నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం
ఇవాళ తెల్లవారు జామున మూడింటి దాకా మాంచి నిద్రట్టేసింది .మూడింటికి మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారే ప్రయత్నం చేశా. కాని నిద్రరాలేదు. అలాగే అయిదింటి దాకా పక్కమీద దొర్లుతూ ,అప్పుడే ప్రారంభమయే ఎఫ్ ఏం రేడియో ఆన్ చేసి శ్రీరామనవమి కనుక హాయైన రామ నామ కీర్తనలతో కాలక్షేపం చేద్దామనుకొని ,పక్కలోని ఆ బుజ్జి ము౦డను గిల్లుతూ తిప్పుతూ నెత్తిమీద మోదుతూ స్టేషన్లు మార్చినా ఒకటి రెండు బాలమురళి కీర్తనలు తప్ప మనసుకు హాయని పించే పాటలే రాలేదు .కాని అంతకంటే చేసేది ఏమీ లేదు కనుక ఏదో మా గన్నుగా వింటూ తిట్టుకొంటూ తిడుతూ ఆరున్నర దాకా కాలక్షేపం చేశా .ఏదో వెలితి బాధిస్తూనే ఉంది .పండగ రోజున సుప్రభాత సమయాన ఇలా జరిగిందేమిట్రా అని గుసగుస లాడుతున్నా. ఇక లాభం లేదని లేచి నిత్యకృత్యాలు ,సంధ్య ,శ్రీరామనవమి పూజాదికాలు పూర్తి చేసి ,సామాను ఒక సారి మళ్ళీ సర్ది ,అంతా ప్రయాణానికి ఓకే అనుకోని మా వాళ్ళు చేసిన పులిహోర తిందామని ప్రయత్నం చేస్తే మా ఉయ్యూరు దబ్బ కాయ పులుపు నషాళానికి అంటి ,ఏదోకతికి మందేసుకొన్నా-సారీ మందులు వేసుకొని రెండో సారి కాఫీ తాగి ,ఏమీ తోచక ఎప్పుడూ ఉయ్యూరులో టి వి మీద ధ్యాస ఉండని నేను చానల్ళు మారుస్తూ ఏదైనా ఆనందం కలిగించేది దొరుకుతుందేమో నని ప్రయత్నించా .భద్రాచల శ్రీ రామనవమి కల్యాణం చప్ప చప్పగా ఉందని పించింది .మా వాళ్ళ ఇంటి దగ్గరే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమౌతుందేమో అని ఆతురత పడితే అక్కడ వాళ్ళుమధ్యాహ్నం ఒంటి గంటకు పైన కాని మొదలు పెట్టరని తెలిసింది .సరే నని ఉసూరు మంటూ చానళ్ళు కిందికీ పైకీ మారుస్తుంటే అప్పుడు ఒక అద్భుతం ఈ టి. వి. లో ఆవిష్కార మైంది . .అదే చిత్తూరు వి నాగయ్య గారి ప్రతిభాసర్వస్వం అయిన త్యాగయ్య సినిమా .ఇదివరకు చాలా సార్లు చూశా కాని ఇప్పుడున్న అసంతృప్తికి అదొక గొప్ప విరుగుడు మానసిక ప్రశాంతికి దోహదంగా కనిపించింది .అంతే ఇక వేరే చానల్ జోలికి పోలేదు .అయ్యేదాకా అలా చూస్తూనే ఉండి పోయాం నేనూ మా శ్రీమతీ .
నాగయ్య గారి ముఖం లో ఎంతటి బ్రహ్మ వర్చస్సు కని పించిందో ఆశ్చర్యమేసింది .త్యాగయ్యగారి పాత్రకు జీవం పోశారు నాగయ్య .ఆయన మహానటుడు సంగీత కర్త దర్శకుడు నిర్మాత గాయకుడు కథారచనలో సంభాషణలలో సముద్రాల రాఘవాచార్యులవారికి చేదోడు కూడా .అన్నీ తానే అయి తనప్రతిభా సర్వస్వం ధార పోసి తీసి నటించి ‘’ఆల్ టైం క్లాసిక్ ‘’వైభవం తెచ్చారు .ఆనటనలో ఎంత తన్మయత యెంత భక్తి పులకరింత ఎంతటి వినయ విధేయతలు ,ఎంతటి ఔదార్యం ఎంతటి రామ నామ పానమహిమ ఉన్నాయో వివరించి చెప్పటం నలువకు, ఆదిశేషునికీ కూడా తరం కాదు అంటే ,కోన్ కిస్కా నేనెంత ? ఆ ఫీల్ ను మీతో పంచుకొంటే పొందే ఆనందం అర్ణవమే . బ్రహ్మానంద సహోదరత్వమే .
కమ్మగా సాగే కమనీయ త్యాగబ్రహ్మ కథ.ఇల్లాలు కమలాంబ గా హేమలతా దేవి ,ధర్మాంబ గా జయమ్మ , జపేశం గా ముదిగొండ లింగమూర్తి ,రాజనర్తకి చపల గా సరితాదేవి ,నారదునిగా వేదాంతం లక్ష్మీ పతి ,తంజావూర్ రాజుగా నారాయణ మూర్తి ,మొదలైన వారంతా శక్తి యుక్తులు ధారపోసి నటించారు ..పద్మనాభం ,లక్ష్మీ రాజ్యం లు కూడా ఉన్నారు .సంగీత దర్శకత్వం చేసిన నాగయ్యగారికి జె.ఎ. రెహమాన్ సహకరించాడు .
భజ గోవిందం పాట పులకరింత తెస్తే ,ఆరగింపవే బ్రతిమాలి స్వామిని పాలు త్రాగి౦చి నట్లు ,దొరకునా పాట మళ్ళీ మనకు వినే భాగ్యం దొరుకునా అన్నట్లు ఉంది .’’ఎందరో మహానుభావులు ‘’వింటే ఎందరో లేరు మహానుభావులు నాగయ్య ఒక్కరే మహానుభావులు త్యాగయ్యలో ఒదిగిన పూర్ణ పురుషులు అనిపించక తప్పదు. జోజో శ్రీరామా జోలపాట వింటే రాముడు తప్పక నిద్రిస్తాడు .మనసా పాట ఆయన అంత రంగ మధనమే .నా మొర ఆలకింప వరద రాజ లు ఆ దేవుళ్ళను పలకరించి విన్నపాలు విన్నవించి కార్యోన్ముఖులను చేసేట్లుగా ఉంటాయి నాగయ్య గారి స్వరం లో సుస్వర మాధుర్యం తో .అందరూ మెచ్చేదే అయినా ఆచరించ లేనిది ,త్యాగయ్యగారు ,పోతన్న గార్లు మాత్రమే ఆచరించినది ‘’నిధి చాల సుఖమా ‘’లో రాముని సన్నిధి మాత్రమే సుఖమిస్తుందన్న ఎరుక కలిగిస్తుంది .తన్మయత్వం తో’’ నాగబ్రహ్మ’’త్యాగ బ్రహ్మ ‘’హృదయాన్ని ఆవిష్కరించారు .’’సంగీతజ్ఞానమూ ‘’వింటుంటే ‘’భక్తి వినా ‘’ మరేదీ లేదని పించింది .తెర అవతలనుంచు ని భక్తి భావ బంధురంగా ‘’తెరతీయగ రాదా ‘’అని పాడితే దేవ దేవుడే దిగివచ్చి లోని, బయటి తెరలుతొలగించి అజ్ఞాన తిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతి దర్శనం చేయించింది .సామజ వర గమన ,బాలకనక మయ ,శివ శివ అనరాదే,రామ భక్తి సామ్రాజ్యం ,ఎవరని నిర్ణయి౦చేరా కృతులు నాగయ్య గారి కంఠం లో ఊపిరులు ఊది సమ్మోహనం చేసి ,భక్తి సామ్రాజ్య వైభవానికి ఎత్తిన పతాకలుగా స్థిరం గా నిలిచాయి .నాగయ్య గారి లాంటి మహానటుడు తెలుగు వాడై పుట్టటం మన అదృష్టం ఆయన దుర దృష్టం .ఆయన నటనకు సాటి రాతగిన వాడు హాలీవుడ్ నటుడు ‘’పాల్ ముని ‘’.అక్కడ మునికి బ్రహ్మ రధం పట్టారు .ఇక్కడ మన నట మహర్షి ,ముని చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి ఘంట సాల వంటి వారెందరినో ప్రోత్సహించి పైకి తెచ్చిన మహా దాత కు గుర్తిపు లేదు . ఇవాళ త్యాగయ్య సినిమా చూస్తే నేను మా ఆవిడ పొందిన ఆనందం వర్ణనాతీతం . ఉయ్యూరులోమా శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో పీతల మీద కూర్చుని సీతారామ కల్యాణం చేసి తలంబ్రాలు పోసే భాగ్యం అమెరికా ప్రయాణం వలన కుదరని మాకు ,నిజంగా శ్రీరామనవమి మా ఇంట్లో చేసుకొన్నంత అదృష్టం దక్కిందని పించింది .
నాకు హృదయానికి తాకే సన్నివేశాలు చూస్తుంటే గుండె కరిగి పోతున్నట్లు అనిపించి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల ధారాపాతంగా కారిపోతాయి .నన్ను నేను సంబాళించుకోలేని ఒక అపూర్వ అచేతన స్థితి అది .అలా అయింది ఇవాళ త్యాగయ్య చూస్తుంటే. అంతటి మధురానుభూతికి లోనయ్యాను .విశ్వనాద్ సినిమాలు చూస్తే ఇలాగే ఉంటుంది నా పరిస్థితి మాయ బజార్ చూసినా మల్లీశ్వరి చూసినా ఇంతే .త్యాగయ్య సినిమా చూసి నేను ఇవాళ గొప్ప రిలీఫ్ పొందాను .తెల్లవారు జామున నుంచి ఉన్న అసంతృప్తి ,అసహాయత ,నీరసం ఒక్క దెబ్బతో దూరమైపోయాయి .ఎద నిండా ఆనందమే తాండవ మాడింది .ఆనంద రస సాగరం లో ముంచి తేల్చారు నాగయ్యగారు త్యాగయ్య లో . ఆ ఇద్దరి జీవితాలు ధన్యాతి ధన్యం .త్యాగయ్య కోసమే నాగయ్య జన్మించారనే అనిపిస్తుంది .పోతన్న కూడా తనకోసమే నాగయ్యగారు పుట్టారని భావించి ఉంటారు .ఇది చారిత్రిక సత్యం .73 ఏళ్ళు దాటాయి నాగయ్యగారి త్యాగయ్య వచ్చి .ఇప్పటికీ అదే స్వచ్చత అదే ,పవిత్రత, అదే రామ భక్తి సామ్రాజ్యం .ఆతర్వాత ఎన్నో వచ్చినా త్యాగ బ్రహ్మం గారి సంగీత సామ్రాజ్య వైభవానికి ఈ చిత్ర రాజం ఒక్కటే నిలువెత్తు దర్పణం గా నిలిచింది .ఈ అనుభూతినే మీతో పంచుకొన్నాను .
మధ్యలో ఒక సారి ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో రామకల్యాణ౦ యెంత వరకు వచ్చిందో చూద్దామని వెళ్ళా .అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట దాటుతోంది .కాని అక్కడ ఇంకా కల్యాణం శురూ కాలేదు . నేను స్వామిని దర్శించి బయటికి వస్తుంటే అప్పుడే కల్యాణం చేసే దంపతులు సీతారాముల విగ్రహాలతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి గుడిలోకి వెడుతున్నారు .కల్యాణం ఇంకాకాని ఆ సీతా రాములను దర్శించి నమస్కరించి ,ఇదే దక్కిందనుకొని ,మా త్యాగయ్య ఏమయ్యాడో అనే కంగారుతో ఇంట్లోకి వచ్చి పూర్తయ్యేదాకా చూసి తృప్తిగా భోజనం చేశాను .
శ్రీరామమనవమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్