కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’

img_20170129_130832

శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ మంగమ్మగారు మాకు చాలా ఆత్మీయురాలు .ఆయన అన్న సోమయాజి గారు నూజి వీడు లో ఉండేవాడు .ఆయన ఆకారం తమాషా గా అని పించేది .ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ ముక్కు పొడుం పీల్చేవారు .ఆ సోదరుల అను బంధం అద్వితీయం .మంగమ్మ మామ్మ,కొడుకు శ్రీరామ మూర్తి మామయ్య ఉయ్యూరులో పుల్లేరు కాలువ దగ్గర స్వంత పెంకు టింట్లో ఉండేవారు .వీళ్ళ అమ్మాయి కమల మా చిన్నక్కయ్య దుర్గ క్లాస్ మేట్.ఈ కమలను మా రేపల్లె బాబాయి అంటే మా మామ్మ అక్క గారు మహాలక్షమ్మగారి గారి కొడుకు  రాయప్రోలు శివ రామ దీక్షితులు పెద్దకొడుకు సుబ్బులు అని మేము ఆప్యాయంగా పిలిచే సుబ్రహ్మణ్యం అన్నాయ్ కిచ్చి ఉయ్యూరు లోనే పెళ్లి చేశారు .సూరి శ్రీరామ మూర్తి బావ గారింటి పేరు చెరుకుపల్లి వారు .ఆయన నూజి వీడు కాలేజి లో లెక్చరర్ అని జ్ఞాపకం .ఆయన పేరు జ్ఞాపకం లేదు .నూజి వీడు సూరి వారి కి అక్కడ రామ మందిరం ఉండేది దాని నిర్వహణ అందులో పెద్దాయన సీతారామాంజ నేయులు గారు చూసేవాడు .ఆయన చిన్న తమ్ముడు రఘు రామ చంద్ర మూర్తి కి ఉయ్యూరు లో మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి గారి పెద్దమ్మాయి రాజ్య లక్ష్మినిచ్చి పెళ్లి చేశారు .పెద్ద తమ్ముడు రామ చంద్రమూర్తి బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో హెడ్ గుమాస్తా తర్వాత ఏం యి వో .ఇదే కాక మా అమ్మ కు తల్లి తరపు అంటే మా అమ్మమ్మ తరపు చుట్టరికం కూడా ఉండేది .దీనితో తరచూ నూజి వీడు వెళ్ళే వాళ్ళం .అప్పుడే శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మగారిని ఒక సారి చూసిన జ్ఞాపకం .తరువాత కాస్త సాహిత్య జ్ఞానం ఒంట బట్టాక జమదగ్ని గారి కధలు కవితలు వ్యాసాలూ చదవటం వలన ఆయన సాహిత్యోపజ్న కొంత తెలిసింది .విశ్వనాధ వారి వీర భక్తులని గొప్ప ఆతిధ్యాన్ని ఇస్తారని ,మహా నిస్టాగరిస్టులని ఆయన కధలు జాతీయ స్థాయిలో ఉండేవని   బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య గారి రచనల వలనతెలిసింది .జనవరి 11 న విహంగ మహిళా వెబ్ పత్రిక వారు నాకు రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో వైస్ చాన్సలర్ శ్రీ ఎస్ వి సత్యనారాయణ గారితోసన్మానం చేసిన తర్వాత శ్రీ శలాక రఘు నాద శర్మ గారిని దర్శించటానికి వెళ్లాం . శర్మ గారు వారి శ్రీమతి మా పట్లచూపిన ఆదరం మరువలేనిది .నాకూ  మానవడు చరణ్ కు శర్మ గారు శాలువాలు కప్పి ,మా శ్రీమతి ప్రభావతికి భార్యగారి చేత చీరే సారే పెట్టించి ఆ దంపతులు చూపిన బంధు ప్రేమ విలువ లేనిది  అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణలో వారి స్వగ్రామం గొల్లపల్లీ నూజి వీడు బంధుత్వం ,జమదగ్ని శర్మగారు శర్మగారు తన మేనత్త  కొడుకు అని చెప్పటం  సూరి శ్రీరామ చంద్ర మూర్తిభార్య శర్మగారి శ్రీమతికి దగ్గర బంధువని అన్నీ తెలిశాయి .శర్మగారిని 2015 ఉగాదికి సరసభారతి తరఫున ఆహ్వానించి మా తలిదండ్రుల స్మారక పురస్కారం అందజేశాం .శర్మగారు తమ రచనలను నాకు ఆప్యాయం గా బహూకరించారు .అందులో ఫిబ్రవరి 11 న కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో శాసన సభ ఉప సభా పతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి అంకిత మివ్వ బోయేశ్రీ కృష్ణ దేవ రాయల ఆముక్త మాల్యద కావ్యం ఆధారంగా రాసిన   ‘’యామున ప్రభు రాజనీతి ,’’అనే  పుస్తకమూ కల్ప వృక్ష వాగ్వైభావమూ మొదలైన విలువైన పుస్తకాలున్నాయి . రాజనీతి ,భారత వైశిష్త్యమూ చదివేశాను .ఇప్పుడు కల్ప వృక్షం పైకి చేరుతుంటే అందులో జమదగ్ని దంపతులకు   ఈ పుస్తకం అంకిత మిచ్చినట్లు ,ఆయన సాహిత్య ఆధ్యాత్మిక కీర్తి వైభవాన్ని కళ్ళకు కట్టేట్లు వర్ణించిన రఘునాధ శర్మగారి వ్యాసం    బాగా ఆకర్షించింది .అందులోని విషయాలు చాలామందికి తెలిసి ఉండక పోవచ్చుననే భావనతో మీ ముందు ఉంచుతున్నాను .ఈ రచనకు ఇంతటి నేపధ్యం ఉంది .

శ్రీ జమదగ్ని శర్మ గారిని రఘు నాద శర్మగారు ‘’మానస గురువు ‘’గా భావించారు .జమదగ్ని గారు జీవిత చరమాంకం శ్రీకాళ హస్తి లో గడిపుతూ అను నిత్యం శ్రీ కాళ హస్తీశ్వర సందర్శనం తో పులకించి పోయేవారట .అక్కడే భౌతిక దేహాన్ని ఒక యోగిలాగా వదిలేశారట .ప్రతి  ఏడాది మాఘ పౌర్ణమినాడు సువర్ణ ముఖీ నదీ స్నానం చేసి , శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వేంచేసి విశిష్ట పూజలు అందుకొంటారు .’’అపర ధూర్జటి ‘’అయిన శ్రీ జమదగ్ని శర్మగారు ఆ పవిత్ర దినాన ఉదయం 10 గంటలకు స్వామి వారి సన్నిధిలో అతి సమీపాన కూర్చుని నిశ్చల మనసుతో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ,సుమారు మూడు గంటలు సాగిన శ్రీవారి విశిష్ట ఆరాధన మానసికంగా దర్శిస్తూ ,తరువాత బాహ్య ప్రపంచం లోకి వచ్చారట ,.వారి ముఖం లో ఏదో గ్లాని కనిపించి డాక్టరు ను పిలవ మంటారా అని అడిగితె వద్దు రిక్షా పిలవమని చెప్పి ,గూడు రిక్షాలో కూర్చుని ఇంటికి వెడుతూ ,దారిలోనే వెనక్కి వాలిపోయి  తుది శ్వాస విడిచారట  .అంటే శివ ధ్యాన పరాయణులై శివైక్యం చెందారన్నమాట ఆయన నోటి నుండి ఎక్కువగా ‘’శివోహం శివోహం ‘’అనే మాటలే విని పించేవట.ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడినా ‘’మంచిది ,మంచిది ‘’అనే ఊత పదం వాడేవారట .మంచి మనిషికి మంచి మరణం అన్నమాట .

జమదగ్ని గారు తెలుగు పాఠం బోధిస్తుంటే తరగతి గదులూ ,పరిసరాలూ ని౦ డిపోయేవట.క్రమ శిక్షణకు ఆయన అత్యంత ప్రాదాన్యమిచ్చేవారు .అతిక్రమిస్తే సహించేవారు కాదు .విద్యార్ధులపై చేయి కూడా చేసుకొనే స్థితి కూడా ఉండేదట .కానీ దేనికీ జంకే వారు కాదట. విద్యార్ధి లోకానికి జమదగ్ని అంటే హడల్ –ఆయన పాఠంఅంటే మహా ఆదరం .కాళిదాసు అన్నట్లు ‘’అధ్యష్యుడూ ,అభి గమ్యుడూ’’ఆయన అన్నారు శలాక వారు .

జమదగ్ని గారికి పద్య కవితలో  విశ్వనాధ సత్యనారాయణ గారు ,కధలలో మునిమాణిక్యం నరసింహా రావు గారు ,కావ్య విమర్శలో ఆచార్య భూపతి లక్ష్మీ నారాయణ గారు ,వేదాంత విద్యలో బ్రహ్మశ్రీ లంక నరసింహ శాస్త్రి గారు గురువులు .రాజ మండ్రిలో వేదాంత విద్య నేర్చుకోవటానికి జమదగ్ని గారు మడి కట్టుకొని ,ఉద్ధరిణ ,పంచ పాత్ర తీసుకొని గురువు గారింటికి వెళ్ళేవారట .విధి నిర్వహణలో అలసతచూపించలేదు ,అధికారులచేత మాట పడని వ్యక్తిత్వం ఆయనది .

సాహిత్యం లో లబ్ధ ప్రతిష్టులైన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి ,మధునా పంతుల సత్యనారాయణ ,మల్లంపల్లి శరభయ్య ,బాలగంగాధర తిలక్ గార్లతో సాన్నిహిత్యం బాగా ఉండేది .శరభయ్య గారు రాజమహేంద్ర పురవాసి అయినా జమదగ్ని గారింట నే అనేక పర్యాయాలు భోజనం చేసేవారట .అంతటి ఆత్మీయత వారిది .మానాప్రగడ శేషసాయి ,చామర్తి కనక ప్రవాసి వంటి మహా వ్యక్తులు ‘’జమదగ్ని గారు మా గురువుగారు ‘’అని జబ్బ చరఛి  చెప్పుకొని గర్వ పడే వారట .తన విద్యార్దీ ,తనకంటే చిన్నవాడూ అయిన భమిడి పాటి సదా నంద ను జమదగ్ని గారు ఆదరించిన తీరు అపూర్వంన్నారు శలాక వారు .

తలిదండ్రుల వార్ధక్యం లో   జమదగ్ని గారు చేసిన సేవ ‘’న భూతో న భవిష్యతి ‘’అన్నట్లు ఉండేది .తండ్రిగారికి నిత్యం స్నానం చేయించటం ,సంధ్యావందనం చేయించటం ,ఎక్కువ గంటలు వారి వద్ద గడపటం ,వైద్యం విషయం లో యెంత ఖర్చు అయినా లెక్క చేయకపోవటం ,యెంత శ్రమ అయినా పడటం జమదగ్ని గారి ప్రత్యేకత .కళాశాల డ్యూటీ ముగించి ఇంటికి రాగానే తలిదండ్రుల వద్ద చేరి ఆప్యాయంగా సంభాషించి వారి మనసులకు హాయి కలిగించటం అందరినీ అబ్బుర పరచేది .అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని ఆ తలి దండ్రుల ఎదురు చూపు అంతకంటే విశేషమైనది .అప్పటికి జమదగ్ని గారి వయసు 50దాటింది అయినా అ పుత్ర ప్రేమ మాతా పితర ఆరాధనా అలానే కోన సాగింది .తన పిల్లలు ,అన్నగారి పిల్లలే కాక ఎందరో విద్యార్ధులకు అన్న వస్త్రాలు కలిపించి చదువులు చెప్పించి ఉద్దరించారు .ఎవరినీ ఏనాడూ మందలించటం జరగలేదట .తన జీవిత విధానం తో వారిని సంస్కరించేవారట .ఆయన నిబద్ధత అది .జీవితాంతం దాన్ని కాపాడుకొన్నారు .

పింగళి లక్ష్మీ కాంతం గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జమదగ్ని గారు స్నాత కోత్తర విద్యకు ప్రవేశం కోసం కలిసి అడిగారు .జమదగ్ని గారి గురించి కాంతం గారికి బాగా తెలుసు. ఆయనకు సీటు ఇవ్వటం ఇష్టం కూడా .కాని ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ‘’జమదగ్నీ!నువ్వు ఖద్దరు కట్టటం మానేస్తే సీటిస్తా నోయ్’’అన్నారు .అప్పటికి జమదగ్ని గారి వయసు 20 .’’మాస్టారూ !మేము ఖద్దరు కట్టటానికీ  ,స్వాతంత్రోద్యమానికీ ఏమీ సంబంధం లేదు .మాకు ఖద్దరు చాలా పవిత్రం .అయినా మీరు చెప్పారుకనుక ఈ రోజు నుంచి ఖద్దరు కట్టే విషయం లో మరింత శ్రద్ధాసక్తులు   చూపిస్తాను ‘’అని చెప్పి బయటికి వచ్చేశారట .పింగళి సీటు ఇవ్వలేదని చెప్పక్కర లేదు అనుకొంటా .నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది .

జమదగ్ని గారు మాంచి భోజన ప్రియులు .తింటారు బాగా తినిపిస్తారు .ఆయన ఆతిధ్యాన్ని గురించి మెచ్చుకోని వారు ఉ౦డేవారుకాదు .అనంత పురం లో పని చేసినప్పుడు సి. రామ కృష్ణా రెడ్డి అనే  యువ తెలుగు లెక్చరర్ ఉండేవాడు .ఆయన పాఠం బాగా బోధించాలి అనే తపన ఉన్నవాడు .జమదగ్ని గారింటికి వచ్చి రోజూ చెప్పబోయే పాఠాన్ని క్షుణ్ణంగా చెప్పించుకోనేవాడు .జమదగ్ని గారి ఆప్త కోటి లోని వాడు. రెడ్డి గారు పాఠం చెప్పించు  కోవటానికి వస్తే ముందు కడుపునిండా కాఫీ ఫలహారాలు పెట్టి ,అప్పుడు   ఆయన పాఠం చెప్పేవారు .అదీ జమదగ్ని గారి ప్రత్యేకత .

జమదగ్ని గారి తండ్రి శ్రీ చెరుకు పల్లి బుచ్చిరామయ్యగారు శ్రీశ్రీ కళ్యాణానంద భారతీ మహా స్వాములవారి శిష్యులు .తమ విజ్ఞాన పరంపరను ‘’శ్రీ కల్యాణి ‘’అనే భగవద్గీతా వ్యాఖ్యానం లో నిక్షిప్తం చేశారు శ్రీ విద్య ఉపదేశం పొంది జేవితాంతం శ్రీ చక్రోపాసన చేసిన ధన్యులు .వారి శ్రీమతి లక్ష్మీ నరసమ్మగారు శలాక వారి ఆడబడుచు.మాతృత్వం మూర్తీభవించిన పుణ్య మూర్తి  .జమదగ్ని గారి ధర్మపత్ని శ్రీమతి శేషమణి ఉత్తమ గృహిణి .శ్రీ శలాక రఘునాధ శర్మగారిని జమదగ్నిదంపతులు  పుత్రునిలా ఆదరించి అభి వృద్ధి లోకి తెచ్చారని ఆ ద౦పతులను తమ దంపతులు ‘’హృదయ పీఠం లో భద్ర పీఠం ఏర్పరచిపూజించు కొంటామని  ,’’కల్ప వృక్ష వాగ్వైభవం’’ను అంకిత మిస్తూ ‘ అత్యంత వినయం ,భక్తీ ప్రపత్తులతో ‘’మానస గురు సమర్చన  ‘’ లో శ్రీ శలాకవారు నివేది౦చారు.

శ్రీ జమదగ్ని దంపతుల ఫోటో జత చేశాను -చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1 -17-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.