ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు
ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు
దుర్ముఖి వెడుతూ వెడుతూ చాలామందిని’’ పచ్చడి పచ్చడి’’ చేసి చేదు పంచి వెళ్ళింది .కొందరికి హాట్ హాట్ స్వీట్ పెట్టింది .కొందరికి బంపర్ ఆఫర్ తో హేపీ ఇస్తే కొందర్ని పాపర్లను చేసి,అన్ హేపీ టోపీ పెట్టింది .అందులో ఈ మధ్యనే జరిగిన పంచ రాష్ట్రాల ఎన్నికలలో ప్రజల చేత పంచెలు ఊడ పోగొట్టుకొన్నవారు కొందరైతే, కొత్త పంచలు కానుకగా పొందిన వారు మరికొందరు . .ఇదీ ఎన్నిక బాగోతం .దూషణ భూషణ తిరస్కారాల కాటా దెబ్బ తిన్న వాళ్ళే గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ లేచి ఎగురుతారు .లేకపోతె చతికిలబడి పోతారు గోడకు కొట్టిన పిడకలాగా .పిడకల వేట ఆపి అసలు విషయానికి వస్తాను .అసలు ఈ ఉగాది ఎవరికి ఎలాటి ఉగాది పచ్చడి రుచులు చూపించిందో చూద్దాం .
భూమి పుత్రులం మేముండగా దత్త పుత్రులెందుకు దండగ అని భేషజాలు పలికిన అఖిలేష్, వాళ్ళ బాబుయాదవ్ ,రాహుల్ ,సోదరి ,కమ్మీ లాలూ ముఠా అండ్ కో పాపం పండి ,మోడీ చేతిలో పీటీ దెబ్బ తిని ,సర్వం కోల్పోయి ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదుమాత్రమె మింగి కూలబడ్డారు .సైకిల్ గాలిపోయి పంచరయి రిమ్స్ బెండ్ అయి , ‘’సీటు ‘’,అధికార సీటూ గోవిందా అయి కూలబడ్డారు .
ఇక’’ ఏనుగు’’ బొమ్మావిడ రాష్ట్రమంతా తన శిలా విగ్రహాలు భారీ లెవెల్ లో పెట్టించి పూజలు చేయించుకొని ,జనానికి విసుగు పుట్టించి పార్టీ ఎవరిని ఉద్ధరించటానికి పుట్టిందో మర్చి పోయి అరిస్టో క్రాట్ గా వ్యవహరిస్తే ,చీదరించు కొని ,ఏవగించుకున్న చీపురు పుల్లలాగా ఏరిపారేస్తే ఉగాది పచ్చడిలో కారం తింటూ నోరుమండి నీళ్ళు తాగుతోంది వేసవి అప్పుడే వ విజ్రుంభించినట్లు పాపం .అధికారం ఉండటం కాదు దాన్ని పదిలం గా ప్రజానుమతంగా మలచుకోవాలి .
రెండున్నర ఏళ్ళక్రితం అసలు పాదమే మోపటానికి స్థానం లేని యు .పి లో చక్కని వ్యూహం పన్ని దాదాపు అన్ని లోక్ సభ స్థానాలు సంపాదించిన మోడీ పార్టీ ,ఈ శాసన సభ ఎన్నికలకు అప్పటి నుంచే పకడ్ బందీ వ్యూహం పన్ని ,అంతా తానే అయి అమిత్ షాదూసుకు వెడితే ,పార్టీ పెద్దలందర్ని దూరం పెట్టి తానే సర్వ సైన్యాధ్యక్షుడై ఢిల్లీ నుంచి గల్లీ దాకా సుడిగాలి పర్యటన చేసి వైరి శిబిరంలో ప్రకంపనలు ,భయోత్పాతం పుట్టించి ఒణుకు తెప్పించి ,వోటరు నాడిని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వోట్లన్నీ దండుకొని మూడువంతుల మెజారిటీ సాధించి పెట్టిన మోడీ అండ్ కో కు ప్రజలు బ్రహ్మ రధం పడితే ,ఈ ఉగాది వేళ ఉగాది పచ్చడిలో బెల్లం చెరుకు ముక్కల కమ్మని స్వీటు తింటున్నారు.గెలుపు మధు రసాస్వాదన చేస్తున్నారు .
పెద్ద నోట్లరద్దు దండగ సాధించిందేమీ లేదు ,బ్యాంకుల దగ్గర భారీక్యూలు ,ప్రజల ఇక్కట్లు గట్టెక్కవు అని కాకిగోలతో ఊదర కొట్టి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ,ఢంకా బజాయించిన వార్తా పత్రికలూ ఎలక్ట్రానిక్ మీడియా అంచనాలు తలక్రిందై కుదేలై ,రెండు నెలల్లో అంతా సర్దు బాటులోకి వస్తే ,మి౦గా లేక కక్కాలేక మోడీ వ్యూహం తెలియలేక తమబాకాలు కాకాలు పని చేయక లబో దిబో మని చతికిలబడి ఈ ఉగాదినాడు ఉగాదిపచ్చడిలో చింతపండు పులుపు మాత్రమే దక్కి ,తిని బావురు మంటున్నారు.ఇందులో ఒక తెలుగు దినపత్రిక మీడియా కూడా ఉన్నాయన కు 400 కోట్ల నల్లదనం’’ రద్దు చెదలు’’ తినేయటం తో మరీ విరుచుకు పడ్డాడు ఆసమయం లో .పాపం ఎవరికి ఎంత దక్కాలో అంతే కదా దక్కేది బాస్ !
మణిపూర్ ఏమిటి కాషాయం ఎగరేయటం ఏమిటి,గొడవల గోవా ఏమిటీ మెజార్టీ రాకపోయినా వ్యూహం ఫలించి కమలం అధికారం లోకి రావటం ఏమిటి ,అందరి అంచనాలను తలక్రిందు చేయటం కలలో కూడా ఊహించలేనిది .కాని ‘’కలనిజమాయేగా కోరికా తీరెగా’’అన్న పాతః పాట నిజమైంది .ఇక్కడ ఉగాదినాడు ఉగాది పచ్చడిలో వగరు కాంగీ తింటుంటే ,పారీకర్ బీరేన్ సింగ్ లు షడ్రుచుల సమ్మేళననాన్ని హాయిగా తింటూ అనుభవిస్తున్నారు .ఉత్తరాఖండ్ లో మొదటినుంచి దూకుడుగా ఉన్న కమలం జెండా రెట్టింపు ఉత్సాహం తో రెప రెప లాడింది .రావత్ అండ్ కో పంచ భక్ష్య పరమాన్నం తో అన్నిరుచుల ఉగాది పచ్చడి ఉగాది నాడు భోంచేస్తున్నారు .
పంజాబ్ మనదే అనుకొన్న అం ఆద్మీ క్రేజీ కేజ్రీ ధమాల్ మన్నాడు . అక్కడి అవినీతి కి బలై కమలం పూర్తిగా వాడి అధికారం కోల్పోయి వల వలా విల విలా .ఈ ఉగాది నాడు అక్కడ కెప్టెన్ వ్యూహం ఫలించి ‘’పంచ ఆబ్ ‘’లను కలిపి గద్దెనెక్కి హేపీ ఉగాది జరుపుకొంటూ ఉగాది ఫలరసాన్ని హాయిగా తోటివారితో అనుభవిస్తున్నాడు .ఆం లేదు ఆద్మీ లేడు హాం ఫట్ లేదు ,షా పధకం పారనూలేదు .కనుక వీళ్ళంతా ఈ ఉగాదికి చేదు కారం వగరు పులుపు తింటూ గత స్మృతులను నెమరేసుకొంటున్నారు .
అసలు గెలుగువాడి ఉగాదిని వదిలి ఉత్తరభారత౦ హరికధ ఎందుకు అంటారని తెలుసు .వస్తున్నాఅక్కడికే .చిన్ననాటి నుండి తండ్రి చాటుబిడ్డ గా ఉండి ,తండ్రిని చాటుకు పంపేసి ఆయ౦డగానే అధికారం చెలాయించి ,పోగానే ఆ గద్దె నాదేనన్న ఊహాలోకం లో తేలుతూ ,ఎన్నికలలో బోర్లాపడి ,ఉప ఎన్నికల్లో కళ్ళూ కాళ్ళూ పోగొట్టుకొని నమ్మిన మంది నట్టేట ముంచి నాలుగోవంతు ఖాళీ అయితే ,నోట్ల రద్దు ఎన్ని వేల కోట్ల బొక్క పెట్టిందో తెలియక ,చేదే అలవాటు చేసుకొని వేపకాయలే తిని తిని వాచాలత్వం ముదిరి తానే సి ఎం అనుకొంటూ పగటి కలలు కంటున్న యువ నాయకుడిని జనం సభలో బయటా చీదరించుకొంటు౦టే మి౦గా లేక కక్కాలేక సి ఎం నే ఎంతమాట అంటే అంతమాట అంటూ పరువు గంగలో కలిసిన’’ దేనిమీదో ‘’వానపడ్డట్టు దులుపుకు తిరుగుతూ ఈ ఉగాది నాడు ఉగాది పచ్చడిలో వేపపూవే మధురసం గా తింటూ మరింత వెర్రి పెంచు కొంటున్నాడు .బాబు మాత్రం చిద్విలాసంగా షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరితోకలిసి ఆరగించి పండగ చేసుకొంటున్నాడు .
మరో యువ సినీ రాచకీయ సేనాని దూకేస్తా దూకేస్తా నంటూ దేని లోనికి దూకుతాడో తెలీక కంగారు పడుతూ పడేస్తూ అటు సినిమాలూ అచ్చిరాక ఇటు రాచకీయం పడక ఉగాదినాడు దిగాలు పడుతూ ఉగాది చెట్నీలో పులుపు,వగరు, కారం చేదు మాత్రమే మింగుతూ ఆకాశానికి నిచ్చెన లేస్తూ పగటి కలలు కంటున్నాడు .
ఇంతమందికి ఉగాది పచ్చడి ఇన్ని రకాల అనుభవాలను అను భూతులను మిగిల్చింది .సవ్యం గా ఆలోచించి సరైన ప్రణాళికతో ము౦దు కెడితే చేదే తీపి కారమే తీపి వగరే పొగరు పవరు అయి ఊరడిస్తుంది .
శ్రీ హేవళంబి ఉగాది శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-17 –ఉయ్యూరు