దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం

ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి నట్లుగా ఒక తంతు గా దీన్ని జరుపుతారు .కానీ దశరధుని మనః ప్రవ్రుత్తి చాలా భిన్నంగా ఉన్నట్లు శ్రీ మద్రామాయణం లో మహర్షి వాల్మీకి ,రామాయణ కల్ప వృక్షం లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారూ గొప్పగా అభి వర్ణించారని ‘’కల్ప వృక్ష వాగ్వైభవం’’లో ‘’సార్వ భౌమ యజ్న దీక్ష ‘’వ్యాసం లో మహా వ్యాఖ్యాత,ప్రాచార్య  శ్రీ శలాక  రఘు నాద శర్మ గారు వ్యాఖ్యానించారు .ఇందులోని సారాన్ని ‘’దశరధ చక్రవర్తి నిస్సంగత్వం ‘’పేర మీకు అందిస్తున్నాను .

యజ్ఞం లో ప్రధాన ఋత్విక్కులైన  హోతకు తూర్పు దిక్కును , ,అధ్వర్యువుకు పడమటి దిక్కును , ,బ్రహ్మకు దక్షిణ దిక్కును , ,ఉద్గాతకు ఉత్తర దిక్కును దశరధ మహా రాజు యజ్ఞం పూర్తయ్యాక తనకున్న సర్వ భూమినీ దక్షిణగా ఇచ్చేశాడు .వాళ్ళందరూ గ్రహించి దీన్ని మేమేం చేసుకొంటాం అని బ్రతిమి లాడి ఆయనకే అప్పగించేసి ఆయన ప్రత్యామ్నాయంగా  ఇచ్చిన గో ,సువర్నాదుల్ని గ్రహించారు . ఇలా చేయటం లో మమకారాన్ని చంపుకోవటం అనే గొప్ప ప్రయత్నం ఉందని గ్రహించాలి .భౌతిక భాగ్య సంపదలతో మమకారం చంపుకున్నవాడు పరమార్ధ సంపదను తలకెత్తు కుంటాడని శర్మ గారు వ్యాఖ్యానించారు .ఈ ఘట్టాన్ని విశ్వనాధ తన ‘’సకలోహ వైభవ సనాధమైన’’ నాథ కథ’’లో అంటే కల్ప వృక్షం లో మహోన్నత రస బంధురంగా తీర్చి దిద్దారు .

‘’దక్షిణ గాగ సర్వ వసుధాతల మిచ్చెను  బర్వు దింపిన –ట్లక్షుల నప్పళించి భుజ మల్లన నూర్పున నెత్తి దించె స –ర్వక్షిత భార దూర్వహ భవ క్లమ బుద్ధి ధరా తలేశ్వరుం –డాక్షణ మందు సౌఖ్య నివహాత్త శరీర లఘుత్వ భావనన్ ‘’.

భావం వాల్మీకి దే అయినా విశ్వనాధ మహర్షిని తనలో ఆవాహన చేసుకొని రుషి వాక్కు ను వ్యాఖ్యానించాడు .దక్షిణగా సర్వ భూ మండలాన్నీ ఇచ్చేశాడు మహా రాజు –ఇదీ అసలు వార్త.ఈ వార్తను కవి కవిత్వం తో రసబంధురం చేశాడు .అలా దక్షిణగా ఇచ్చేసిన తర్వాత ఆయనకు పెద్ద బరువు చాలా కాలం మోయాగా మోయగా దింపేసి నప్పుడు కలిగిన గొప్ప అను భూతి అంటే రిలీఫ్ కలిగింది .కళ్ళు అప్పళించాడు.భుజం కొంచెం కదిలించి ,పెద్దగా ఊపిరి  తీసుకొని,పైకి ఎత్తి దించాడట .బరువులు మోసే వాళ్ళందరూ బరువు ది౦చినపుడు కలిగే ఊరట పొందాడన్న మాట  .ఇంతకాలం ఇంత బరువు మోసి నందుకు కలిగిన అలసమైన బుద్ధి ఇప్పుడు తేలిక పడింది .కొన్ని వందల సుఖాలు కట్ట కట్టుకొని వచ్చాయా అన్నట్లు శరీరం తేలిక పడింది .ఒక గొప్ప అందమైన భావ చిత్రాన్నిఅక్షరాలతో చిత్రించి విశ్వనాధ  కవి మన ముందుంచాడు రస రమ్యంగా .మనం దేశ కాలావధులు దాటి కథా కాలానికి వెళ్ళిన మహా విభూతి కల్పించారు కవి సామ్రాట్ .ఇంతటితో ఆగి పొతే ఆయన విశ్వనాధ ఎలా అవుతారు  ?మరో పద్యం వెలువరించారు –

‘’ఇన్నాళ్ళీధర మోసి మోసి ,బరువయ్యెన్ విశ్వ విజ్ఞాన సం-పన్నాళీక భవుల్ భవత్కరములన్ భద్రమ్ముగా నుంచి త-ర్కోన్నేయాచ్ఛ పథాధ్వనీనుడుగ నన్నో భూసుర గ్రామణుల్-మన్నింపం దగు నెప్పుడో తెణపి సంప్రాప్తించె నీ నాటికిన్ ‘’.

దీన్ని వ్యాఖ్యానిస్తూ శలాక శర్మగారు –‘’దశరధుని త్రికరణాలూ బరు వెక్కి పోయాయి .వయసూ పెరిగింది కనుక భారం ది౦చుకోవాల్సిందే .దాన్ని తేలిగ్గా కింద పారేసి చేతులు దులుపుకోవటం ధర్మ నిష్ట కల దశరధునికి సులభం కాదు .దాన్ని ‘’సుస్థాన పతితం ‘’చేయాలి అంటే మంచి సమర్ధుల చేతిలో పెట్టాలి .అందుకే ‘’విశ్వ విజ్ఞాన సంపన్నాళీక భవుల్ ‘’అంటే విశ్వ విజ్ఞాన సంపదలో మీరు పద్మ సంభవుడైన బ్రహ్మ దేవుని అంతటి వారు కనుక నిశ్చింతగా ఈ భారాన్నిమీకు అందిస్తున్నాను అనే పరి తృప్తి నా హృదయం లో పరవళ్ళు తొక్కు తోంది ‘’అని అతి వినమ్రంగా విన్న వించాడు  .ఇక్కడ ప్రయోగించిన ‘’నాళీకభవ ‘’ శబ్దం సాభి ప్రాయం గా ఉన్నది .నాళీకంఅంటే పద్మం –పంకజం అనీ అంటారు .అది బురదలో పుట్టి పెరిగినా దానికి ఆ బురద అంటుకోదు .అలాగే మహాత్ములైన మీరు ఈ రాజ్యాన్ని నిర్లిప్త భావం తో పరి పాలిస్తారు కనుక ఈ భూమికి సర్వతో భద్రత ఏర్పడుతుంది అనే గంభీరమైన అర్ధం ఇందులో కవి సామ్రాట్ నిక్షిప్తం చేశారు .’’భవత్కరములన్ భద్రమ్ము గా నుంచి ‘’అన్నాడు చక్రవర్తి –‘’మీ చేతుల్లో భద్రం గా పెట్టి నేను విశ్రాంతి తీసుకొంటాను ‘’అనే భావాన్ని ‘’విశ్వనాధ కవి చక్ర వర్తి ‘’ప్రాచీన భారతీయ మహా చక్ర వర్తి మహోన్నత భావ పరంపరను కుమ్మరించి చూపించారు ‘’అని శర్మ గారు పొంగిపోయారు .ఆ పులకింత మనకూ కల్పించారు .ఉత్తముడైన రాజు ప్రజల కోసమే బ్రతుకు తాడు .తాను  ఏలే రాజ్యానికి సర్వ సమర్ధుడైన ఉత్తరాధి కారి కావాలని ఆశిస్తాడు .అంతటి మహాత్ముడు దొరికితే ఆయన హృదయం ఆనంద అర్ణవమే అవుతుంది .బరువు ఎత్తుకొనేటప్పుడు,దించు కొనేటప్పుడు ఈ తత్త్వం’’ ఓతప్రోతం’’ గా ఉంటుంది అన్నారు శర్మ గారు .దశరధ మహా రాజు ఇంతటి మహోన్నతుడు కనుకనే  విష్ణు మూర్తి ‘’పితరం రోచయామాస తదా దశరధం నృపం ‘’అను కొన్నాడు అన్నాడు వాల్మీకి మహర్షి .అంటే తండ్రిగా దశరధ మహా రాజును శ్రీరామావతారానికి  ఎంచుకొన్నాడు విష్ణు మూర్తి అని అర్ధం .ఇక్కడ చక్రవర్తి సంసార బంధ వినిరక్తుడైన ఒక నిస్సంగునిలా దర్శనమిస్తాడు .అలాంటి వాని హృదయం ‘’ఆనంద సాంద్ర స్థితి ‘’లో విహరిస్తుంది ‘’అని శర్మ గారు మాత్రమే  చేయగల వ్యాఖ్యానం ఇది .

ఈ ఘట్టానికి ఫైనల్ టచ్ ఇస్తూ విశ్వనాధ –

‘’అని ఉత్తరీయమునుగ –ట్టిన దోవతి తోడ వడి వడిం జను ,నరపా

లుని త్రోవ కడ్డమై బ్రా-హ్మణు లిది ఏమయ్యభూమిపా !భూమ కృపా ‘’

ముందు పద్యం లో చెప్పిన మాటలు పలికి రాజు ఉత్తరీయం తో కట్టిన దోవతి తో వడివడి గా వెళ్లి పోతున్నాడు .అంతా దానం చేశాక కట్టు బట్టలు తప్ప మరేమీ తనతో తీసుకు పోరాదనే  దృఢ వైరాగ్య భావన గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకొని ,పరమ విరాగిగా ఉన్నాడు మహా రాజు .అప్పటి వరకు ‘’అసముద్ర క్షితీసుడు ‘’దక్షిణగా సర్వ భూమినీ ధార పోసిన మరు క్షణం లో ఐశ్వర్యం పై ఆవ గింజంత అధికారం కూడా తనకు లేదను కొన్న త్యాగ మూర్తి దశరధ మహా రాజు .కాళిదాస మహాకవి ‘’సంభ్రుతార్దానాం ‘’ అన్నాడు అంటే త్యాగం కోసమే అర్ధ సంపత్తిని కూర్చు కుంటారు అన్నాడు .త్యాగమే అమృతత్వానికి దారి .ఇంతటి త్యాగ శీలినే మహా విష్ణువు తండ్రిగా కోరుకున్నాడు .మనసు చాలా విచిత్రమైంది .ఒక్క క్షణం జాగు చేస్తే అది తనపై అధికారం చలా ఇంచే ప్రమాదం ఉంది కనుక ‘’వడి వడిం జని’’అని అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోతున్నాడు .అయితే ఎక్కడికి వెడుతున్నాడో కవి చెప్పలేదు . అది ‘’పరి వ్రజనం ‘’అన్నమాట .అంటే గమ్యం లేకుండా సాగటం .ఇదే పరమ వైరాగ్యానికి పరమ నిదర్శనం అంటారు శలాక శర్మ గారు .

తర్వాత యధా ప్రకారం దక్షిణ తీసుకొన్నవారు రాజుకు తిరిగీ భూభాగం అప్పగించి కానుకలతో సరిపెట్టుకోవటం మనకు తెలిసిందే .కాని వారు రాజుకు మహా సామ్రాజ్యం కంటే మహా ఫలాన్ని అనుగ్రహిం చారు .ఇక్కడ మహర్షి –

‘’తస్యా శిషోథ విధి వద్ బ్రాహ్మణైః సముదీరితాః-ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ ‘’

బ్రహ్మ జ్ఞాన సంపన్ను లైన ఆ మహర్షులు ఉదారుడు ,రాజ వీరుడూ ,నేల పై సాష్టాంగ  దండ ప్రణామం చేసి ఉన్నవాడూ అయిన దశరధ మహా రాజు కు విధి ననుసరించి ఆశీస్సులు అనుగ్రహించారు .ఇక్కడ ఆశీస్సులు అంటే ‘’శాసనాత్మకమైన ఆదేశాలు ‘’అన్నమాట .వారి మాటలను కాదన లేక మహా రాజు రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించాడు .అయినా ‘’విరక్తత ‘’అలాగే ఉండి పోయింది అంటారు శలాక వారు .మహర్షి పలికిన ఆశీస్సులను విశ్వనాధ కవి మహర్షి బహుధా ప్రవచించి ఇలా చెప్పారు –

‘’సాదు జనైక క౦టక నిశాచర క౦ఠ కరాళ మూర్తి ,మా-యాధవు డంజనాద్రి శిఖరా౦చల చిక్కణ కాంతి మత్తనూ –సాధు మనోజ్ఞ మూర్తి త్రిదశ ప్రభు బంధ విమోచనుడు భూ –మీ ధవ !త్వత్పురావన సమిద్ధ మహో నిధియై తలిర్చుతన్ ‘’అన్నారు

భావం –‘’భూమీధవా !భూదేవి పతీ !అని సాభిప్రాయంగా అని ‘నీకు పరి పాలించే భూమి అంతాసుఖంగా ఉండాలన్న తపన ఉంటే,ఇప్పటికీ నువ్వు భూమి ధవుడివే అయి శ్రీ మహా విష్ణువుకు తండ్రివై ,నిన్ను నువ్వు ఉద్ధరించు కొని ,ప్రజలందర్నీ ఉద్ధరించే పుణ్యం కట్టుకోవాలి .ఎలాగా అంటావా –సాదుజనాలకందరికీ ఒకే ఒక క౦టకుడిగా చెలరేగుతున్న నిశాచర కంఠాలకు కరాళ మూర్తి అయిన వాడూ ,మాయ అనే ప్రకృతికి భర్త అయినవాడూ ,కాటుక కొండ కొమ్మల చివర్లలో నిగ నిగ లాడే కాంతితో విరాజిల్లే దేహ సౌందర్యం తో అందరి మనస్సులనూ ఆకట్టుకొనే నీల మేఘ శ్యాముడు ,దేవేంద్రుని బంధనం నుంచి విడిపించేవాడూ అయిన కుమారుడు జాజ్వల్యమాన మైన కాంతితో నీ ముందు తిరుగాడుతూ ఉంటాడయ్యా ‘’అని శుభాశీస్సులు కురిపించారు .దీనితో రాజు కోరికా ,జన వేదనా ,రాక్ష సంహారం, ఇంద్ర సంతృప్తీ తీరే వర ప్రదానం మహా రాజుకు యజ్న ఫలంగా దక్కింది .

మహర్షులు ద్రష్టలు ,క్రాంత  దర్శులు కనుక పుట్టబోయే’’ బుల్లి బుజ్జాయి’’ శ్రీ రామ చంద్రుని దర్శించి మాట్లాడారు .ఆయన చేసే సర్వ రామాయణాన్ని మూడు ముక్కల్లో కుదించి కుప్ప బోశారు .ఆది శేషుని అంశతో లక్ష్మణుడు ,పాంచజన్య శంఖం వెలుగులతో భరతుడు ,సుదర్శన చక్ర స్వరూపం తో శత్రుఘ్నుడు అవతరించ బోతున్నారని కూడా ఆశీస్సులతో సూచించారు .దశరధ మహా రాజు వైరాగ్య గరిమతో అందుకో బోతున్న ‘’అమృత స్థితి ‘’ఇది .ప్రత్యామ్నాయంగా కోట్ల కొలది సువర్ణాన్ని ,గోవులను సమర్పించి నామమాత్రమైన రాజ్య పాలన స్వీకరించాడు దశరధ చక్రవర్తి .ఇదంతా మహర్షి వాల్మీకి వాక్యాలకు విశ్వనాధ చేసిన మహా భాష్యం .’’అన్న శ్రీ శలాక వారి వ్యాఖ్యానం  శిఖరాయ మానం .బహుశా భారత ,భాగవతాలలో అశ్వ మేధయాగాలు చేసిన యే చక్రవర్తీ దశరదునిలా ప్రవర్తించినట్లు యే కవీ రాయలేదుఅని నేను అనుకొంటాను . .ఆ పని ఒక్క విశ్వ నాద మహా కవి మాత్రమే చేసి  తన సకలోహసనాధం గా  కల్ప వృక్ష రామాయణానికీ పట్టాభి షేకం చేశారు .

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .   .

 

 

 

 

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.