ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2
భారత దేశ తత్వ వేత్తలు ఏదైనా ఒక అంశాన్ని పట్టు కోవటానికి 4 ప్రమాణాలను పాటిస్తారు .అవే ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద ప్రమాణాలు .వీటిలో ఒక దానికంటే మరొకటి క్రమగా బలవత్తరాలు .సాధారణంగా వాదం లో స్వపక్షం ,పర పక్షం ,మధ్యమ పక్షం అనేవి ఉంటాయి .ఒక పక్షానికే చెందిన మాటలు యధా తధంగా ఆమోదించ టానికి వీలు కాదు .రెండు వైపులా ఉన్న ఉత్తమ స్వభావం గలవారి మాటలను ప్రమాణంగా తీసుకోవాలి . వాద ప్రతి వాదులలో అజ్ఞానం చేత ,ఆవేశం చేత తమ తప్పులు ఒప్పుకోవచ్చు .అప్పుడు స్వపక్షం నుంచి వెలువడిన అభిప్రాయాలను ప్రత్యక్ష ప్రమాణాలుగా స్వీకరిస్తారు .ఇలాంటివి మహా భారతం లో చాలా ఉన్నాయి మచ్చుకి కొన్ని చూద్దాం .
1-సంజయ రాయబారం అయిన కౌరవ కొలువులో అర్జునుడి మాటలన్నీ 50 శ్లోకాలో సంజయుడు వృద్ధ రాజుకు చెప్పాడు .భీష్మ ద్రోణాదులు ఆమాటల్ని ధ్రువీకరించారు .’’పాండవులు ఎవరి సాయం తో మామీదకు వస్తారు ?’’అని అడిగాడు గుడ్డిరాజు .ఆమాట సంజయుడికి ఒక విద్యుత్ ఘాతం లా తగిలి మూర్ఛపోయాడు .విదురుడు సంజయుడు మూర్ఛపోయాడని రాజుతో చెప్పాడు .సభలో ఉన్న పెద్ద లందరూ కురు వంశం సర్వ నాశనం అయి పోయింది అనుకున్నారు .అప్పుడు గుడ్డిరాజు ‘’ఆ ఏమీ లేదు .పాండవులు సంజయుడిని బాగా బెదిరించారు అందుకే మూర్ఛపోయాడు’’ అన్నాడు తాపీగా .తేరుకున్న సంజయుడు రాజుతో పాండవుల సహాయ సంపత్తులు బలం ,బలగం ఎంత గొప్పవో అన్నిటినీ పూస గుచ్చినట్లు వివరించాడు .అప్పుడు ధృత రాష్ట్రుడు –భీముని శక్తి సామర్ధ్యాలన్నీ వర్ణిస్తూ 60 శ్లోకాలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు .తన నోటితో తానే పాండవులకు చేసిన అన్యాయాలన్నీ ఏకరువు పెట్టాడు .భీముడి సాహసాన్ని పదే పదే గుర్తు చేసుకొన్నాడు. గుండె చెరువై పోయింది .కొంపలు అంటుకుంటున్నా రాజ్య భాగం గురించి ఒక్క మాట అయినా గుడ్డిరాజు నోటి నుంచి రాలేదు .యుద్ధం చేయటానికే నిశ్చయించాడు .
2- ‘’చావరు ,నొవ్వరు పాండవు –లేవురు నని నీవు చెప్పనిప్పలుకులు దుః-ఖా వేశములై ,చే-తో వ్రుత్తి గరంప జొచ్చె దుర్భర భంగిన్ ‘’అని శల్య పర్వం లో యుద్ధం దాదాపు పూర్తికావచ్చిన సందర్భం లో ధృత రాష్ట్రుడుఅన్నమాటలివి .తనవాళ్ళు అందరూ చచ్చినందుకు పడుతున్న బాధ కంటే ,పాండవులు చావలేదన్న వేదనఅత్యంత ప్రమాణంగా ఆయన వెళ్ళ గక్కాడు .దీన్ని ఆధారంగా ఒక సారి ఫ్లాష్ బాక్ కు వెడితే గుడ్డిరాజు నిజస్వరూపం తెలుస్తుంది .యుద్ధాన్ని ఆయన ఎంతగా ఇష్టంగా కోరుకున్నాడో ,యుద్ధం ద్వారా ఎలాంటి ఫలితాన్ని అంటే పాండవుల సర్వ నాశనాన్ని ఎలా కోరుకున్నాడో అవగత మవుతుంది .ఇంతకంటే ధృతరాష్ట్రు ని లోగిలి అంటే అంతరంగానికి ప్రత్యక్ష ప్రమాణం వేరుగా ఇంకోటి ఏమీ అక్కర్లేదు అన్నారు ప్రాచార్య శర్మగారు .
అనుమాన ప్రమాణం ద్వారాకూడా గుడ్డి రాజు కపట వృత్తిని నిశ్చయింప వచ్చు అన్నారు శర్మగారు .క్రియాశీలురు దుర్యోధనాదులే అయినా వారికి మూల శక్తి ముసలిరాజే .లోకం లో ప్రతి గ్రూపుకూ వీరాభిమానులు చాలా మందే ఉంటారు .ఇక్కడ కౌరవ పక్షాన్నిమనస్పూర్తిగా ఆరాధించిన వాళ్ళు కనబడటం, కాని వారి పేర్లను పెట్టుకోవటం కాని మనకు కని పించదు.అంటే వాళ్ళ అ౦తరాంతరాలలో ఎక్కడో ఎవరు ఎలాంటి వారు అనే అభిప్రాయం గూడు కట్టుకొనే ఉంది అని ఊహించవచ్చు అంటారు శర్మగారు .
సమర్ధ మైన ప్రమాణంగా కవి ఉపమానాన్ని స్వీకరిస్తాడు .మహాభారతం లో రెండు పక్షాలవారినీ శ్రీ కృష్ణుడు ఉపమాన ప్రమాణం ద్వారాఉద్యోగ పర్వం లో విస్పష్టంగా వివరించాడు –
‘’రోషమయ మహాతరువు సుయోధనుడు,రు –స్కంధ మందులో న గర్ణు డలరు-గొమ్మ సౌబలుడు ,గుసుమ ఫలములు ,దు –శ్శాసనుండు ,మూల శక్తి తండ్రి ‘’
‘’ధర్మజుండు ధర్మ తరు ,వర్జునుడు ఘన –స్కంధ ,మనిల సుతుడు శాఖ ,కవలు –పుష్ప ఫలము ,లేను ,భూసురులును ,వేద –ములు దదీయ మైన మూల చయము ‘’.
ఈ రెండు పద్యాలు చాలా బలమైనవి. భారత తత్త్వం అంతా వీటిలో బీజ ప్రాయంగా ఇమిడి ఉండి .దీనిలో ధృత రాష్ట్రు ని తత్త్వం విస్పష్టంగా కనిపిస్తోంది .’’మూల శక్తి తండ్రి ‘’అనటం లో నెపం దుర్యోధనుడి మీదకు నేట్టేయటానికి వీలు లేదు .ఈ చెట్టు ‘’అసారం ‘’అనీ రెండవ చెట్టు ‘’గాఢ సార సహితం ‘’అనీ శ్రీ కృష్ణ నిర్ణయం .ఇక్కడ అందరికీ ఒక అనుమానం రావచ్చు .పాండవ పక్షపాతి కదా నల్లవాడు ఆయన చెప్పిన మాట పక్షపాతం తో ఉండటం సహజం కదా అటువంటప్పుడు దాన్ని పట్టుకొని వేలాడటం భావ్యమేనా .అందుకే కృష్ణుడు చమత్కారంగా ‘’ధర్మ తరువునకు మూల చయం –ఏను ,భూసురులు ,వేదములు ‘’అన్నాడు దీన్ని తాత్వికంగా లోతుగా తరచి చూడాలి .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 12-2-17 –ఉయ్యూరు