గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)
1868 లో కర్నాటక రాష్ట్రం కావేరీ తీరాన రుద్రపట్నం గ్రామం లో శ్యామ శాస్త్రి జన్మించాడు ,సాంకేతి బ్రాహ్మణుడు .పుట్టిన చోటే చదివి మైసూర్ వెళ్లి సంస్కృత పాఠశాలలో చదివి సంస్కృత విద్వత్ –డిగ్రీ ఉత్తమ శ్రేణి లో పొందాడు .ఆయన ప్రతిభను గుర్తించిన మద్రాస్ యూని వర్సిటి సంస్కృతం లో బి ఏ డిగ్రీ ఇచ్చింది .మైసూర్ రాజ్య దివాన్ శేషాద్రి అయ్యర్ ప్రోద్బలం తో శాస్త్రి ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరి లో లైబ్రేరియన్ గా చేరాడు .ఇక్కడపని చేస్తూ వేద ,వేదాంగాలను క్లాసికల్ సంస్కృతాన్ని,ప్రాకృత ,ఇంగ్లీష్ ,కన్నడ ,జర్మన్ ,ఫ్రెంచ్ భాషలను స్వయంగా అభ్యసించి గొప్ప వాడయ్యాడు .
1891 లో ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్’’ మైసూర్ ఓరియెంటల్ లైబ్రరి ‘’గామారింది .అందులో వేలాది సంస్కృత తాళ పత్రా గ్రంధాలున్నాయి .నిత్యం వీటిని పరీక్షిస్తూ వీటిని కేటలాగ్ చేస్తూ వాటిలోని విషయాలను సేకరించాడు . ఆ కుప్ప లో 1905 లో అర్ధ శాస్త్రం ఆయన కంట బడింది . మూడేళ్ళు కస్టపడి శిధిలమౌతున్న దానిని ఓపికగా కాగితాలపై రాసి తన సంపాదకత్వం లో ముద్రించి లోకానికి మొట్ట మొదటి సారిగా కౌటిల్యుని అర్ధ శాస్త్రాన్ని తెలియ బరచాడు .దానిని తానే ఇంగ్లీష్ లోకి అనువదించి 1915 లో ప్రచురించాడు .ఇక్కడ అర్ధ శాస్త్రం మూల గ్రంధ రూపం లో లభిస్తే ,దేశం లోని ఇతర ప్రాంతాలలో దాని నకళ్ళు దొరికాయి .దీనిని తంజావూర్ లోని ఒక సంస్కృత పండితుడు ఈ లైబ్రరీకి ఎప్పుడో ఇచ్చాడట .ఇప్పటి దాకా అర్ధ శాస్త్రం దండి ,బాణుడు ,విష్ణు శర్మ ,మల్లినాద సూరి మెగస్తనీస్ మొదలైన వారు వారి రచనలలో ఉదాహరించినదే అందరికి తెలుసు .అసలు అర్ధ శాస్త్రం గ్రంధ రూపం లో శ్యామ శాస్త్రి ప్రచురించి మహోపకారం చేశాడు .ఇది ఒక చారిత్రాత్మక సన్ని వేశంగా నిలిచింది .తరువాతనే ఫ్రెంచ్ జర్మన్ మొదలైన భాషలలోకి అనువాదం పొందింది అర్ధ శాస్త్రం .
శాస్త్రి మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీలో 1912 వరకు పని చేసి తర్వాత బెంగుళూరు లోని శ్రీ చామ రాజేంద్ర సంస్కృత పాఠ శాల ప్రిన్సిపాల్ అయి 1915 వరకు ఉన్నాడు .1918 లో మళ్ళీ పాత స్థానం చేరి ,క్యురేటర్ అయి ,మైసూర్ లోని ఆర్కిలాజికల్ రిసేర్చేస్ కు డైరెక్టర్ అయి 1929 వరకు రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .అర్ధ శాస్త్రాన్ని కనుక్కోవటం తో ఆగి పోకుండా శ్యామ శాస్త్రి వేద కాలం ,వేద ఖగోళం మొదలైన విలువైన విషయాలపై పరిశోధన చేశాడు .క్రీ పూ.8 శతాబ్దానికి చెందిన’’వేదాంగ జ్యోతిషం ‘’,గ్రహణాలపై ‘’ద్రప్స’’ ,ఎక్లిప్స్ కల్ట్ ఇన్ వేదాస్ కొరాన్ అండ్ బైబిల్ అనే ద్రప్స కు అనుబంధ గ్రంధం ,వేదకాలం పై ‘’గవ౦ అయన ‘’,ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటి ,ది ఆరిజినల్ ఆఫ్ దేవ నాగరి ఆల్ఫబెట్స్’’అనే గొప్ప రచనలు చేశాడు శ్యామ శాస్త్రి .వీటిని దేశీయ ,విదేశీయ సంస్కృత విద్వాంసులు అందరూమహోన్నత రచనలుగా కీర్తించారు .భారత దేశం లో ఆశుతోష్ ముఖర్జీ ,రవీ౦ద్ర నాథ టాగూర్ బాగా మెచ్చారు .1927 లో శాస్త్రి గాంధీ జీని నంది హిల్స్ లో కలిశాడు .శాస్త్రి పరిశోధనలవలన మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీకి అంతర్జాతీయ గుర్తింపు గౌరవం దక్కాయి .
ఇండాలజిస్ట్ లు ,ఓరిఎంటలిస్ట్ లు అయిన జూలియస్ జాలీ ,మొరిజ్ విత్నిజ్ ,ఎఫ్ డబ్ల్యు ధామస్ ,పాల్ పెల్లి యాట్ ,ఆర్ధర్ బెర్రిన్ గ్దేల్ కీత్ ,స్టెయిన్ కొ నోవ్ మొదలైన వారు శాస్త్రి కృషికి నీరాజనాలు అందించారు .జే. ఎం .ఫ్లీట్ ‘’భారత దేశ సామాన్య చరిత్రను అందజేసిన౦దుకు శ్యామ శాస్త్రి కి మనం ఎల్లప్పుడు రుణ పడి ఉండాలి ‘’అన్నాడు .వాషింగ్టన్ డిసిలోని ఓరియంటల్ యూని వర్సిటి 1919 లోను ,1921 లో కలకత్తా యూని వర్సిటి శ్యామ శాస్త్రికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి .రాయల్ ఏషియాటిక్ ఫెలో ను చేసి గౌరవించారు .కాంప్ బెల్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసి సత్కరించారు .
శ్యామ శాస్త్రి కృషికి ‘’అర్ధ శాస్త్ర విశారద ‘’,బిరుదును మైసూర్ మహా రాజా ఇస్తే ,భారత ప్రభుత్వం ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదును ,వారణాసి సంస్కృత మండల్ ‘’విద్యాలంకార ,పండిత రాజ ‘’బిరుదులూ ప్రదానం చేసి ఆయన కీర్తిని పెంచాయి .ఆయన అంతర్జాతీయ కీర్తి కి ఉదాహరణ గా ఒక ఉదంతాన్ని అందరూ చెప్పుకొంటారు –ఒక సారి మైసూర్ మహా రాజు నాలుగవ జయ చామరాజ ఒడియార్ జర్మనీ సందర్శించినప్పుడు ఒక యూని వర్సిటి వైస్ చాన్సెలర్ ‘’మీరు శ్యామ శాస్త్రి గారి మైసూర్ నుంచి వచ్చారా “’అని ఆశ్చర్యంగా అడిగాడట .రాజు మైసూర్ కు తిరిగి వచ్చి శ్యామ శాస్త్రిని న భూతో గా సత్కరించి ‘’మేము మైసూర్ లో మహా రాజులం మీరు మా పౌరులు .కాని జర్మనీ లో మీరు గురువులు ,మీ వలననే మేము ,మా ప్రజలు గౌరవం, కీర్తి పొందాము ‘’అని అత్యంత వినయంగా గౌరవం గా అన్నారట .
శ్యామ శాస్త్రి తర్వాత కూడా ఇండాలజీ సమస్యలపై పరిశోధనలు కొన సాగించి క్యురేటర్ అయ్యాడు .మైసూర్ రాజ్య ఆర్కి యాలజి డైరెక్టర్ గా ఉంటూ ఎన్నెన్నో శిలా ఫలకాలు, రాగి రేకులుకనిపెట్టాడు . మైసూర్ చాముండి పురం లోనితన స్వగృహానికి ఆశుతోష్ ముఖర్జీ గౌరవార్ధం ‘’ఆశుతోష్ ‘’అని నామ కారణం చేశాడు శ్యామ శాస్త్రి .1944 లో 76 వ ఏట అర్ధ శాస్త్రాన్ని కనుగొని లోకానికి అందించిన రుద్రపట్నం శ్యామ శాస్త్రి మహా రుద్ర సన్నిధానానికి చేరుకున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు
.