గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
55-భాగవతాచార్య –వైశ్రవ నాద రామన్ నంబూద్రి (1940 )
సంస్కృత విద్వాంసుడు ,గాంధీ అనుచరుడు వైశ్రవనాద రామన్ నంబూద్రి కేరళలో పాలఘాట్ జిల్లాలో జన్మించాడు .సంస్కృత ,మళయాళ ఉపాధ్యాయునిగా పని చేశాడు .తరువాతః భాగవతాచార్య గా మారాడు .భాగవత సత్రం ఆచార్యులలో చాలా ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు .తర్క ,సైన్స్ శాస్త్రాలలో లో ఎం .యే .డిగ్రీ . .వ్యాకరణ సిద్ధాంత మహా పండితునిగా ప్రసిద్ధుడు .100కు పైగా వేద,ఉపనిషత్ మొదలైన సంస్కృత మహా గ్రంధాలను సరళ మళయాళ భాష లోకి అనువదించాడు .దీనివలన సామాన్య మలయాళీలకు వాటిలోని సారం అర్ధమయింది .భాగవతం లో చెప్పబడిన దశావతార వర్ణన వలన డార్విన్ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకో గలిగారు . ఇతర సంస్కృత విద్వాంసులతో కలిసి గురువాయూర్ వంటి ప్రముఖ దేవాలయాలలో హరి జన ప్రవేశం కోసం చేసిన ‘’గురువాయూర్ సత్యాగ్రహం ‘’లో ప్రముఖ పాత్ర పోషించాడు .ఆలయాల వెలుపల భాగవత సప్తాహాలు చేసి ప్రజల దృష్టిని భాగవత సత్రం ఆకర్షించింది .అనంగ నాడి హయ్యర్ సెకండరి స్కూల్ లో ఆడిటోరియం నిర్మించి తన ఉపన్యాసాలకు తగిన వేదిక చేసుకొన్నాడు నంబూద్రి .ఆయన మరణా౦తరం దానిపేరు ‘’రామన్ నంబూద్రి స్మారక మందిరం ‘’గా మార్చి గౌరవం కల్పించారు .గాంధీ జీ పిలుపు మేరకు కేరళలోనూ గుజరాత్ లోని పోర్ బందర్ లోను రామన్ నంబూద్రి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నాడు .
56-మహా భాష్యాన్ని ఆంగ్లీకరించిన –డా.పి.ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి(1890-1978)
సంస్కృత ,తమిళ భాషలలో అద్వితీయ పండితుడైన డా.పి.ఎస్. సుబ్రహ్మణ్య శాస్త్రి తమిళనాడు తిరుచిరాపల్లి లో చదివి గణితం లో డిగ్రీ పొంది ,తిరు వైయ్యార్ లో శ్రీనివాసరావు హయ్యర్ సెకండరి స్కూల్ లో లెక్కల మాస్టర్ గా చేరి ,తర్వాత తిరుచి లో నేషనల్ హైస్కూల్ లో పని చేశాడు .వ్యాకరణ తత్వ శాస్త్ర పండితుడైన నీల కంఠ శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించి ,న్యాయ ,అలంకార శాస్త్రాలను ఎస్. కుప్పు స్వామి శాస్త్రి వద్ద అధ్యయనం చేశాడు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో చిన్నస్వామి శాస్త్రి దగ్గర మీమాంస శాస్త్రం నేర్చి ఎం. యే ,పాసై ,తర్వాత మద్రాస్ లో సైదా పేట ట్రెయినింగ్ కాలేజి లో ఎల్. టి .పాసయ్యాడు . సంస్కృతం తో పాటు తమిళాన్నీ బోధించేవాడు .
కుప్పుస్వామి శాస్త్రి ఈయనకు ఇండో ఆర్యన్ భాషల కంపారటివ్ ఫైలాలజి ని క్షుణ్ణంగా బోధించాడు .ప్రేరణ పొందిన శాస్త్రి తమిళ భాషను,వ్యాకరణాన్ని సంప్రదాయ బద్ధంగా బోధించేవాడు .’’హిస్టరీ ఆఫ్ గ్రమాటికల్ దీరీస్ ఇన్ తమిళ్ అండ్ దెయిర్ రిలేషన్ టు గ్రమాటికల్ లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ ‘’అనే పరిశోధన వ్యాసం రాసి 1930 లో మద్రాస్ యూని వర్సిటి నుంచి పి .హెచ్ .డి .అందుకొన్నాడు .తమిళం లో రాసిన ఈమొట్టమొదటి పరిశోధనకు మొట్టమొదటి పి హెచ్ డిని శాస్త్రి కి అందజేసింది రికార్డ్ కు కారణమైంది .
తిరుచి ఎస్. పి. జి .కాలేజి లో ప్రొఫెసర్ ఆఫ్ ఓరిఎంటల్ స్టడీస్ గా ఫాదర్ గార్డినర్ చేత నియమింప బడిన శాస్త్రి 1917 నుండి 1926 వరకు 9 ఏళ్ళు సేవ చేశాడు .మద్రాస్ యూని వర్సిటి ‘తమిళ లెక్సికన్ ‘’పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా 1932 వరకు ఉండి,చివర్లో ఒక నెల ఎడిటర్ గా పని చేశాడు .తిరువయ్యూర్ రాజా కాలేజి ప్రిన్సిపాల్ గా 1932 నుంచి 42వరకు 10 ఏళ్ళు ఉన్నాడు .1942-47కాలం లో అన్నామలై యూని వర్సిటి సంస్కృత శాఖాదిపతిగా సేవలందించాడు .తాను చేరినప్పుడు సుప్తావస్థలో లో ఉన్న ఆనర్స్ కోర్స్ కు పునరుజ్జీవనం కల్పించాడు .సంస్కృత ,తమిళ భాషా శాస్త్ర బోధనలను తులనాత్మక౦ గా బోధించి విద్యార్ధుల మనసులను ఆకర్షించేవాడు. ఇంగ్లాండ్ సంస్కృత విద్వాంసుడు ,ఆక్స్ ఫర్డ్ లో బోడేన్ ప్రొఫెసర్ ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటుకు సహా సంపాదకుడు అయిన టి .ధామస్ బర్రో అన్నామలై యూని వర్సిటీ లో శాస్త్రి సంస్కృత బోధనా క్లాసులకు హాజరై ఆనందాన్ని అనుభవించేవాడు
సుబ్రహ్మణ్య శాస్త్రి కి ‘’తోలక్కాప్పియం ‘’అంటే మహా అభి రుచి దానిని ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచ దృష్టికి తెచ్చి ప్రపంచావ్యాప్త భాషా శాస్త్ర వేత్తల అభినందనలు అందుకున్నాడు .తోలక్కాప్పియం అంటే తమిళ సాహిత్యమూ భాషాశాస్త్రము . అందులో వర్ణక్రమం ,వర్ణ నిర్మాణం ,పద నిర్మాణం ,అర్ధ విచారం ,ఛందస్సు ఉన్నాయి .ఇదేకాక ‘’ఎఝుత్తు ‘’,పూను లాదికారం ‘’లను కూడా అనువదిస్తే కుప్పు స్వామి రిసెర్చ్ సెంటర్ ముద్రించింది .’’సోల్లాదికారం ‘’అనువాదాన్ని అన్నామలై యూని వర్సిటి ప్రచురించింది .తోలక్కాప్పియం కు శాస్త్రి ఇంగ్లీష్ ,రోమన్ భాషలలో చేసిన అనువాదాలు ప్రపంచ వ్యాప్త కీర్తి పొందాయి .అన్నామలై లో ఉండగా శాస్త్రి పతంజలి మహా భాష్యాన్ని రెండుభాగాలుగాతమిళం లో ,ధ్వన్యాలోకానికి తమిళానువాదం ‘’తూని విలక్కు ‘’,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ ‘’తమిళం లో ,రెండుభాగాలుగా ,ఇంగ్లీష్ లో తమిళ్ రీడర్ వంటివి రాశాడు .
ఉద్యోగ విరమణ తర్వాత తిరువయ్యూర్ వెళ్లి కంచి మహా స్వాములు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల ఆదేశం తో’’ మహా భాష్యం ‘’ను ఆంగ్లం లోకి 14 భాగాలుగా 4 వేల పేజీలలో అనువాదం ప్రారంభించి 1953లో పూర్తీ చేశాడు .మహా భాష్యం లోని ప్రతి సూత్రానికి ముందు విపులమైన ఉపోద్ఘాత౦ రాసి అందులో వ్యాఖ్యానించ బోయే విషయాలను తెలియ బరచి,మూలాన్ని దేవ నాగర లిపి లో రాసి ప్రతి శ్లోకాన్ని అనువదించాడు .తన వ్యాఖ్యానానికి ఆధారం గా కయ్యాటుని ‘’ప్రదీప’’నాగేశ భట్టు రాసిన ‘’ఉద్యోత ‘’లలోని వివరాలను అధో సూచికలలో పేర్కొన్నాడు .పాఠాంతరాలనూ తెలియ జేశాడు .పద సూచీ కూడా చేర్చి కొత్తదనం చేకూర్చాడు .
సుబ్రహ్మణ్య శాస్త్రి విద్వత్తు కు తగిన ;;విద్యా రత్న ,విద్యా నిధి ,విద్యా భూషణ ,మహా మహోపాధ్యాయ ,వాణీ –త్రివేణి బిరుదులూ పొందాడు .వాణీ –త్రివేణి బిరుద ప్రదానం చేస్తూ శ్రీ పరమాచార్య సంస్కృత ,తమిళ భాషలు గంగా ,యమునా నదులని ఇంగ్లీష్ అంతర్వాహిని అయిన సరస్వతి అని శాస్త్రి ఈ మూడునదుల త్రివేణీ సంగమం అని కొని యాడారు .నిరంతర పఠనం ,రచన ఉన్న మహా విద్వాంసుడు శాస్త్రి .శాస్త్రి జర్మన్ ఫ్రెంచ్ ,తెలుగు కన్నడ మలయాళం లలో కూడా గొప్ప పాండిత్యం ఉన్నవాడు .ఇంతటి మహా విద్వా౦సుడైన శాస్త్రి .అతి సామాన్య జీవితం గడిపేవాడు .పాకీ పని చేసుకొనే కార్మికుడికి రుగ్ ,యజుర్ ,అధర్వ వేదాలను బోధించి నేర్పిన మహా పురుషుడు,మహా సంస్కారి . పైన చెప్పినవే కాక మరొక 40పుస్తకాలు రాసిన విద్యా వేత్త . శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విద్యకు ప్రతీక .ఆ నామాన్ని సార్ధకం చేసుకొన్న డా సుబ్రహ్మణ్య శాస్త్రి 20-5-1973,న88 వ ఏట సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చేరాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .
,