సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు –సమీక్ష
సరసభారతి 103 వ సమావేశం గా ఉగాది వేడుకలు ఉగాదికి మూడు రోజులముందు 26-3-17 ఆదివారం సాయంత్రం స్థానిక ఏ .సి .లైబ్రరీలో నా అధ్యక్షత న జరిగాయి .ప్రముఖ గాయని శ్రీమతి శాంతిశ్రీ గారి ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమైంది .అధ్యక్షోపన్యాసం లో నేను సరసభారతి గత ఏడేళ్ళ, నాలుగు నెలల కృషిని తెలియజేశాను .ముఖ్యఅతిధి శాసన మండలి సభ్యులు శ్రీవై .వి .బి .రాజేంద్ర ప్రసాద్ మా ట్లాడుతూ ‘’ సరసభారతి ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించటం , వందకు పైగా సాహితీ వేత్తలు హాలు క్రిక్కిరిసేలా హాజరవటం, సాహిత్యం లో లబ్ధ ప్రతిస్టు లైనవారికి ఉగాది పురస్కారాలు అందజేయటం ,దాదాపు 50 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించటం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే .ఈ వయసులో కూడా మా మాస్టారు ఇంత పకడ్బందీగా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించటం పుస్తకాలు రాసి ,రాయించి ప్రచురించటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది .అందరూ ఆయనకు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారు .అందరికి అభినందనలు .’’అన్నారు . నేను మాట్లాడుతూ ‘’లైబ్రరీ పై అంతస్తు పూర్తికాలేదు .సెక్రెటరి గారిని ఫిబ్రవరిలో కలిసి మాట్లాడినప్పుడు ఈ విషయం వారి దృష్టికి తెచ్చాను .ఆయన ‘’ఫండ్స్ ఉన్నాయి. కాంట్రాక్ట ర్లే ఎవరూ ముందుకు రావటం లేదు ‘’అని చెప్పారు ‘’అన్నాను శ్రీ రాజేంద్రతో .ఆయన ‘’మరొక సారి ప్రయత్నిద్దాం .ఎవరూ రాకపోతే మనమే ఎవరో ఒక పేరుమీద కాంట్రాక్ట్ తీసుకొని చక్కగా అన్ని వసతులతో కట్టిద్దాం .సాహిత్య కార్యక్రమాలు పైనే హాయిగా జరుపు కోవచ్చు ‘’అన్నారు .అందరూ హర్షధ్వానాలు చేశారు .
మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలను
1-విద్యా వార్రిది ,బహు సంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,జ్యోతిష్య శాస్త్ర వేత్త డా. శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి 2-అవధాన భారతి,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్క్రుతోపన్యాసకులు విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావు గారికి 3-నవ భారత సాహితీరత్న ,సాహితీ విశిష్ట ,వానమామలై స్మారక ,సోమనాథ కళా పీఠ పురస్కార గ్రహీత ,శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు ,సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్య భరిత గ్రంథ ప్రచురణ కర్త ,విద్వత్ కవి ,విమర్శకులు ,40 కి పైగా గ్రంధాలను రచించిన గ్రంథకర్త ,విశ్వనాథ వారి కృష్ణ కావ్యాల పరిశోధకులు డా శ్రీ టి .శ్రీరంగ స్వామికి గారికి అందజేశాము .ముగ్గురకు గంధ తాంబూలాలతో .పన్నీరు ,సెంట్ సుగంధ పరిమళాలతో సత్కరించి నూతన వస్త్రాలు ,శాలువా ,పుష్పహారం ,వసుధైక కుటుంబం జ్ఞాపిక లతో పాటు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల నగదు కానుకగా అంద జేశాము .
‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని –ఐ టి ఐ .ఐ టి సి కోర్సులకు గ్రంథాలను,పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యలకు రిఫరెన్స్ పుస్తకాలను స్వంత ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాలనుండి ఏ రకమైన సహాయ ప్రోత్సాహకాలు లభించని సాంకేతిక విద్యా వేత్త ,రిటైర్డ్ డిప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ళ శ్యామ సుందరరావు గారికి అందజేశాము .వీరికీ పై విధంగానే చందన తాంబూలాలు ,నూతనవస్త్రాలు ,శాలువా, పూల దండ , వసుధైక కుటుంబం జ్ఞాపిక శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )అందజేసిన 3 వేల రూపాయలు ,సరసభారతి అందజేసిన 2 వేల రూపాయలు మొత్తం 5 వేల రూపాయల నగదు కానుకగా అందించాం .
సన్మాన గ్రహీతలు తమ సంతోషాన్ని ,కృతజ్ఞతను ,తమ సాహిత్య వ్యాసంగాన్ని వివరంగా తెలియ జేశారు .శ్రీ నిష్ఠల వారు తమ బహుముఖ పాండిత్యాన్ని సంస్క్రుతరచనలో తమ అనుభవాన్ని ఉదాహరణ పూర్వకంగా తెలియ జేశారు.తమ రచనలను ఆసక్తికలవారికి పంచిపెట్టారు . .శ్రీ చక్రాలవారు తాము ఈ ప్రాంతానికి రావటం ఇదే మొదటి సారి అని తమను ఎంతో ఆత్మీయం గా ఆదరించారని చెప్పి తాము రచించిన ‘’రుక్మిణీ పరిణయం ‘’కావ్యం లోని సొగసులను వివరిస్తూ ఈ కావ్యం లో 400కు పైగా వివిధ ఛందస్సులను సందర్భాన్ని బట్టి ప్రయోగించానని అందరు చదివి ఆనందించాలని చెప్పి అక్కడ కవిత్వం ప్రయోగం మీద ఆసక్తి ఉన్న వారికి కావ్యాన్ని తమ చేతుల మీదుగా అందజేశారు. శ్రీ రంగస్వామి తాను ఉయ్యూరు రావటం మహదానందంగా ఉందని దుర్గా ప్రసాద్ గారితో 23 ఏళ్ళుగా పరిచయం ఉందని చెప్పి తమ సాహితీ సేవలను తెలియ జేశారు .శ్రీ నాదెళ్ళ తాము పుస్తక రచనలో పడిన ఇబ్బందులను ,ప్రభుత్వాల ఉదాసీనతను అందరి దృష్టికి తెచ్చారు .
గౌరవ అతిధిగా వచ్చేసిన ‘’ప్రముఖ అంతర్జాతీయ గణిత( స్టాటిస్టిక్స్ )శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ డా శ్రీఅరుచూరి రామ కృష్ణయ్యఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాథ్ గారు తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను వివరించారు .అప్పుడు నేను మాట్లాడుతూ ‘’ఆహ్వాన పత్రం లో నేనూ శ్రీనాథ్ గారు సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తా౦ ‘’అని తెలియ బరచాం ‘’అని గుర్తు చేసి ‘’లూయీ అంటర్ మేయర్ అనే అమెరికా సాహితీ వేత్త ‘’మేకర్స్ ఆఫ్ దిమోడరన్ వరల్డ్ ‘’అనే గ్రంధాన్ని- కవిత్వం ,నాటకం ,సినిమా, చిత్రలేఖనం, సైన్స్ ,టెక్నాలజీ, శిల్పం ,నాట్యం, రాజకీయం మున్నగు వివిధ రంగాలలో చరిత్రను తమ సృజన లతో మలుపు తిప్పి న 92మంది ప్రముఖులపై రాశాడని ,దాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణగారు నాకు పంపారని దాన్ని చదివి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’పేరిట ఇంటర్ నెట్ లో రాశానని అది పూర్తికాగానే శ్రీ గోపాల కృష్ణగారు ఇంతటి ఉద్గ్రంధాన్ని తమ బావమరది ప్రముఖ గణిత శాస్త్ర మేధావి స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామ కృష్ణయ్య గారికి అంకితం ఇస్తే సముచితంగా ఉంటుందని సూచించారని దాని ముద్రణ ఖర్చు విషయం శ్రీ శ్రీనాథ్ గారితో మాట్లాడానని తెలియ జేశారని ఇప్పుడు శ్రీనాథ్ గారు ఆ విషయమై ప్రకటన చేస్తారని అన్నాను .శ్రీ శ్రీనాథ్ గారు ‘’మా అన్నగారికి ఈ పుస్తకం అంకితం ఇస్తున్నందుకు చాలా సంతోషం .దీనిని సరసభారతి తరఫున ముద్రించటానికి అయ్యే మొత్తం ఖర్చు డా పరుచూరి రామకృష్ణయ్య ట్రస్ట్ అందజేస్తుంది ‘’అని అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు . అంతే కాక సరసభారతి భవిష్యత్తులో నిర్వహించే ఏ మంచి కార్యక్రమానికైనా ట్రస్ట్ అండగా నిలుస్తుందని ,విద్యార్ధులకు స్కాలర్షిప్ లను అందజేయాలనుకొంటే తాము ట్రస్ట్ ద్వారా అందించగలమని శ్రీ నాథ్ చెప్పి అందరిలో ఉత్సాహాన్ని కలిగించారు .
ఈ సందర్భం లోనే నేను మాట్లాడుతూ ‘’నిన్ననే శ్రీ మైనేని గారు ఒక మెయిల్ రాశారు .నేను ఇంటర్నెట్ లో రాస్తున్న మూడవ గీర్వాణం ను పూర్తి చేయగానే అమెరికాలోనార్త్ కారోలీనా లోని ’’ కారీ’’ లో ఉంటున్న ప్రపంచ ప్రఖ్యాత బయో కెమిస్ట్ స్వర్గీయ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి కుమారులు శ్రీ రామ మోహన రావు గారి ఈ గ్రంథాన్ని-ఆధ్యాత్మిక వేత్త అయిన తమ బావగారు శ్రీ భండారు రాధాకృష్ణ మూర్తి గారికి అంకిత మిస్తే బాగుంటుందని సూచించారని, గ్రంథ ముద్రణకు శ్రీ రామ మోహన రావు గారు స్పాన్సర్ గా ఉంటామని తెలియ జేసారని ,నాకు ఎంతో ఆనందం కలిగిందని ,ఒక మంచి పుస్తకం రావటానికి ఇంతమంది సహృదయాలు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఏమీచేయ లేక పోతున్నానని తెలియ జేయగా అందరూ ఆనందం తో చప్పట్లు మోగించారు .
తారువాత ‘’వసుధైక కుటుంబం ‘’పై కవి సమ్మేళనం ను మినీ కవిత్వ సారధి ,విమర్శకులు మచిలీ పట్నం ఆంధ్రా బాంక్ మేనేజర్ శ్రీ వసుధ బసవేశ్వర రావు ,విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలుగుపండిట్ శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ,మచిలీపట్టణం హైస్కూల్ టీచర్ కవి విశ్లేషకురాలు బాల సాహిత్య రచయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికా రాణి 2 గంటల పాటు సమర్ధంగా నిర్వహించారు .కృష్ణా జిల్లాలోని నలుమూలలనుండి గుంటూరు,పశ్చిమ గోదావరి జిల్లాలనుండి కవులు కవయిత్రులు అన్ని వయసుల వారు అత్యుత్సాహంగా పాల్గొని కవిత్వాన్ని చదివి వినిపించి మురిపించారు .కవిమిత్రులందరికీ వసుధైక కుటుంబం జ్ఞాపిక అంద జేశాము .
నేనూ నా శ్రీమతి ఏప్రిల్ 6 న అమెరికాకు 5 వసారి వెడుతున్నాం .మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు కోరుతున్నాం అనగానే అందరూ హర్షం తో కరతాళ ధ్వనులు చేసి అభినందించారు .
ఈ వసుధైక కుటుంబం కవి సమ్మేళన కవితలను ముద్రిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చి శ్రీ వసుధ గారిని సంప్రదించాను .ఆయన మంచి నిర్ణయం అన్నారు .వెంటనే వసుధగారికే పుస్తకం తెచ్చే బాధ్యతను స్వీకరించమని కోరగాఆన౦ద౦ గా హర్ష ధ్వానాలమధ్య అంగీకరించారు .కనుక కవి సమ్మేళనానికి రాలేక పోయిన కవులు తమ కవితలను వసుధ గారికి పోస్ట్ లోకాని లేక vasudha@gmail.com కు మెయిల్ ద్వారా పంపమని వసుధ, నేనూ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం .
సరసభారతి అధ్యక్షురాలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవిగారు ఫినిషింగ్ టచ్ గా ఒక గీతాన్నికమ్మగా పాడి కార్యక్రమానికి సమాప్తి పలికారు .
సభ ప్రారంబానికి ముందు అందరికి గారె టిఫిన్ గా అందజేసి మధ్యలో పైనాపిల్ జ్యూస్ ఇచ్చాం , కార్య క్రమం లో పాల్గొన్న వారందరికీ లైబ్రరి పై అంతస్తులో శ్రీమతి శ్యామలాదేవిగారు కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు .సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు 4 గంటలపాటు సరసభరతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు అత్యంత ఆనదోత్సాహాల మధ్య జరగటం చారిత్రాత్మక విషయం .అందరికి అభినందలు .ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని అన్నీ తానే అయి నిర్వహించిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి సమర్ధతకు ధన్యవాదాలు .కార్యక్రమం దిగ్విజయం చేయటానికి సహకరించిన కోశాధికారి చి .జి. వి .రమణ,సాంకేతిక సలహాదారు శ్రీవి. బి .జి .రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు ధన్యవాదాలు .
శ్రీ చక్రాలవారు ఫోన్ లో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రావటం ఇదే ప్రధమం అని చెప్పగా వారిని వారి కుటుంబం తో సహా మా ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని ఆతిధ్యం స్వీకరించమని కోరగా విచ్చేసి మమ్మల్ని ఆన౦ద పరచారు .మా ఇంట భోజన ఏర్పాట్లన్నీ మా కోడలు శ్రీమతి రాణి ,మా ఇంటి ఆడపడచులు అను కొనే శ్రీమతి మల్లికాంబ గారు శ్రీమతి భవానిగారు ,శ్రీమతి శివలక్ష్మి కుటుంబం చేశారు .వారు విశ్రాంతి తీసుకోవటానికి తమ గృహం ఇచ్చారు శ్రీమతి శ్యామలాదేవిగారు . మా మనవడు ఛి చరణ మనవరాలు ఛి రమ్య చక్కని సహకారం అందించారు ..
సాయంత్రం అందరికంటే ముందే మూడున్నరకే వచ్చిన శ్రీ నిష్టల దంపతులను ,వారి మిత్రులను ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ను మా ఇంటికి సాయంత్రం ఆహ్వానించి బిస్కెట్ ,టీ ఇచ్చి వారి ప్రయాణపు బడలికను కొంత తగ్గించాగలిగాం . శ్రీ చక్రాల వారు శ్రీ నిష్ఠల వారు మా ఇంటికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-17 –ఉయ్యూరు