నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ ‘’అన్నది ఆమె .’’అమ్మా మీ పేరు వగైరా చెప్పండి ‘’అన్నా .’’నా పేరు జాకీ రాణి .చాలా సభల్లో కవిత్వం వినిపించా .ఏ టాపిక్ అయినా దంచేస్స్తా .’’అంది .’’దంపుడూ ,రుబ్బుడూ వద్దుకాని ,నీతో నాకు ఇదివరకు పరిచయం లేదు కదా అందుకని అడిగా .దేనిమీదైనా రాస్తానన్నావు కనుక నాలుగు లైన్లు ‘’ఆటో ‘’మీద వినిపించు అన్నా .’’ఒకే సార్ –వినండి –‘’తోలుతుంటే వాడు ఆటో –చెప్పాలనిపిస్తుంది రైటో –వాడు చెప్పే రేటో –వింటే రక్త పోటో ‘’.అన్నది  ‘’ఎలా ఉంది  సార్’’అడిగింది .’’నీ కవిత వింటే గుండె పొటే’’అని ఫోన్ పెట్టేశా .కాసేపు మాగన్నుగా కునికా .మళ్ళీ రింగ్ రింగ్ .’’ఎవరు ?’’అడిగా .’’నేను త్రిజటా రావు సార్.మీ కవి సమ్మేళనం లో నాకు చాన్స్ ఇవ్వండి ‘’అన్నది అవతలి గొంతు .’’ఇంతకీ మీరు పురుషా స్త్రీయా ?’’సందేహం గా అడిగా ‘’మగోణ్ణే. సబ్జెక్ట్ మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా ‘’అన్నాడు అదేదో సినిమాలో వేణుమాధవ్ ఇంటర్వ్యు లో ఎం ఎస్  నారాయణ ను అడిగినట్లు .’’నీ కెందుకు శ్రమకాని అబ్బాయా .’’నోట్ల రద్దు మీద కవిత గుద్దు ‘’అన్నా ‘’పెద్దనోట్లు రద్దు –మోదీకేమో బలే ముద్దు –మనకేమో నెత్తిన పిడి గుద్దు.’’అన్నాడు .’’బానేఉంది .’’అన్నా .’’మరి నా చాన్సో ‘’అన్నాడు ‘’ఇస్తే నీకు ముద్దు –నాకు మాత్రం సభికులనుంచి పిడి గుద్దు’’అన్నా ఠపీ మని ఫోన్ పెట్టేశాడు .ఇంతలో మరోకాల్ ‘’నేనండీ అరుణ తార .కవి సమ్మేళనాలెన్నిటిలోనో పార్టిసిపేట్ చేశా. చాన్సిస్తే రాస్తా .’’అన్నది .’’నీ భావ ధార వదులు తల్లీ ‘’అన్నా.’’నిఘంటువు లో  ఉండకూడదు పేరు మగ –అదంటే నాకు పరమ పగ -.మగోడు లేకుంటే ఏమిటి వగ –వాడ్ని ఎందుకు పొగుడుతారు తెగ ‘’అన్నది ‘’ఇక చాలు అమ్మా .’’ఇస్తే చాన్స్ నీకు మా వాళ్ళతో నాకు పొగ –ఇక కక్కకమ్మ నీ అక్కసు తెగ సెగ ‘’అని ఫోన్ పెట్టేశా .

లేచి కాఫీ తాగి సేద దీర్చుకొంటుంటే  మళ్ళీ సెల్ మోత .’’హలో ‘’అన్నా .’’నేను సార్ భావకవి బలాదూర్ ను.కవి సమ్మేళనం లో నాకు ఎల్లానూ చాన్స్ ఇస్తారనుకోండి .ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి సార్?అడిగాడు ‘’కోడి పందాలు ‘’అన్నా .’’అయితే పందెం కోడిలా రెచ్చిపోతా –వినండి –‘’మేపిన కోడిని కొక్కొరకో –పందెం వేస్తారు కొక్కొరకో –కత్తులు ఉండవంట కొక్కొరకో –ధ్రిల్ ఏముంటుంది కొక్కొరకో ‘’అన్నాడు ‘’నువ్వు ఆపక పోతే కొక్కొరకో –పోలీస్  కంప్లైంట్ ఇస్తా కోక్కోరకో ‘’అనగానే ఫోన్ బంద్. మరో నిమిషం లో ఫోన్ బాంగ్ ‘’అయ్యా నేను పద్య కవి పరమేశాన్ని .మీ సమ్మేళనం లోనాకూ చాన్స్ –‘’అన్నది అవతలి గొంతు ‘’సరే పరమేశం జీ .దేని మీద పద్య స్వారి చేస్తారు ?’’అడిగా .’’ఏదైనా నల్లేరు పై బండీ లా నడిపిస్తాను ‘’అన్నాడు .’’అయితే అమరావతి పై చెప్పండి సాంపిల్ గా ‘’అన్నా .’’దేవేంద్రుని రాజ దాని అమరావతి –దాని వగలు సోయగాలు చూస్తుంటే పోయేను మతి –అప్సరసల పొందు తీర్చేను జీవన గతి –ఆ ఆనందం చెరగని  స్మ్రుతి ‘’అని ‘’ఎలా ఉంది సార్?’’అన్నాడు ‘’అయ్యా! కళ్ళముందున్న నవ్యాంధ్ర రాజధాని ని వదిలేసి , సొల్లు కార్చుకొనే ఆ అమరావాతి పై చెప్పారు .సమకాలీనం లో జీవించండి .’’అన్నా .’’అరే సార్.ఇక్కడో అమరావతి ఉందా ?’’అన్నాడు ‘’’ఊహాలోకం లో సంచరిస్తే మతి –లేకుంటే ఇంటికాడ పెళ్ళాం పిల్లలు అధోగతి ‘’అన్నా .ఫోన్ పెట్టేశాడని చెప్పక్కరలేదను కొంటాను .

కాసేపు పేపర్ తిరగేశా .ఇంతలో రింగ్ రింగ్ ‘’ఎవరూ ‘’అన్నా’’నేను సార్ మినీ కవితల మీసాల్రావు ‘’అన్నాడు .’’మిమ్మల్ని గురించి వినలేదండీ .మీ పరిచయం .’’అన్నా .చెప్పి,సాంపిల్ గా ‘’ఆకాశం లో మేఘం –కిందనేమో దాహం –అది కురవదు –ఇట దాహం తీరదు ‘’అన్నాడు. ‘’ కవితలో కవిత్వం ఉండదు –చాన్సిస్తే నేను ఉండను’’అన్నా .మరికొంత సేపటికి మరో మోత ‘’నా పేరు  నానీల నాని .చాన్సిస్తారా ?’’డైరెక్ట్ క్వశ్చన్ .’’ఓకే .మాదిరి కవిత చెప్పండి ‘’ఒకే .’’నానీ-నేనీ-కానీ –పోనీ –అనీ  –‘’అని ఆపేశాడు .’’అబ్బో .’’వినీ వినీ –పైకి పోనీ ‘’అన్నా.అర్ధం చేసుకోన్నాడో ఏమో మారు మాట లేదు .కొంతసేపటికి మరో ఫోన్ ‘’హలో ఎవరూ ‘’అన్నా .’బ్రదర్ -’నేను వీరవిప్లవ కవి పరపర రావు ‘’అన్నది అవతలి గొంతు ‘’బ్రదరూ  !నాకు విప్లవసాహిత్యం తో పరిచయం లేదు ఆనాయకులేవరో తెలీదు నువ్వు  రాంగ్ నంబర్ కు ఫోన్ చేశావేమొ బ్రదర్  ?’’అన్నా .’’మేం అడవుల్లో తిరుగుతున్నామన్నా  జనజీవన స్రవంతి లో వార్తలన్నీ తెలుసుకొంటాం .అడవి రాముళ్ళం.మీ కవితా సమ్మేళనం లో అజ్ఞాతంగా పాల్గొంటాను .అవకాశాం ఇస్తారా ?’’దేని పై కవిత్వం చెబుతావు బ్రదర్  ?’’అడిగా .’’బుజాన బుల్లెట్టు –కాళ్ళకు జాకెట్టు –నెత్తి మీద పాకెట్టు –నన్ను చూస్తె షాక్కొట్టు’’అన్నాడు రొప్పుతూ .’’బ్రదర్ .’’ఒకమాట చెబుతాను విను బ్రదర్ .నీకు ఇంకా ఆసాహిత్యం వంట బట్టినట్లు లేదు .ఎదోకుతూహలపడి అడిగినట్లున్నావు .మీవాళ్ళు రాస్తే బుల్లెట్ల వర్షం కురిసేట్లు ఉంటు౦ది  నీ కవితలో పొంతన లేదు కవిత్వం ప్రాక్టీస్ చెయ్యి ‘’అన్నా .’’నిజమే బ్రదర్ .నువ్వు అన్నాక నా కవిత నాకే రోతగా ఉంది .ఏదో ఆత్రపడ్డాను ‘’అన్నాడు .’’బ్రదర్ ! కవిత్వం లో ప్రవేశించాలనుకొన్న నీ భావనకు సాల్యూట్ .బాగా రాస్తే నేనే ఆహ్వానం పంపిస్తా నువ్వు అడగకుండా ‘’అన్నాను ‘’ఒకే బ్రదర్ లాల్ సాల్యూట్ ‘’అంటూ బూట్ల శబ్దం తో ఫోన్ ఆగి పోయింది .

ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరా బాదరా రోప్పుకుంటూ వచ్చాడు .’’బావా ! నేను లేకుండా కవి సమ్మేళనమా?ఎంత అవమానమెంత అవమానము ?అన్నాడు పాత ఎన్టీ ఆర్ స్టైల్ లో .’’నువ్వూ కవిత్వం కక్కుతావా ?అఘోరించు ’’అన్నా’’శుభం పలకరా మంకేన్నా అంటే అదేదో అన్నట్లు ఈ దీవనలేమిటి బా! .పండగ ముందు .’’అన్నాడు .’’బామ్మర్ది అంటే సొతంత్రం రా .నే ననాలి నువ్వు పడాలి అది రూలు ‘’అన్నాను  .’’కవిత్వ విషయం ఏంటి బా !’’అన్నాడు .’’ఇ౦కా ఆలొచి౦చలేదు .ఆలోచిస్తుంటే కురుపు సలపరింతలాగా ఫోన్లమీద ఫోన్లు .నువ్వు దేనిమీదైనా ప్రిపేర్ అయ్యావా ?’’’’మనం ఆల్రెడీ రెడీ .’’అన్నాడు .’’ఒక నమూనా వదులు’’అన్నా –సరే బావా !నవ్వ కూడదు .’’అన్నాడు ‘కానీ !’’అన్నా ‘’ స్వచ్చ భారత్ కోసం చీపురుతో రోడ్లన్నీ ఊడవ లేక అలసిమోడీ  -పెద్దనోట్లను ‘’రద్దు చీపురు’’తోఅర్ధ రాత్రి  ఊడ్చి పారేశాడు –డబ్బు తెలుపైందో లేదోకాని –నల్లకుబేరులు  బేర్ మన్నారో లేదో తెలీదుకాని –సామాన్యులు ‘’బావురు’’మన్నారు .పోపుల డబ్బా డబ్బులు బ్యాంక్ లో చేరాయి కాని –నల్లదనం మరింత నలుపెక్కిందని వింటున్నాం –ఫలితాలకోసం రెండు నెలలు ఆగినా –ఎదురు చూపేకాని ఆశల ముందు చూపు కనిపించట్లేదు –ఎవరికోసం ఈ రద్దు ?అమెరికా సలహాతోనా ?అంతు తెలియని అజ్ఞాత వ్యక్తుల ప్రేరణ తోనా ?ప్రజల జీవితాలతో ఆడుకో వద్దు –చూస్తూనే ఉన్నాంగా ఎన్నో దేశాల భవితవ్యం –మనదైన భావన ఉండాలి ప్రతి చర్య వెనకా –అప్పుడే వస్తుంది ఎంచక్కా ప్రగతి చక చకా ‘’అని గుక్క తిప్పుకోకుండా వదిలాడు .’’ఒరే !నీ లో ఇంత కవిత్వం అజ్ఞాతం గా దాగుందా –బాగుంది –నువ్వే ఈ కవిసమ్మేళనాన్ని నిర్వ హించు ‘’అన్నా .’’బావో ! నా నెత్తిన అంత భారం పెట్టకు .ఏదో నీ నీడ లో వాడిని ‘’అన్నాడు .’’ఎంత కాలం నీడ ?వెలుగులోకి రా ఈ సారైనా ‘’అన్నా .’’ముసిముసి నవ్వులతో వాళ్ళక్క దగ్గిరికి వంటి౦ట్లోకి పండగ సరుకు భక్షి౦చటానికి రంయి మని దౌడు తీశాడు బామ్మర్ది బ్రహ్మం .

Inline image 3

రేపటి  సంక్రాంతి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-13-1-17 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.