పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )
చాలామంది కవులు సందర్భానికి బాగానే స్పందించి తమ శక్తి యుక్తుల్ని కూడా దీసి తమ కిస్టమైనన్ని పద్యాలు రాసి తమదైన బాణీలో కంచు కంఠాలతో దిక్కులు పిక్కటి ల్లేట్లు చదివే ప్రయత్నం చేశారు .కానీ సరైన విధానం అవలంబించక పోవటం వలన ,ఎవరు ఏ రోజు ఏ సమయం లో పద్యాలు చదవాలో ముందే తెలియ జేయక పోవటం వలన మధ్యలో మంత్రులకు స్వాగతాలు వాళ్ళు యదా ప్రకారం ఆలస్యంగా రావటాలు, వాళ్ళకోసం ప్రోగ్రాం కుది౦చటాలతో కవులందరికీ సమానమైన సమయం దక్కలేదు .చాలా నిరుత్సాహ పడ్డారు కూడా .దీనికి తోడు’’మీ కవితలు ఎలాగో పుస్తకం లో ప్రచురిస్తారు కదా ఒక్క పద్యం చదవండి చాలు’’ అని ‘శ్రీ పాలపర్తి వారు పదే పదే అనటం కవులకు బాదే కలిగించింది.’’ అంతకాడికి పద్యాలు మీకే పంపించేవాళ్ళం కదా మళ్ళీ ఈ వేదిక ఎందుకు ?’’అని గొణుగుళ్ళూ వినిపించాయి . మొదటి రోజు సభ ఆలస్యంగా ప్రారంభమవట౦ తో కవులకు సమన్యాయం దక్కలేదు .హడావిడిగా ముక్కు చీదినట్లు చీదేశారుపాపం .ఎక్కడో విశాఖ నుంచి ,కడపనుంచి వచ్చిన వారికి చాలా నిరాశా నిట్టూర్పే మిగిలింది .ఆ రోజు ఉదయం చివరగా చదివిన కవులకు శ్రోతలే లేరు అందరూ’’ ఫుడ్ కోర్ట్ లో బాటింగ్’’లో మునిగి పోయి ఉన్నారు .శ్రోతలు లేనప్పుడు కవులకు స్పూర్తి ఎలా కలుగుతుంది ? ఈ విషయం నిర్వాహకులు ఆలోచించలేక పోయారు .మధ్యాహ్న కవులకూ అదే పరిస్థితి . కవులు కూడా కొత్తదనం కోసం పాకు లాడింది తక్కువే అని పించింది .రొటీన్ రోడ్ద కొట్టుడు కొంత ఇబ్బంది అయింది .చమక్కులు లేవు .ప్రేలుళ్ళు లేవు .హాస్యపు వరద లేదు .చతురతా తక్కువే అనిపించింది . ఎత్తుగడా ,ముగి౦పులలో మెరుపులు లేవు .
రెండవ రోజు డా .శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ప్రసంగం ఆద్యంతం రక్తి కట్టింది .దిశా నిర్దేశామూ చేసింది .ఆయన రాసి చదివిన పద్యాలకూ గొప్ప సార్ధకత కనిపించింది .అవి నాకు బాగా నచ్చి అయన వెంట బడి స్క్రిప్ట్ తీసుకొని కాపీ చేసే దాకా వదలలేదు నేను. ఆయనా నవ్వుతూ నా కోరికను తీర్చారు .మర్నాడు ఆచార్య వర్య ను బెజవాడ మనోరమ హోటల్ వద్ద మేము పోలవరం యాత్ర సందర్భంగా కలువగా వారికినేను రాసిన ‘’కేమటాలజి పిత కొలచల సీతారామయ్య –(పుల్లేరు నుంచి ఓల్గా దాకా )పుస్తకం అందజేస్తే చాలా ఆనందించారు. ఆ చిరునవ్వు మనో ఫలకం పై ముద్ర పడింది . వీరిని మళ్ళీ సాయంత్రం వేదిక నెక్కించి మాట్లాడమనటం ,శ్రీ ఇనాక్ గారినీ ,మళ్ళీ వాయి౦చ మనటం చూసే వాళ్ళకే కాక వారిద్దరికీ కూడా ఇబ్బంది కలిగించినట్లు అనిపించింది .దీన్ని అవాయిడ్ చేసి ఉండాల్సింది .
ఇప్పుడు డా. శ్రీ తిరుమల శ్రీనివాసా చార్య గారి పద్యాలను ఆస్వాదిద్దాం –
1-శ్రీ కృష్ణ దేవరాయల –యాకృతి నామమ్ములందు నద్భుత మేదో
ప్రాకటముగ భాసి౦చును –తాకిన నాముక్త మాల్యదను మన చేతన్ .
2-శబ్ద యోజన చూడ పాషాణ భంగి –కాని పించును రాయల కాయ మట్లు
అర్ధమారసి చూడగా నమృత మట్లు-యెదల నూరించు రాయల హృదయ మట్లు
3- ఆతని కావ్యము చదివిన –చేతస్సున నిండి పోవు చిన్మయ శక్తుల్
ఆతని వీరత గాంచిన –చేతుల చప్పట్లు కొట్టు జేజే లగుచున్ .
4-ఆతడెత్తిన కత్తి కెదురేది బెదురేది –అరి వర్గ మెల్లెడ శిరసు వంచె
ఆతడెక్కిన గుర్ర మడ్డులన్నిటి ద్రొక్కి –పరుగు లెత్తగ గిరుల్ శిరసు వంచె
అతడు పన్నిన వ్యూహ చతురతల్ దిలకించి –పులకించి కోటలు తలలు వంచె
అతడు సల్పిన ధాటి నరి కట్ట లేని తు-ర్కల సైన్య మెల్ల శీర్షమును వంచె
రాత్రి పగలును భయద గర్జనలు సలిపి –యుద్ధ సైన్యాల నెపుడు సముద్ధరించి
గజపతుల నెల్ల నోజంబు ‘’కటక ‘’నూది-దక్షిణావని నేలిన దక్షు డతడు.
5-సంస్కృతాంధ్రములందు సమ కౌశలము దెల్పు –రాయల మీసముల్ రమణ కెక్కె
శైవ వైష్ణవముల సమదృష్టి బ్రకటించు –రాయల మీసముల్ రమణ కెక్కె
శాత్రవ దమనము సత్ఫలనము జాటు –రాయల మీసముల్ రమణ కెక్కె
సతు లిద్దరను భావ సములని సూచించు –రాయల మీసముల్ రమణ కెక్కె
కృతులు రచియించుట –కవి కృతులు గొనుట
భువన విజయమ్ము నందును కవన విజయ మందు సమమని
మెరయించి యంద గించి –కృష్ణ రాయలకు సముల్ కెరలు చుండు.
6-ఒక చేత రాజ్య లక్ష్మికి స్వర్ణ మకుటాన –ముద్దుగా నవ రత్నములను పొదిగి
ఒక చేత రాజ్య లక్ష్మికి స్నిగ్ధ చికురాల –పొలుపుగా అందాల పూలు ముడిచి
ఒక చేత విజయ లక్ష్మికి పాదముల నీడ –పరరాజ శిరముల వంచి నిలిపి
ఒక చేత వర లక్ష్మికి సంతసము గూర్చు – శంఖ భేరీ పృధు స్వనము వినిచి
తుళువ వంశ సంజాత చతుర్భుజుడయి –చతుర మతితోడ సాహితీ సమర రంగ
సార్వ భౌముడై తెలుగుల స్వాంత సీమ –వెలుగు శ్రీ కృష్ణ దేవరాయల నుతింతు .
7-ఖడ్గ మెత్తి నట్టి కఠిన కరమ్మున –కలము నెట్లు పట్టి లలిత రీతి
స్వప్నమందు గన్న జ౦జాక్షు డే నిల్చె-ఖడ్గమందు ,అతని కలము నందు .
8-అంత గొప్ప కావ్య మాముక్త మాల్యద –కృష్ణ దేవ రాయ లెట్లు వ్రాసె
వింత ఏమి ?స్వప్న వేళాగమ౦దైన –ఆంద్ర విష్ణువు మహిమ యని తలంతు.
9-సరిలే రెవ్వరు విష్ణు కావ్య రచనా శైలీ విలాసమ్మునన్ –సరి లేరెవ్వరు ,సౌమ్య రాజ్య జనతా సౌఖ్య ప్రదానమ్మునన్
సరి లేరేవ్వరు ,దివ్య వేంకట గిరీశ స్వర్ణ సంపూజలన్ –సరిలే వెవ్వరు కృష్ణ రాయలకు అస్టైశ్వర్య భోగమ్మునన్ .
ఇలాంటి కలకండ వంటి పద్యాలను ఈ బ్రహ్మోత్సవం లో కవులు రాశారేమో తెలియదు –కారణం అన్నీ వినే అదృష్టం కల్పించక పోవటం ,కొంత మేము అక్కడ లేక పోవటం కూడా .పద్య వరద పారించి కృష్ణా కూలంకష కు వరద తేవాలన్న అందరి సంకల్పం నెరవేర్చే మంచి ప్రయత్నమే ఇది .ఇంకొంచెం వ్యూహ రచన చేసి ఉంటే ఇంకా బాగా రాణించేది . 130 మంది కవులలో తలలు నెరిసిన వారే దాదాపు 120 మంది ఉంటారు .యువతను ప్రోత్సహించాలన్న ధ్యేయం సాధించ లేదు . కాలేజీ స్థాయిలో వారికి వేరే పద్య ప్రయత్నం చేసి ,ప్రోత్సాహకాలు అంద జేస్తే కొంత ప్రయోజనం ఉండేది ..
కవులు కావ్యాలు రాస్తే గొప్ప పారితోషికమిచ్చి వెంటనే ప్రచురిస్తామని ప్రభుత్వం తరఫున భాషా సాంస్కృతిక శాఖ కార్య దర్శి ,మంత్రి గారు ,శ్రీ బుద్ధప్రసాద్ వేదికపై చాలా సార్లు ప్రకటించారు .అది త్వరగా సఫలం అవుతుందని ఆశిద్దాం .కవులు మంచి రచనలు చేసి ,సమర్ధత చాటి ,ముద్రణ భాగ్యం పొందాలని ఆశిద్దాం .ప్రభుత్వాలు ప్రకటించినట్లు పనులు జరగటానికి ఏళ్ళూ పూళ్ళూ పడతాయి .కవులను ప్రభుత్వ౦ తమ కటాక్షం కోసం చాతక పక్షుల్లా వేచి చూడనీయకుండా ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకొని అన్నమాట నిలబెట్టుకోవాలి .పైరవీలు ,పక్షపాతాలకు తావు లేకుండా సంర్ధతకు ,ప్రతిభకు విలువ నిచ్చి ప్రోత్సహించాలి .అప్పుడే పద్య కవితా బ్రహ్మోత్సవ కల సాకారమై అందరికి విస్తృత ప్రయోజనం లభిస్తుంది .యువత పోటీ పడి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి .తెలుగు దేశం లో అందర౦ కలిసికట్టుగా వారసత్వంగా వచ్చిన పద్యానికి పట్టాభి షేకం చేసే ప్రయత్నం చేసి తెలుగు తళ్లి ఋణం తీర్చుకుందాం .
ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-17 –ఉయ్యూరు