ధృతరాస్ట్ర లో(కౌ)గిలి
కురుక్షేత్ర యుద్ధానంతరం నిర్వేదనకు గురైన ధృత రాష్ట్రుడు కౌరవ వంశాన్ని నిర్వంశం చేసిన భీముని పై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో భావించి పైకి భీముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ అతని కౌగిలి కోరటం ఈ దుష్టపన్నాగం గమనించిన శ్రీ కృష్ణుడు భీముడికి బదులు లోహ భీముడిని తయారు చేయించి కౌగలించుకోమనటం, ధృత రాష్ట్ర కౌగిలి లో ఆ ఇనుప భీమ విగ్రహం పొడి పొడి అవటం మనం విన్నాం ,సినిమాలలోనూ చూశాం .అంతటి కాపట్య౦ ఉన్నవాడు గుడ్డిరాజు .మహాభారతానికి నాయకుడు ధర్మరాజు , నాయక నాయకుడు శ్రీ కృష్ణుడు .కృష్ణుడు ఆడించినట్లే భారతం నడిచింది అనిలోకం విశ్వ సిస్తుంది .కాని కురువంశ వినాశనానికి ముఖ్య మూల కారణం అ౦బి కాతనయుడైన గుడ్డి రాజే అని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’వ్యాస భారత వరి వస్య ‘’గ్రంధం లో ‘భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు ‘’వ్యాసం లో చాలా లోతుగా పరిశీలించి వ్రాశారు .ధృత రాష్ట్రుని బాహ్య ప్రవృత్తి కౌగిలి లో బయట పడితే ,ఆ౦తరిక ప్రవ్రుత్తి హృదయం అనే గృహం అంటే లోగిలిలో బందీ గా ఉన్నది అని నాకు అని పించి, శలాక వారి అభిప్రాయాలలోని ముఖ్య విషయాలను అందరూ తప్పక తెలుసుకోవాలన్న అభిప్రాయం తో మీకు అందించే ఉద్దేశ్యం తో శీర్షిక గా ‘’ధృత రాష్ట్ర లో(కౌ )గిలి ‘’అని రెండూ కలిసి వచ్చేట్లు పెట్టి రాస్తున్నాను .సాహసానికి మన్నించండి .
‘’ పారమార్ధిక దృష్టి లో చూస్తే భారత యుద్ధానికి మూలకారణం శ్రీ కృష్ణ పరమాత్మ .రాజకీయ దృక్పధం తో చూస్తే రాజ్యం పైఆశ .మానవత్వ కోణం లో చెప్పాలి అంటే సర్వ అనర్ధాలకు మూలకారణం ధృత రాష్ట్రుడే ‘’అన్నారు శ్రీ శలాక శర్మగారు .పరమార్ధం శరీరం ,శరీరి ,తత్త్వం మొదలైన అంశాలకు సంబంధించింది .భారతం తత్వ ప్రధాన గ్రంధం .ధృత రాష్ట్ర పక్షం అసుర భావాలకు ,పాండవ పక్షం దివ్య భావాలకూ ప్రతీకలు .ఈరెండిటికి శరీరం లోను ,విశ్వ శరీరం లోను నిత్య సంఘర్షణ ఉంటుంది .పరమాత్మను ఆశ్రయించిన దైవ సంపత్తి ,ఆసుర సంపత్తిని సర్వ నాశనం చేస్తుంది .దీన్ని ఆడించేవాడు పరమాత్మ .ఆయన కర్తవ్యాలు సాధు పరి రక్షణ ,,అసాధు శిక్షణ ,ధర్మ స్థాపన .మానవుని లో చెలరేగే దుస్ట భావాలు- అంటే సచ్చిదానంద తత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అజ్ఞానం మొదలైనవి అసాదువులు .వీటికి వ్యక్తిత్వం వస్తే ధృత రాస్ట్రుడు మొదలైన వారు ఏర్పడుతారు .ఆత్మ తత్వాన్ని ఆశ్రయించి ,కర్మాది యోగాలద్వారా స్వస్థితిని చేరుకొనే జ్ఞానాశిస్ట భావాలే సాదు శబ్దవాచ్యాలు .వీటికి రూపకల్పన జరిగితే పాండవులు అవుతారు .ధర్మ సంస్థాపన అంటే వేరే ఏదో కాదు –పై రెండు పనులు జరిగితే ఏర్పడే స్థితి .చీకటి తొలగి వెలుగు వచ్చినట్లు అన్నమాట .ఈదృష్టి తో చూస్తే ,సర్వాంతర్యామి ,సర్వజ్ఞుడు ,సర్వ కారణుడు ,వాసుదేవ రూపం లో అవతరించిన పరమాత్మ మహా భారత యుద్ధానికి కర్త ,కారయిత ‘’అన్నారు మహా వ్యాఖ్యాన శిరోమణి శలాక శర్మగారు .సాక్షాత్తు అపర సూత మహర్షి అనిపిస్తారు .
యుద్ధానికి రెండవ కారణం రాజ్యాశ .నిజంగా ఇది రాజులకు దోషం కాదు .ఇక్కడ పాండవ కౌరవులలో రెండు పక్షాలు సర్వ నాశనం కాకుండా మధ్యే మార్గం సూచింపబడింది .అదే రాజ్యం లో సగభాగం .అదీ కుదరక పొతే అయిదు ఊళ్లు అయినా ఇవ్వటం .కాని కౌరవ పక్షం ‘’వాడి సూది మొన ఇంచుక మోపిన యంత మాత్రయున్ భూమి యొనర్చి ‘’ఇవ్వను ఫో అన్నది .ఇంకొంచెం దూకుడుగా ముందుకు వెళ్లి ‘’ఎవ్వరైన సంగ్రామమునన్ జయంబు గొని రాజ్యము చేయుట నిశ్చయించితి ‘’అనేదాకా వెళ్ళింది .అంతేనా ‘’ఆ మహా భోగం ‘’సిద్ధి౦చేదాకా పట్టిన పట్టు విడువకుండా అంగుళం కదలకుండా కూర్చున్నది .రాజ్యం వీరభోజ్యం అన్నంత మాత్రాన ధర్మం ,న్యాయం ఇచ్చి పుచ్చుకొనే పద్ధతీ ,సోదరత్వం మొదలైన మంచి లక్షణాలను మంట గలిసి పోయేలా ప్రవర్తి౦చటం వివేక వంతుల లక్షణం కాదు .వీటికోసం ఒక పక్షం అంటే పాండవ పక్షం చేయవలసిన కృషి అంతా చేసింది .ఇంగ్లీష్ లో ‘’గివ్ హిం ఏ లాంగ్ రోప్ ‘’అన్నట్లు చాలా ఉదారంగా వ్యవహరించింది .ఎంతటి మహోన్నత త్యాగాలకైనా ,ఎన్ని విపత్తుల కైనా తట్టుకోవాలని దృఢ సంకల్పం తో ఉంది. రెండవ పక్షమైన కౌరవ పక్షం వీటిని నామ రూపాలు లేకుండా ,తుడిచి పెట్టటానికి శాయ శక్తులా ప్రయత్నించింది.ఫలం అనుభవించింది . మితిమీరిన అర్ధ లోభం ఎంత భయంకరంగా పరిణమిస్తుందో కురుక్షేత్ర యుద్ధం నిరూపించింది .ఈ దృష్టి లో మహా భారత యుద్ధానికి అసలు కారణం అధికార దాహం .ఇది కౌరవులలో కొండంత గా ఉంటె పాండవులలో గోరంత గా ఉన్నది .
తత్వానికీ ,అర్ధ లోభత్వానికీ మధ్యలో వాటితో విడదీయరాని సంబంధం ఉన్న మానవత్వం అనే ముడి ఒకటి ఉంది.అనేక కోణాలలో మానవుడు పశుతుల్యుడే ,కొన్ని కోణాలలో విశిష్టుడుగా కనిపిస్తాడు .ఈ కొన్ని కోణాలలో నిలదోక్కుకుని నిలబడితేనే అతని మానవత్వం పరిగణన లోకి వస్తుంది .పైన చెప్పిన ధర్మం, న్యాయం మొదలైనవే ఆ కొన్ని కోణాలు .ఈ విషయాలలో ఒక నీతి ,నియమం ,లేకుండా ప్రవర్తించి సర్వ నాశనం తెచ్చుకున్నవారు దుర్యోధనుడు ,కర్ణుడు ,శకుని ,దుశ్శాసనుడు .నైతిక బలం తో, అధికార దృష్టితో ,పెద్దల మద్దతు తో ,వీరిని అదుపులో పెట్టుకొనే సమర్ధత ఉన్నా ,కన్నుకావని పుత్ర వాత్సల్యం తో ,దురాశ,సంకుచిత స్వభావం తో చాటుగా ,సూటిగా కూడా ప్రోత్సహించినవాడు ధృత రాష్ట్రుడు.అతని కపటత్వమే కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణమై౦ది .దీన్ని నిరూపించటానికి ప్రత్యక్ష ,పరోక్ష నిదర్శనాలున్నాయ౦టున్నారు శ్రీ శలాక వారు .వాటిని గురించి తరువాత తెలుసు కొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-17 –ఉయ్యూరు
—