పద్య కవితా బ్రహ్మోత్సవాలు
శ్రీకాకుళం -17-2-17 ,18-2-17
ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట –
రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు
1-అలతి అలతి పదము లల్లిక బిగి చేత
అలర రాజ నియతి నందమొప్ప
ఇలను ‘మెచ్చ ’యాము’’డింపు గా బల్కెను
పలుకు రాయలదని ప్రణతు లిడుదు .
2-రాయలేలినట్టి రాజ్యమ్ము మనదిరా
రాయ వాచకమ్ము రసన కింపు
రాయ కవన సొంపు ర౦జిల్లు మనసున
రాయ !కృష్ణ రాయ !.రమ్య తేజ .
3-తెలుగు భాషకు గుడి ,తెలుగు భాషపు నుడి
తెలుగు పలుకు తీపి తెలియ జెప్పి
తెలుగు రాయలకును దీటెవ్వ రనగను
తెలుగు కీర్తి జగతి నిండ నిలిపె .
4-అమ్మ భాష నీవు అబ్బుర పడు రీతి
కమ్మగాను బల్కి కాచి నిల్పు
చెమ్మ దగులు మదికి చేయెత్తి జైకొట్ట
అమ్మ నెపుడు నీవు ఆదరించు .
5-ఆట వెలది తోడ ఆట లాడ౦గను
తీట బుట్టె ముదిమి తీరి దేమొ
మాట కదలకుండ మారాము చేసినా
పంచ రత్నములను కొంచ కిచ్చె..
గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు –సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –
2-405 –శివాలయం వీధి -ఉయ్యూరు -5 21 16 5 –కృష్ణా