మా విశాఖ విజిట్

మా విశాఖ విజిట్

చాలా రోజుల నుండి విశాఖ పట్నం వెళ్లి  మా మైనేని గోపాల కృష్ణగారి అక్క బావా ,డాక్టర్ దంపతులైన శ్రీ రాచ కొండ శర్మ శ్రీమతి అన్నపూర్ణా దేవి గార్లను చూడాలని ఉంది .సుమారు  రెండేళ్ళ క్రితం పరిచయమైన ఆచార్య సార్వభౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ దర్శించాలనే కోరిక ఉంది. ఒక సారి మైనేనిగారు కా .రా .మాస్టారి కథానిలయం కు విరాళం ను సరసభారతి ద్వారా చెక్కు రూపం లో అందజేయమని డబ్బు పంపినపుడు నేనే స్వయం గా వెళ్లి శ్రీకాకుళం లోని మాస్టారికిచ్చి ,వచ్చేటప్పుడు శర్మ గారి దంపతులను చూసి వద్దామనుకొన్నా .కాని అప్పుడు అకస్మాత్తుగా శర్మగారికి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్ లో ఉన్నందున ఆ ప్రయత్నం మానుకొని పోస్ట్ లోనే కారా మాస్టారికి చెక్కు పంపా . ఈ మధ్య ఒక ఇరవై రోజుల క్రితం మళ్ళీ విశాఖ వెళ్లాలని పించటం, మైనేని వారిద్వారా శర్మ గారికి తెలియ జేస్తే ,వారు  ఆనందించటం, శ్రీ శాస్త్రిగారికి ఫోన్ లో వస్తున్నాననిచెబితే ఎప్పుడు వచ్చినా స్వాగతం  మా మహద్భాగ్యం  అని తెలియ జేయటం జరిగింది .మా అబ్బాయి శర్మ ద్వారా రైల్ టికెట్స్ 15 -3-17 బుధవారం విజయవాడ నుండి విశాఖ కు రత్నాచల్ లో ఏ. సి. చైర్ కార్ లో మా ఇద్దరికీ మనవడు చరణ్ కు , వచ్చేటప్పుడు అదే రోజు రాత్రి విశాఖ లో రాత్రి 8 -30 గం లకు బయల్దేరే గరీబ్ రధ్ లో బుక్ చేసేయటం చకచకా జరిగి పోయింది .నిన్న ఆప్రోగ్రాం ప్రకారం 24 గంటల వ్యవధిలో ఉయ్యూరు నుంచి ఉదయం 4 గంటలకే కారులో  బయల్దేరి విజయవాడ స్టేషన్ చేరటం 6 గంటల రత్నా చల్ లో బయల్దేరటం ,విశాఖ 12 గం లకు చేరటం ,దారిలో ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్  ఉదయం 7 గం లకు, విశాఖ స్టేషన్ లో మేము తెచ్చుకున్న అన్నం తినేయటం ,వెంటనే ఆటో లో శర్మగారింటికి వెళ్ళటం ,అక్కడ 4 -30 దాకా గడిపి శ్రీ శాస్త్రి గారింటికి అటో లో వెళ్ళటం అక్కడ వారి ఆత్మీయతను అందుకోవటం ,బిగ్ బజార్ లో షాపింగ్ చేసి స్టేషన్ చేరి రాత్రి 8-30’’గరీబోడి రధం ‘’(ఫుల్ ఏ .సి .)ఎక్కి పడుకొని అలసట తీర్చుకొని ,రాత్రి 2 గం లకు బెజవాడ చేరటం కారులో 3 -30 కు ఇంటికి రావటం జరిగింది . శర్మ ,శాస్త్రి గార్ల ఇంటిలో మా అనుభవాలను ఇప్పుడు తీరికగా తెలియ జేస్తా .http://wp.me/p1jQnd-aqT

93 ఏళ్ళ వృద్ధ డాక్టర్ దంపతులు డా .శ్రీ రాచకొండ నరసింహ శర్మగారు ,డా శ్రీమతి అన్నపూర్ణాదేవిగార్లు

ఇద్దరికీ 93 ఏళ్ళు .పైకి ఆరోగ్యంగా నే కనిపిస్తున్నారు .ఆమెకు ఏ రకమైన వ్యాధి అంటే బి .పి ,షుగర్ ల వంటివి ఏవీ లేవు   ఒక్క మందు బిళ్ళ కూడా మి౦గాల్సిన అవసరం లేకపోవటం  ఎంతో అదృష్టం .కొద్దిగా వినికిడి తక్కువ .రోజూ కనీసం రెండు గంటలు ఏదో ఒకటి చదవటం ఆమెకు ఇష్టం .చదవకుండా ఉండలేరామే.కొంత జ్ఞాపక శక్తితగ్గింది .చక్కగా తానే లేచి నుంచొని ,నడవటం చేస్తారు .అయినా శర్మగారు ఆమె ఆరోగ్య విషయం లో అత్యంత శ్రద్ధ చూపించి 24 గంటలూ షిఫ్ట్ పద్ధతిలో ఒక నర్స్ ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉండే ఏర్పాటు చేశారు .ఆమె అంటే ఆయనకు ప్రాణం .ఆమెకూ ఆయనంటే గొప్ప ఆరాధ్యం .అందుకే ఆ దంపతులు హాయిగా మానసికంగా చాలా బలంగా శారీరకం గా దృడం గా లేకపోయినా మానసికం గా మహా బలం గా ఉండి జీవితం కొన సాగిస్తున్నారు .పిల్లందరూ ఎదిగి డాక్టరీ చదివి వివాహాలు అయి అమెరికాలో స్థిర పడ్డారు .వీరిద్దరూ డాక్టర్ వృత్తిలో విశాఖ ,ఇతర ప్రాంతాలలో ఐతర దేశాలలో సేవలు అందించి 2004 నుండి విశాఖ లో స్వంత ఇల్లు ‘’రాచకొండ రెసిడెన్సి ‘’లో ఉంటున్నారు .2008లో ఈ దంపతులు అమెరికా లో పిట్స్ బర్గ్ లో ఉన్నారు అప్పుడు మేము మూడో సారి అమెరికా వెళ్లి మిచిగాన్ లో స్టెర్లింగ్ హిట్స్ లో ఉన్న మా అమ్మాయి చి. సౌ విజయలక్ష్మి,అల్లుడు  శ్రీ అవధాని గార్ల ఇంట్లో ఉన్నాం .శర్మగారు నాకు కవితలు ,పుస్తకాలు పంపటం ,నేను వెంటనే చదివి తిరుగు మెయిల్ టపాలో వాటిపై స్పందించటం జరిగేది .దానికి ఆయన చాలా ఆశ్చర్య పోయేవారు .వారితో పరిచయమూ తమాషాగానే జరిగింది .

శ్రీ మైనేని గారు ఉయ్యూరు శాఖా గ్రంథాలయానికి భూరి విరాళం అందించటం ,దాన్ని ఏ .సి .లైబ్రరీగా కట్టే ప్రయత్నం లో ఎం .ఎల్. సి  శ్రీ రాజేంద్ర ప్రసాద్ నన్ను కన్వీనర్ గా చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయటం మైనేని గారి అన్నగారు శ్రీ తాతయ్య గారూ  నేనూ కలిసి బిల్డింగ్ వర్క్ చూసి అతి తక్కువ కాలం లోనే పూర్తి చేయటం,2004 లో దాని ప్రారంభోత్సవానికి మైనేని గారు రావటం ,అప్పుడే శర్మగారూ రావటం తో ఇద్దరితో ఒకే సారి పరిచయం కలిగింది  .అప్పటినుంచి శర్మగారి ఆ౦తరంగికులలో నేను చేరిపోయాను మైనేని వారితో బాటు .శర్మగారి 90 వ జన్మ దినోత్సవం నాడు నేను రాసిన ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’వారికే అంకితమిచ్చి ఆవిష్కరణ జరిపాం. ఖర్చు అంతా మైనేని వారిదే .ఇలా  వృద్ధి  పొందిన ఆత్మీయత క్రమంగా బలపడి వారు సరసభారతికి అప్పుడప్పుడు విరాళం పంపటం నేను కృతజ్ఞతలు చెప్పి స్వీకరించి వారి పేరును పుస్తకాలో ప్రచురించటం జరుగుతూ మన పుస్తకాలు వారికి పంపటం వారి పుస్తకాలు నాకు పంపటం జరుగుతోంది .ఈబంధమే వారిని మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కలుసుకోవటానికి ఆతురత చూపించింది .మైనేని వారిని అప్పుడూ ,ఆతర్వాత నాలుగో సారి అమెరికాకు 2012 లోమేము  వెళ్ళినప్పుడు నన్నే వారి వేటపాలెం (హాంట్స్ విల్ )కు పిలిపించుకోవటం మూడు రోజులు వారింట్లో ఉండటం తో ,రెండవ మారు చూసే అదృష్టం కలిగింది .నిత్యం’’ మెయిల్ మొయిల్ ‘’ద్వారా కలుస్తూనే ఉంటాం .అది వేరే విషయం .

శర్మ గారింట్లో నిన్న వారి చెల్లెలు , విశాఖ ప్రభుత్వ మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,ఆమె కుమారులు అ౦తర్జాతీయ ప్రముఖ డాక్టర్ శ్రీ శ్రీధర్ గార్ల పరిచయం కలిగింది .అందరూ అందరే మహా ప్రతిభా సంపన్నులు .శర్మ గారి అన్నగారు రా .వి .శాస్త్రి , ప్రోలిటరేటియట్లపై అద్భుత కథా ప్రముఖ కథా, నవలా రచయితా ,  పేదలకు రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా కేసు చేబట్టి న్యాయం చేకూర్చిన ఆడ్వోకేట్, స్వర్గీయ రాచకొండ విశ్వ నాద శాస్త్రి  గారు .శర్మ గారి అన్నగారు ప్రసిద్ధ రైల్వే ఇంజనీర్ ఎన్నో నూతన రైలు మార్గాలను నిర్మించిన ఆదర్శ ఇంజనీర్ .లంచానికి ఆమ్యామ్యా కి అతి దూరం. నిర్దుష్టంగా విధి నిర్వహణ చేసినవారు .శర్మ గారి తండ్రిగారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు ఇతరులకు మేలు చేసి ఆస్తి హారతి కర్పూరం చేసుకొన్న వదాన్యులు మాస్టర్ సి వి గారి ముఖ్య శిష్యులు . .ఇప్పుడు  శర్మ గారి రాచకొండ రెసిడెన్సి వారి తండ్రి గారి నుంచి సంక్రమించిన  స్థలం లో నిర్మించినదే .దీనికి ఎదురుగా దాదాపు సముద్ర తీరం వరకు ఒకప్పుడు వీరి జమానాలోనే ఉండేదట .శర్మ గారి మేనల్లుళ్ళు ,అన్నగారి కుమారులు అందరూ ఇక్కడే ఫ్లాట్ లలో ఉంటూ హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజా సేవలో ఉన్నారు .   ‘’మా అన్నయ్య అందరికీ మంచి ఆరోగ్య సూత్రాలు బోధిస్తాడు .కాని తాను ఆచరించిన పాపాన పోలేదు .అందుకే కంటి చూపు దాదాపు లేదు .తన విషయం లో విపరీతమైన తాత్సారం అశ్రద్ధ . అదే మా  వదిన  విషయం లో కాని, మా విషయం లో కాని ,తాత్సారం చేయడు మమ్మల్ని చేయ నివ్వడు ‘’అని మొత్తుకున్నారు శర్మగారి సోదరి .’’రోజూ ఇంత గోధుమపిండి నీళ్ళలో కలుపుకొని హోటల్ నుంచి చప్పిడి రుచి లేని కూరలు తెప్పించుకొని   ఆ సూప్ లాంటి దానిలో నంచుకొని తింటాడు .ఇంక బలం ఏమి వస్తుంది “’అని బాధ పడ్డారామే .కంప్యూటర్ పనికి ,తాను చెప్పింది టైప్ చేయటానికి ఒక కుర్రాడిని పెట్టుకున్నారు . వీరి కుమార్తెలు  తలిదండ్రులను అమెరికా తీసుకు వెళ్ళే ప్రయత్నం లో ఉన్నారు . అన్నపూర్ణ గారు ‘’ఇక్కడే బాగుంది అక్కడికి ఎందుకు ‘’?అంటున్నారట .ఈ లోగా తాను ఇన్నేళ్ళుగా సమకూర్చుకున్న అతి విలువైన గ్రంధాలయం లోని పుస్తకాలను శర్మ గారు స్థానిక లైబ్రరీలకు ఉదారం గా ఇచ్చేసి కొంత బరువు తగ్గించుకొంటున్నారు .నాకు కావాల్సినవేవైనా తీసుకోమని అంటే ‘’సామల సదాశివరావుగారి ప్రత్యేక సంచిక ఏప్రిల్- సెప్టెంబర్ ‘’ జయంతి ‘’సంచికను ,జాన్ మాకే రాసిన ‘’ది స్టోరీస్ ఆఫ్ దివరల్డ్స్ లిటరేచర్ ‘’గ్రంథాన్ని వారికి చెప్పి ‘’నోక్కేశాను .’’

శాస్త్రి గారికి ఒక ఉత్తరీయం కప్పి దంపతులిద్దరికీ శాలువా కప్పి సరసభారతి తరఫున మా దంపతులం వారి సోదరి మేనల్లుడు ల సమక్షం లో  సత్కారం చేశాం  .శర్మగారు మా మనవడిని ఆశీర్వ దించి 5 వేల రూపాయలు నగదు బహుమతిని అందజేశారు .ఆ వృద్ధ దంపతులకు శిరసు వంచి మేము పాదాభి వందనం చేసి అదృష్ట వంతులమయ్యాం . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యెక సంచిక ,సరసభారతి శ్రీ హేవలంబి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

మా కోసం స్వీటు పళ్ళు తెప్పించారు. విశ్రాంతికి గది ఏర్పాటు చేశారు .మా మనవడు బీచ్ చూస్తానంటే వారి అసిస్టంట్ నిచ్చి పంపించి చూసే ఏర్పాటు చేశారు శర్మగారు .వారు ప్రస్తుతం డా .యెన్ .గోపి గారి ఎన్నో కవితలను ఆంగ్లం లోకి అనువదిస్తున్నారు .కంటి చూపు లేకపోయినా మైక్రోస్కోపిక్ గ్లాస్ సహాయం తో .అదీ వారి సాహితీ దీక్ష .వైద్య రంగం లో ,విద్యా సాహిత్య రంగం లో రెండింటిలోను సవ్య సాచి డాక్టర్ శ్రీ శర్మగారు .ఎన్నో సాహితీ సంస్థలతో సంబంధాలున్నాయి .12 వ తేదీన వారి పుస్తకం ఒకటి ఆవిష్కరణ జరిపించారు .అందుకని నన్ను వారి సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే తహతహ తో ఎందరికో ఫోన్ మీద ఫోన్ చేసి వారింటికి వచ్చెయ్యమని కోరారు .ఎవరి పనిలో వారుంటారు కదా ,ఇంతలో మమ్మల్ని శ్రీ వేదుల వారు వారింటికి సాయంత్రం 5 గంటలకు తప్పక రమ్మని  ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు .కనుక శర్మ గారి మిత్రులిద్దరూ అక్కడే శాస్త్రి గారింట్లో నే కలుస్తామని వీరికి చెప్పారు . శ్రీ శర్మగారి దంపతులు ‘’శతమానాధికం ‘’ ‘’జరుపుకోవాలని వారి ఆరోగ్యాలు సుస్థిరంగా ఉండాలని  వారి మానసిక బలానికి జేజేలు పలుకుతున్నాను .శర్మ గారి దంపతులకు సాదర కృతజ్ఞతలు తెలియ జేసి మేముముగ్గురం వారి అసిస్టెంట్ సాయం తో ఆటో లో బయల్దేరి శ్రీ శాస్త్రి గారి గృహం చేరాం .ఆ ముచ్చట్లు కింద రాస్తున్నాను .

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ శాస్త్రి గారు సుమారు రెండేళ్ళ క్రితం వారి అమూల్య గ్రంధాలను నాకు పంపారు .అందిన వెంటనే  అందులో ఉన్న వారి ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి పుస్తకాలు అందాయని ధన్యవాదాలు తెలియ జేసి ‘’నా గురించి మీకు అసలు ఎలా తెలిసింది అడ్రస్ ఎలా తెలుసుకున్నారు ‘’అని ఆశ్చర్యంగా అడిగాను .’’ఎలాగోలా తెలుసుకున్నాను .మీ గురించి ఇక్కడి మా వాళ్లకు చాలామందికి తెలుసు .వారి ద్వారా తెలుసుకొని మీకు పంపాను ‘’అన్నారు అవాక్కయ్యాను .అదిగో అప్పటి నుంచి వారితో పరిచయం పెరగటం మా సరసభారతి పుస్తకాలు వారికి పంపించటం వారు రాసినవి నాకు పంపటం .అందుకని రెండవ గీర్వాణం మొట్టమొదటగా వారి గురించే రాశాను నెట్ లో. అది పుస్తక రూపం దాల్చినప్పుడు కవుల కాలం బట్టి కూర్చటం తో ఆ వరుసలో వారి గురించి వ్రాసింది వచ్చింది. వారి గురించి రాశానని చెప్పాను చాలా ఆనందించి ఆ పుస్తకం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు .మొదటి రెండు భాగాలు చదివి వారు ‘’మీ రచనలో గొప్ప రీడబిలిటి ఉంది .అది నన్ను చకితుడిని చేస్తోంది. వాటిలో రోజూ ఏదో ఒక వ్యాసం చదవకుండా నేను ఉండలేక పోతున్నాను ‘’అని ఫోన్ లో తలియ జేసి ఆశీర్వదించి అభినందించిన సజ్జన వరేణ్యులు శాస్త్రిగారు . ఈ మధ్యనే వారు తాత్పర్య సహితంగా రాసిన పుష్పదంతకవి ‘’శివ మహిమ్న స్తోతం ‘’నాకు పంపటం దాన్ని అంతర్జాలం లో ఇంకొంచెం సులభతరం చేసి సీరియల్ గా రాయటం జరిగింది .శాస్తిగారు ప్రసన్న భారతి మాసపత్రిక లో ‘’రెండవ గీర్వాణమ్ ‘’పై  సంక్షిప్తంగా చక్కని వ్యాసం రాశారు .అలాగే ఆపత్రికలోను ,కళా గౌతమి లోను నేను వారిపై అందులో వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించారు .వారి శ్రీమతి గారు కూడా గొప్ప విదుషీమణి . భర్త కు  అన్నివిధాలా సాహిత్యం లో చేదోడు వాదోడుగా ఉంటారు .

శాస్త్రి గారి దంపతులకుమేము ముందు సన్మానం చేద్దామని సిద్ధమవుతుంటే వారు వారించి ‘’మీరు మా అతిధులు ముందు మా సత్కారం మీరు స్వీకరించాలి ‘’అని నచ్చ జెప్పారు .కాదనలేక పోయాం .వారు మా ఇద్దరినీ ఆత్మీయంగా సత్కరించాక మేమిద్దరం ఆ దంపతలకు గౌరవ సన్మానం  సరసభారతి తరఫున చేసి పాదాభి వందనం చేసి వారి ఆశీర్వచనాలు అందుకున్నాం. ఎన్నో రోజుల కల ,కోరిక ,ఈ నాడు నెరవేరింది .ఉగాదికి ముందే ఒక విద్వత్ కవి పండిత  శ్రేష్టులను సత్కరించే అదృష్టం మాకు దక్కింది. చాలా ఆనందం కలిగింది . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యేక సంచిక ,సరసభారతి శ్రీ హేవళంబి  ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

శర్మ గారి కోరిక పై నన్ను కలవటానికి శాస్త్రి గారింటికి వచ్చిన విశాఖ సారస్వత వేదిక నిర్వాహకులు శ్రీ మంగు శివరామ ప్రసాద్ ,ప్రసన్న భారతి సంపాదకులు శ్రీ డి. వి .సుబ్బారావు గార్లతో ఆత్మీయ పరిచయం కలిగింది .వారికి సరసభారతి గురించి ,నా గురించి శ్రీ శర్మగారిద్వారా బాగా తెలుసునని అన్నారు .అలాంటి సాహితీ మిత్రులను చూచినందుకు మహదానందం కలిగింది .వారిద్దరూ ‘’ఈ సారి విశాఖ కు మీరు మా ఆహ్వానం పై రావాలి మాతో గడపాలి మీ ప్రసంగం మేము వినాలి ‘’అని కోరారు .తప్పక వస్తానని అది నా కర్తవ్యమని చెప్పాను .వారిద్దరు బహు విలువైన ఒక రకం గా అమూల్యమైన గ్రంధాలు -1-శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి జయంతి విశేష సంచిక 2-శ్రీడి .వి .సూర్యారాగారి ‘’సద్గమయ ‘’3-ఆర్ష విజ్ఞాన పరిషత్ ప్రచురణ ‘’మృదుల ‘’గారి భావ వీచికలు 4-శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర 5-‘’కవిగారు ‘’శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జీవిత చరిత్ర ‘’కవిగారి మనుగడ ‘’6-శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ‘’భగవద్గీత ‘’అనువాదం  ‘’7-శ్రీమతులు చర్ల విమల ,మృదుల రాసిన ‘’గీతామృతం ‘’8-ప్రసన్న భారతి ‘’జనవరి సంచిక అందజేశారు . వారికి ఎంతో కృతజ్ఞుడను .

ఇలా పండిత శ్రేస్టులు మహా కవి విమర్శకులు  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు డా శ్రీ గుమ్మా సాంబశివ రావు గారు మొదలైన వారెందరికో పి. హెచ్ .డి .కోసం మార్గ దర్శనం చేసిన ఆచార్య సార్వ భౌముల దర్శనం చేయటం వారు మాకు ఆత్మీయ సత్కారమందించటం వారిని సన్మానించే గొప్ప అదృష్టం మాకు లభించటం మా భాగ్య గరిమ గా భావిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-17 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.