అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )

https://plus.google.com/photos/115752370674452071762/album/6389572083020488849?authkey=CMfb3Ia3zPaC7gE

పట్టి సీమ ఎత్తి పోతల పధకం

‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’కాదు ,’’జలధనమేరా అన్నిటికి మూలం –ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ‘’అన్నది సూక్తి కావాలి .’’జలసిరి  ఉంటేనే  సర్వ  సిరుల సమాహారం లభిస్తుంది . జీవాధారం, జీవనాధారం అయిన నీరు  అతి పవిత్రం . దాన్ని సేకరించి నిల్వ చేసుకోవాలి .లేకుంటే ప్రగతి అధోగతి పాలౌతుంది .

ఇటీవలకాలం లో కృష్ణ గుంటూరు సీమలలో  కృష్ణ నదీ జలాలు అందక ‘’క్రాప్ హాలిడే ‘’ప్రకటించబడి అన్నపూర్ణ అయిన ఈ రెండు జిల్లాల పరిస్థితి దారుణమై రైతుల పాలిటి హృదయ శల్యమై బాధిస్తోంది .దీని నుంచి రైతులకు విముక్తి కలిగించకపోతే ఆంద్ర దేశానికి మనుగడ ఉండదు .ఈ విషయాన్ని కనిపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,పోలవరం వచ్చేదాకా ఆగకుండా ,సాగు తాగు నీరు అందించే పధకం గా లిఫ్ట్ ఇర్రిగేషన్ ద్వారా గోదావరి నీళ్ళను కృష్ణ లో బెజవాడ అవతల  ఇబ్రహీం పట్నం దగ్గరున్న ఫెర్రీ లో సంగమించే పధకం ఆలోచించి అత్యంత వేగంగా అమలు జరిపి అందరినీ ఆడుకున్నారు .దీనివలన గోదావరి జిల్లాకు ఏ రకమైన నష్టం ఉండదు కారణం గోదావరి వరద జలాలను మాత్రమే పట్టిస గ్రామం వద్ద నిర్మించిన 24 మోటార్ల నిలువు మోటార్లతో తోడి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరేట్లు చేయటం సాహసం అద్భుతం .పోలవరం నిర్మాణానికి మనపైనున్న రాష్ట్రాల అభ్యంతరాలు నిదుల కొరత ,కేంద్ర సాయం అంత త్వరగా పరిష్కారం అయ్యే వికావు కనుక అంతదాకా అన్నదాతలను పస్తుపడుకో బెట్టటం ఇష్టం లేక పట్టుబట్టి చేబట్టిన దీపట్టిసీమ ఎత్తి పోతలపధకం .

పట్టిసీమకు ఒక ప్రత్యేకత ఉంది ద్రాక్షారామం లోదక్ష ప్రజాపతి అల్లుడైన శివుని ఆహ్వానించకుండా యజ్ఞం చేసి ,పిలువని పేరంటంగా వచ్చిన స్వంత కూతురు సతీ దేవిని అవమానిస్తే ,ఆమె అక్కడే యోగాగ్నిలో దగ్ధమైతే ,శివునికి తెలిసి జటాజూటం నుంచి వీర భద్రుని సృష్టించి దక్షాధ్వర విధ్వంసం చేయించాడు .హాజరైన దేవతలందరికీ తగిన శాస్తి చేసి తన’’ పట్టిస ‘’అనే ఆయుధం తో  దక్షాదులను సంహరించి  ,ఆ పట్టిస ను గోదావరి నీటిలో కడిగిన ప్రదేశమే పట్టిస .అదే పట్టి సీమ .గోదారి మధ్యలో శ్రీ వీర భద్రేశ్వరాలయం చిన్న గుట్ట మీద ఉంటుంది .బోటులలో వెళ్లి దర్శించాలి .శివరాత్రికి ఇక్కడికి వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకొంటారు .అంతటి పురాణ ప్రసిద్ధ ప్రదేశం పట్టిస .అక్కడే మన ఎత్తి పోతలపధకం ఉన్నది .అదిఅప్పుడు  ‘’వీర భద్ర విజయం’’ అయితే ఇప్పుడిది’’ చంద్ర బాబు విజయం ‘’..

పోలవరం పనులు యదా ప్రకారం జరుపుతూనే దీనికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు .పట్టిస గ్రామం పోలవరానికి అతి దగ్గరలో ఉండటం కుడికాల్వ సమీపం లో ఉండటం దీన్ని ఎంచుకోవటానికి ముఖ్య కారణాలయ్యాయి .వరదకాలం లో సుమారు 80 టి ఎం సి లనీటిని ఎత్తిపోస్తారు  .24 మోటార్లు అంటే  వర్టికల్ టర్బైన్ పంపులుఉపయోగించారు .ఒక్కో మోటారు 354 ఘన అడుగుల -10 ఘన మీటర్ల నీరు ఎత్తి పోస్తుంది .ఒక్కో మోటార్ హార్స్ పవర్ 6300 .పోలవరం కుడికాల్వ లోకి నీరు  మళ్ళించ టానికి తా 95అడుగుల ఎత్తుకి నీటిని తోడిపోస్తారు .ఒక్కో మోటారు విద్యుత్ సామర్ధ్యం 4.7 మెగా వాట్లు .మొత్తం 113 మెగా వాట్ లవిద్యుత్తూ అవసరం అవుతుంది .ఈ పధకానికి అక్కడ రైతులనుంచి స్వచ్చందంగా సేకరించిన భూమి 186 .5 ఎకరాలు .గోదావరి ఒడ్డునే పట్టిసం గ్రామం లో పంప్ హౌస్ కట్టారు .14 మోటార్లను బి హెచ్ ఇ ఎల్ సమకూరుస్తే  గడువు లోపు పని పూర్తీ అవటానికి మరో 14 చైనా నుంచి తెప్పించి వాడారు .

డయాఫ్రం వాల్ నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత .మోటారు,పంపులు అమర్చటానికి లోతుగా బావిని తవ్వి అంచులు కూలి పోకుండా గోడలు కట్టే బదులు భారీ ప్రత్త్యేక యంత్రాలతో నాలుగు వైపులా మందపాటి గోడను కడతారు ఇదే డయాఫ్రం వాల్ .వీటి మధ్యలో ఉన్న మట్టిని త్రవ్వి తీసి బావులు నిర్మించారు ఇది అత్యంత అధునాతన ప్రయోగం అత్యన్తరక్షణ కరం కూడా. పనీ అతి త్వరగా పూర్తీ అయింది .221మీటర్ల పొడవు 33 మీటర్ల వెడల్పు స్థలం లో గోదారి ఒడ్డునే పంప్ హౌస్ నిర్మించారు .దీనికి కుడి కాలువ కేవలం 4 కిలో మీటర్ల దూరం లోనే ఉంది.ప్రత్యేకమైన 12 వరుస పైప్ లైన్ ల ద్వారా నీరు వస్తుంది .ఒక్కో పైప్ లైన్ 3.2 మీటర్ల అంటే దాదాపు 10 మీటర్ల వ్యాసం కలిగి న పైప్ లైన్లను ఈ నాలుగు కిలో మీటర్ల పొడవునా 12 వరుసలలో అమర్చారు .ఒక్కో వరుస పైప్ లైన్ రెండు పంపులు తోడిన నీటిని మోసుకు వెడుతుంది .అంత లావు గోట్టాలనుంది నీరు కాలవలోకి పోస్తే గట్లు కొట్టుకు పోకుండా ప్రత్త్యేక డెలివరి సిస్టర్న్ లను  రెండు ఎకరాల స్థలం లో ఏర్పాటు చేశారు .ఈ పైప్ లైన్ లద్వారా కుడికాలువకు చేరిన నీరు అక్కడి నుండి త్రవ్విన177 కిలోమీటర్ల  ప్రత్యేకకాలువ గుండా కృష్ణా నదికి చేరుతాయి .కాలువలోకి నీరుపడే దాకా మనకు ఎక్కడా గొట్టాలు భూమి పైన కానీ పించకుండా లోతుగా అమర్చటం మరో ప్రత్యేకత .ఈ కాలువ ప గొ జిల్లాలో 12 1 కిలో మీటర్లు ,కృష్ణ జిల్లాలో 56కి మీ ప్రయాణం చేస్తుంది .ఈ కుడికాలవ పోలవరం జలాశయం దగ్గర లో ఉన్న ‘’తోట గొంది ‘’గ్రామం లో ప్రారంభమై ,కృష్ణా జిల్లా వెలగలేరు గ్రామం వద్ద అంతం అవుతోంది .ఈ కాలువ ప గొ జి లో 9 మండలాలు –పోలవరం ,కొవ్వూరు ,గోపాలపురం ,దేవరపల్లి ,నల్ల జర్ల ,ద్వారకా తిరుమల ,పెదవేగి ,దెందులూరు పెదపాడు మండలాలలో  ,43 గ్రామాలు,-పోలవరం ,వి౦జపురం ,ప్రగడ పల్లి ,గంగోలు ,కొవ్వూరు పాడు ,గుడ్డిగూడెం ,భీమోలు ,వెల్ల చింతల గూడెం ,చిట్యాల ,వెంకట రాయ పాలెం ,చెరుకు మిల్లి ,బందాపురం ,దేవరపల్లి ,దీమంతుని గూడెం ,యర్న గూడెం ,వీరవల్లి ,సంజీవ పురం అనంతపల్లి ,నల్లజర్ల ,మరెళ్ళమూడి ,ఆవపాడు ,ఉంగుటూరు రిజర్వ్ ఫారెస్ట్ ,నల్లమాడు  ,గున్నంపల్లి ,నారాయణ పురం ,యం.ఎస్ పల్లి ,పంగిడిగూడెం ,పోలసానిపల్లి ,సి సి పూడి ,రామారావు గూడెం అగ్రహారం,ముండూరు ,చక్రాయ గూడెం ,జి .గుంట,పెదవేగి ,కావవ గుంట ,చోది మేళ్ళ,ఒంగూరు ,జగన్నాధ పురం ,పినకడిమి ,కొప్పాక ,భోగాపురం ,వేంపాడు ,కొక్కిరపాడు గ్రామాల గుండా  కృష్ణా లో 5 మండలాలు –నూజివీడు ,బాపులపాడు ,గన్నవరం ,విజయవాడ రూరల్ ,జి కొండూరు ,మండలాల గుండా 25 గ్రామాలు –పల్లెర్ల మూడి ,సీతారాం పురం ,వేలేరు ,రేమల్లె ,రంగన్న గూడెం ,వీరవల్లి ,సూరవరం ,బండారు గూడెం కుందావారి కండ్రిక ,పాతపాడు ,పి నైనవరం ,జక్కంపూడి ,వేమవరం ,కొత్తూరు తాడేపల్లి ,తాడేపల్లి వెలగలేరు ,బల్లిపర్రు ,తెంపల్లి ,వీరపనేని గూడెం చిక్కవరం ,గొల్లనపల్లి ,గోపువారి గూడెం ,కొండపావులూరు , గుండా ప్రవహి౦చి ఇబ్రహీం పట్నం వద్ద ఫెర్రీలో కృష్ణా నదిలో గోదావరికలిసి గోదా కృష్ణ రూపు దాల్చింది .కృష్ణా పుష్కరాలకు ఈ అసాధ్యం సుసాధ్యమైంది .రైతులకు సకాలం లో నీరు అందించటమే దీని ప్రధాన ఉద్దేశ్యం .

కుడికాలువ కృష్ణా జిల్లా పల్లెర్ల మూడి వద్ద మొదట ప్రవేశిస్తుంది .రైతులతో ముఖ్యమంత్రి చర్చించి సానుకూలంగా స్పందింపజేసి ,తగినంత నష్టపరిహారం ఇచ్చి ఈ భూములు తీసుకొన్నారు .కావాల్సిన 12 ,543 ఎకరాలలో 10 ,695 ఎకరాలు సేకరించారు ఇంకా 1848 ఎకరాలు సేకరించాలి .కోర్టు కేసులలో ఉండటం వలన ఈ సేకరణ జరగలేదు కుడికాలువ పనులన్నీ 60 రోజుల్లో పూర్తీ చేయటం విశేషం.అప్పటికే గతప్రభుత్వం కాలువలను కొంతమేరకు త్రవ్వటం వలన యిది సాధ్యమైంది .మొత్తం 13 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని 438 ఎక్స్ వేటర్లు ,10 25 టిప్పర్లు ఉపయోగించి తవ్వారు .వేగం గా పని ముగియటానికి తాత్కాలికంగా85 మంది ఇంజనీర్లను కేటాయించారు .మొత్తం మీద 141 మంది ఇంజనీర్లు ,181 మంది సాంకేతిక నిపుణుల వేలాదికార్మికుల  సేవలను వినియోగించారు .కల్వర్టులు అండర్ టన్నేళ్ళు  , ఆక్వి డేక్ట్ ,ఇన్ లెట్ ,అవుట్ లెట్ లద్వారా వాగులు వంకల అవరోధాలను అధిగమించారు .రవాణా సౌకర్యానికి ఇబ్బందిలేకుండా కాలువలో పెద్దపెద్ద పైపులు వేసి తాత్కాలిక  వంతెనలు  వేశారు  .తవ్విన మట్టిని కాలువ గట్ల పటిష్టతకు ఉపయోగించారు  .

పోలవరం పూర్తీ అయితే పట్టిసీమ యంత్రాలను మరొక చోట కు తరల్చి ఉపయోగిస్తారు .13 00కోట్ల రూపాయల పట్టి సీమ ఎత్తి పోతలపధకం వలన ఏటా రైతులకు 1000కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుంది .దీనివలన కృష్ణా ఆయకట్టులో 13 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది .ముందే చెప్పినట్లు గోదావరి వరద నీరు మాత్రమే అందులోనూ కొద్దిభాగం మాత్రమే దీని ద్వారా ఉపయోగిస్తున్నాం .పట్టిసీమలో 14 మీటర్ల నీటి మట్టానికి మించి వరద వస్తేనే కృష్ణాకు నీరు తరలిస్తారు కనుక గోదావరీ తీర ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .ధవళేశ్వరం బ్యారేజి పూర్తీ స్థాయి నీటి మట్టం 13 .6 7 మీటర్లు పైన .అంతకంటే ఎక్కువ నీరువస్తే కిందకి వదులుతారు .కనుక పట్టి సీమ వద్ద నీరు తోడాలి అంటే 14 మీటర్ల పైన నీరు వస్తేనే అది వరదనీరై కృష్ణాకు నీరు అందుతుంది అని అందరూ గ్రహించాలి . కృష్ణా జిల్లాలో జి కొండూరు మండలం వెలగలేరు వద్ద కుడికాలువ ద్వారా నీరు తెప్పించి అక్కడినుంచి బుడమేరు మళ్లింపు ద్వారా కృష్ణ లోకి నీళ్ళు మళ్ళించి బుడమేరును సద్వినియోగం చేస్తారు .

ప్రకాశం బారేజి కెపాసిటి 3 టి ఎం సీ లు మాత్రమే .మరి గోదావరి నుంచి వచ్చి చేరే 80 టి ఎం సి లనీటిని  నిల్వ చేయకుండా కృష్ణా డెల్టా కాలువలకే ఆయకట్టు నీరు అందించటానికి విడుదల చేసి బారేజ్ ను కాపాడుతారు .కృష్ణా గోదారులకు ఒకే సారి వరదలు వస్తే గోదారి జలాన్ని అసలు తరలించనే తరలించారు. సముద్రం పాలుకావాలి లేక పోలవర జలాశయం లో నిలవ చేస్తారు .డెలివరి సిస్టం పని సామర్ధ్యానికి కావాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్ లో భాగంగా 11 కె వి ళ సబ్ స్టేషన్ నిర్మించి .పల్లంట్ల గ్రామం వద్ద 400 కె వి సబ్ స్టేషన్ నుంచి ప్రత్యెక ట్రాన్స్ మిషన్ లైన్లద్వారా విద్యుత్ అందిస్తారు .కాలువ దారిలో ఉన్న వాగులలోని నీటినీ వాడుకొనే ఏర్పాటు చేశారు .పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ,పంపిణీ కాలువల  వ్యవస్థ ఏర్పడ్డాక రాయలసీమ పొలాలకు నీరు అందజేస్తారు .కుడికాలువ కు ఇచ్చిన భూమికి గాను రైతులకు 700కోట్ల నష్ట పరిహారం చెల్లించి సంత్రుప్తిపరచారు .కరువుకాటకాలను తట్టుకొని నిలబడటానికిడెల్టా శిల్పి  సర్ ఆర్ధర్ కాటన్ సూచించిన నదుల అనుసంధాన విధానాన్నే మన ప్రభుత్వం భారత దేశం లో మొట్టమొదటి సారిగా అమలు చేసి అసాధ్యాన్ని అత్యన్తసుసాధ్యం చేసి చూపించింది .దీనికి అందరూ అభినందనీయులే .

కుడికాలువ రహదారులు దాటే చోట మొత్తం 41 వంతెనలు నిర్మించారు .పోలవరం కాలువ గుండేరును కవ్వగుంట వద్దా  ,తమ్మిలేరును జానం పేట ,రామిలేరును పల్లెర్ల మూడివద్ద దాటుతుంది .పట్టిసీమ ప్రాజెక్ట్ పనిని ‘’మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ‘’కు అప్పగించారు .పట్టిసీమ పనులు ప్రారంభించిన 139  రోజుల్లోనే గోదావరి  కృష్ణ లను 16-9-20 16 న  అనుసంధానం చేసి రికార్డ్ సృష్టించారు.

గోదావరి నదీ గర్భం లో  కట్టే పోలవరం డాం నిర్మాణానికి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికారాలను ఉప యోగిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీ దీనికి గొప్పగా సహకరిస్తోంది .డయాఫ్రం వాల్ నిర్మాణమే ఒక అత్యద్భుతం .ప్రత్యేకంగా చూశాముకనుక మహదానందం వేసింది  ఇక్కడ వాడే భారీ పరికరాలన్నీ మన దేశం లోనే తయారు చేసినవే .యంత్రాల నిర్మాణం ,ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అంతా ఎల్ అండ్ టి వారిదే అవటం తో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి .అయినా చంద్రబాబు ఇంకా అసంత్రుప్తిగానే ఉన్నారు .వారానికి జరగాల్సిన పనులలో నలభై శాతమే అవుతున్నట్లు నిన్న చాలా తీవ్రంగా స్పందించారు .. కాని అక్కడి ఇంజనీర్లు చాలా ఆత్మ విశ్వాసం తో పని చేస్తూ ,గడువుకు ముందే ప్రాజెక్ట్ పూర్తీ చేస్తామని గర్వంగా మాతో అన్నారు .నిజమే అని పించింది .డాం నిర్మాణం తర్వాత అటు 150మీటర్లు ఇటు మరో 150మీటర్ల ఏటవాలు రోడ్డును వంద అడుగుల లోతు నుండి నిర్మించి పై భాగాన రెండు వైపులా 50 మీటర్ల వెడల్పు ఉండేట్లు నిర్మిస్తారు .కొండలు గుట్టలు త్రవ్వి తీసిన రాయి రప్పా మట్టి అంతటిని  ప్రాజెక్ట్ బలోపేతానికి వినియోగిస్తారు . ఏర్పరచే కాఫర్ (మట్టి ) డాం నిర్మాణమూ అపురూపమైనదే .మరొక మూడేళ్ళలో ప్రాజెక్ట్ మొత్తం పూర్తీ అయి బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా అబ్బుర పరుస్తుంది . వచ్చే జూన్ నాటికి పోలవరం నీరు కృష్ణానదిలోకి చేర్చే భగీరధ ప్రయత్నం లో అందరూ తలమునకలై పని చేస్తున్నారు .మన సాంకేతిక పరిజ్ఞానానికి జోహార్లు అందించాలి .భారత దేశం లో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూ ఉపయోగించని అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను పోలవరం ప్రాజెక్ట్ కు విని యోగించటం దీని అతి ముఖ్య మైన విషయం విశేషం .ఇంతటి బృహత్తర నిర్మాణాన్ని మన రాష్ట్ర ప్రభుత్వమే ఎవరి కోసమూ ఎదురు చూడకుండా ప్రారంభించింది .తర్వాత భారత ప్రభుత్వం మొత్తం ఆర్ధిక బాధ్యత సమ కూర్చటానికి ముందుకురావటం ,పైన ప్రధాని శ్రీ మోడీ ,జలవనరుల మంత్రి శ్రీమతి ఉమా భారతి  ,ఇక్కడ రాష్ట్రం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,జలవనరుల మంత్రి శ్రీ ఉమా మహేశ్వర రావు ల సంయుక్త ఆలోచన మద్దతు పూర్తీ స్థాయిలో లభించి  ,ఫలితాలను త్వరలో అందుకో బోతున్నాం .ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఇదే వేగం తో పనులు జరిగి ప్రాజెక్ట్ అతి త్వరలో అన్ని లక్ష్యాలతో  సాకారం  కావాలని  సర్వ దేవతలనూ ప్రార్ధిద్దాం . శుభం భూయాత్ .ఈ బృహత్తర అత్యంతాధునిక దేవాలయ నిర్మాణానికి  రాళ్ళెత్తి న కూలీ లందరికి వందనం అభి వందనం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.