ట్రిప్ చేజెర్ల -1

ట్రిప్ చేజెర్ల -1

18-3-17 శనివారం ఉదయం 5 గం లకే నేనూ  నా శ్రీమతి ప్రభావతి ,మనవడు చరణ్ మా కుటుంబ మిత్రురాలు శ్రీమతి మల్లికాంబ గారు కలిసి కారు లో బయల్దేరి గుంటూరు జిల్లాలోని  చేజెర్ల ,కోటప్పకొండ దేవాలయ సందర్శనం పొన్నూరులో శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల ను దర్శించి ,54 ఏళ్ళ క్రితం నాతో రాజమండ్రి బి ఎడ్ కాలేజి లో   ట్రెయినింగ్  మిత్రులైన  చందోలులో ఉంటున్న శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి  ,ఖాజీపాలెంలో ఉంటున్న శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ స్వగృహాలలో  వాళ్ళను చూసి ,రేపల్లె మీదుగా  పెనుమూడి వద్ద శ్రీ మండలి వెంకట కృష్ణా రావు వారధి దాటి ,కృష్ణ కరకట్ట మీదుగా ప్రయాణం చేసి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఇంటికి చేరాం .ఆవిశేశాలు .

చేజెర్ల కపోతేశ్వరాలయం

శిబి చక్రవర్తి కాశ్మీర్ దేశాన్ని పాలిస్తున్న రోజులలో ఆయన తమ్ముళ్ళు  మేహా డంబరుడు, జీమూత వాహనుడు ఉన్నారు .మేహా డంబరుడు అన్న గారి అనుమతి తీసుకొని  కొందరు మునులతో ఇప్పటి చేజెర్ల అని పిలువ బడే చేరం చోర్ల వచ్చి అక్కడి ప్రకృతి కి పరవశుడై   ‘’దేవర కొండ ‘’పై శివునికై  తపస్సు చేసి లింగాకారం పొందాడు .వార్త తెలుసుకొన్న జీమూత వాహనుడు అన్నగారి జాడ తెలుసుకోవటానికి కొందరు మునులతో ఇక్కడికి వచ్చి తానూ అన్నగారి దారిలో తపస్సు చేసి కైలాసం చేరాడు .ఇద్దరు తమ్ముళ్ళ జాడ తెలియని శిబి చక్రవర్తి ససైన్యంగా ఇక్కడికి వచ్చి తానూ ఇక్కడి ప్రకృతి అందాలకు పులకి౦చి త్రయాగం అంటే 100 యజ్ఞాలు చేయ టానికి నిశ్చయించి 99 పూర్తీ చేసి నూరవ యజ్ఞం చేస్తుండగా ,వంద యజ్ఞాలు పూర్త యితే బ్రహ్మ పదవి కి అర్హుడౌతాడుకనుక అతనిని పరీక్షించటానికి త్రిమూర్తులు నిర్ణయించుకొని శివుడు వేటకాడుగా బ్రహ్మ ఆయన బాణం గా విష్ణు మూర్తి పావురం గా మారి ఇక్కడ ఉన్న రూపన గుంట్ల గ్రామానికి వస్తారు   .శివుడి బాణం దెబ్బకు  గాయ పడిన కపోతం   శిబి పాదాలపై పడి ఆయన ను శరణు కోరుతుంది .ఆయన అభయమిస్తాడు .వేటకాడు వచ్చి తాను కొట్టిన పావురం తనకు ఆహారం గా కావాలంటే ,దాని ప్రాణ రక్షణ చేస్తానని అభయమిచ్చాను కనుక వదలను అంటాడు శిబి .చివరకు కపోత రక్షణ  కోసం శిబి, పావురం బరువుతో సమానంగా తన శరీరం లోని మాంసాన్ని  కోసిస్తాను అంటే వేటకాడు శివుడు ఒప్పుకుంటాడు .త్రాసు తెప్పించి పావురాన్ని ఒక వైపు ఉంచి తన శరీర మాంసాన్ని కోయటం ప్రారంభిస్తాడు .ఎంత కోసినా తూకం సరి పోవటం లేదు. చివరికి తన శిరస్సును ఖండించు కొబోగా త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆయన శరణాగత ధర్మానికి మెచ్చి నూరవ యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించి బ్రహ్మ పదవి నిస్తారు .శిబి ఆప్రదేశాన్ని అపర కైలాసం గా వర్ణిస్తాడు శివుని ఆజ్ఞతో తాను శివలింగా కృతి పొంది పావురం పేరు మీద ‘’కపోతేశ్వర లింగం ‘’అవుతాడు. అతని తో బాటు మిగిలిన వారూ లింగాలుగా మారిపోతారు .లింగం పై భాగాన రెండు రంధ్రాలు ఉంటాయి .అవి శిబి చక్రవరి కళ్ళు .ఆ రంధ్రాలనుంచి అభిషేక తీర్ధం ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు .లింగం వద్ద ఇప్పటికీ మాంసం వాసన రావటం ఆశ్చర్యమే కాక చారిత్రిక సత్యంగా భావిస్తారు .శిబి తండ్రి మాంధాత ఆయన తండ్రి యయాతి అని మనకు తెలిసిందే .

శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఈ స్వామిపై ‘’కపోతేశ్వర శతకం ‘’రాశారు .రెండేళ్ళ క్రితం నాకు పంపగా చదివి ఆనందించి ఈక్షేత్ర దర్శనం చేయాలని ఉవ్విళ్ళూరాను .ఇదిగో ఇప్పటికి కుదిరింది .ఆలయం చాలాపురాతనమైనది  సుమారు 17 వందల ఏళ్ళ నాటిది .రాతి శిలాఫలకాలపై చరిత్ర ఉంది .లింగం తెలుపు పాలరాయి. మేము వచ్చేసరికిపూజారి గారు అభిషేకం చేస్తున్నాడు .అయిదారుగురు భక్తులున్నారు .మా కొబ్బరికాయ కొట్టి హారతి తీర్ధ ప్రసాదాలు ఇచ్చాడు .ఇక్కడే ప్రక్కన ఉన్న అరుగుమీద మాతో తెచ్చుకున్న ఇడ్లీలు తిన్నాం .

‘’ మా అమ్మాయి ‘’

శ్రీమతి బెల్లంకొండ శివకుమారి నరసరావు పేట లో ఉంటుంది .భర్త లెక్చరర్ .ఆమె విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై పై గొప్ప అధారిటి .చాలా చక్కగా ఎన్ని గంటలైనా పుస్తకం సహాయం లేకుండాఅనర్గళంగా  దానిపై మాట్లాడుతుంది .ఉయ్యూరు లో రెండు సార్లు నేను ఆమెతో మాట్లాడించా .బెజవాడ లో గత ఏడాది జరిగిన విశ్వ నాథ సాహితీ వైభవం లో కూడా పూర్ణ చంద్ గారికి చెప్పి ఆమెను పిలిపించి మాట్లాడించా .ఆమె నన్ను ‘’నాన్న గారు ‘’అని మాశ్రీమతిని ‘’అమ్మా ‘’అనిఎంతో ఆప్యాయంగా, గౌరవం గా కలిసినప్పుడు, ఫోన్ లో మాట్లాడినప్పుడూ సంబోధించటం ఆమె సంస్కారం .మేము చేజెర్ల వస్తున్నామని నరసరావు పేట రాగానే ఆమెకూ, శ్రీమతి యడవల్లి మనోరమ కు ఫోన్ చేస్తే మనోరమలిఫ్ట్ చేయలేదు శివకుమారి తాను చేజెర్ల దారిలో ఉన్న రెడ్డి పాలెం హైస్కూల్  కు వస్తున్నానని  అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర ఉండమని అంటే ఆగాం. భర్త తో  కలిసి వచ్చి అమాంతం నా పాదాలపై వాలి’’ నాన్న గారూ ! మళ్ళీ ఎన్నాళ్ళకు  అమ్మను ,మిమ్మల్ని చూడగలిగాను ‘’అని ఆనందం తో పరవశించింది .మాకూ ఎంతో ఆనందం కల్గింది భర్తకూడా అదే  విధంగా  పాదస్పర్శ చేసి నమస్కరించాడు మా ఇద్దరికీ . సంస్కారం మూర్తీభవించిన ఆడంపతుల్ని చూసి పులకించి పోయాం అందరం . శివ కుమారి సామర్ధ్యాన్ని నాకు తెలియ జేసిన వారు  ప్రముఖ కథా రచయిత,  నరసరావు పేటవాస్తవ్యులు శ్రీ గంధ౦  యజ్న వల్క్య శర్మ గారి అన్నగారు .నాకు సరసభారతికి ఆప్తులు ‘’అమృత హస్తాలు ‘’ ‘’కథా సంపుటి రచయిత స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మగారు  .వారే డా.శ్రీ మడక సత్యనారాయణ గారినీ మా పాపాయి పిన్ని మేనకోడలు  నరసరావు పేట లో తెలుగు లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ ను కూడా పరిచయం చేశారు. మనోరమ నన్ను ‘’బాబాయి గారు ‘’అంటుంది మావిడను ‘’అమ్మా ‘’అంటుంది .శివకుమారి మనోరమకు ఫోన్ చేసి  మా చేజెర్ల ప్రయాణం సంగతి చెబితే అప్పుడు ఫోన్ చేసి సారీ చెప్పి  మాట్లాడింది .శివకుమారిని చూసిన ఆనందం తో చేజెర్ల కపోతేశ్వర దర్శనం మరింత మధురమని పించింది .

కోటప్పకొండ

రెండేళ్ళ క్రితం మొదటి సారిగా కోటప్ప కొండకు వెళ్లి వచ్చాం .దారిలోనే కదా అని మళ్ళీ  శ్రీ త్రికోటేశ్వర స్వామి ‘’దర్శనం చేసుకొని  ఇక్కడి స్పెషల్ ప్రసాదం అయిన ‘’నేతి అరిసెలు ‘’కొన్నాం .శ్రీ కోడెల శివ ప్రసాద్ గారి వల్లనే కోటప్ప కొండ అభి వృద్ధి బాగా జరిగింది. పైకి కారు వెళ్ళే రోడ్డు వేశారు .వసతులు బాగా కల్పించారు .కోటప్పకొండ ప్రభలు చాలా ప్రసిద్ధం .కొండకింద ‘’గబ్బిట కోటయ్య గారి బ్రాహ్మణ అన్నదాన సత్రం ‘’చూసి అక్కడి వాచ్ మన్ ద్వారా దాన్ని నిర్వ హించే శ్రీ  గబ్బిట బాలు గారు చిలకలూరి పేటలో లో ఉంటారని తెలుసుకొని ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాం. చిలకలూరి పేట లో’’గబ్బిట వారి వీధి ‘’ఉందని వాచ్ మన్ చెబితే  ఎంతో సంతోష పడ్డాం . ఈ సత్రం బ్రాహ్మణుల కోసమే .శివరాత్రికి వచ్చే  బ్రాహ్మణ   భక్తులకు మూడు రోజులు ఉచితంగా భోజనం పెడతారు .మిగిలిన కులాల వారికీ  సత్రాలున్నాయి .దీనికి గాను చందాలను వసూలు చేయటానికి ఒక బ్రాహ్మణుడు రసీదు పుస్తకాలతో ఉయ్యూరు వచ్చి సేకరించి తీసుకొని వెళ్ళేవాడు .దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎవరూ చందాల కోసం రావటం లేదు .చిన్న సత్రమే అయినా సేవ ఘనం .అందులోనూ మా గబ్బిట వారిది అని గర్వ పాడుతాం వారికి మాకూ పరిచయాలు లేక పోయినా .అప్పుడు మేమిచ్చిన చందా మొదట్లో 2 ,తర్వాత 5 చివర్లో 10 రూపాయలు మాత్రమమే తలచుకొంటే ఇప్పుడు సిగ్గేస్తుంది .కాని అప్పటికి అదే గొప్ప .వసూలు చేసే బ్రాహ్మణుడు మా ఇంట్లోనే భోజనం చేసి ఊర్లోకి వెళ్లి చందాలు వసూలు చేసేవాడు .మా అమ్మా నాన్నా తర్వాత నా తరం వరకూ అలా జరిగింది. తర్వాత వాళ్ళే రావటం మానేశారు .నిధులు సంతృప్తిగా ఉన్నాయేమో .

పొన్నూరు లో సాహితీ మూర్తుల దర్శనం

కోటప్పకొండ నుంచి చిలకలూరి పేట మీదుగా ,పెదనందిపాడు దాటి పొన్నూరు కు బయల్దేరాం. దారిలో  నీడ ఉన్న ప్రదేశం లో మేం తెచ్చుకొన్న మామిడికాయ పప్పు ,కొబ్బరి మామిడి పచ్చడి, కారం పొడి గడ్డ పెరుగు తో భోజనం లాగించాం డ్రైవర్ ఈసా తో సహా.మధ్యాహ్నం 1-30 కు పొన్నూరు చేరి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారింటికి వెళ్లి ,వారి శ్రీమతికి చీరా జాకెట్ పెట్టి ,మా దొడ్లో కాసిన దబ్బకాయ ఇచ్చి ,శాస్త్రిగారు పెట్టిన టీ తాగి ,ప్రక్కనే ఉన్న రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ ,జ్యోతిష శాస్త్ర వేత్త బహు  గ్రంథ కర్త మన హేవళంబి ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారం అందు కొబోతున్న    డా శ్రీ నిష్టల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ  దర్శించి ,వారి శ్రీమతికీ చీరా జాకెట్   దబ్బకాయ ఇచ్చి పొన్నూరు వచ్చిన ఫలితం పొందాం . వారి సతీమణి మా శ్రీమతికి ,మల్లికాంబ గారికి జాకెట్ పీస్ లిచ్చి సత్కరించారు.  దక్షిణా మూర్తి గారివల్లనే నేను రండవ గీర్వాణం లో చాలామంది సంస్కృత కవుల పై రాయగలిగాను .ఎ0దరినో నాకు పరిచయం చేసి ఎన్నో పుస్తకాలు పంపి రాయటానికి సహకరించి ప్రోత్సహించిన మహానుభావులాయన .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 -ఉయ్యూరు


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.