వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం .

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం )

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

 

 శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది .ఏప్రిల్ వర్షాలు మేలో పూలు రావటానికి బాగా తోడ్పడతాయని భావం .మా అమ్మాయి విజ్జి ఉదయం 6-30 కే డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం లీవ్ పెట్టి ఒంటిగంటకు వచ్చి మమ్మల్ని గోసుకొండ అరుణ ఇంటికి భోజనానికి తీసుకు వెళ్ళింది వీళ్ళ  కమ్యూనిటీలోనే ఆ చివర ఉంటారు .అప్పటికే ‘’మణిద్వీప’’పూజ పూర్తీ చేసి మా కోసం రెడీ గా ఉంది అరుణ ..మణిద్వీపపూజ  ఇప్పటికి 8 వారాలుగా ప్రతి శుక్రవారంచేస్తూ ఆఖరి9 వ వారం ఇవాళ చేసి మాశ్రీమతికి  వాయనం ఇవ్వాలని ఆమె సంకల్పం .దేవుడిగది చాలా బాగా ఉంది అమ్మవారి అలంకారం పూలతో శోభాయ మానంగా ఉంది .లలితా పరమేశ్వరీ అమ్మవారు మణి ద్వీపం లో ఉంటుందని మనకు తెలుసు .మణి ద్వీపేశ్వరి పై అస్తోత్తరం ఉంది అది ప్రతివారం చదివి పూజ చేస్తారు .32 శ్లోకాల మణి ద్వీప వర్ణన స్తోత్రం,మణిద్వీప స్తోత్రం ,పంచ దశీ మంత్రం 40  చరణాల ‘’లలితా చాలీసా ‘’ నిత్య పారాయణ శ్లోకం ,దీప ప్రార్ధన ,లలితా నవ విధ భక్తిమాలిక  భక్తీ నీరాజనం మంగళ హారతి చదివి పూజ పూర్తీ చేస్తారు .మేము ఈ పూజను వినటం ఇదే మొదటి సారి .ఈ విషయాలన్నీ ఉన్న చిన్నపుస్తకాన్ని పెద్ద బాల శిక్ష సంకలన కర్త శ్రీ గాజుల సత్యనారాయణ ప్రచురించారు  అ పుస్తకం మాకు ఇచ్చింది .దాన్ని బట్టే వివరం తెలిసింది .

‘’పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతలు మా ఇంటికి వచ్చారు ‘’అంటూ అరుణ పొంగిపోయింది మా శ్రీమతికి  నాకూ పూజ చేసి నూతన వస్త్రాలు అందజేసి మా శ్రీమతికి వాయనమిచ్చింది . తర్వాత భోజనాలు .మా కోసం కారం ఉప్పు తగ్గించి ప్రత్యేకంగా చేసింది .టమేటా పప్పు వంకాయ కూర ,బీన్స్ కూర కొత్త ఆవకాయ ,చట్నీ పూర్ణపు బూరెలు ,గారెలు పాయసం ,పులిహోర ,కర్నాటక బేడల(పప్పు) చారు అనే రసం పెరుగు మాంగో సలాడ్  లతో కమ్మని భోజనం పెట్టింది .దగ్గర కూర్చుని అన్నీ అడిగి వడ్డించి కొసరి కొసరి తినిపించింది అరుణ    అక్కడ సుమారు 15 మంది ఆడవాళ్ళు కూడా మాతో ఉన్నారు భోజనానికి .గురువారం ఉదయం మా ఇంటికొచ్చిన పద్మ అనే అమ్మాయి  కబుర్లతో జోకులతో మంచి సందడి చేసింది .ఈ బాచ్ ని చూస్తే మా అమ్మాయికి ట్విన్స్ పుట్టినప్పుడు2005 లో  మేము మిచిగాన్ లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న జ్యోతి ప్రీతీ బిందు మొదలైన వారంతా గుర్తుకొచ్చారు .అక్కడ వారానికొకరింట్లో భోజనాలు కబుర్లు సరదాలు పుట్టిన రోజు ,సీమంతం వేడుకలతో కాలం యిట్టె గడిచిపోయింది .అందరం అరుణ ఇంట్లో గ్రూప్ ఫోటో దిగాం ..మా అమ్మాయి అరుణకు చీర జాకెట్ పెట్టింది .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 -30 అయింది .సాయంత్రం స్వామి బ్రహ్మానంద సరస్వతి పై రాశా .రాత్రి యు ట్యూబ్ లో కామెడీ  చూశాం .

 ఈవారం లో ‘’హ్యూమరిస్త్స్ ‘’,బిగ్ జోక్స్ ,బైజాంటిన్ ఎంపైర్ ,ది నాజిహోలో కాస్ట్,చదివాను .దీనిపై రాయానిపిస్తోంది ఇవికాక ది వైకింగ్స్ ఇంట రెస్ట్ గా  ఉంటె చదువుతున్నా ‘’.28 టు యాక్టర్ ప్లేస్ ‘’ డ్రైవింగ్ త్రూసౌది’’మొదలుపెట్టాకాని రుచించలేదు .

  శనివారం మా ఇంట్లో శ్రీ శంకర జయంతి .మా అల్లుడి సంకల్పం అమ్మాయి సహకారం  .ఉదయం 7 గంటలకే ఆవాహనతో ప్రారంభమైంది .రాంకీ తమ్ముడు ఇంకొక ఆయన వచ్చారు . ఉపనిషత్తులు ఆదిత్య హృదయం అరుణం చదివారు .తర్వాత ఒక 10 మంది వచ్చారు మధ్యాహ్నం 12 30 కు  కేసరి ఉప్మా కాఫీ లతో ఫలహారం . తర్వాత నమక చమకాలు .మధ్యాహ్నం 3 కు ఒక 25 మంది అయ్యారు .అప్పటికే రాంకీ వగైరాలు వచ్చారు .ఒకాయన భజగోవిందం పై పది నిమిషాలు మాట్లాడాడు .తరువాత ఆడవాళ్ళు పాటలు పాడారు .మా అమ్మాయి చెప్పే అపర ఘ౦టసాల గారుపూర్వపు  కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాలోని భక్తీ గీతం పాడారు .రాంకీ తమ్ముడిభార్య పద్మశ్రీ త్యాగ రాజక్రుతులు బహుకమ్మగా గానం చేసింది .ఇద్దరు పిల్లలూ బాగా పాడారు గాయత్రి అనే అమ్మాయి కూడా చక్కగా స్వర రాగ యుక్తంగా పాడింది ఈమెను  ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’అన్నాను ..రాంకీ  తమ్ముడు పంచాంగ శ్రవణం చేశారు సరైన హోమ్ వర్క్ చేయనట్లు అనిపించింది .మధ్యమధ్య నేను కొంత చెప్పా .తర్వాత శ్రీ శంకరాచార్యస్వామికి  అస్టోత్తర పూజ జరిగింది. రాంకీ పురోహితునిగా ఉన్నాడు . చివరికి మధ్యప్రదేశ్ లోపుట్టి బొంబాయిలో పెరిగి అమెరికా చేరిన ఒక యోగా మాస్టర్ తేలికైన ఇంగ్లీష్ ,హిందీలలో యోగా గురించి డిమాన్ స్ట్రేషన్  లెసన్ చెప్పాడు అందరూ మెచ్చారు .కేరళ లోని 92 ఏళ్ళ స్త్రీ యోగాసనాలు చాలా  సునాయాసంగా  చేస్తున్న వీడియో క్లిప్పింగ్ చూపించాడు .అందరూ చప్పట్లు చరిచారు .తర్వాత  మహా నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం తో కార్యక్రమం పూర్తి .నాలుగు మాటలు నన్ను మాట్లాడమని రాంకీ అడిగితె ‘’ఇండియాలో మేము మరచిపోతున్న శంకరాచార్య స్వామిని అమెరికాలో గుర్తుంచుకొని మా అమ్మాయి అల్లుడూ శ్రర్దగా ఉదయం 7-30 నుంచి సాయంత్రాం 6-30 వరకు నిర్వహించటం గొప్ప విషయమని వారిద్దరిని అభినందిస్తున్నానని ,కంచి పెద్ద స్వామి శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ‘’మైత్రీ భజతే ‘’అనే సంస్కృత గీతాన్ని రచిస్తే అంతర్జాతీయ సమితి యు యెన్ వో 50 వ వార్షికోత్సవం లో భారత రత్న ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గానం చేసిందని దానికి అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారని,సరస భారతి మార్చి 26 ఉగాది వేడుకలో ‘’వసుధైక కుటుంబం ‘’శీర్షికపై కవి సమ్మేళనం నిర్వ హించిందని దాన్ని పుస్తకంగా తెస్తున్నామని  ,అప్పుడు జ్ఞాపికగా వసుధైక కుటుంబం చిత్రం  పరమాచార్య ఫోటో, వారి మైత్రీ గీతం లో చివరిభాగం తో జ్ఞాపిక తయారు చేయించి అందరికీ ఇచ్చామని చెప్పి జ్ఞాపిక చూపించా . పద్మశ్రీ వెంటనే ఆ గీతాన్ని బహు శ్రావ్యంగా పాడింది. అందరూ అభినందించారు .కార్యక్రమం పూర్తి ఆయే సమయానికి 45  మందిఉన్నారు పొద్దున్న కొందరు వచ్చి వెళ్ళారు .’’రాలీ’’లో భగవద్రామానుజ జయంతి చేస్తున్నారని అక్కడ సినీ ,టీవీ గాయని శ్రీమతి ఉష సంగీత విభావరి ఉందని చాలా మంది ఇక్కడికి రాలేదు లేక పోతే మరో 15 మంది వచ్చి ఉండేవాళ్ళు ఉష అమెరికాలోనే ఉండి ప్రోగ్రాములున్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తుంది .ఉష అక్క  ఉదయమే వచ్చి కాసేపు ఉండి వెళ్ళింది .

  తర్వాత మా అమ్మాయి అందరికీ చేసిన  వంట కాలతో  కమ్మని విందు భోజనం-టమేటా పప్పు వంకాయ చిక్కుడు కాయ కూర ,ఆవకాయ  పూరీలు ,బంగాళాదుంప కూరా ,కేసరి ,బూరెలు గారెలు ,పెరుగు పచ్చడి సాంబారు ,పెరుగన్నం .అందరూ సంతృప్తిగా భోజనం చేశారు .5 ఏళ్ళక్రితం పరిచయమైనా మంజుల .ప్రక్కి అరుణ చక్కగా పలకరించారు .

  భోజనాలతర్వాతగాయత్రి తో అందరూ అడిగి పాటలు పాడించాం .ప్రక్కి వాళ్ళమ్మాయి అబ్బాయి కూడా పాడారు . గాయత్రికి ‘’షార్లెట్ కౌమార కోకిల ‘’అని సరదాగా బిరుదు ఇచ్చి ఆ పేరేరే రాసి శతకత్రయం సరసభారతి ఉగాది జ్ఞాపిక అంద జేశాం ..ఆ అమ్మాయి తలిదండ్రులు బాగాశ్రర్ధ తీసుకొని సంగీతం నేర్పిస్తుంటే ఆ అమ్మాయి సార్ధకం చేస్తోంది ఇక్కడ పాడిన వారందరి తలిదండ్రులను అభి నందిస్తున్నాను .సరదాగా నేను  ఇద్దరు అరుణలలో ఒకమ్మాయిని ఇంటిపేరుతో ప్రక్కి అరుణ అని రెండో అమ్మాయి మాటల్లో చాలాసార్లు ‘’కరెక్ట్ అంకుల్ మీరుకరేక్ట్ ఆంటీ ‘’అనటం మూలంగా ఆ అమ్మాయిని ‘’కరెక్ట్ అరుణ ‘’అన్నా.అందరూ పగలబడినవ్వారు అరుణ ‘’కరెక్ట్ అంకుల్ ‘’అంది సరదాగా .ఇదంతా పూర్తి  అయేసరికి రాత్రి 9 అయింది .పవన్ భార్య రాదఉదయం నుంచి విజ్జికి చాలా సహాయంగా ఉంది .చివరికి అన్నీ సర్ది పవన్ దంపతులు మా ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు .

పవన్ రెండో కూతురు మా రెండవ బావ గారు  వేలూరి వివేకానంద్ గారి చెల్లెలు శాంతమ్మగారు లాగా నవ్వుతూ నవ్విస్తూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పుతూ అచ్చంగా ఆవిడ పోలికలే వచ్చినట్లు అనిపించింది .ఈ విషయం హైదరాబాద్ వెళ్ళినప్పుడు శాంతమ్మగారితో చెప్పాలని మా ఆవిడ తహ తహ లాడుతోంది .తాత గారి చెల్లెలి అంటే మేనత్త పోలిక  అన్నమాట .

కొస ముక్క -తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధననాడు ఆయనకూ శివునికి అభిషేకం చేస్తారు .శంకర జయంతి నాడు కూడా శంకరా చార్యులు అపర శంకరులే కనుక ఆయనకు మహన్యాసం తో అభిషేకం చేస్తే బాగుంటుంది .వ్యాస మహర్షి వేద వాజ్మయాన్ని పురాణ ఇతిహాసాలను మనకు వరం గా ప్రసాదించారు .శ్రీ శంకర భగవత్పాదులు ప్రస్తానత్రయానికి వ్యాఖ్యానం రాసి జ్ఞానానికి  మార్గ౦ సుగమం చేశారు. ఇది ఒక స్థాయి ఉన్నవారికే పనికొస్తుంది .సామాన్యులు తరించటానికి మార్గం వారు రాసిన స్తోత్రాలు ,శివానంద సౌందర్య లహరి మొదలైనవి అందులో వేద వేదాంత సారం అంతా నిక్షిప్తం చేశారు . సంస్కృతాన్ని సామాన్య జనం స్థాయికి స్తోత్రాల ద్వారాతెచ్చి తరుణోపాయం చూపారు .కనుక జయంతి నాడు కనీసం రెండు గంటలు శివానంద సౌందర్య లహరి ,స్తోత్రాలను విడివిడిగా సామూహికంగా గానం చేస్తేనే ఆయన ఋణం తీరుతుంది .అప్పుడే గొప్ప అనుభూతి కలుగుతుంది. సౌందర్య లహరి అందరికీ అందుబాటు లో ఉండటం కష్టం .శివానంద లహరి చాలా సులభం అందరూ నేర్చుకొని పాడచ్చు అలాగే స్తోత్రాలు కూడా సామూహికంగా పాడాలి .అప్పుడే దాని ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది .

   మరో విషయం శంకర జయంతినాడు సంస్కృతం లో కృషి చేసినవారికి కాని ,స్తోత్ర గానం చేసినవారికి కాని సంగీత నృత్యాలలో  రాణించినవారికి కాని ప్రోత్సాహక బహుమతులు అందిస్తే సార్ధకమౌతుంది ..దేశం కాని దేశం లో చేస్తున్నప్పుడు ఈ రెండూ బాగా రాణిస్తాయి .కనుక ఈ సారి శంకర జయంతికి ఈ ఆలోచన చేస్తే బాగుంటుందని నా భావన .ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పవచ్చు .దిగితే కానీ లోతు తెలియదని నాకు తెలుసు .అందుకే సరసభారతి గాయత్రికి శ్రీ సువర్చలాన్జనేయ శతక త్రయం, ఉగాది జ్ఞాపిక అందజేసి మార్గం చూపించింది .

  రాత్రి భారవి తీసిన శంకరాచార్య తెలుగు సినిమా చూశాం యు ట్యూబ్ లో .పైత్యం ఎక్కువ శ్రీహరిని మోహన బాబు ను ,సుమన్ ను  భరణి నిఎక్కడపడితే  అక్కడ చూపించి పలచన చేశాడు . హు౦దాతనం  ఉత్క్రు స్టతలోపించి చౌకబారు సినిమాగా గ్రాఫిక్ మయం గా మారింది. నిద్ర పోయే సరికి రాత్రి 12 .

30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి .వీలు ప్రకారం శనివారం చేశారు మా వాళ్ళు . నేను ఉదయం 6 -30 కే లేచి కాలకృత్యాలు పూర్తీ చేసి ఉదయం 7-30 కు పూజలో కూర్చున్నా .మామూలు నిత్య పూజ చేసి   శ౦కరా చార్య అస్తోత్తరం  శివ అస్తోత్తరం  సహస్రం ,లలితా సహస్రం దక్షిణా మూర్తి దత్త్రేయ అస్తోత్తరాలతో పూజ చేసి శివానంద లహరి సౌందర్య లహరి చదివి ,మహాన్యాసం తో నమక చమకాలు దశ శాంతి  సామ్రాజ్య పట్టాభి షేకం  తో ఏక రుద్రం చేసి(చదివి) , బిల్వ అష్టోత్తర౦  తో పూర్తీ చేసే సరికి ఉదయం 10-30 అయింది అంటే మూడు  గంటలు  పట్టింది ధన్యుడను అనుకొన్నా ..తర్వాత టిఫిన్ .

               వీక్లీ అమెరికా 4 మొదలు పెట్టి కొంత  రాశా .కాలి ఫోర్నియా నుంచి మేనల్లుడు శాస్త్రి భార్య విజయ లక్ష్మి  కొడుకు కృష్ణ ఫోన్ చేసి మాట్లాడారు . కృష్ణకు  సాన్  ఫ్రాసిస్కో లో మంచి కొత్త ఉద్యోగం వచ్చిందని మే 15 చేరుతాడని ,విజయలక్ష్మి అమ్మగారు మే 7 న కొడుకుతో ఇండియా నుండి అమెరికా వస్తున్నారని ,మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండేట్లు రమ్మని కోరారు .సరే అన్నాం. మా ప్రయాణం మా చేతుల్లో లేదుకదా .

  ఈ వారమంతా బాహుబలి హడావిడి ఇండియాలో టికెట్ వెయ్యి రూపాయలు అమెరికాలో 42 డాలర్లని అంటున్నారు .అయినా కొని చూస్తూనే ఉన్నారట .80 కోట్లు కూడా ఉండని తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి 450కోట్ల స్థాయికి తెచ్చి బాలీ వుడ్ ను మించి అతనిపై  నమ్మకం తో నిర్మాతలు అంత డబ్బూ పెట్టు  బడి పెట్టారు . వాళ్ళ పంట పండినదని కాసులవర్షం కురుస్తోందని మీడియా కోడై కూస్తోంది .రాజమౌళి తీసిన్న మగ ధీరకాని బాహు బలి 1 కాని నేను చూడలేదు ఆ సీన్లు ఏదైనా చానల్ లో వచ్చిన స్కిప్ చేస్తా . సినిమా హృదయాన్ని కదిలించాలి కాని గ్రాఫిక్స్ కాదు

  విజ్జి  ఉదయం 9-30 కు తెలుగు క్లాసు నిర్వహించి మధ్యాహ్నం 12 కు ఆఫీస్ కు వెళ్ళింది .రాత్రి 8 కి వచ్చింది .కాసేపు ఫ్యాన్ బకెట్ చూశా .అయ్యర్ సంస్కృత శ౦కరాచార్య కాసేపు చూశా .1970 దశకం లో తమిళ నుంచో మలయాళం నుంచో తెలుగులోకి డబ్బింగ్ అయిన  ఆది శంకరాచార్య సినిమా బాగా ఆడింది అందరికీ నచ్చింది అద్భుతమ నిపించింది అది యెక్కదైనా దొరుకుతుందేమోనని యు ట్యూబ్ లో వెతికితే కనపడలేదు .ఇక ఈ వారానికి స్వస్తి .

               మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 – కాంప్ -షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.