స్వస్తినః
‘’స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాః-స్వస్తినః పూషా విశ్వ వేదాః-స్వస్తిన స్తార్ష్యోరిస్ట నేమిః-స్వస్తి నో బృహస్పతి ర్దదాతు’’
అనే ఋగ్వేద మంత్రం మనల్ని రక్షిస్తుంది .మంత్రం అంటే మననం చేసే వాడిని రక్షించేది అని అర్ధం .పై స్వస్తి మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జలజంతు బాధ లేకుండా ఉండటానికి జపిస్తారు ,అప్పుడే కాదు సర్వ కాల సర్వా వస్థలలో జపించి రక్షణ పొందవచ్చు .ఇంద్ర ,సూర్య ,గరుత్మంత ,బృహస్పతులు మనకు స్వస్తి చేకూర్చాలని ఇందులో భావం .ఇందులోని విశేషార్ధాలను తెలుసుకొని జపిస్తే ఇంకా ఆనందం .
ఇంద్రుడిని వృద్ధ శ్రవుడు అంటారు .అంటే కీర్తి బాగా పెరిగిన వాడు .లేక అన్నం కలవాడు అనీ అర్ధం .ఇంద్రుడు అంటే దేవ లోకాధిపతి అని సామాన్యార్ధం .కాని విశేషార్ధం లో పరమాత్మ .’’ఇది –పరమైశ్వర్యే ‘’అనే ధాతువు నుండి ఇంద్ర శబ్దం పుట్టింది .పరమైశ్వర్యం ఉన్న వాడు పరమాత్మ ఒక్కడే .ఇంద్రుడు పరమాత్మ కనుక వృద్ధ శ్రవుడు అయ్యాడు .శృతి స్మృతి పురాణాలన్నీ ఇంద్రుడిని కీర్తించాయి .’’ప్రభూత హవిర్లక్షణాన్నయుక్తః ‘’అనే అర్థాన్నీ వేదార్ధ వేత్తలు చెప్పారు .అంటే పరమాత్మకు ఇచ్చే హవిస్సు మానవుడు నిలువ చేసుకొన్న ధనం వంటిది .అగ్ని ద్వారా హవిస్సు పంచ భూతాలలో నిండి ,వర్షం మొదలైన అనుకూల వాతావరణం ఏర్పడటానికి కారణం అవుతుంది .దాని వలన పంటలు సమృద్ధిగా పండుతాయి .లోకాలు సుఖ శాంతులతో వర్దిల్లుతాయి .కనుక పరమేశ్వరార్పణం గా ఇచ్చే హవిస్సు అనే అన్నం జగత్తుకు శ్రేయస్సును కల్గి౦చటానికే .దీనినే భగవద్గీత –
‘’సహా యజ్ఞాః ప్రజాః సృష్ట్వాపురోవాచ ప్రజాపతిః-అనేన ప్రసవిష్యద్వ మేషవో స్త్విస్టకామధుక్ –దేవాన్ భావయతా నేన దేవా భావయంతువః-పరస్పరం భావ యంతః శ్రేయః పర మావాప్స్యధ’’అని చెప్పింది
దీనిభావం –సృష్టి మొదట్లో ప్రజాపతి ప్రజలను యజ్ఞాలతో పాటు సృష్టింఛి ప్రజలతో ‘’యజ్ఞాలతో మీ జాతి వృద్ధి చేసుకోండి .ఇది మీ కోరికలు తీర్చే కామధేనువు అవుతుంది .యజ్ఞాలతో దేవతలకు తృప్తి కలిగించండి .వాళ్ళు మిమ్మల్ని సంతృప్తి చెందిస్తారు .ఇలా ఒకరినొకరు తృప్తి పరచుకొని మహా శ్రేయస్సును పొందండి ‘’అని చెప్పాడు .దీన్ని బట్టి ఇంద్రుడు హవిర్లక్షణ రూప అన్న యుక్తుడు అని తెలుస్తోంది .
తరువాత విశ్వవేదుడైన పూషుడు మనకు స్వస్తి చేకూర్చు గాక అని రెండవ ప్రార్ధన .పూషుడు అంటే సూర్యుడు –‘’పుష్ణా తీతి పూషా ‘’-పుస్టిని ఇచ్చేవాడు .సూర్యుడు తపన శక్తితో సస్య సమృద్ధికి ,చీకటి నాశనానికి కావలసిన శక్తి నిస్తాడు .దేహ పుష్టి తో పాటు విజ్ఞాన పుస్టీ కలిగిస్తాడు .’’వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ ‘’అని ఉంది .హనుమ సూరుని వద్దనే నవ వ్యాకరణాలు నేర్చాడు .కనుక సమస్త మానవ కోటికి భౌతిక ,మానసిక పుష్టి నిచ్చేది సూర్యుడే .కనుక ‘’ప్రత్యక్ష దైవం ‘’అయ్యాడు .అందుకే పరమాత్మకు ప్రతిరూపం అన్నారు .దీనితో ‘’విశ్వ వేదుడు ‘’అయ్యాడు సూర్యుడు .అంటే సర్వజ్ఞుడు అని అర్ధం .పరమాత్మ తన మహిమాది శక్తులను సూర్యాదులలో నిక్షేపించి ,వారి ఆరాధనే తన ఆరాధన అని తెలియ జెప్పాడు .అందువల్ల సూర్య భగవానుడిని పరమేశ్వరునిగా భావిస్తాం .విశ్వ వేదుడుఅనే శబ్దానికి ఎక్కువ ధనం ఉన్నవాడు అనే అర్ధం కూడా ఉంది .నిఘంటువు జాత వేద శబ్దానికి అర్ధం చెబుతూ –‘’వేదో హిరణ్య మస్మాజ్జాత ఇతి జాత వేదాః ‘’అని చెప్పింది .వేదం అంటే హిరణ్యం అంటే బంగారం .దాని నుంచి పుట్టిన వాడు .అందుకని జాత వేదుడు అంటే సమస్తమైన ఐశ్వర్యమూ కలవాడు అని అర్ధం .ఇది కూడా పూషుని పరమేశ్వరతత్వాన్ని చాటుతున్నదే .మొత్తం మీద సమస్త ప్రాణికోటికీ పుష్టి తుష్టి ,దానికి కావలసిన ధనం అంటే శ్రేష్టమైన జ్ఞానధనం ప్రసాదించే ఆదిత్యుడు మనకు స్వస్తిని చేకూర్చుగాక అని అర్ధం .
మూడవ దానికొస్తే ‘’తార్ క్ష్యుడుఅంటే గరుత్మంతుడు .తృక్అనే మహర్షి కొడుకనుక అలా పిలువ బడ్డాడు .అతడు అరిస్టనేమి .దీనికి ‘’అనుప హింసిత ఆయుదః –‘’’’అప్రతి హత రదః’’అనే రెండు అర్ధాలున్నాయి .గరుత్మంతుని వద్ద ఉన్న ఆయుధం వంటివి ఇంకెవరి దగ్గరా లేవని భావం .అంటే సర్వ శక్తి మంతుడైన పరమాత్మ అని అర్ధం .నిజానికి గరుత్మ౦తుని ఆయుధాలు ఆయన కాలిగోళ్ళే.అంతవాడి అయిన ఆయుధం ఇంకేదీ లేదు .ఈ గోళ్ళతోనే అమృతాన్ని హరి౦చేటప్పుడు సుర వీరుల౦దర్నీ తానొక్కడే ఓడించాడు .అమృత సాధన అంటే సర్వ దైవీ భావాన్ని అధిగమించటం .ఆయన అప్రతిహత రధుడు కూడా .అంటే ఆయన సంచరించలేని ప్రదేశం ఉండదని .అనగా సర్వాంతర్యామి అని అర్ధం .అన్నిటిలో చైతన్య రూపం గా ఉన్న పురుషుడు అనగా పరమాత్మ .కనుక అలాంటి గరుత్మంతుడు అందరకు స్వస్తి కలిగించాలని ప్రార్ధన .
చివరిది బృహస్పతి ప్రార్ధన .దేవ గురువు బృహస్పతి .విశేషార్ధం లో దేవతలకంటే గురువు అంటే బ్రహ్మము .దేవా అంటే ద్యోతన శీలం కలది .పంచ భూతాలూ ,పంచేంద్రియాలు ఇంద్రాదులు దీని పరిధిలోకి వస్తారు .వీరందరికంటే గురువు అంటే శ్రేష్టుడు అని భావం అంటే పరతత్వ మైన పరబ్రహ్మమే నని అర్ధం .సామాన్యార్ధం లో –‘’బృహతానాం దేవానాం పాలయితా ఇంద్ర పురోహితః ‘’అనగా గొప్ప వారైన దేవతలపాలకుడైన ఇంద్రుని పురోహితుడు బృహస్పతి .ఆయన స్వస్తి చేకూర్చు గాక అని ప్రార్ధన .
ఇంతకీ ఎలాంటి స్వస్తి కావాలి ?పరమాత్మ నుండి ఆశించే స్వస్తి ‘’పరమ స్వస్తి ‘’మాత్రమే అయి ఉండాలి .అంటే మోక్ష రూప బ్రహ్మానంద లబ్ది .దీనికి ఏం కావాలి ?ఏక సాధనమైన ఏకత్వ దర్శన రూప అద్వైత సిద్ధి .అలా అయితే ఇందులో ఎవరినో ఒకరినే ప్రార్ధించ వచ్చుగా –ఇందర్ని ఎందుకు ?ప్రపంచం లో నానాత్వాన్ని చూడటానికి అలవాటు పడిన మనకు నానాత్వం నుండి ఏకత్వాన్ని చూడాలని భావన .ఇది ఎలా సాధ్యం ?సర్వేశ్వరత్వ ,సర్వ పోషకత్వ ,సర్వ శక్తి మత్వ ,సర్వోత్క్రుస్ట లక్షణ సమాహార సమన్వయము వలన .అంతేకాదు మంత్రం లో ‘’నః’’,దదాతు పదాలు మహార్ధాన్ని వ్యంజనం చేస్తాయి ..’’నః ‘’అంటే సృష్టిలోని భూత జాలమంతా ఒక్కటే అనటాన్ని తెలియ జేస్తుంది .దదాతు అనేది ప్రార్ధనార్ధక క్రియ .దీనికి కాలావదులులేవు .అంటే సర్వ కాల సర్వావస్థలలో పర మేశ్వరుడు సర్వ ప్రాణి సముదాయాన్నీ ఒక్కటిగా ,తనతో అభిన్నంగా చేసి స్వస్తి సంధాయకుడు అవుతున్నాడు అనే మహార్ధం ఇక్కడ వ్యంగ్య రూపం లో ఉన్నది అని మహా గొప్ప వ్యాఖ్యానంగా స్వస్తి మంత్రాన్ని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ‘’కదంబ వనం ‘’లో ‘’స్వస్తినః ‘’వ్యాసం లో తెలియ బరచి మన కళ్ళ పొరలను తొలగించారు .
వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
ఆయా మూలగ్రంంథాలను చదవటంం ముఖ్యంంగా పుస్తకాలను సేకరింంచటమే అయ్యేపనికాదు. చాలా లోతైైన విషయాలను సుబోధకంంగా అంందిస్తున్న మీశ్రద్ధోత్సాహనైైపుణ్యాలు శ్లాఘ్యమానములు.మీ వ్యాసాలన్నీ ఆయా విషయాల సంంప్రదింంపులకు(referance)భద్రపరచుకోదగినవి.నమఃఃపూర్వకాభినంందనలతో
తుమ్మోజు రామలక్ష్శణాచార్యులు