్త భావోద్వేగాలు వారిని ఆకర్షింఛి కొత్తద్వారాలు తెరిచాయి .కేంబ్రిడ్జి లో ఉన్న రెండేళ్లలో వారి వ్యక్తిత్వాలు మరింతగా కుసుమింఛి వికసించాయి ..ఇక్కడే తోరు కు మేరీ మార్టిన్ అనే అమ్మాయి పరిచయమై స్నేహం జీవితాంతం కొనసాగింది .మేరీ తో కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో తోరు కవితా వికాస విలసనాలు స్పష్టంగా తెలుస్తాయి . చిన్నారి తోరు జీవితానందం తో ఆమె మేధ కూడా వికసించటం గమనిస్తాం .వాళ్ళమాటలలో, రాతలలో పూలు ,పక్షులు ,కళాదృష్టి అనారోగ్యం పాండిత్య ప్రకర్ష అన్నీ చూడచ్చు .

1873 లో వాళ్ళు ఇండియాకు తిరిగొచ్చాక ఇద్దరూ సాహిత్యాన్వేషణ లోనే గడిపారు .ఈకాలం లో తోరు ఫ్రెంచ్  కవితలను ఇంగ్లీష్ లోకిఅనువదింఛి ‘’ఎ షీఫ్ గ్లీనేడ్ ఫ్రం ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’అని పేరు పెట్టి1876 మార్చి లో ప్రచురించింది ..ఇలాంటిదే సంస్కృతం లోనూ తేవాలనే అభిప్రాయం కలిగి తండ్రి దగ్గరే సంస్కృతం నేర్చింది  . .   .  .

సాహిత్య విజయాలు

వచనం లోకంటే కవిత్వం లో ఆమె ప్రతిభ బాగా రాణించింది .రాసిన కవిత్వం 1-‘’ఎ షీఫ్ గ్ల్లీనేడ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’,2-ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూస్థాన్’’రెండే అయినా అందరి దృష్టినీ ఆకర్షించాయి .ఆమె కవిత్వం లో సున్నితమైన వర్ణన, భావ గీతం ,పాటవం ఉంటాయ.ఆమె జీవితకాలం లో ప్రచురితమైన ఒకే ఒకటి ‘’ఎ షీఫ్ ‘’.అందులో అహంభావం లేని నిరాడంబర కవిత్వం తగిన గెటప్ ఉన్నాయి .1876 ఆగస్ట్ సంచిక ‘ది ఎక్సామినర్ ‘’లో ఈ పుస్తక సమీక్ష ప్రచురించారు .సమీక్షకుడు ఎడ్మండ్ గాస్ ‘’162 అనువాదకవితలున్న ఈ పుస్తకం తోరు దత్ లోని అభినివేశాన్ని ,అత్యద్భుత ప్రదర్శనను తెలియ జేస్తుంది .ఆశ్చర్యకరమైన ,అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ‘’అన్నాడు .ఫ్రెంచ్ కవితలను ఎన్నుకోవటానికి తోరు దత్ ఫ్రెంచ్ సాహిత్యం లోని కాల్పనిక కవిత్వానికి ప్రాధాన్య మిచ్చింది .సంధియుగపు కవులైన చీనియర్ ,కొరియర్ ,లార్టైన్ ,లానే లే కాక రోమా౦టిక్స్ కాని  ,మోరో, డూపాంట్  ,వాల్మోర్ ల కవిత్వాలనూ తీసుకొన్నది .ఫ్రాన్స్ లో రోమా౦టిజం ఇంగ్లాండ్ లో లాగానే 18 శతాబ్ది చివర 19 శతాబ్ది మొదట్లో వచ్చింది .ఏనిబందనలు లేని స్వతంత్ర సరళ సూటి వ్యక్తీకరణ ఊహ దీని లక్షణం .అందుకే హృదయాలను తాకి ,ఆనందం కలిగించి , దేశభక్తి ప్రబోధాత్మకమై ఏకాంతం ,ప్రక్షాళన ,నిరాశా ,భ్రమ ,ప్రవాసం ,నిర్బంధ భావాలున్న కవిత్వానికే  ఆమె ప్రాముఖ్యమిచ్చింది.మాతృకలోని నాడిని పట్టుకొని అర్ధం చేసుకొని దాన్ని చక్కగా అనువాదం చేయటం ఆమె ప్రత్యేకత .అందుకే విశ్లేషకుడు గాస్ ‘’ఆధునిక ఫ్రెంచ్ కవిత్వం అంతా పూర్తిగా కనుమరుగైనా,నశించినా ,అందులోని అనేకకవితలను పునర్నిర్మించలేక పోయినా ఏమీ ఫర్వాలేదు వాటిలో చాలాభాగం భారతీయ అనువాదం (ఇండియన్ వెర్షన్ )లో దొరుకుతుంది ‘’అన్నాడు .నిజానికి ఆమె గుడ్డిగా అనువాదం చేయలేదు .ఏ విధమైన సంకోచం లేకుండా ఆమె ఫ్రెంచ్ పదాలను ,పద బంధాలనుతీసేసి  వాటికి మరింత స్పష్టమైన తగిన వాటితో మార్పు చేసి స్వతంత్రం తో అనువాద౦ చేసి సొగసు చేకూర్చింది . మూలం లోని లయను చాలా జాగ్రత్తగా అనువాదం లోకి తెచ్చింది. అది ఆమె గొప్పతనం .

యూరప్ లో చదివి శిక్షణ పొందినా ,తోరు దత్ హృదయం మాత్రం భారతీయమే .చిన్నప్పుడు తల్లి  రామాయణ ,మహాభారత ,పురాణ కధలను చెప్పి మనసులో గాఢ ముద్ర వేసింది .స్వయం గా సంస్కృత కావ్యాలను చదవటం వలన ఆకధలలోని ఆంతర్యం,లోతు  ఆమెకు స్పష్టంగా అవగాహన కల్గించింది .అందుకే ఆమె ‘’ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూ స్థాన్’’రాయటానికి పూనుకొని విజయవంతంగా ర్తి చేసి 1882 లో ముద్రించి ము౦దు మాటలను ఎడ్మండ్ గాస్ తో రాయించింది  .’’ఇంగ్లీష్ లో గొప్ప రచన ‘’అని విమర్శకులు మెచ్చుకొన్నారు .’’భారతీయ ఆత్మను ఆంగ్ల కవితా మాధ్యమం లో  పడమటి దేశాల వారికి ఎరుక పరచిన మొట్టమొదటి పుస్తకం ఇది ‘’అని సాహిత్య విమర్శకుడు లోకితా బసు అన్నాడు .   చక్కని వైవిధ్యం కధనం సుందర కవిత్వం తో గొప్ప విందు అనిపించింది .ఇందులో  సావిత్రి ,లక్ష్మణుడు ,ప్రహ్లాదుడు ,,సింధు మొదలైన వారి కధలున్నాయి .మొత్తం 3 ముద్రణలు పొందింది ‘’షీఫ్ ‘’కాని తనసాహితీ విజయాలను చూసుకొనే అదృష్టం ఆమెకు దక్కలేదు .ఎనిమిది కవితలను పెద్దక్క అనువాదం చేసింది .

తోరు దత్ రెండునవలలు 1-బియాంకా( ది స్పానిష్ య౦గ్ వుమన్ )2-లె జర్నల్ డిమాడెమోడిల్లెడిఆర్వెస్’’రాసింది .మొదటిది అసంపూర్తి రోమాన్స్ ఇంగ్లీష్ నవల .రెండవదిమార్గరెట్ అనే ఆమె డైరీ రూపం లో ఫ్రెంచ్ భాషలో రాసినది .అంటే ఫ్రెంచ్ భాషలోనూ రాసిన మొట్టమొదటి భారతీయ రచయిత్రి తోరు దత్ అని తెలుస్తుంది .ఈ రెండూ ఆమెచనిపోయిన తరువాత ఆమె దగ్గరున్న పేపర్ల గుట్టలో దొరికాయి .భావ గర్భితంగా కవితాత్మక కధనం తో సరళంగా రాసిన రచనలు ఈ రెండు .తోరు కు భారతీయ సాంస్కృతికవారసత్వమ౦టేగర్వపడుతుంది .అందులోని  ,జానపద ,పురాణ ,,ఇతిహాస కధలన్నాచెప్పలేనంత ఇష్టం.ఆంగ్ల విద్య నేర్చినా,ఆమెజీవిత విధానమ౦తా భారతీయమే . ఇ.జె.ధాంసన్ఆమెను గురించి చెబుతూ , “Toru Dutt remains one of the most astonishing woman that ever lived …. Fiery and unconquerable of soul. These poems are sufficient to place Toru Dutt in the small class of women who have written English verse that can stand.’’అన్నాడు . ఆమె రాసిన ‘’కాసురీన ట్రీ’’(సరుగుడు చెట్టు )కవిత ఆధునిక భారతీయ సాహిత్యం లో బాగా ప్రసిద్ధి చెందింది .ఆచెట్టు జ్ఞాపకాలతో తన బాల్యాన్ని నెమరేసుకోవటం దీని ప్రత్యేకత .ఈకవిత మనదేశం లో ఇంగ్లీష్ పుస్తకాలో బోధనాంశంగా ఉండేది .

తోరు చనిపోయాక తండ్రికి 1887 లో ‘’బాలడ్స్ ‘’రచన దొరికి ముద్రించాడు .ఆమె నవల ‘’లె జర్నల్ ‘’ను పృధ్వీంద్ర ముఖర్జీ బెంగాలీ భాషలోని అనువాదం చేశాడు .ఇది ‘’బసుమతి ‘’అనే బెంగాల్ పత్రికలో సీరియల్ గా వచ్చింది .ఇంగ్లీష్ అనువాదమూ సీరియలైజ్ అయింది .తోరుకు జర్మన్ భాషలోనూ ప్రావీణ్యం ఉంది .బ్రిటిష్ వారు భారతీయులపై చూపిస్తున్న దాష్టీకం ,పెత్తనం పై తోరు తీవ్రంగా విమర్శించింది .నిత్యం దినపత్రికలు చదివి ఇండియాలో జరిగే విషయాలన్నీ తెలుసుకొని భారతీయులపై  బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణ విధానాలవల్ల ఆ జాతిపై ఆమె కు  క్రోధం పెరిగింది .ఒక భారతీయునిపై ఇంగ్లీష్ వాడి కుక్కలు వెంటబడి బాధ పెడితే,ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తే, వాడు కేసుపెడితే, 3 వారాల జైలు శిక్ష విధిస్తే, ఆమె పేపర్ లో తీవ్రంగా తన అసమ్మతి తెలియ జేస్తూ ‘’ఇంగ్లీష్ వారి దృష్టిలో భారతీయులు ఎంత చులకనగా ఉన్నారో ఈ ఉదంతం తెలియ జేస్తుంది’’అన్నది మరో సారి 9 మంది బెంగాలీలను చంపి అనేకమందిని గాయపరచిన బ్రిటిష్ సైనికుల అరాచకాన్ని పేపర్ లో ఎండ గట్టింది .ఆడంబరాలు గిట్టని ఆమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు కలకత్తా మైదానం లో పెద్ద ఎత్తున మందుగుండు సామాను కాల్చటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది  .డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ కలకత్తా వచ్చినప్పుడు స్వాగత సత్కారాలకు 9 000రూపాయలు ఖర్చు చేయటాన్ని ప్రశ్నించింది  .అన్న ,అక్క క్షయ వ్యాధి సోకి మరణించారు .తోరుకూ అది సోకిఆమె 1887 లో మరణించింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-17 –ఉయ్యూరు .

 

.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.