నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ
తెలంగాణలో కరీమ్ నగర్ జిల్లా మంధెన గ్రామం లో సుమారు 200 ఏళ్ళక్రితమ్ ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ నాటి మధ్య రాష్ట్రాలు అని పిలువబడిన సెంట్రల్ ప్రావిన్స్ కు పొట్ట పోషించుకోవటానికి వలస వెళ్ళాడు . ఆయన ఇంటిపేరు దహనం . పే రు పుల్లయ్య .
కాంప్టి పట్టణం చేరి పౌరోహిత్యం చేశాడు . అక్కడ అప్పటికే ఉన్న తెలుగు వారితో సౌమనస్యంగా గడిపి పేరు తెచ్చుకున్నాడుపుల్లయ్య . .విధి వక్రించి అకస్మాత్తుగా చనిపోయాడు . పుల్లయ్య భార్య అహరహం కష్టించి ఒక తెలుగు వారింట వంటపని చేస్తూ పిల్లల్ని పెంచి పోషించింది .యజమాని చిరువ్యాపారి మంచివాడు కావటం తో పుల్లయ్య పిల్లలకు చదువు చెప్పించాడు .ఆ పిల్లల్లో పెద్దవాడు లక్ష్మీ నారాయణ . చురుకుదనం కల కుశాగ్ర బుద్ధి . బాగా చదివి నాగపూర్ వెళ్లి అక్కడ హిస్టాఫ్ కళాశాల లో ఇంటర్ చదివి ,అక్కడి మైకా గనుల వ్యాపారం పై ఆకర్షితుడయ్యాడు . తన కుటుంబానికి సాయం చేసిన ఆయన కు మైకా వ్యాపారం లో సాయం చేశాడు . గృహస్తు వ్యాపారం లో సాయం చేయటానికి చదువు మానేశాడు . మైకాను దూర ప్రాంతాలకు రవాణా చేస్తే లాభాలు బాగా వస్తాయని గ్రహించి గృహస్తుకు నచ్చ జెప్పాడు .ఆయన అలాగే చేసి సంపన్నుడయ్యాడు . లక్ష్మీ నారాయణ మీద ఉన్న నమ్మకం తో వ్యాపార పురోగతి బాధ్యతను అతనికే అప్పగించాడు .
క్రమంగా నారాయణ మైకా గనులను లీజు కు తీసుకొని వ్యాపారం లో స్థిరపడి బాగా సంపాదించాడు . ఇంతలో యజమాని మరణించటం ,అయన యావదాస్టి లక్ష్మీ నారాయణకు దక్కటం జరిగాయి .అప్పటిదాకా మనదేశం లో ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం అనేది ఇంగిలీషు వారి చేతుల్లోనే ఉండేది .ప్రతి చిన్న సాంకేతిక సమస్యకూ వాళ్ళ మీదే ఆధార పడాల్సి వచ్చేది .దీనిపై ఆలోచించిన నారాయణ సాంకేతిక నైపుణ్యం గల ఇంగిలీషు వారిని తన కింద ఉద్యోగులుగా నియమించుకొని విదేశీ వ్యాపారం సాగించి కూడు గుడ్డ లేనివాడు కోట్లకు పడగ లెత్తాడు .
క్రమంగా ప్రజాహిత కార్య క్రమాలలో ప్రవేశించి జిల్లా బోర్డు సభ్యుడై ,మధ్య రాష్ట్రాల ఇండస్ట్రియల్ బోర్డు మెంబర్ అయి ,నాగ పూర్ పయోనీర్ ఇన్సూరెన్స్ అధ్యక్షుడుగా ఎదిగాడు . 1920 లో మధ్యరాష్ట్రాల శాసన సభ్యుడు కూడా అయ్యాడు . 1930 లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు బ్రిటిష్ ప్రభుత్వం ”రాయబహదూర్ ”బిరుదు నిచ్చింది .ఇంతకాలం మధ్య ప్రదేశ్ లో ఉన్నా లక్ష్మీ నారాయణకు ఆంద్ర దేశం పై విపరీతమైన అభిమానం ఉండేది
19 27 లో ఆంద్ర విశ్వ విద్యాలయం ఏర్పడుతోందని చాలా సంతోషించాడు .తనకున్న యావదాస్తిని దానికి రాసివ్వాలని నిశ్చయించాడు .ఈ విషయాన్ని ఆనాటి గవర్నర్,విశ్వవిద్యాలయ వైస్ చాన్సెలర్ కట్టమంచి రామ లింగా రెడ్డిగార్లకు లిఖిత పూర్వకంగా తెలియ జేశాడు కూడా .తానిచ్చే నిధిని ఎలా సద్వినియోగం చేయాలో కూడా సూచించాడు . అయితే లింగా రెడ్డి దీనిపై తగినంత శ్రద్ధ తీసుకోలేదు .తనకున్న విద్యా గర్వం తో నారాయణ ను చాలా చిన్న చూపు చూశాడు .కానీ ఉండబట్టలేని నారాయణ రెడ్డికి ముందే తెలియజేసి బెజవాడ వచ్చాడు .ఆయన్ను స్టేషన్ లో రిసీవ్ చేసుకోవటానికి విశ్వ విద్యాలయ అధికారులెవరూ రాలేదు .అయినా ఓపికగా వెయిటింగ్ రూమ్ లో నిరీక్షించాడు చాలా సేపు .తర్వాత ఎప్పుడో ఒక చిన్న ఉద్యోగి వచ్చి రెడ్డిగారికి తీరిక లేదని ,విశ్వ విద్యాలయం ఇంకా బెజవాడలో రూపు దిద్దుకోలేదని అందుకని రెడ్డి ,నారాయణ ను చూడటానికి అవసరరం లేదని భావించాడని చావు కబురు చల్లగా చెప్పాడు .ఎంతో ఆశతో వచ్చిన వితరణ శీలి లక్ష్మీ నారాయణ హతాశుడై తిరిగి నాగ పూరు వెళ్లి పోయాడు .
తనదగ్గర ఉన్న సంపదను 35 లక్షల రూపాయలను నాగ పూర్ విశ్వ విద్యాలయానికి దానం చేశాడు నారాయణ .”లక్ష్మీ నారాయణ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ”అనే సంస్థను స్థాపించాడు ..నాగపూర్ లా కాలేజీకి ,విశ్వ విద్యాలయానికి ఉచితం గా నివేశన స్థలాలను దానం చేశాడు .అక్కడ ఏర్పడే ప్రతి విద్యాలయం లో తెలుగు విద్యార్థులకు ప్రత్యేకం గా హాస్టల్ ఉండాలని నిబంధన పెట్టి తన ఆంధ్రాభిమానాన్ని చాటుకున్నాడు
. ఆంధ్రులు ,కట్టమంచి తలపొగరుగా వ్యవహరించినా లక్ష్మీ నారాయణకు తెలుగు దేశం పై అభిమానం వీసమంతా కూడా తగ్గలేదు .అందుకే ఆంధ్రా యూని వర్సిటీకి తనవద్ద ఉన్న అమూల్య పుస్తకాలన్నీ ధారా దత్తం చేశాడు . ఆ నాటి ఆంద్ర యూని వర్సిటీ లైబ్రేరియన్ శ్రీ అబ్బూరి రామ కృష్ణా రావు నాగపూర్ వెళ్లి లక్ష్మీనారాయణ ఇంట్లో అతిధిగా ఉండి స్వయం గా ఆ పుస్తకాలను బెజవాడ తీసుకొని వచ్చి యూ ని వర్సిటీ లైబ్రరీకి అందజేశారు .ఆ పుస్తకాల జాబితాయే ఆంద్ర విశ్వ విద్యాలయ ప్రధమ ప్రచురణ .
వితరణ శీలి దహగం లక్ష్మీ నారాయణ 19 30లో మరణించాడు . లక్ష్మీ నారాయణ విషయం శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు తన ”వరద కాలం ”లో రాసే దాకా ఆంధ్రులెవరికీ పెద్దగా తెలియదు .అందుకే దీన్ని అందరికి తెలియాలని నేను మీకు అందజేస్తున్నాను
నేను అమెరికా వచ్చేటప్పటికి నాకు వరద రాసిన కవన కుతూహలం ,వరద కాలం అందేట్లు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపేట్లు చేయమని నా ఆర్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి కోరటం వారాపని చేయటం 7 మధ్యాహ్నం మేము చేరేటప్పటికి పుస్తకం ఉండటం జరిగింది .ఆ రోజు రాత్రి 5 పేజీలు మాత్రమే చదివి నిన్నా ఇవాళ ఉదయం మొత్తం 370 పేజీలు పూర్తి చేశాను అందులో దహగం వారి ఆర్టికల్ బాగా ఆకర్షించి ఋణం తీర్చుకున్నాను .శ్రీ మైనేని వారికి కృతజ్ఞతలు .మిగిలిన విశేషాలు వీలు వెంట తెలియ జేస్తాను
ఆధారం -కవన కుతూహలం మరియు వరద కాలం -అబ్బూరి వరద రాజేశ్వర రావు
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్ -షార్లెట్ -అమెరికా -10-4-17 –