శ్రీ సూర్య నారా (నామా )యణ౦
మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా ‘’అమరకోశం ‘’లో –
‘’సూరా ,సూర్యార్యమాదిత్య ద్వాదశాదిత్య దివాకరాః-భాస్కరా హస్కర బ్రద్న ప్రభాకర విభాకరాః-భాస్వద్వివస్వ త్సప్తాశ్వహరి దశ్వోష్మ రస్మయః –వికర్తనార్క మార్తాండ మిహిరారుణ పూషణః-ద్యుమణి స్తరణిర్మిత్రశ్చిత్ర భాను ర్విరోచనః –విభావసు ర్గ్రహ పతి స్త్వషాంపతి రహర్పతిః-భానుర్హంస స్సహస్స్రా౦శు స్తపన స్సవితా రవిః’’అని చెప్పి ఇవికాక
‘’కర్మ సాక్షీ జగచ్చక్షు రంశుమాలీ త్రయీతనుః –ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోక బాన్ధవః –సురోత్తమో ధామ నిధిః పద్మినీ వల్లభో హరిః’’అనీ చెప్పింది .
కనుక రధ సప్తమీ పర్వదినాన సూర్య నారా (నామా )యణ రహస్యాలను తెలుసుకొని తరిద్దాం .దీని వివరణ అంతా ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ రచన ‘’కదంబ వనం ‘’లో ‘’ప్రత్యక్ష దైవం సూర్యుడు ‘’వ్యాసం లో తెలియ జేశారు .
సూర్యుని ముఖ్యనామాలు 37 .ఇవికాక మరో 12 తో కలిపి 49 పేర్లు ఉన్నట్లు పైన చెప్పబడిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది .ఇవన్నీ గుణాలను బట్టి ఏర్పడ్డాయి .నామాధిక్యం గుణాదధిక్యానికి సూచన .పై పట్టిక లో ‘’ఇన’’శబ్దం లేదు .ముందు దాన్ని గురించి తెలుసుకొందాం ‘’ఏతి ఇతి ఇనః ‘’అంటే సంచరించేవాడు .సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని విజ్ఞానశాస్త్రం చెబుతోంది .కనుక సూర్య గమనం అంటే కిరణప్రసారం అనుకొంటే ఇబ్బంది రాదు అన్నారు శర్మ గారు .సూర్య కిరణప్రసారం అన్ని వైపులకు అన్నికాలాలలో జరుగుతు౦ది కనుక అది గమన శీలమే .’’సర్వే గత్యార్దాః బుద్ధ్యర్ధః ‘’అనే వ్యాకరణ సూత్రం ప్రకారం సూర్యుడు జ్ఞాన ,విజ్ఞాన మూర్తి .కనుకనే ఆయనను గురూత్తమునిగా వానరోత్తముడైన హనుమ భావించి నవ వ్యాకరణాలు అధ్యయనం చేశాడు .తరువాత ‘’సూర ‘’శబ్దం.’’సరతి గచ్చతి ఇతి సూరః ‘’అని లింగా భట్టు చెప్పాడు .దీనికీ ఇన శబ్దార్ధమే .శూర అని అనుకొ౦టే విక్రమించేవాడు అవుతాడు .సూర్య అంటే సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత అని అర్ధం .తరువాత ‘’ఆర్యమ ‘’అన్నా గమనం ఉన్నవాడనే అర్ధం –‘’ఋ గతౌ ‘’అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దం ఇది .కశ్యప ప్రజాపతి భార్య అదితి కి పుట్టాడు కనుక ఆదిత్యుడు .ఆమె దేవతలకు మాత .దాతు చర్చలో ఆమె అఖండ బుద్ధి విశేషానికి ప్రతీక .గౌతమి పుత్ర శాతకర్ణి కి ముందే తల్లి పేరుతో చలామణి అయినవాడు ఆదిత్యుడు . ఇంద్ర ,ధాత ,పర్జన్య ,త్వష్ట ,పూష,ఆర్యమ ,భగ ,వివస్వత ,విష్ణు ,అంశుమంత ,వరుణ ,మిత్ర అనే 12 మూర్తులున్నవాడుకనుక ద్వాదశాత్ముడు .దివము అంటే పగలును చేసేవాడుకనుక దివాకరుడు .దిన భాగం లో ప్రాణులను చైతన్యం చేసేవాడనీ అర్ధం .’’భాసం కరోతి –ఇతి భాస్కరః ‘’అమేయమైన కా౦తినిచ్చేవాడు .ఆహాస్సును చేసేవాడు ఆహాస్కరుడు .నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు .ఆయన కాంతికి కొన్ని ప్రదేశాలలో అవరోధం కలుగుతుంది కనుక రాత్రి అవుతుంది .ఆ అడ్డంకి తొలగితే అహస్సు. ‘’న జహాతి ప్రత్యాగమనమితి అహః ‘’అని లింగాభట్టు విచిత్రమైన అర్ధం చెప్పాడు దీని అర్ధం తిరిగి రావటాన్ని విడువనిది .మరో అర్ధం –‘’సూర్యేణ న హీయతే ఇత్యహః ‘’అంటే సూర్యుడిని వదలి పెట్టి ఉండనిది .ఇలాంటి అహస్సును యేర్పరచేవాడు ఆహాస్కరుడు .ఇతర తేజస్సులను అడ్డుకోనేవాడు ,చీకటిని కట్ట కట్టి దూరంగా విసిరేసేవాడు కనుక ‘’బ్రద్నుడు ‘’.బంధించే వాడని భావం .
ప్రభ ,విభ అనే ప్రశస్త అత్యధిక కాంతి నిచ్చేవాడు కనుక ప్రభాకరుడు ,విభాకరుడు .సర్వ ప్రాణి కోటికీ దర్శన సామర్ధ్యం కలిగించటాన్ని ప్రశస్తత అంటారు .కిరణాల ద్వారా అన్నాదులను ఏర్పాటు చేయటం విశిష్టత .ఇలాంటి ప్రయోజనాలు ,అనేక లోకాలకు అనంత వెలుగులు కలిగించేవాడు కనుక భాస్వంతుడు .కాంతి తో సర్వాన్నీ కప్పేస్తాడు కనుక వివస్వంతుడు .’’వస ‘’అనే ధాతువుకు ఆచ్ఛాదనం అని అర్ధం .ఏడు గుర్రాలపై వస్తాడుకనుక సప్తాశ్వుడు .వ్యాపించే గుణం ఉండటం వలన గుర్రానికి అశ్వం అని పేరు .ఈ వ్యాపన శీలం అగ్ని ,విద్యుత్తూ ,దీపం మనకు సూర్య ప్రతిరూపంగా దర్శనమిస్తుంది అంటారు శర్మ గారు .సూర్యుడికి ఒకే ఒక అశ్వం ఉందని దానిపేరే ‘’సప్త ‘’అనీ ‘’గురుబాల ప్రబోధిని ‘’తెలియ జేస్తోంది .అయితే లోకం లో 7 గుర్రాలు అని వాడుక .7 అనేవి 1 ఎలా అవుతుంది?న్యూటన్ వర్ణ చక్రం ను వేగంగా తిప్పితే 7 రంగులు కలిసి తెల్ల రంగు అవుతుందని మనకు తెలుసు .అసలు తెలుపు కూడా కాదు యే రంగూ లేని తనం .సూర్య రశ్మి లో 7 రంగులుంటాయి కదా అలా .హరిదశ్వ అనే పదానికి పచ్చ గుర్రాలున్నవాడు అని అర్ధం .సృష్టి లోని పచ్చదనానికి సూర్యుడు ప్రతీక .ఈ పచ్చదనం సంపద,సౌభాగ్యాలకు ప్రతీక .
సూర్యుడికి ‘’ఉష్ణ రశ్మి ‘’ అనే పేరుంది .కిరణాలు కలవాడని అర్ధం .సూర్యుడు విశ్వ దేహానికి అవసరమైన వేడిని తగిన ప్రమాణం లో కిరణాల ద్వారా అందిస్తూ విశ్వాన్నిరక్షిస్తాడు .ఈ ఉష్ణం ప్రాణికోటికి కావాల్సిన వాటిని పచనం పాకానికి తెచ్చి పోషిస్తాడు .’’వికర్తనుడు ‘’అంటే ‘’వికృతంతి తమః ‘’-చీకటిని చీల్చేవాడు ,’’వికృత కర్మణా విక్రుతః ‘’అనే మరో అర్ధం లో విశ్వ కర్మ సూర్యుడిని సానబెట్టి ప్రతాపాన్ని సహ్యంఅంటే సహి౦చేట్లు చేశాడని అర్ధం వస్తుంది .ప్రాణికోటికి ఈ రెండూ కావాల్సినవే .భౌతికమైన చీకటి సరే లోపల చీకటి కూడా ఉంది .అదే అజ్ఞానం .ఈ రెండిటినీ చీల్చి ప్రయోజనం కలిగిస్తాడు .’’అర్కుడు ‘’లోకాల చేత అర్చించ బడేవాడు .మృతండ మహర్షి కొడుకు కనుక మార్తాండుడు .మరో అర్ధం –‘’మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తా౦డః’’.మృతమైన బ్రహ్మాండాన్ని జీవింప జేస్తున్నాడు కనుక మార్తాండుడు .’’మిహిరుడు ‘’అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించే వాడు .సూర్య కిరణాలు జలరాశిని ఆవిరి చేసి మేఘాలుగా మార్చి వర్షాన్ని స్తాయి కనుక మార్తాండ ,మిహిర శబ్దాలు సూర్యునికి పర్యాయ పదాలను చేశారు మన మహర్షులు .
నిరంతర సంచారి కనుక అరుణుడు.ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు .అదే ‘’పూష’’.ఈ గమనం లో దివ్య జ్యోతులు కనిపిస్తాయికనుక ద్యుమణి .దీప్తి తుష్టి పుష్టి ఆరోగ్యాలను అందించే మణి.అందరికోసమే ఆకాశం లో ఆయన అన౦త గమనం చేస్తాడు . ఆయన గమనం వలన ప్రాణులు చీకట్లను తరిస్తారు .ఆయన ఆకాశాన్ని తరిస్తాడు కనుక ‘’తరణి ‘’.సర్వ భూతరాశిపై స్నేహ భావం ఉండటం వలన ‘’మిత్రుడు ‘’..వివిధ వర్ణాలున్నవాడుకనుక ‘’చిత్ర భానువు ‘’.సృష్టిలోని అన్ని రంగులు సూర్య కిరణ స్వరూపాలే . విశేషంగా ప్రకాశించేవాడు కనుక ‘’విరోచనుడు ‘’ఆ కాంతి పు౦జ మే ఆయనకు ధనం అంటే వసువు అందుకే విభావసువు . ఆ ధనతత్వం ప్రాణుల ప్రయోజనం కోసమే కనుక దైవం అయ్యాడు .గ్రహాలకు నాయకుడుకనుక గ్రహ పతి .తన కిరణాలను ,ప్రతిరూపాలైన అగ్నులను ,ఓషధులను ,దేహం లోపలి జఠరాగ్నిమొదలైన వాటిని సంరక్షిస్తాడు కనుక ‘’త్విషాంపతి ‘’’’త్విట్టులుఅంటే కాంతులు అని అర్ధం .పగటికి ప్రభువుకనుక ఆహస్పతి.
‘’హంతి తమః ఇతి హంసః ‘’చీకట్లను రూపు మాపేవాడు కనుక హంస .అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్రాం శువు ‘’.నిద్రించే వారిని మేల్కొల్పే వాడుకనుక ‘’సవిత ‘’-సువతి –సుప్తం ప్రేరయతి ‘’.ఇన్ని గొప్ప పనులు మనకోసం చేసేమహాత్ముడు కనుక ఆయన్ను స్తుతించాలి .స్తుతి అర్ధాన్నిచ్చే ‘’రు ‘’ధాతువు నుండి ఏర్పడినది ‘’రవి ‘’.లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక ‘’అంశుమాలి ‘’.మూడు వేదాలు అయన శరీరం గా ఏర్పడ్డాయి .వెలుగు అంటే విద్య కనుక .అవి ఆయన నుంచి వస్తున్నాయికనుక ‘త్రయీ తనువు’’.
14 లోకాలకూ వెలుగులివ్వ వలసిన వాడు కనుక ప్రకృస్టం గా ప్రకాశించాలి కనుక ‘’ప్రద్యోతనుడు ‘’.అందుకే దినమణి.ఆకాశం లో వెలిగేవాడుకనుక ‘’ఖద్యోతుడు ‘’.ఆపని లోక బాంధవ్యం కోసమేకనుక ‘’లోక బాంధవుడు ‘’.అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు ‘’.ధామం అంటే కాంతికి నిదికనుక ‘’ధామనిది ‘’.తామర పూలను వికసింప జేసేవాడు కనుక పద్మినీ వల్లభుడు .తమస్సు హరించేవాడు కనుక ‘’హరి ‘’.
ఇదీ ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్య నారా (నామా )యణం’.ఇంతటి అర్ధ భావాలను విశదీకరించిన శ్రీ శలాక వారు నిజంగా ‘’శబ్ద దినమణి’’ .ఆయన వెలుగే ఇదంతా .
రేపటి రధ సప్తమి కి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-2-2-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.
—