సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్
‘’అమ్మ ‘’కు విలువనిచ్చి తల్లి పేర తనపేరు చలామణి చేసుకొని తల్లికే పట్టాభిషేకం జరిపి శాలివాహన శకానికి ఆద్యుడై ,బ్రిటిష్ వారి చరిత్రలో నాలుగు లైన్లు కూడా లేని పోరాట యోధుడు, భారత దేశం నాలుగు చెరగులా ఆంద్ర సామ్రాజ్యాన్ని విస్తరించి ,అఖండ భారతమే ధ్యేయంగా పరిపాలించినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి .ఇది తెలుగువాడి’’వాడి ‘’ కధ.తెలుగువాడి పౌరుష గాధ.చిరంతన చిరస్మరణీయ చరిత్ర .దీన్ని తీయటానికి సాహసం ఉండాలి .తపన ,దృఢ సంకల్పం ,అంకితభావ౦ ,అత్యున్నత ప్రమాణ శీలనం ఉండాలి .తగిన నటుడు దొరకాలి .రెండవ శతాబ్దపు నేపధ్యపు కధకు తగిన వాతావరణం ఏర్పరచుకోవాలి .భారీ బడ్జెట్, దాన్ని సమకూర్చే నిర్మాత ,దమ్మున్న దర్శకుడు ,దర్శకుని మనోధర్మానికి ,ప్రస్తుతకాలానికి అనుసంధానంగా కదా నిర్మాణం ,దానికి తగిన సంభాషణా రచనా ,జీవితమంతా యుద్ధం లోనే గడిపిన ఆ యోధుని యుద్ధ విజ్రు౦భణను ప్రతిఫలి౦పజేసే సంగీతం ,నేపధ్య సంగీతం కుదరాలి .ఇన్నీ కుదిరినా సినిమా మొదలు పెట్టి ఏళ్ళూపూళ్ళూ తీస్తే నటులు ముసలివారై టెంపో తగ్గి దెబ్బతింటుంది .ఇన్ని విషయాలూ దర్శకుడు క్రిష్ ఆలోచించి కేవలం 65 రోజుల్లో చాలెంజ్ గా తీసుకొని దేశ విదేశాలలోనూ షూటింగ్ చేసి ,’’సెభాష్ క్రిష్ ‘’అని పించాడు .దీనికి సంభాషణలు రాసిన బుర్రా సాయి మాధవ్ ,సంగీతం కూర్చిన చిరంతన భట్,నటించిన బాల కృష్ణ అందరూ అత్యంత అభినందనీయులే .ఈ విజయం పై వారందరిదీ మాత్రమే కాదు చూసి ఆనందిస్తున్న తెలుగు ప్రేక్షక మహాశయులదికూడా .తెలుగు జాతి మహత్తర వీరుని కి ,సామ్రాట్ కు పట్టాభి షేకమే . ఇది సమష్టి కృషి విజయమూనూ .అందుకే దీన్ని ‘’సాహో సాయి ,చిరంతన ,బాల క్రిష్ శాతకర్ణి సామ్రాట్ ‘’అన్నాను .
అసలు ఈ సినిమా చూడాలని నాకు ఇవాళ పోద్దునదాకా లేదు .ఎందుకో ఉదయం ఈనాడు తిరగేస్తే దర్శకుడు రాజమౌళి ‘రాసిన ‘’విజయం నీదే మిత్రమా ‘’అనే బాలకృష్ణకు రాసిన ఉత్తరం కనిపించి చదివాను .రాజమౌళినే మెప్పించిన చిత్రం కదా చూడాలనుకొని మాటినీ కి వెళ్లాను .మార్నింగ్ షో చూసి బయటికి వచ్చిన జనాన్ని లెక్కేస్తే 60 కి మించి లేరు .’’అయ్యో అనవసరంగా వచ్చానే ‘’అనుకొన్నా .మాట్నీకి బాల్కనీ ఫుల్ .కింద ఒక యాభై మంది ఉంటారు .రిలీజ్ అయి 10 రోజులే అయింది .బెరుకు బెరుకుగానే సీట్లో కూచున్నా .సినిమా మొదలయ్యాక అన్నీ మర్చి పోయా .ఆలోకం ,ఆకధలో ,ఆ కాలం లో ,ఆనుభవం లో ,ఆ వీరత్వం లో,ఆదేశభక్తి లో, ఆ మాతృస్వామ్య ప్రేరణ లో ,ఆ కర్తవ్య బోధనలో ,తెలుగు సంభాషణా మాధుర్యం లో ,యుద్ధానికి తగిన నూటికి వెయ్యి రెట్లు న్యాయం చేకూర్చిన చిరంతనభట్ సంగీత విన్యాసం లో, బాలకృష్ణ అపూర్వ అత్యంత ప్రభావ శీల నటనలో ,ప్రేరణాత్మకం గా సాగిన కధాగమనం లో లీనమై చూసి ఆనందించాను .మనసారా అందుకే అభినందించాను .సినిమాలోని పాత్ర ,గాత్ర ,దారులు సాంకేతిక నిపుణులు అందరిపేర్లు తల్లి పేరు తో వేయటం చాలా యాప్ట్ గా ఉంది.ఈ సినిమా ఈ ఆదర్శానికీ మార్గ దర్శకమైంది .అభినందన శతం .
బుర్రా వారిబుర్ర చాలాపదునైనది .మాటలు ఈటెల్లా బుర్ర లోకి మనసులోకి సూటిగా దూరాయి .ఎక్కడా పలచబడలేదు .పరి పుష్టిగా ఉన్నాయి .స్పందన ,చేతనా చైతన్యం కలిగించి ప్రభావితం చేస్తాయి .అందరూ చాలా చక్కగా నిర్దుష్టంగా ,భావ గర్భితం గా పలికారు .(పలకలేని వారికి డబ్బింగ్ చెప్పినవాళ్ళూ బాగా పలికారు ) కనుక రచనా పరంగా స్క్రీన్ ప్లే పరంగా గొప్ప విజయమే . ఆదినుండి అంతం వరకు యుద్ధాలే కనుక నేపధ్య సంగీతమూ ఆ వాతావరణాన్ని గొప్పగా కల్పించింది .ఇది ముఖ్యంగా ఈ సినిమా విజయానికి మరో బలీయ మైన కారణమైంది .కనుక రచయితా ,సంగీత కర్తా మిక్కిలి అభినందనీయులయ్యారు .కాని పాటలో తెలుగుదనమే లేదు .పాడినవారూ తెలుగు ఇంపు సొంపు లను ఒలికించ లేక పోయారు .ఒక ఆరకంగా కంపు చేశారేమో అని పించింది .శ్రావ్యత లేదు .కర్ణ కఠోరంఅని పించింది .మారు వేషం లో బాలకృష్ణ ,శ్రేయ నగర సంచారం చేస్తూ పాడిన పాట ఒక రోజు ముఖ్యమంత్రి అయిన తమిళనటుడు అర్జున్ ,మనీషా కోయిరాలా నటించిన సినిమా ‘’ఒకే ఒక్కడు ‘’ అనిజ్ఞాపకం లో ‘’వాళ్ళిద్దరూ కూడా మారువేషం లో పాడిన ‘’ఉప్పు చేపకూర’’పాట గుర్తుకు తెచ్చింది .రాత్రి శృంగారం సీనులో బాలు తదితరులు పాడిన ‘’మృగనయనే ‘’పాటలో మద్దెల మోత పెట్టి ‘’అర్ధ రాత్రి మద్దెల దరువు ‘’అను కోనేట్లుంది .సంభాషణలు తెలుగుకు జీవం పోసి ఊర్జాన్ని కలిగిస్తే పాటలు తెలుగను నిర్జీవం చేసి స్వారస్యాన్ని మింగేశాయని పించింది .
నటులు ఎవరు ఏ పాత్రలో నటించారో తెలుసుకోక పోయినా ఫరవాలేదు అందరూ స్థాయిఅందుకొని , శక్తికి మించి సమర్ధతను చాటి నటించారు .మన దేశ రాజులైనా శత్రు దేశ పాలకులైనా అందరూ మెప్పించారు అని నిర్ద్వందంగా చెప్పవచ్చు .గౌతమి పుత్రా శాతకర్ణి తల్లి ‘’ గౌతమి బాలశ్రీ ‘’పాత్ర హేమమాలిని ధరించింది .ఆమె వలన పాత్రకు నిండుదనం ఏమి చేకూరిందో నాకు తెలియదు .అందరినీ అభినందిస్తున్నాను .అంతా బాగానే ఉందా అంటే అలాని చెప్పలేను .శాతకర్ణి పరిపాలన విదానం మనకు చెప్పలేదు .ప్రతి రాష్ట్రం ధాన్య కటకమవ్వాలని ,అమరావతి అవ్వాలన్న ఒకటి రెండు డైలాగులలోతప్ప. బాలకృష్ణ మీసం కిందకి దింపటం సబబు అనిపించలేదు .కొంచెం మెలి తిప్పితే హుందా గా ఉండేది .ఇప్పుడు ‘’వట్టి వీర బద్రయ్య ‘’అని పించాడు .అలాగే అతని పర్సనాలిటీ నిటారుగా నిర్దుష్టంగా చూపలేదు .నాకుమాత్రం వీరపాండ్య కట్ట బొమ్మన గుర్తుకు వచ్చాడు .కుంచించుకొని పోయి నట్లు కనిపించాడు .ఇంటర్వల్ తర్వాత శత్రు రాజులను చంపటం లో బాల కృష్ణ నటనతో అబ్బా అనిపిస్తాడు . విషప్రయోగం జరిగి నప్పుడు అతన్ని బ్రతికి౦చు కోవటానికి భిషగ్ వరేణ్యు లు చేసిన ప్రయత్నం భారతీయ ఆయుర్వేద విధానానికి ఎత్తిన పతాక అని పించింది .వాసిష్ట పుత్ర పులమావి ముద్దుముద్దుగా బహు అందంగా ఉండటమే కాదు శత్రు రాజుతో ‘’తాతా!నువ్వు చంపు తావా నన్ను చంపమంటావా “”?అన్నడైలాగ్ కనులను చెమరి౦ప జేస్తుంది .అలాగే మరొక రెండు సందర్భాలలోనూ అలాగే ఉంటుంది .
బ్రహ్మాండ పురాణం లో విష్ణు భాగవత పురాణాలలో శాతవాహన చరిత్ర ఉంది.మహారాష్ట్ర లో నాశిక్ లో పండల్వేని గుహలలో ఉన్న శిలా శాసనాలు శాతకర్ణి చరిత్రకు అద్దంపడతాయి .భారత దేశం లో పడమటి శాత్రపులను గోదావరీ పరివాహక రాజ్యాలను ,పల్లవ ,యవన రాజ్యాలపై దండయాత్ర చేసి జయించి ,మధ్యా ప్రదేశ్ లో మాల్వ సౌరాష్ట్ర ,కృష్ణా ,కొంకణ ,అవంతి ,రాజపుటాన ,తూర్పు పడమటికనుమలమధ్యరాజ్యాలు విదర్భాది 32 రాజ్యాలను స్వాధీనం చేసుకొని అఖండ ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించి తల్లి చేత రాజాధిరాజు, చక్రవర్తి అని పించుకున్నవాడు గౌతమి పుత్ర శాతకర్ణి .ఆ కధే వీనుల విందు మనకు .మన ఆరాధకుడైన తెలుగు మహా వీరుడిచరిత్ర .మనం చూడాలి ఆనందించాలి విజయం చేకూర్చాలి ,రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాణిజ్య పన్ను మినహాయింపు ఇవ్వటం అభినందనీయం .కాని రెండో వారానికే దియేటర్ చాలా ఖాళీ గా ఉండటం బాధించింది .విజయం చేకూర్చటం మన వంతు కర్తవ్యమ్ అని చెబుతూ మరో సారి అందరినీ అభినందిస్తున్నాను .
నహ పాణ రాజ్యాన్ని జయించి విజయోత్సవం చేసుకొంటున్న శాతకర్ణి -ఊహా చిత్రం
మీ-భవాని పుత్ర దుర్గా ప్రసాద్ – 22-1-17 –కృష్ణా జిల్లాపుత్ర ఉయ్యూరు