శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

‘’రాయికైనా ఆయన పాఠం చెబితే రావాల్సిందే –రాకపోవటం అనేది లేదు ‘’అని ప్రసిద్ధి పొందిన  వారు మహా మహోపాధ్యాయ శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారు .కంచి పరమాచార్యులకు అత్యంత సన్నిహితులు . ద్వైత అద్వైత విశిష్టాద్వైతు లందరికీ ఆదర్శ గురు మూర్తి .వారి౦టి లోనే  ఉండి చదువుకొన్నవారెందరో శిష్యులున్నారు .వారి శిష్యపరంపర అగణితం .అందరూ వివిధ శాస్త్రాలలో అమోఘ   పాండిత్యం ఆ గురు మూర్తి వలన పొంది లబ్ధ ప్రతిష్టులై,అత్యున్నత పదవులలో రాణిస్తున్నారు .ఆయన జీవితకాలం లోనే శిష్యులందరూ కూడి ఫాల్గుణ బహుళ పాడ్యమి శాస్త్రి గారి జన్మ దినం రోజు ,శాస్త్రార్ద చర్చలు ,పండిత పురస్కారాలు చేస్తూ చక్కని పర౦పరను సృష్టించారు .ఇప్పడు శ్రీ మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను దేశం లోని  అనేక రాష్ట్రాలలో ,రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో ఉన్న శిష్య బృందం అందరూ కలిసి ఘనం గా 11-3-17 నుండి 13 -3-17 వారి జన్మ దినం ఫాల్గుణ బహుళ పాడ్యమి వరకు  మూడు రోజుల పాటు ఘనంగా విజయవాడలోని శివ రామ కృష్ణ క్షేత్రం లో అంటే మాణిక్య శాస్త్రి గారు 30 సంవత్సరాలు ఏకధాటిగా  సకల పురాణ ప్రవచనం చేసిన  కార్య క్షేత్రం లో నిర్వహించారు .

11-3-17 –శనివారం     మొదటి రోజు ఉదయం గో పూజ ,గురుపూజ నిర్వహించి, అంతకు ముందు రెండు  రోజులుగా నిర్వహించిన హోమానికి   పూర్ణా హుతి జరిపారు .ఉదయం 9 గం లకు  సభ ప్రారంభమైనది .ఉదయం 10-45 వరకు ‘’తైత్తిరీయ ఉపనిషత్ ‘’భాష్య ప్రవచనం ,అద్వైత సిద్ధిలో ‘’అనుమాన బాదోద్ధార ‘’విచారం శాస్త్ర చర్చ జరిగింది .ఉదయం 11 గం లకు మాణిక్య శాస్త్రిగారి ముఖ్య శిష్యులు ,ప్రస్తుత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ప్రొఫెసర్ డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి  గారు- నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ బాగం ‘’నుండి మాణిక్య శాస్త్రి గారి పై ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పై రాసిన వ్యాసాలను సంగ్రహించి ఒక ప్రతేక సంచిక (బుక్ లెట్)గా సరస భారతి చేత రూపొందించి స్వంత ఖర్చులతో ముద్రించి ఉదయం  శ్రీ మాణిక్య శాస్త్రి గారి పెద్దకుమారులు శ్రీ సూర్యనారాయణ ఘనపాటి గారిచే ఆవిష్కరణ జరిపించి ,అందరికి పంచిపెట్టించారు . మధ్యాహ్నంవిందు భోజనం .చేతి వ్రేళ్ళ సందులలోనుంచి జారిపోయేట్లు ‘’స్నేహం ‘’అంటే నెయ్యి వడ్డించి శుస్టు గా ,అందరూ సంతృప్తిగా భుజించేట్లు కొసరి కొసరి వడ్డించి ,తినిపించి ఆనందించారు .

మధ్యాహ్నం 3 గం నుండి 5 గం వరకు శాస్త్రార్ద చర్చ ఆ తర్వాత 6 -30 నుండి 8 గం వరకు సంగీత విభావరి జరిగాయి .    రెండవ రోజు 12-3-17 ఆదివారం ఉదయం 8-30 గం నుండి 10 గం వరకు బ్రహ్మ సూత్ర శంకర భాష్యం లో’’ఈక్ష్త్యత్యధికరణ ప్రవచనం .10 గం నుండి 12-30 వరకు అద్వైత సిద్ధిలో అనుమాన బాధోద్ధార –విచారణ

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 గం వరకు ‘’శాస్త్రార్ధాలు ‘’.సాయంత్రం 6-30 గం నుండి ‘’పండితోపన్యాసాలు ‘’

జరుగుతాయని ఆహ్వాన  పత్రిక లో ఉంది .నేను ఆ రోజు వెళ్ళ లేదు కనుక  జరిగే ఉంటాయి .

మూడవ రోజు 13-3-17 సోమవారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి జన్మదినం –ఉదయం 8-30 నుంచి 10 గం వరకు భగవద్గీత లో అస్టమాధ్యాయం .10 గం నుండి 12 -30 వరకు ‘’సిద్ధాంత బిందు టీక’’లో విచారము .

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 వరకు శాస్త్రార్ధాలు .జరిగే ఉంటాయి .

సాయంత్రం 6 30 నుండి 7-30 వరకు సమాపన ఉత్సవం –గురువరేణ్యు లు శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శేముషీ వైభవం పై పండితుల ,శిష్యుల ఉపన్యాసాలు .రాత్రి 7-30 గం లకు పండిత సత్కారాలు , వేద స్వస్తి ,వందన సమర్పణ .

నిన్న అంటే 13 వ తేది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,శ్రీ మద్దులపల్లి దక్షిణామూర్తి గారు ఫోన్ చేసి’’ సాయంత్రం పండిత సత్కారం లో మీకు కూడా సత్కారం చేయాలని అనుకొంటున్నా౦ దంపత్యుక్తంగా రావలసినదని ఆహ్వానించారు .పెద్దల ఆహ్వానం శిరోధార్యం కనుక ,నేను ఏ రకంగానూ పండితుడిని కాదు కనుక ,పండితుల సమక్షం లో సన్మానం కనుక ,జిహ్వ చాపల్యమూ ఉంది కనుక, వస్తాను అని చెప్పి మేమిద్దరం మా మనవడు చి చరణ్ తో కలిసి 5-30 గం లకు శివ రామ కృష్ణ క్షేత్రం చేరాము .అప్పటికి ఇంకా ఉపన్యాసాలు జరుగుతున్నాయి .వారెవరో పేరు తెలియదుకాని అనర్గళం గా గంగా ప్రవాహ సదృశంగా గీర్వాణ భాష లో మాట్లాడి సభా రంజనం చేశారు  .వారికి నా నమస్సులు .మద్దుల పల్లి వారి శిష్యులు వారి వారి అనుభవాలను మనసుకు హత్తు కోనేట్లు వివరించి చెప్పారు .అందులో నేను అంతర్జాలం లో  మూడవ గీర్వాణం లో రాసిన డా వెంపటి కుటుంబ శాస్త్రి గారు కూడా ఉండటం మహా దానందం కలిగించింది .తనకేమీ తెలియదని మొదలు పెట్టి ,చివరికి మనకేమీ తెలియ దన్నట్లు గా వారు ప్రసంగించిన తీరు అద్భుతం అని పించింది .శ్రీ గబ్బిట వారూ   అంతేవాసిగా తమ అనుభవాలను  గుదిగుచ్చి చెప్పారు .డా ధూళిపాళ రామ కృష్ణ గారూ గురువుగారి  పరిపూర్ణ కటాక్షాన్నివివరించారు . మాణిక్య శాస్త్రిగారి కుమారుడు శ్రీ  దత్తాత్రేయ  శాస్త్రిగారు తండ్రి గారి బాణీలో ,అదే స్వరం తో వారు ప్రవచనం చెప్పి నట్లు అర్ధవంతమైన ప్రసంగం చేసి ఆకట్టు కొన్నారు .సభా సంచాలనం శ్రీ విశ్వ నాథ గోపాల కృష్ణ గారు చేశారు .అంతా విన్న తర్వాత నా మనసులో ఒక మాట మెదిలి  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి చెవిలో  చెబితే ‘’ఆ మాట ఈ ముఖతా చెబితే గౌరవం గా ఉంటుంది ‘’అని నన్నే చెప్ప మన్నారు .నేను ‘’అందరికీ నమస్కారం .అందరూ మహానుభావులు .దిగ్దంతులైన పండిత శ్రేస్టులు .నేను మాణిక్య శాస్త్రి గారి గురించి రెండవ గీర్వాణం లో రాయటానికి ఎంద రెందరినో ఆశ్రయించాను. ఎవరి వద్దా సరైన సమాచారం లేదు .చివరికి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి వలన మద్దు లపల్లి వారబ్బాయి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి పరిచయం కలిగి ,వారు పంపిన రెండు పుస్తకాల నుండి విషయ సేకరణ చేసి రాశాను .ఇక్కడ ఈ మూడు రోజులుగా మీరందరూ మాణిక్య శాస్త్రి గారి ప్రతిభా విశేషాలను ఎవరి అనుభవాన్ని బట్టి వారు చాలా వివరం గా తెలియ జేశారు .ఇంతమంది విద్వజ్జనం ఈ సభకు రావటం ఆశ్చర్యం .అది శాస్త్రి గారి పై ఉన్న విశేష అభిమానానికి చిహ్నం .మీరందరి ప్రసంగాలను వ్రాత పూర్వకం గా ఇక్కడి నిర్వాహకులకు అందజేసి వాటిని ఒక పుస్తక రూపంగా తెస్తే మాణిక్య శాస్త్రి గారి పై కొంతవరకు సమగ్రమైన పుస్తక౦ వస్తుంది. ఆ ప్రయత్నం అందరూకలిసి చేసి సమగ్ర గ్రంధాన్ని ఆ మహానీయునిపై త్వరలో తీసుకు రావలసినదిగా అభ్యర్ధిస్తున్నాను .నేను రాసింది ఆవగింజలో అరవై వ భాగమే .ప్రస్తుతం అదే అందరికి కర దీపిక గా ఉండటం  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పూనికా నా అదృష్టం’’అన్నాను .అంతా బాగానే ఉందన్నారు .నిజంగా అందరూ కలిసి ఆలోచించి పని చేసి ఉంటె ఈ సభలోనే మాణిక్య శాస్త్రి గారి పై ప్రత్యెక సంచిక సమగ్రంగా సర్వ విషయాలతో ఆకర్షణీయంగా రూపొండేది ఆ ఆలోచన ఎందుకు చేయలేక పోయారో నిర్వాహకులు అంతు చిక్క లేదు .

శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు తమ గురు వరేణ్యు లు శ్రీ మాణిక్య శాస్త్రి గారి కుమారులకు వస్త్ర ,ధన రూపం గాసత్కరిస్తూ ,పనిలో పనిగా నాకూ ఆ సత్కారం చేసి నన్ను రుణ గ్రస్తుడిని చేశారు  . మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారు అన్నట్లు ’’ వేద పండు ‘’ లు ఇందరి ముందు నాకు సన్మానం చేయటం ఆంజనేయ శాస్త్రి గారి విశాల హృదయానికి తార్కాణ,నాపరమ అదృష్టం .ఈవిధంగా సుమారు 100 మందికి పైగావేద, శాస్త్ర విద్వాంసులను ఘనంగా సత్కరించి  శత జయంతికి ఘనత చేకూర్చారు .ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు .

కొసమెరుపు –శత జయంతి ఉత్సవాలు షడ్ర సోపేత భోజనాదులతో  వైభవంగానే జరిగాయని పించాయి .ఆహ్వానాలు అందరికీ అందలేదని కొందరికి మాత్రమే చేరాయని  ఆహ్వానాలు వేరు కరపత్రాలు వేరుగా ఉన్నాయని ,వాట్సప్ లో   పంపి చేతులు దులుపుకున్నారని గుసగుసలు వినిపించాయి .   ఆహ్వానం లో ఎవరెవరు వచ్చి పాల్గొంటున్నారో వారి వివరాలు రాయక పోవటం దారుణం .మూడు యూని వర్సిటీ లకు వైస్ చాన్సలర్ గా పని చేసి ,పారిస్ లో ఉన్న ’’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్’’కు అధ్యక్షులుగా ఉన్న శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి పేరే ఆహ్వాన పత్రికలో లేక పోవటం చాలా వింతగా ఉంది. సంగీత కచేరీ చేసిన ఆమె పేరూ ముద్రించక పోవటం బాధ్యతా రాహిత్యం అని పించుకోదా?వేదికపై పసంగించేవారు వారి ధోరణలో వారు సంస్కృత లోకం లో విహరిస్తూ ఉంటే ప్రేక్షక స్థానం లో ఉన్నవారు ఎవరి వ్యాసంగం లో వారు ఉండి పోయి, వక్తకు నిరాశే మిగిల్చారు .

మూడు రోజుల కార్య క్రమ౦ లో శాస్త్ర చర్చలు అందులో నిష్ణాతులకు మాత్రమే కదా,మిగతావారికి అందులో ఆహ్లాదం ఉండక పోవటం సహజం .కనుక మధ్యమధ్యలో వారి ప్రసంగ సారాంశం తెలుగు లో చెప్పి ఉంటె కొంత ఆకర్షణ ఉండేది .

ఇంత పెద్ద కార్యక్రమం  ఇద్దరు పీఠాది పతుల ఆశీస్సులతో నిర్వహిస్తూ కూడా మీడియా వారికి తెలియ జేయక పోవటం ఇక్కడ జరిగిన విషయాలు పత్రికా ముఖంగా ప్రచురణ భాగ్యానికి నోచుకోక పోవటం ఆశ్చర్యం .దీనికి బాధ్యులెవరు ? వేదిక మీద ఎప్పుడూ ఒకే పెద్దాయన ఉండి మిగిలిన వారికి సరైన గౌరవం దక్కలేదనే  నిట్టూర్పులు వినిపించాయి .లక్షలు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమం అందరి తోడ్పాటుతో ,అందరి ప్రాతినిధ్యం తో ,ఎంతో స్పూర్తి దాయకం గా పరి సమాప్తి కావాల్సింది .అలాజరగ లేదనే అని పించింది .ఇంతటి కార్య క్రమాన్ని వీడియో తీయించలేక పోవటం, రికార్డ్ చేయించలేక పోవటం ప్రసార మాధ్యమాల విలువ విపరీతం గా ఉన్న ఈ కాలం లో నచ్చని పని .అయితే కొందరు ఉత్సాహ వంతులు స్వంత వీడియో కెమెరాలతో వారికి కావలసినవి వీడియో తీసుకున్నారు .ఇప్పటికైనా మించి పోయింది లేదు వారి వద్ద సేకరించి ఒక సమగ్ర సి .డి. గాతీసి చానల్ వారికిస్తే ప్రపంచ వ్యాపితంగా కార్యక్రమ౦ తెలుస్తుంది .

వీటన్నిటికి మించి మరొక పెద్ద లోపం –చివరి రోజు సాయంత్రం సభను బహిరంగ సభగా నిర్వహింఛి  బెజవాడలోవివిధ రంగాలలో ప్రముఖులను కూడా ఆహ్వానించి వారి ఉపన్యసాలనూ ఏర్పాటు చేస్తే, మాణిక్య శాస్త్రి గారి మాణిక్య ప్రభా విశేషం లోక విదితమయ్యేది . ఈ ఆలోచన రాక పోవటం విడ్డూరం .

మొదటి రోజు నేను వెళ్ళినప్పుడు ఒక 70 ఏళ్ళ ముసలావిడ ‘’బాబూ ! ఉదయం 6 అయిందంటే ఇక్కడ మేమందరం కనీసం మూడు వందలమంది మాణిక్య శాస్త్రి గారి ప్రవచనం వినటానికి హాజరయ్యేవారం .ఆ అభిమానమే మళ్ళీ ఇక్కడికి మమ్మల్ని రప్పించింది ‘’అన్నది .ఆమె మాటలకు నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. అంతటి అభిమానం సంపాదించారు శాస్త్రి గారు .

లోపాలను చూపటమే ధ్యేయం కాదునాది .మరింత స్పూర్తిదాయకం గా నిర్వహిస్తే సంతృప్తి ఆనందం దక్కేదికదా అని మాత్రమే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –  14-3-17 -ఉయ్యూరు

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.