ట్రిప్ చేజెర్ల -2

ట్రిప్ చేజెర్ల -2

—                54 ఏళ్ళ క్రితపు స్నేహితులు   బాబాయ్,అబ్బాయ్ ల సందడే సందడి

1962- 63లో రాజమండ్రి లో నా బి ఎడ్  ట్రెయినింగ్ మిత్రులు శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ. ఇద్దర్నీ కలిపి మళ్ళీ చూడటానికి 54 ఏళ్ళు పట్టింది . వాళ్ళిద్దరూ నన్ను’’ బాబాయ్’’ అనేవాళ్ళు నేను ‘’అబ్బాయ్ ‘’అనే వాడిని .అదీ మా స్నేహ బాంధవ్యం . కిస్టాయ్కి  అప్పటికే పెళ్లి అయింది .1964 లో నా పెళ్ళికి సుబ్బయ్య వచ్చాడు .తర్వాత అతని పెళ్లి మన ఘంటసాల లో జరిగితే నేను వెళ్లాను .తర్వాత ముగ్గురం జిల్లా పరిషత్ సెలెక్షన్ లలో కలిశాం .నాకు గుంటూరు జిల్లాలో రెంట చింతల అనే ఎండలు రికార్డ్ గా ఉండే ఊర్లో పోస్టింగ్ ఇస్తే , సుబ్బయ్యను కృష్ణా పరిషత్ లో ముసునూరు ,కృష్ణ మూర్తికి వత్సవాయి ఇచ్చారు .వాళ్ళూ చేరలేదు నేనూ చేరలేదు. అప్పటికే నేను కృష్ణా లోమోపి దేవి లో ఉద్యోగం చేస్తున్నాను .కృష్ణ లెక్కల వాడు .సుబ్బు బయాలజీ వాడు .కృష్ణ గుంటూరు జిల్లాపరిషత్ లో హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయితే ,సుబ్బాయ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .కృష్ణ మూర్తి నేను 1963 నుండి కనీసం పదేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు కొనే వాళ్ళం .ఇన్లాండ్ కవర్ లో ఒక్క మిల్లీ మీటర్ కూడా ఖాళీ లేకుండా రాసుకునేవాళ్ళం .ఆ తర్వాత ఒక సారి చందోలు వెళ్లి కిస్టాయ్ ఇంట్లో ఒక రోజు ఉండి ,వాళ్ళమ్మ గారి ఆతిధ్యం కూడా పొంది ,ఖాజీపాలెం  సుబ్బాయ్  ని ఇద్దరం కలిసిచూసి అక్కడి నుంచి నేను రేపల్లె వెళ్ళి మా రాయ ప్రోలు శివ రామ దీక్షితులు బాబాయి వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .బాబాయ్ ‘’ఒరే నీ జీతం ఎంత ?’’అని అడిగితె ‘’145 ‘రూపాయలు ‘’అని చెబితే బోల్డు ఆశ్చర్య పోయి ‘’మేస్టర్లకు అంత జీతమిస్తారా “’అని అడిగితే అవాక్కయ్యా .సుమారు 20 ఏళ్ళ క్రితమ 1997 లో నేను అడ్డాడలో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు కిస్టాయ్  ఒక సారి పామర్రు బస్ స్టాండ్ లో కనిపించాడు .ఒకటి రెండు ఉత్తరాలు  రాశా .జవాబు లేకపోతే  వదిలేశా .సుబ్బయ్య జాడ మళ్ళీ లేదు .2016 కార్తీక మాసం లో శివాలయం లో కొత్త బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లో జరిగిన కార్తీక వనభోజనాలలో సుబ్బయ్య అల్లుడి  తమ్ముడు ఉయ్యూరులో రాయప్రోలు ముక్కోటి శాస్త్రి అల్లుడు పలకరించి సుబ్బయ్యగారు మిమ్మల్ని అడగమన్నారు అంటే  ఎలా అని ఆరాతీసి ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా సుబ్బాయ్ కి ఫోన్ చేసి కిస్టాయ్ ఫోన్ నంబర్ తీసుకొని మళ్ళీ’’ టాకటం ‘’ మొదలు పెట్టాం .సరసభారతి పుస్తకాలు కార్యక్రమాల ఆహ్వానాలు పంపుతూనే ఉన్నా .సుబ్బయ్య భార్య తో సహానిరుడు  జనవరి 25 న జరిగిన కొలాచల సీతారామయ్యగారి పుస్తకావిష్కరణ కు  వచ్చాడు  .ఇన్నేళ్ళకు కలుసుకొన్నందుకు అందరం ఎంతో సంతోషించాం .వేదికపైకి ఆహ్వానించి మాస్నేహం అందరికి చెప్పి శాలువా కప్పి జ్ఞాపిక అద జేశా .భోజనాల తర్వాత  ఇంటికి దంపతులు వచ్చారు .ఇద్దరికీ బట్టలు పెట్టాం. వాళ్ళూ మాకు పెట్టారు .మళ్ళీ ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు ముగ్గురం దంపత్యుక్తంగా కలుసుకొనే మహా భాగ్యం కలిగింది .

పొన్నూరు నుంచి సరాసరి చందోలు వచ్చాం . శ్రీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న కృష్ణ మూర్తి ఇంటికి వెళ్లాం .దంపతులు  ఎంతో  సంతోషించారు .పది రోజులక్రితమే  ఇలా వస్తున్నట్లు ఫోన్ లో చెప్పా .టిఫిన్ కాఫీలు అయ్యాక కిస్టాయ్ తమ దేవాలయం లోమా సమక్షం లో  మా పేర పూజ చేసి ప్రసాదం ఇచ్చాడు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు  శాలువా అందజేశాడు .మేమూ ఆ దంపతులకు అలాగే సత్కారం చేసి దబ్బ కాయ ఇచ్చాం . కిస్టాయ్ సరసభారతికి, శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకు 2,1 1 6 రూపాయలు అంద జేశాడు .అక్కడే ఎదురుగా ఉన్న శ్రీ లింగోద్భవ దేవాలయం సందర్శించాం .ఈ స్వామి మీదనే శ్రీతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులుశ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు 8 వ ఏట సంస్కృతం లో లింగోద్భవ వృత్తమాలిక రాసి తమ ప్రతిభను చూపారు .స్వామి ముందు మొదటి సారి అష్టావధానం చేశారాట.

చందోలు అనగానే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గుర్తుకు వస్తారు. వారు నడయాడిన పవిత్ర స్థలం చూశాం .వారిని కంచి పరమాచార్యులవారితో కలిసి ఉయ్యూరు లో 1969 లో చూసిన జ్ఞాపకం .శ్రీ బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు వారు .పరమాచార్యులవారికి అంతరంగికులు .తనకోసం రావద్దని శాస్త్రి గారిని చూస్తే  చాలని వారు భక్తులకు చెప్పే వారట .అంతటి మహనీయులు శాస్త్రి గారు . ఆదంపతుల విగ్రహాలు చూశాం .జీవ కళ తొణికిస లాడుతూ ముచ్చటగా ఉన్నాయి. అక్కడే పరమాచార్యులవారు కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం చూసి పులకించని వారు ఉండరు .శాస్త్రిగారి తమ్ముడుగారి అబ్బాయి , వీరి కుమారుడు అక్కడే ఉండి ఆ భవన బాధ్యతలు చూస్తున్నారు. వారు స్థాపించిన వేద పాఠ శాల విద్యార్ధులు లేక ఖాళీ గా ఉంది.శాస్త్రిగారి కాలం లో పరమ వైభవంగా ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం బోసి పోయినట్లు ఉన్నది .శాస్త్రి గారి పూజా గృహమూ చూశాం .జన్మ ధన్యం అయింది  .

అక్కడి నుంచి కృష్ణ మూర్తి తో సహా ఖాజీ పాలెం చేరాం .సుబ్బయ్య ఇల్లు శివాలయం ప్రక్కనే. ఆతను ఇందులో పూజారికూడా. సంవత్సరం లో 4 నెలల వంతు .ఇల్లు ముచ్చటగా ఉంది .ముగ్గురం కలిసి 54 ఏళ్ళు .మళ్ళీ గలగలా మాట్లాడుకొంటూ పాత విషయాలు గుర్తు చేసుకొంటూ బి ఎడ్ అనుభవాలు చెప్పుకొంటూ ఒక గంట గడిపాం .రాజమండ్రి లో ఎన్నో సినిమాలు కలిసి చూసిన కబుర్లు ,సాయంత్రాలలో  గోదారి ఒడ్డున తిరిగిన విశేషాలు ,వరద రాజు హోటల్ ఇడ్లీ రుచి, పంచవటి హోటల్ పేపర్ అట్టు జ్ఞాపకం చేసుకోన్నాం. కాలేజి గురువులు ప్రిన్సిపాల్ శ్రీ హాబి బుల్లా ,లెక్కల లెక్చరర్లు శ్రీ డి.వీరభద్ర రావు ,శ్రీ డి సూర్యనారాయణ ,తెలుగు హెడ్  ఫిజిక్స్ నటరాజన్ బయాలజీ సుబ్బమ్మ కేమిస్త్రి అప్పారావు (చెంబిస్త్రి) బేసిక్ ఎడ్యుకేషన్ రాజు గార్లను  గుర్తుకు తెచ్చుకున్నాం. క్లాస్ మేట్ లు  లలితా వరలక్ష్మి  విశాలాక్షి ,నాగే౦ద్రనాథ్ (కాకినాడ )రూమ్ మేట్ల ను(వెంకట రెడ్డి-అద్దంకి  ,పాల్ -మైలవరం )లను   మరోసారి హృదయ ఫలకం పై ఆవిష్కరింప జేసుకొన్నాం. ఆ రోజులు తిరిగి  రావు అని  ఆనంద పడ్డాం . కిస్టాయ్ జోకుల కేకర్లకు మల్లికాంబ గారు పగల బడి నవ్వారు . మా దంపతులకు సుబ్బయ్య ద౦పతులు బట్టలు పెట్టారు. సుబ్బయ్య భార్యకు మేము చీరా జాకెట్ పెట్టాం. దబ్బకాయ ఇచ్చాం .సుబ్బాయ్ సరసభారతికి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు 2 వేల రూపాయలు అందజేశాడు .వాళ్ళు పెట్టిన  పండ్ల ముక్కలు తిని, కాఫీ త్రాగాం .విష్ణు పూజారి కృష్ణ మూర్తి ,శివ పూజారి సుబ్బయ్య .విష్ణు శివ అవతారాలు అనుకొంటే ఏదో కొంత సాహిత్యం సృష్టిస్తున్న నేను బ్రహ్మనే కదా .కనుక ముగ్గురం ఆ త్రిమూర్తుల ప్రతి రూపాలమే అని పిస్తుంది. ,శివాలయ దర్శనం చేసి రాత్రి 7 -30 గం లకు బయల్దేరి రేపల్లె చేరి పెనుమూడి వంతెన దాటి ,కృష్ణ కరకట్ట ఎక్కి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఉయ్యూరు చేరాం .మా డ్రైవర్ ఈసా ముస్లిం .అయినా ఒక్కడే దేవుడు అన్న విశ్వాసం ఉన్నవాడు .ఒక ముస్లిం మత గురువు ఉపన్యాసాల రికార్డ్ వినిపిస్తూ తానూ అన్నీ చెబుతూ అందర్నీ ఆకట్టుకొన్నాడు .అతనితో దాదాపు 25 ఏళ్ళ పరిచయం ఉంది  మా ‘’లూనా’’ కు గాలి కొట్టి౦చటానికి  రిజిస్త్రార్ ఆఫీస్ ఎదురుగాఅతనూ సోదరులు నడిపే టైర్ రిపేర్ షాప్ కు  కు వెళ్ళేవాడిని. అదే పరిచయం .అతని భావ తీవ్రతకు ముగ్ధుడ నై 26 వ తేదీ ఉగాది వేడుకలకు తమ్మని ఆహ్వానం ఇచ్చి శాలువా కప్పుతాను అని చెప్పాను .ఉదయం 5 గం నుంచి ప్రయాణం లో ఉన్నా ఎక్కడా అలసట అనిపించ లేదు స్నేహబంధం ఆరోగ్యకరం ఆనంద కారణమూ  అయి  మనసుకు ఉల్లాస ఉత్సాహాలనిచ్చింది . సంతృప్తికలిగింది . .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.