వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం నాకు సయించదు .నా కవిత్వం నాది .ప్రకృతికి నాకు ప్రత్యక్ష సంబంధం .మొదట్లో కవిత్వం వద్దనుకున్నా తర్వాత ఎందుకు రాయకూడదు అని రాశా .;లలిత కళ ల న్నిటా ప్రావీణ్యం పొందితే కవిత్వం అత్యంత సహజ సుందరమవుతుంది ”అన్నారు .ఆయనది గుప్త మోహనమైన అమాయకత్వం అన్నాడు వరద . అదే అందరినీ ఆకర్షించింది .దుగ్గిరాల వారు ఆశించి నట్లు బాపిబావ విశ్వ విఖ్యాత చిత్ర రచన చేయలేకపోయారు ..

18- బసవరాజు అప్పారావు -”కొల్లాయి గట్టి తేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి ”పాటతో జగత్ప్రసిద్ది చెందారు ..కవిత్వం కోసం జీవిద్దామని భ్రమలో ఉండేవారు .. దుగ్గిరాల ప్రభావం బసవరాజు పై ఎక్కువ … ”హృదయాన్నే మాటల్లో పెట్టె శక్తి అప్పారావు ఒక్కరే సాధించారు .

దుగ్గిరాల మరణిస్తే -”ఏల పాడనింక యమునా కల్యాణి -నే లీలా మానవుడు గోపాలుడు లేడాయె -బంగారు గనులలో చెంగలించేవేళ -పిడుగు బోలిన వార్త వినిపించే నాకయ్యొ ”అని కన్నీరు మున్నీరుగా విలపించారు … ఆయన ప్లీడర్ వృత్తి సరిగ్గా సాగలేదు బెజవాడ అంటే విరక్తి కలిగింది . భారతి ,పత్రికలలో సబ్ ఎడిటర్ ..

ఢిల్లీ లో కుతుబ్ మినార్ అశోక స్తంభం ,మసీదు ఆర్య దేవాలయం ప్రక్క ప్రక్కనే ఉండటం చూసి చలించి -వెంటనే

”ఇది మొగల్ దివాణమా ? ప్రళయ శివ మహా స్మశానమా ?ఇది విజయ స్థంభమా ?చల విద్యుఛ్చ0ద్ర చూడ దంభమా ?ఇవి జీర్ణ సమాధులా ?ప్రమాద గణ నివాస వీధులా ?ఇది యవన వికాసమా ?నటేశ తాండవ విలాసమా ?”అని గేయం రాశారు ఇదే ఆయన ఆఖరి గీతం …ఢిల్లీలో ఆయనకు మతి తప్పింది అనుకున్నారు మిత్రులు -ఆయన ఆశించినట్లు –

”బతుకు బరువు మోయలేక -చితికి చితికి డస్సి వాడి -ఫికరు పుట్టి పారిపోయి -ఒకడనే యే తోటలోనో -పాట పాడుతుండగనా -ప్రాణి దాటి యేగేనా ?ప్రాణి దాటి యేగు చుండ -పాట నోట మోగేనా ?”అంతిమ క్షణం అలానే జరిగింది ..

19- కవిగారు -మారేపల్లి రామ చంద్ర శాస్త్రిగారు కృష్ణా జిల్లా కనక వల్లి నుండి విశాఖ చేరి అదే కార్య క్షేత్రంగా గడిపారు . కాళ్లకు చెప్పులు ఉండేవికావు.తనను చూసి విష జంతువులూ దూరం పోతాయనేవారు శుద్ధ శ్రోత్రీయ బ్రాహ్మణ వేషం ..విశాఖ లో ఆబాలగోపాలం ఆయన్ను కవిగారు అనేవారు ..ఆయన కవితాసమితికి ఆజీవ అధ్యక్షులు ..” తెలుగు నుడి ”ని సేకరించి ”నుడికదలి ”నిఘంటువు తయారు చేయాలన్నది ఆయన ఆశయం . అచ్చ తెలుగు ను ఆరాధిస్తే అందరికీ దూరమై పోతామేమో నని చాలా మంది సంశయం వెలి బుచ్చారు .అందుకనే పెద్దగా సహాయ సహకారాలు అందలేదు .అమాయకత్వం వినయం ఆయన సొమ్ము .ఘోషా ఆస్పత్రి దగ్గర చిన్న పూరిపాకలో నివాసం .దానిలోనే లైబ్రరీ .సాంబ నిఘంటువు సంపాదించి దానిపై పరిపూర్ణమైన అధికారం సాధించారు . బాలికా విద్య కోసం శ్రమించారు . సంస్కరణలు తెచ్చారు .. యాంత్రిక నాగరికత నచ్చేదికాదు .. మైకుల్లేని రోజుల్లో వేలాది మందిని తన ఉపన్యాస0 తో ఆకట్టుకొనేవారు . జాతీయోద్యమం లో గాంధీ వెంట ఉన్నారు .

కవి గారి షష్టి పూర్తి 19 33-34 లో జరిగింది .ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా సభామండపానికి తెన్నేటి విశ్వనాథంగారు కారులో కూర్చోబెట్టుకొని తీసుకు వచ్చారు .విశాఖ యావత్తూ ఊరేగింపులో పాల్గొన్నది .అంతటి భారీ ఊరేగింపు విశాఖ లోనే కాదు మరే పట్టణం లోను జరగలేదని వరద ఉవాచ .ఆయన సభలో ప్రసంగిస్తుంటే ఆయన చెక్కులమీద ఆనంద బాష్పాలు ధారగా కారిపోయాయి .అంతటి పరవశం కల్గించారు విశాఖ ప్రజలు .అంత చక్కని ఉపన్యాసాన్ని తానెన్నడూ వినలేదన్నాడు వరద

కవి గారికి వ్యాపకాలు ఎక్కువ దానితో నుడికదలి మందగించింది .ఉత్తరాల్లో కూడా అచ్చ తెలుగే రాసేవారు ..శుభం అని రాయటానికి బదులు ”మేల్ ”అని రాసేవారు ..ఆయనకు దేవుడు కు అచ్చ తెలుగు పదం దొరకలేదు .చివరికి కొత్త పదం ”ఎల్లడు ”ను సృష్టించారు . దీన్ని శ్రీ శ్రీకి వినిపిస్తే పగలబడి నవ్వాడు పురిపండా ముక్తసరిగా ”బావుంది ”అన్నాడు .

20-నాయని సుబ్బారావు -అగ్ర శ్రేణి కవి . కానీ తగినంత ప్రాశస్త్యం రాలేదు .. ”మాస్ మీడియా వచ్చి సాహిత్యాన్ని బతకనీయటం లేదు ఒక వేళ బతికినా జీవచ్ఛవంగా ఉంది ”అని ఆయన అభిప్రాయం .

21-బొడ్డు బాపిరాజు -చదునైన ముఖం ,చిన్న మీసాలు ,ఎడం పాపిట ,ధోవతి లాల్చీ వెడల్పాటి అంచు ఉత్తరీయం తో ఉండేవాడు . ప్రచార భాగ్యం శిష్య వర్గం లేని కవి .. బహుమాన సత్కారాలూ లేవు . 1973 లో ఒక చిన్న సభ జరిపి అభినందిస్తే కవిత్వానికి గౌరవం కల్పించారని పొంగిపోయి ,ఆనంద పారవశ్యం తో అక్కడికక్కడే చనిపోయాడు .-అతని కవిత్వానికి మచ్చుకు –

”ఓయి ప్రభూ తపింతునిట -లుర్వి ధరాగ్రము నెక్కి ఎన్ని య -ధ్యాయములేగె లోక కథ -యంతయునుం దిలకించినావె ?యధ్యాయము లయ్యె నేమి భవదీయ -జగద్ధిత మార్గముల్ దయా -తోయధి వౌచు కొండా దిగె -దో యొక గట్టుకు జేర్చువో భువిన్ ”.

22- మాచిరాజు దేవీ ప్రసాద్ -భావ కవుల్ని ఎద్దేవా చేస్తూ పారడీలు రాశాడు ..దీన్ని బాగా పండించాడు జలసూత్రం . 1949 లో కృష్ణ శాస్త్రి పఠాభి ,అబ్బూరి ,దేవిప్రసాద్ పద్ధతులలో రాసి పేరు లేకుండా మల్లవరపు విశ్వేశ్వర రావు సహాయం తో శ్రీశ్రీ ద్వారా భారతిలో అచ్చు వేయించారు . కొన్ని –

”అసలు శ్రావణమాస మధ్యమ్ము నందు -కురిసి తీరాలి వర్షాలు ,కొంచె కొంచె -మేని రాలాలి తుంపరలేని ,కాని -ఉక్కమాత్రమేమాత్రమూ ఉండరాదు .

ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి సుంత -కదిలితె చెమట వాసనలు కక్కుతుంది -నేనె వర్షపు మేఘమైతేను ,పైని -ఒట్టిపోయింది కొండపై ఉత్తమబ్బు ”

కర్ణ పేయంగా కవిత్వాన్ని మలచిన కీర్తి దేవి ప్రసాద్ కె దక్కుతుంది ఇలాంటి ధోరణి ని పఠాభి ప్రారంభించినా ,పెద్ద అబ్బూరి నిర్దేశించినా ,విశిష్ట రూపాన్ని సంతరించినవాడు దేవీ ప్రసాద్ ..కృష్ణశాస్త్రిగారు దేవీ ప్రసాద్ ను చిరంజీవిని చేశారు భారతి లో ప్రచురించేట్లు చేసి –

”అతడు ప్రియురాలిగా0చు బ్రహ్మా0డ మందు -అచ్చ మామె నె గాంచు ప్రత్యణువులోన- పువ్వులో ,నుర్వులో గాలి పర్వు లోన -రెక్కలో రిక్కలో పందికొక్కులోన .

ఆ కళా0బోధి ఊహా విలోకనాన -లోల లోచనాల్విధు మండలాన కలదు -ఆమె లోలాక్షి వికచతోత్పలాయ తాక్షి -కాని అసలులో ఆమె కో కన్ను మెల్ల ”

23- చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి – కవిత్వానికి ప్రత్యేకంగా ”ధ్వని ”అనే ఒక పత్రిక పెట్టాలని శ్రీశ్రీ భావించి దాని ముఖ చిత్రంగా శాస్త్రిగారి చేతులను ఫోటో పెట్టాలని భావించి శాస్త్రిగారి చేతులు ఫోటో తీయించి ,ఆయన ఎందుకు అని అడిగితె ”మీకవిత్వం చేత్తో రాస్తారుకనుక ”అని చెబితే ఆయన ”నేను కవిత్వం చెప్పా . నిజమే .రాసింది తక్కువ .నాకు న్యాయం చేయాలనుకొంటే నా మేధస్సుని ,హృదయాన్ని గాత్రాన్ని ఫోటో తీసి పెట్టండి ”అన్నారు .అప్పుడు వరద ”అలా కుదరదుకనుక మీ చేతులేశరణ్యం ”అనగానే అందరూ నవ్వారు ‘

శాస్త్రిగారికి బందర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆవిడకు చిన్న హోటలువుండేదని శాస్త్రిగారూ శిష్యులు పింగళి కాటూరి వగైరా అక్కడే టిఫిన్ చేసేవారని అక్కడ పెసరట్టు అదుర్స్ అని చెప్పుకొనేవారని ,అది తెలుసుకోవటానికి కోలవెన్ను రామ కోటేశ్వరరావు గారు రహస్యంగా వెళ్లి చూస్తే ,పెసరట్టు వేసేవాడు వేడి అట్లకాడ తన పిక్క మీద కాసేపు పెట్టుకొని దానితో అట్టు తిరగేసి ఆకులో వేసేవాడని ,వాడి కి పిక్క తామర ఉండటం వలన వేడి కాడ పిక్క మీద పెట్టుకొనేవాడని గ్రహించారని మాధవ పెద్ది బుచ్చి సుందరరామయ్యగారు చెప్పారు .ఆ హోటలుకు వీళ్ళు ”సాహిత్య తామర విలాస్ ”అని పేరుపెట్టి సాహిత్య తామర ఉన్నవాళ్లే అందులో పెసరట్టు అదుర్స్ అంటారని ప్రచారం చేశారట . ఈ కథను శాస్త్రిగారి చెవిన వేశాడు వరద .ఆయన ఫక్కుమని నవ్వి ”ఆ రోజుల్లో నా మీద అనేక అబాండాలు వేసేవాళ్ళు అభిమానంతో కొందరు అసూయతో మరికొందరు .ఒకసారి ఒక సంస్థానం లో అవధానానికి వెళ్లాం .అక్కడ చదువుకున్న వేశ్య నాకొక పద్యం రాసి పంపింది తానూ కవిత్వం చెబుతానని నేను వినాలని .తిరుపతి శాస్త్రి మండి పడ్డాడు .ఎక్కడికి పోయినా నీకో పేరుందని తెలిసి పోతుందన్నారు. నిజానికి ఆమె పద్యానికి నేనెలా బాధ్యుడిని /ఇలాంటివి బోలెడు జరిగాయిలే ”అన్నారట .

80 వ పడిలో మంచం మీద ఉండగా వరద వగైరా చూసి ఏవైనా పద్యాలు చెప్పమంటే చెప్పారు అందులో కొన్ని –

”నన్ను వృద్ధుడంచు బన్నెమ్మునకు మీరు -గౌరవింతు ,రేను దారమైన -మీ సపర్య లెలమిఁ మెచ్చి కైకొనియెద -గవిని నేను కాను కాను కాను .

ఇరువురొ ముగురొ కవులుం -దురు కబ్బంబులు నంతె ,దోషజ్ఞులు ధీ -పరమాన్యులు తితక వులై -పరి శీ లించు నెడ బైకి వచ్చెడి సుకృతుల్ .

కవిత వలన బన్నెము గూడ గలిగెనేని -గలుగునిండా వశ్యకము గాదు ,రామ -కోటి వలె నుండు రచనలు కోవిదులకు -నచ్చ నీ రహస్యమ్ము ”విన్నాణి ”యెరుగు . ‘

శాస్త్రి గారి దర్శనమే ఒక మహా విభూతి ,అపురూపమైన అనుభూతి .ఆయనలాంటి సాహిత్య మూర్తి నభూతో నభవిష్యతి ”అని కైమోడ్పు ఘటించాడు వరద .

24-మల్లాది రామ కృష్ణ శాస్త్రి -పెద్ద అబ్బూరి కి ప్రాణ స్నేహితుడు ..అబ్బూరి పిల్లలు బందరులో జబ్బు పడ్డప్పుడు ఆయన ఆశువుగా ఒక నవల చెబితే తెల్లార్లూ రాశారు మల్లాది .అదే మంగళ సూత్రం నవల అదొక్కటే అబ్బూరి నవల ..అబ్బూరి ప్రోత్సాహంతో సాహిత్యం లో దిగారు మల్లాది .శాస్త్రిగారితో తిరగడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు వరద .కధ మల్లాది చేతి లో పరిపక్వమైంది .ఆయన సాహిత్య విమర్శ అత్యంత నిర్దుష్టం ఆమోదయోగ్యం .సునిశిత వ్యంగ్యం ఆయన సొమ్ము . ఖాళీ దొరికితే కీర్తనో జావళీయో రాసేవారు అక్షర రమ్యత ఆయనకు ఇష్టం . సముద్రాల సీనియర్ కు సినిమా పని ఎక్కువైతే ఎవరినైనా సాయం పంపమంటే వరద వగైరా శాస్త్రిగారిని బలవంతం మీద పంపారు ఆయన అక్కడ స్థిరపడ్డారు . వరద రాసిన ”ప్రతిమా సుందరి ”నాటాకాన్ని పంతం మీద ఒక్క రాత్రిలో అచ్చు వేయించి కూర్మా వేణు గోపాల స్వామి గారి పైరవీ నాటకానికి చెక్ పెట్టించారు ..దీనికి ముందుమాట రాస్తూ శాస్త్రిగారు ”తెలుగులో ఔచిత్యం ,విచక్షణ ,జిజ్ఞాస కు హాయి కలిగించేది వరద రాసిన ప్రతిమా సుందరి ”అన్నారు

ఒకసారి బెజవాడలో సినిమా చూడటానికి వెళ్లిన శాస్త్రిగారిని ఒక ప్రౌఢ బుగ్గ పట్టుకొని ”ఏం పంతులూ తేరగా ఉన్నామా మా మీద రాసెయ్యటానికి ”అంది .ఆమె ఒక పేరుమోసిన వేశ్య కూతురు .శాస్త్రిగారు ఫకాలుననవ్వి ”నా కధలు వీళ్లూ చదువుతున్నారన్నమాట ”అన్నారు .శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ”నా కవి మిత్రులు ”అనే శీర్షికలో పది వ్యాసాలూ అద్భుతంగా రాశారు .

మరోసారి ఉమాయ్ శాస్త్రిగారు సినిమాకు రాసిన పాట పాడి వినిపిస్తే శాస్త్రిగారికి కోపం నషాళానికి అంటి ”మనం చాలా సరదాగా మాట్లాడుకొంటున్నప్పుడు సినిమాలకి రాసే మల్లాది గురించి మాట్లాడకండి .ఆ మల్లాది ఎవడో నాకు తెలియదు .నేను మీ అందరికీ తెలిసిన వాణ్ని అర్ధమయిందా అన్నారు .అంటే ఆయనకు సినిమాల్లో చేసే వృత్తిమీద అంత అసహ్యం అన్నమాట ..నిజంగా ఆయన అంత బాగా సినిమా పాటలు రాసిన వాళ్ళు లేరు . ఆయనే ఒకసారి ”మెప్పుకోసం ఉప్పుకోసం రాసింది సాహిత్యం కాదు .సాహిత్య ప్రాయోజనం సాహిత్యమే ”అన్నారు .

వరద ను ”ఏమైనా రాస్తున్నావా ?”అని అడిగితె ”రాస్తున్నా -వరద అంత్యక్రియలు ”అన్నాడు . అవాక్కయ్యారు మల్లాది .వివరణ ఇస్తూ వరద ”ప్రతి పాదాంతం లోను క్రియ వచ్చేట్లు రాస్తున్నా .అంచేత అంత్యక్రియలు అయింది ”అన్నాడు .శాస్త్రిగారు ”నీ అంత్య క్రియలను ముందుగా నా చేత చదివించునాయనా ”అన్నారట .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.