నాద బ్రహ్మ ద్వయం – నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

నాద బ్రహ్మ ద్వయం

నాద బ్రహ్మ ,సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదోపాసకుడు ,మహా వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం.లకు ఉయ్యూరు లో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లోనిర్వ హిస్తూ ,బాలమురళీ కృష్ణ  మరణించిన నెల రోజుల లోపునే బహుశా ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ఏ సాహితీ సంస్థ ఏర్పాటు చేయని ‘’స్వర్గీయ మంగళంపల్లి బాల మురళీ  కృష్ణ  స్మారక నగదు పురస్కారం ‘’ను సరసభారతి ఏర్పాటు చేసి  ,మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి ,శ్రీ సాంబావధాని (అమెరికా )దంపతుల సౌజన్యం తో ,రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లోగాన౦ చేస్తున్న గాయనీ మణులకు అందజేస్తున్న సందర్భంగా ,ఆ ‘’నాద బ్రహ్మ ద్వయం ‘’జీవిత విశేషాలను సంక్షిప్తం గా అంద జేస్తున్నాను .

నాద  బ్రహ్మ త్యాగ రాజ స్వామి

శ్రీ సర్వ జిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి సోమవారం ప్రకాశం జిల్లా కంభం తాలూకా కాకర్ల గ్రామం లో శ్రీ కాకర్ల  రామబ్రహ్మం ,శ్రీమతి సీతమ్మ దంపతులకు శ్రీ త్యాగరాజ స్వామి ఆ త్యాగరాజ శివుని అనుగ్రహం తో జన్మించారు .వీరిది వైదిక బ్రాహ్మణ కుటుంబం ,మురికి నాడు శాఖ .తండ్రి తంజావూర్ రాజు శరభోజి ఆస్థాన ఉద్యోగి .తాత గిరిరాజకవి .అందుకే త్యాగయ్య ‘’గిరిరాజ సుతా తనయా ‘’అనే కృతి బంగాళా రాగం లో రాశారు .కుటుంబం  ఆంధ్ర దేశం నుండి తమిళనాడుకు మొదట ఆరు పల్లెల కూడలి ‘’తిరువారూర్ ‘’కు తర్వాత పంచ నదీ సంగమం ‘’తిరువయ్యూర్ ‘’కు చేరింది .ఇక్కడే త్యాగయ్య సంస్కృతం వేద,వేదాంగాలు నేర్చారు .వీరి సంగీత గురువు శ్రీ శొంఠి వెంకట రమణయ్య .

త్యాగయ్యగారు 96కోట్ల శ్రీ రామనామం జపించి శ్రీ రామ దర్శనం పొందిన మహానుభావులు .త్యాగ బ్రహ్మ మహా వైణికులు కూడా .మొదటి భార్య శ్రీమతి పార్వతి చనిపోతే ,ఆమె చెల్లెలు శ్రీమతి  కమలను ద్వితీయం చేసుకొన్నారు .కూతురు సేతామహలక్ష్మి .ఆమెకు ఒక కుమారుడు జన్మించి చనిపోయాడు .త్యాగయ్య గారు 13 వ ఏటనే తోడి రాగం లో ‘’నమో రాఘవా ‘’కీర్తన రాశారు .నారద మహర్షి త్యాగయ్యగారికి ‘’స్వరార్ణవం ‘’అనే సంగీత గ్రంధం అనుగ్రహించాడు ఈ విషయాన్ని ‘’సాధించెనే మనసా ‘’ లోను ‘’స్వరరాగ సుధా రసము ‘’కృతిలోను చెప్పారు .జీవిత కాలం లో 24వేల  రచనలు చేసినట్లు తెలుస్తుంది .కాని వారివి తెలుగు కృతులు 711 కృతులు .సంస్కృతం లోనూ రచించారు  .ప్రహ్లాద భక్త విజయం ,నౌకా చరిత్ర అనే రెండు సంగీత నాటకాలు రాశారు . అందరు దేవుళ్ళను తన శ్రీరామునిలోనే దర్శించుకొన్న పుణ్యాత్ములు త్యాగయ్య .చివరి దశలో ‘’నాద బ్రహ్మానంద ‘’దీక్షానామం ధరించి రామగానం లోనే గడిపారు .శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు 80 వ ఏట త్యాగ బ్రహ్మ నాదైక్యమయ్యారు .కనుక ఆయన కు ఇది 250 వ జయంతి .170 వ వర్ధంతి . వర్ధ౦తి రోజునే  త్యాగ రాజ ఆరాధనోత్సవాలు తిరువయ్యూర్ లోను, దేశమంతటా ఘనం గా జరుగుతాయి .త్యాగబ్రహ్మ౦గారి శిష్యులలో మూడవ తరం వారు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,నాల్గవ తరం  వారు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు.

శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు, చెన్నపట్నం నివాసి త్యాగరాజ స్వామికి మహా భక్తురాలు .ఆమె ఒకసారి తిరువయ్యూర్ వచ్చి శిధిలమై పోతున్న త్యాగరాజస్వామి సమాధిని చూసి చలించి పోయి ,తంజావూర్ రాజుద్వారా ,రెవిన్యు అధికారుల ద్వారా స్థలాన్ని కొని ,శుభ్రం చేయించి మద్రాస్ లోని తన ఖరీదైన మేడను అమ్మి ఆ డబ్బుతో  త్యాగరాజస్వామికి గుడి, చుట్టూ గోడలుకట్టించింది .27-10-19 21 లో శంకుస్థాపన చేసి నాలుగేళ్ళలో నిర్మించి 7-1-19 25 న కుంభాభి షేకం చేయించింది .మండపం ,పాకశాల నిర్మించటానికి ధనంలేక తన నగలు,సంపద అన్నీ అమ్మేసింది.మహానటుడు చిత్తూరు నాగయ్యగారిని కలిసి సత్రం నిర్మించమని కోరగా ఆయన మహా వితరణ శీలికనుక వెంటనే సత్రం నిర్మించి అందజేశారు .

త్యాగ రాజ కీర్తనలు 1-తాత్వికం 2-కీర్తనం 3-నిత్యానుస్టానం అని మూడు రాకాలు అని విశ్లేషకులు భావించారు .నలిని కాంతి ,జయంతి శ్రీ వంటి 100 కొత్త రాగాలను త్యాగబ్రహ్మ సృష్టించారు .త్యాగరాజ పంచరత్న కీర్తనలను సామూహికంగా ఆరాధనోత్సవం నాడు గానం చేస్తారు .ఇవి అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞానమయ ,ఆనందమయ కోశాలను మెట్లుగా ఎక్కే భావ పరంపర గా భావిస్తారు .ఉత్సవ సంప్రదాయ కీర్తనలు  ఉత్సవాలనాడు గానం చేస్తారు.జీవన్ముక్తుడైన నాద బ్రహ్మ ,గానబ్రహ్మ ,కవిబ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ అయిన త్యాగ బ్రహ్మ గారు’’బ్రహ్మొహం ‘’ అంటూ పాడిన చివరి కృతి ధన్యాసి రాగం లోని ‘’శ్యామసు౦దరాంగ-సకల శక్తియు నీవేరా-  తామస రహిత ,గుణ సాంద్ర –ధరను వెలయు శ్రీరామ చంద్ర –దుస్ట దనుజ విహార ,శిష్టజన హృదయ విహార –ఇష్ట దైవము నీవేరా ,ఇలను త్యాగ రాజు వేరా ‘’.ఇదే ఆయన చరమగీతం –(శ్వాన్ సాంగ్) ‘’.త్యాగరాజహంస పరమహంసలో చేరిపోయింది .

తెలుగునాట పుట్టి ,తమిళదేశం చేరి అక్కడ శ్యామాశాస్త్రి ,ముత్తుస్వామి దీక్షితులవంటి సంగీత దిగ్గజాలతో కర్నాటక సంగీత త్రయం అనిపించి , వారిలో శిఖరాయమానం గా ప్రకాశించి తమిళనాట తెలుగు భాషా వైభవాన్ని చాటి, కీర్తి పతాకను ఎగరవేసిన నాద బ్రహ్మ త్యాగరాజ స్వామి .

మరో  నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

 

మురళీ కృష్ణ బాలమురళి అవటం

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకర గుప్తం గ్రామం లో శ్రీ మంగళం పల్లి పట్టాభి రామయ్య ,శ్రీ మతి సూర్య కాంతం దంపతులకు శ్రీ బాలమురళీ కృష్ణ 6-7-1930 న జన్మించారు .పుట్టిన 15 రోజులలోనే తల్లిని పోగొట్టుకొన్న దురదృస్టవంతులాయన ..తండ్రిగారు తల్లీ గురువు  సర్వమూ అయి కంటికి రెప్పలా పెంచారు .రాత్రిళ్ళు తండ్రి పక్కలో పడుకొని ఆయన దగ్గరే సరళస్వరాలు ,జ౦ట స్వరాలు ,వర్ణాలు కీర్తనలు నేర్చారు .1939 జులై 6 న  9 వ ఏట లోబెజవాడలో దుర్గా పురం లోని శరభయ్య గుడులలో మందిర ప్రారంభోత్సవ సందర్భం గాశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి గురువు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి సద్గురు ఆరాధనోత్సవాలలో శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికధ ఏర్పాటు చేశారు .ఆయన రాక ఆలస్యమైతే ఒక అరగంట కచేరి చేయమని తండ్రి గారు ఆశీర్వ దించి  వేదిక ఎక్కి౦చారు .కచేరీ సాగింది .భాగవతార్ వచ్చి మూడుగంటలపాటు ఈ మురళీ కృష్ణ గానం తన్మయంగా వింటూనే ఉండిపోయారు .శ్రోతలు తన్మయత్వం చెందారు. మంత్ర ముగ్ధులయ్యారు .దాసుగారు ‘’ఇంక నేను హరి కధలు చెప్పను .ఈ కుర్రాడిని  ఈ నాటినుంచి బాలమురళీ కృష్ణఅని పిలుద్దాం ‘’అని దీవించారు అప్పటినుంచి మురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ అయ్యారు .  బహుశా ఇప్పుడేనేమోశ్రోతగా ఉన్న  శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తటాలున వేదిక ఎక్కి బాలమురళి ని ప్రశంసిస్తూ మూడు పద్యాలు చెప్పి ఆశీర్వది౦చారట .అందులో ఒక పద్యం ‘’నా వలెనే వృద్దుడవై –నావలెనే కీర్తిగాంచి –నావలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’  .

త్యాగరాజస్వామి ఆశీర్వాదం

11 వ ఏట తిరువయ్యూరు లో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలకు గురువు పారుపల్లి వారితో బాలమురళి వెళ్ళారు .అక్కడ తాను పాడాల్సిన సమయాన్ని శిష్యుడికిచ్చారు గురువుపారుపల్లి .అంతే జంకూ గొంకూ లేకుండా అనాయాసంగా కచేరీ చేసి అందరి నుంచి అపూర్వ స్పందన అందుకొన్నారు .ఆ సభలో ఉన్న శ్రీమతి బెంగుళూరు నాగ రత్నమ్మగారు బాలమురళి చేయి పట్టుకొని అక్కడేఉన్న శ్రీ త్యాగరాజస్వామి  విగ్రహం పాదాల వద్దకు తీసుకొని వెళ్లి నమస్కారం చేయించి ‘’ఏ నర దృష్టీ సోకకుండా ,జనఘోష లేకుండా ఈ పిల్లవాడిని కాపాడు స్వామీ ‘’అని ప్రార్ధించారు.

కృతి రచనకు శ్రీకారం

14 వ ఏట బెజవాడ సత్యనారాయణ పురం లోని వీరింటి ఎదురుగా ఉన్న దూబ గుంట వారి సత్రం లో కుర్తాలం పీఠాధిపతి శ్రీ శ్రీ విమలానంద భారతీ స్వామి విడిది చేసి ఉన్నారు .బాలమురళి వారిని దర్శించి ఆశీస్సుల౦దు కొని 4 30 బాణీలలో 72 మేళకర్త రాగాలకుఒక్కొక్క కృతి చొప్పున కీర్తన రచనకు శ్రీకారం చుట్టి ,రచించి ‘’జనకరాజ కృతి ‘’అని ఆ గ్రంధానికి పేరు పెట్టారు .యతి ,ప్రాస ,కవితా లక్షణాలను కృతి కీర్తన ,పాట ,పదం జావళీ లలోని భేదాలను ,సృజన రహస్యాలను నేర్పిన తొలిగురువు శరభయ్య గుడుల లో దేవీ ఉపాసకులు పండితులు శ్రీ అప్పయ్య శాస్త్రిగారు .

ఆకాశవాణి ఆర్టిస్ట్

14 వ ఏటనే తమ అపూర్వ సంగీత వైదుష్యం తో ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు .1940  నుండి రేడియో ప్రస్థానం కొన సాగించారు . 22 వ ఏట విజయవాడ కేంద్రం లో సంగీత పర్య వేక్షణ శాఖ లో  చేరారు .శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీ బాలమురళి ఆనాటి రేడియో సంగీత త్రయం .ఉదయం పూట కార్యక్రమం లో భక్తికి సంబంధించిన ది ఉండాలని చెప్పి మొట్ట మొదటి సారిగా ‘’భక్తి రంజని ‘’ప్రవేశ పెట్టింది బాలమురళీయే .సంగీతం నాటకం,స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ శాఖలు ప్రొడ్యూసర్ పోస్ట్ లు ఏర్పాటు చేయించి ,సమర్ధులను నియమింప జేసిన ఘనత బాలమురళి దే.ఎంకిపాటలు ,రామదాసు ,అన్నమయ్య ,త్యాగరాజు ,సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలకు రాగాలు కూర్చి గానం చేసి చేయించి  శ్రోతలకు పరిచయం చేసి వినిపించారు .’’ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది ‘’అనే అన్నమయ్య కీర్తనకు మొదటి సారిగా స్వర పరచి గానం చేశారు .ఎన్నో తత్వాలకు స్వరకర్త బాలమురళి .’’ఏమీ సేతురా లింగా ‘’వంటివెన్నో ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .ప్రయాగ రంగ దాసు కీర్తన-‘’రాముడుద్భవించినాడు రఘుకులమ్మున ‘’అనేది ఆయన నోట అపురూప గీతమైంది ‘’పిబరే రామ రసం రసనే ‘’,’’స్థిరసా నహి నహిరే ‘’వంటి సదాశివ బ్రాహ్మేంద్ర కీర్తనలకు స్వర రాగ స్పర్శ కల్పించి చిరస్మరణీయం చేశారు .జయ దేవుని అష్టపదులు స్వాతి తిరుణాల్ కీర్తనలు ,శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల కృతులు ఆయన గానం లో అమృతమయమయ్యాయి .గాయత్రీ రామాయణం ,అమర నారాయణ కీర్తనలను స్వరపరచి ,పాడి, జీవం పోసిన నాదానంద మూర్తి బాలమురళి .ఆయన కాలం లో వచ్చిన యక్షగానాలు ,సంగీత రూపకాలు రసరమ్యాలు .కబీర్ గానటించి సమర్పించిన సంగీత రూపకం శ్రీ  బందా కనకలింగేశ్వర రావు గారి ప్రశంసలను పొందింది .ఆకాశ వాణిలో 9 విభాగాలలో అత్యుత్తమ శ్రేణి సాధించి పెట్టిన ఘనత బాలమురళి దే.అందుకే ఆయన ఆకాశవాణిలో పని చేసిన కాలం ‘’స్వర్ణ యుగం ‘’అన్నారు .

సంగీత కళాశాల స్థాపన –ప్రిన్సిపాల్

విజయవాడలో సంగీత కళాశాల  స్థాపించ వలసిన  అవసరాన్ని గుర్తించి  ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాలా ప్రయత్నం చేసి శ్రీ అన్నవరపు రామస్వామి వంటి వారి సహకారం తో కళాశాల స్థాపనను చేయి౦చ గలిగారు బాలమురళి.  29 ఏళ్ళకే మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు చేబట్టారు .విద్వత్తుకు తగిన ప్రతిఫలం ఇది .అయితే ఒక్క ఏడాది మాత్రమే పని చేసి 30 వ ఏట రాజీనామా చేసి మద్రాస్ వెళ్ళిపోయారు .విజయవాడలో సత్యనారాయణ పురం లో ‘’మంగళం పల్లి వారి వీధి ‘’ని పురపాలక సంఘం ఏర్పరచి గౌరవించింది .

తమిళనాట విరిసిన తెలుగు తేజం

సర్వశ్రీ సెమ్మంగుడి ,జి యెన్ బాలసుబ్రహ్మణ్యం ,ఎం ఎస్ సుబ్బు లక్ష్మి పట్టమ్మాళ్ వంటి తమిళ సంగీత దిగ్గజాలున్న మద్రాస్ మహా నగరం లో ప్రవేశించిన బాలమురళి అందరినీ మించి స్వీయ ప్రతిభా పాటవాలతో ,అసలు త్యాగరాజ కృతి ని ఎలా పాడి భావాన్ని వెలువరించాలో చూపి అందరి హృదయాలను గెలిచి నిలబడి జయ కేతనం ఎగర వేశారు .ఆనాటి త్యాగ రాజుగారిలా   ఈ నాటి అపర త్యాగబ్రహ్మ తెలుగుకు పట్టాభి షేకం చేశారు .దేశ విదేశాలలో 25 వేల కచేరీలు చేశారంటే మానవ మాత్రునికి సాధ్యమా అని పిస్తుంది .’’వేదిక ఎక్కే దాకా నేను బాల మురళీ నే ‘’కచేరీ ప్రారంభించగానే నేను నేనుకాను .అమ్మ వారు నన్ను నడిపిస్తుంది ‘’అన్నారు ఆయన  మాతో మూడేళ్లక్రితం మద్రాస్ లో వారింటికి వెళ్లి కలిసి మాట్లాడినప్పుడు .అది సత్యమే ..

రాగ సృష్టి

త్రిశక్తి ,ఓంకారి ,లవంగి ,రోహిణి ,కాళిదాస,తరణి ,సర్వశ్రీ ,మనోహర  సుముఖ ,వల్లభి ,ప్రతి మధ్యమావతి, మహతి వంటిఅపూర్వ రాగాల సృష్టికర్త బాలమురళి .అంతే కాదు అవతలివాడిలో ఉన్న ప్రతిభను గుర్తించి అతడిని పైకి తెచ్చే సృష్టికర్త కూడా .శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ మాటలలో  ‘’ఈలపాటలో సిద్ధహస్తుడనని నన్ను గుర్తించి పిలిపించి ఇంట్లో ఉంచుకొని ,తనతో కచేరీలకుతీసుకు వెళ్లి అన్నీ నేర్చు కోనేట్లు  చేసి,కన్నకోడుకులా చూసి నాకు సంగీత భిక్ష పెట్టి నన్ను తీర్చిదిద్దినది బాలమురళీ కృష్ణ గారే ‘’అని పొంగిపోయి చెప్పారు .అందుకే బాలమురళి ని ‘’సృష్టి కర్త ‘’అన్నారాయన .   అలాగే శ్రీ డి .వి ,మోహన కృష్ణ ప్రతిభకూ తగిన ప్రతిఫలం కలిపించారు .

రచన

7 2 మేళ కర్త రాగాలకు 430 బాణీలలో ఒక్కొక్క కృతిని కూర్చి ‘’జనక రాజ కృతి మంజరి ‘’గ్గ్రంథంగా వెలువరించారు బాలమురళి .తన స్వీయ కృతులను ‘’సూర్య కాంతి ‘’పుస్తక౦ గా  తెచ్చారు .ఎన్నో తిల్లానాలకు ప్రాణం పోశారు బాలమురళి అంటే తిల్లానా అని ‘’అల్లానా ‘’అని ఆశ్చర్య పోతాం .

 

.       పురస్కారాలు

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మవిభూషణ్ పురస్కారాలు అందజేసింది .ఆయన 75 వ జన్మ దినోత్సవం లో   తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత పాల్గొని బాలమురళి కి ‘’భారత రత్న ‘’ఇవ్వాలని కోరింది .ఆవిడ పేరుమీద ‘’జయజయలలితే ‘’అనే కొత్త రాగాన్ని సృష్టించి పాటరాసి పాడి ఆమెకు అంకితమిచ్చారు  బాలమురళి .ఉత్తమ శాస్త్రీయ ,ఉత్తమ నేపధ్యగాయక ,ఉత్తమ సంగీత దర్శక పురస్కారాలు అంటే మూడు జాతీయ పురస్కారాలు అందుకొన్న ఏకైక వ్యక్తి బాలమురళి  ‘.

సినీ వినీలాకాశం లో

1957 లో బాలమురళి ఎస్ వరలక్ష్మి నిర్మించిన సతీ సావిత్రి చిత్రానికి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పని చేశారు .భక్త ప్రహ్లాదలో నారద పాత్ర పోషించారు .నర్తన శాలలో ‘’సలలిత రాగ సుధారస సారం ‘’గుప్పెడు మనసులు లో ‘’మౌనమే నీ బాస ఓ మూగమనసా’మేఘ సందేశం లో ‘’పాడనా వాణికల్యాణి రాణిగా’’ ముత్యాలముగ్గు అందాలరాముడు ,రామాంజనేయ యుద్ధం  కర్ణ మొదలైన వాటిలో కమ్మని పాటలు పాడారు .కన్నడ చిత్రం ‘’మధ్వా చార్య  ‘’,కు సంగీత దర్శకత్వం వహింఛి ఉత్తమ సంగీత దర్శక అవార్డ్ పొందారు .హంసగీతే కన్నడ చిత్రం లో పాడిన పాటకు  ఉత్తమ నేపధ్యగాయక జాతీయ స్థాయి బహుమతి అందుకున్నారు .సంస్కృతం లో జి .వి. అయ్యర్ తీసిన శంకరాచార్య చిత్రానికి సంగీతం కూర్చారు .’’సందేని సిందూరం ‘’మళయాళ చిత్రం లో కూడా నటించారు . బాల మురళి పాడిన చివరి సినిమాపాట ‘’ప్రభ ‘’అనే తమిళ చిత్రం లో శ్రీదేవి అనే యువ రచయిత్రి రాసి,ఎస్ జే .జనని స్వరపరచిన ‘’పూవే పేసుం –పూవే పూవిన్ ,వాసం నాలం వీనుం వానం ,మరైత్తమేగం తూలియాగ కరైందు పోగుం’’అన్న పాట . ఇది ఆయన చనిపోయేనాటికి ఇంకా రిలీజ్ కాలేదు .,

ప్రత్యేకతలు

మృదంగం వీణ వయోలిన్ వయోలా కంజీర మొదలైన 9 వాయిద్యాలలో బాలమురళి టాప్.తనగాత్రానికి తానే ఏకకాలం లో వయోలిన్ ,మృదంగం వాయిస్తూ రికార్డ్ చేశారు .జి .యెన్. బి .కచేరి కి వయోలిన్ తో సహకారంఅందించారు బాలమురళి . భీమ సేన్ జోషి ,చోరాసియా ,కిశోరీ అమో౦కర్ వంటి ఉత్తరాది సంగీతదిగ్గజాలతో సమానంగా ధాటీగా జుగల్ బందీ నిర్వహించి రికార్డ్ సృష్టించారు .ప్రయోగాలు చేయటం లోనూ అగ్రేసరులే ఆయన . ఫ్రెంచి పాట విని రాసుకొని 10 నిమిషాల్లోపాడి ఆశ్చర్య పరచిన మేధావి .దాన్ని వయోలిన్ పై వాయించమంటే వాయించిన ప్రతిభాశాలి .కలకత్తా లో బెంగాలీ పాటపాడితే విని  75 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆనందంగా కౌగిలించుకొని గంతులేస్తూ ‘’గురుదేవ్ టాగూర్ బ్రతికి వచ్చి పాడినట్లు ఉంది ‘’అని మెచ్చుకొన్నది .రవీంద్రుని వద్ద ఆ పాట నేర్చుకొన్న వారిలో బ్రతికి ఉన్నది ఆమె ఒక్కరే నట ,రవీంద్ర సంగీతం భద్రం చేసుకోవటానికి బాలమురళి చేత 30 పాటలు పాడించి రికార్డ్ చేసుకొన్నారు .టాగూర్ తానే సంగీతం కూర్చాడు .ఎవరూ మార్చటానికి వీలు లేదు .రవీంద్రుని శాంతి నికేతన్ బాల మురళి కి మొట్టమొదటిసారిగా ‘’డాక్ట రేట్ ‘’బిరుదు ఇచ్చి సత్కరించింది  .సంగీతం వ్యాధినివారకం అని అనేక ప్రయోగాలు చేసి మ్యూజిక్ ధేరపి కి మార్గ దర్శి అయ్యారు .తమిళనాడు ముఖ్యమంత్రి ఎం .జి .రామ చంద్రన్ జబ్బు పడి కోమాలో ఉంటె వైద్యులు ఇక లాభం లేదని పెదవి విరిస్తే, వెళ్లి చూసి 9 నిమిషాలు మ్యూజిక్ రికార్డ్ చేసి ఇచ్చి దాన్ని వినిపిస్తే హాయిగా ప్రాణం విడుస్తారని చెప్పి బాలమురళి వెళ్ళిపోయారు .మర్నాడు వచ్చి చూస్తే ఎం .జి. ఆర్. కొమాలోంచి బయటపడి హాయిగా కనిపించారట .అవాక్కయ్యారు మురళి .

డా నేడునూరిగంగాధారం గారికి అన్నమయ్య పదాల రాగి రేకులు దొరికితే తీసుకొని వచ్చి బాలమురళి కి ఇచ్చారు అప్పటికి అన్నమయ్య పదాలున్నాయికాని సంగీతం లేదు .బాలమురళి వాటికి సంగీతం కూర్చి మొదటిసారిగా ఆకాశవాణి భక్తీ రంజని కార్యక్రమం లో పాడి వినిపించారు .మద్రాస్ లో  హెచ్. ఏ. ఎల్ .మాజీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూపొందించిన పోర్టబుల్ ఎలెక్ట్రానిక్ తంబురా ను కచేరీలో వాడిన మొదటి గాయకుడు బాలమురళీ యే .

ఒక సారితిరునల్వేలి లో కచేరీ చేసి కన్యాకుమారికి వెడుతూ ఉంటె దారిలో ఒక పవిత్ర నదికనిపిస్తే నెత్తిన జలం చల్లుకొందామని నీటిలో దిగితే షాక్ కొట్టినట్లు అయిందట. మరో సారి ప్రయత్నం చేసినా అలానే జరిగిందట .ఆయన తో వచ్చినవారికి ఎవరికీ ఏమీ కాలేదు .ఆ విషయం గ్రామస్తులకు తెలియ జేశారు. వారు అక్కడ త్రవ్వితే శ్రీ దుర్గా౦బిక విగ్రహం దొరికింది .దాన్ని ప్రతిష్టించి గుడి కట్టించటానికి బాలమురళి ఉచితంగా కచేరీలు చేసి ధనం సమకూర్చి ఇచ్చారు బాల మురళి పేర ఆడిటోరియం కట్టి ,రాజ గోపురం లో బాలమురళి విగ్రహం ప్రతిష్టించి కృతజ్ఞత తెలియ జేశారట .మద్రాస్ ఆకాశవాణి లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా  ఉంటూనే సంగీతకచేరీలు చేశారు బాలమురళి .తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులు, తమిళనాడు ప్రభుత్వ కలైమణి గౌరవం పొందారు .ఆయన జీవితం పై పుస్తకాలు వచ్చాయి .

బాలమురళీయం

శ్రీ బాలమురళి గాత్రం ,శ్రీ అన్నవరపు  రామస్వామి వయోలిన్ ,శ్రీ దండమూడి రామమోహనరావు మృదంగం త్రివేణీ సంగమమై శ్రోతలను రసగంగలో స్నానం చేయిస్తుంది .ముగ్గురూ ఎన్నో వేలకచేరీలు కలిసి చేసి రికార్డ్ సృష్టించారు .ఈ త్రయానికి సాటి లేదు అనిపించారు .’’త్యాగరాజ ఆరాధనోత్సవాలను ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు’’ ?అని అడిగితే ‘’’’ఆరాధన అంటే మృతి చెందిన రోజు చేసేది .కొత్త చీరలతో సింగారించుకొని ,ఒంటినిండా నగలు దిగేసుకొని వెళ్లి పాడటం సబబుకాదు .కావాలంటే త్యాగయ్య గారు పుట్టిన రోజున ఇంత హడావిడిగా చేసుకోండి పాడండి .’’అన్నారు .అందుకేనేమో అమెరికాలో ఒహాయు రాష్ట్రం లో ప్రతి ఏడాది ఎప్రిల్ నెలలో దేశం లోని అన్ని రాష్ట్రాలనుండి గాయకులూ వచ్చి భక్తిగా త్యాగరాజ సభపెద్ద ఎత్తున నిర్వహించి  గానం చేసి తరిస్తారట .అందులో పాల్గొనటానికి మూడు ,నాలుగు రౌండ్ల ప్రిలిమినరీలు జరుగుతాయట. అందులో క్వాలిఫై అయిన వారే వెళ్లి పాడాట .

‘’  ‘’పంచ ప్రాణాలూ సప్తస్వరాలే ‘’అన్నట్లుగా జీవించారు బాలమురళి .పాట అనుకోవటం,రాగం కూర్చటం ,పాడటం అప్పటికప్పుడు చేసే ‘’సంగీత సర్వజ్ఞుడు ‘’బాలమురళి .ఆయన ‘’తిల్లాన ‘’ఒక తుళ్ళింత ఒక ద్రిల్లింత .ఊగిపోవాల్సిందే .సంగతులు ,సరిగమలు సహజంగా అమరిపోతాయి .సంగీతం పాడుతూ తాను ఆనందిస్తూ,రసజ్నులను ఆనందింప జేయటం, నవ్వుతూ పాడటం బాలమురళి ప్రత్యేకత .ఏ స్థాయిలోనైనా గీర రాకుండా పాడగలిగే దమ్ము ఆయనది. పర్వీన్ సుల్తాన్ తో సరిసాటి .’’అమ్మా !పుట్టగానే మురళీగానమిచ్చి ‘’అంటూ కన్నతల్లిని, పుట్టిన ఊరు శంకర గుప్తం ను గుర్తుఉండి పోయేట్లు ‘’సూర్య కాంతి ‘’రాగాన్ని సృష్టించి దాన్ని ‘’విడువ విడువ నింక ‘’అన్న అన్నమయ్య కీర్తనతో ప్రకాశింప జేసిన సంగీత భానుడు బాలమురళి .

‘’నా కీర్తనలో రాగం భోగం ,మొహం ,స్నేహం ,దోబూచులాడుతాయి .ఆర్తి ,ఆవేదన ,ఆరాటం ,ఆకాంక్ష ,తపన మిళితమై ఉంటాయి ‘’అన్న వాగ్గేయకారుడు బాలమురళి .నాదం లో ఆనందాన్ని పొంది ,పొందించిన నాద బ్రహ్మ. బ్రహ్మానందాన్ని అందించినవారు .అందుకే ఆయన్ను ‘’స్టార్ వాల్యు ఉన్న సంగీత విద్వాంసుడు ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .సంకుచిత పరిధిలో ఉన్న సంగీత సరస్వతిని ‘’భారతీయ సంగీతం ‘’గా మార్చి కొత్తమార్గం తొక్కించిన మార్గ దర్శి బాలమురళి .’’సంగీతం నాకు రాదు ,తెలియదు .కాని సంగీతానికి నేను తెలుసు .అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంతకాలం  నేను వాహిక గా ఉంటాను .పాట నా నోట పలుకు తుంది  .నేనొక సంగీత పరికరాన్ని (instrument ) ‘అన్నారాయన .

ఇంత గొప్ప వాగ్గేయకారుడు ,అపర త్యాగబ్రహ్మ, నాదోపాసకులు, గాన గాంధర్వ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ 22-12-16-న 86 వ ఏట  ఏనాడూ ఇంటిదగ్గర కచేరీకి సాధన చేయనివారు మూడు రోజులుగా నెమ్మదిగా సంగీత సాధన చేస్తూ ,అందరినీ చూసుకొంటూ తనకిస్టులైనశ్రీ అన్నవరపు రామస్వామి గారి చేతులను తన చేతులతోపట్టుకొని తుది శ్వాస విడిచారు .హంస పరమహంసలో చేరింది .అందుకే  ఆంధ్ర జ్యోతి దినపత్రిక  ఆయన మరణం పై ‘’ఆధార షడ్జమం అంతర్ధానమైంది .తేనెలు కురిపించే తెలుగు పంచమం మూగ బోయింది . నిషాదం విషాదమైంది .సప్త స్వరాలూ అశ్రు సాగరాలయ్యాయి .మూడు స్వరాల మహతీ రాగం సృస్టికర్తనే కోల్పోయి ,విలపించింది త్రుళ్ళిపడేతిల్లానా ఊపిరి పోయింది .ప్రతిమధ్యమావతి తుది జోలపాడింది .వయోలిన్ ,వయోలా ,వీణ ,మృదంగం అనాధలైనాయి .కర్నాటక సంగీత సామ్రాజ్యం సామ్రాట్టు లేని రాజ్యమైంది .సరిగమలు నివ్వెర పోగా ,గమకాలు తడబడగా, మధుర మంజుల బాలమురళీ గానం మూగబోయింది ‘’అని గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది .

Inline image 1Inline image 2

పుష్యబహుళపంచమి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-17 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.