నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2
డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు ప్రసాద్ ,తెలుగుమేస్టర్ శర్మ హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా రామమోహనరావు గారి జమానాలోవాళ్ళు . వాళ్ళదగ్గర అతివినయంగా ఉండటమే తప్ప బోధనలో మెళకువలు లేవు .మరో తమాషా నేను గమనించింది సాయంకాలానికి రామ మోహన రావు గారబ్బాయి దగ్గరకు స్కూల్ లోని అన్నివిషయాలూ చేరేసే వాళ్ళు .వీళ్ళనే గడప పూజారులు అనేవాళ్ళం గుమాస్తా ఉయ్యూరయ్య నిఖార్సైన మనిషి .లెక్క అంతా పకడ్బందీ స్కూల్ అకౌంట్ డబ్బులు కూడా అతని చేతికే ఇచ్చాను .ఎక్కడా తేడా రాదు .అంత నమ్మకం .గొల్లలు అతనే రిటైరయ్యాక మేడూరు సర్పంచ్ గా ఎన్నికై మంచి పనులు చేశాడు . అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఇరుకు గదిలో నేనున్నట్లు ఫీలయ్యాను . నాకు స్వతంత్రం గా ఉండి అన్నిపనులు సమర్ధంగా చేయటం ఇప్పటిదాకా అలవాటు .ఇక్కడ సాంస్కృతిక విషయాలేమిటో టీచర్లకూ పిల్లలకూ తెలియదు .ఇంతవరకు అల్లాంటివి ఇక్కడ జరగ లేదని చెప్పేవారు . అయినా నా పద్ధతిలో వీటిని అధిగమించి నడపాలని నిర్ణయానికొచ్చాను .ముందుగా ప్రతిరెండవ బుధవారం మిగతా చోట్ల చేసినట్లే సాయంత్రం చివరి పిరియడ్ లో వాటిని క్లాస్ టీచర్ల చేత నిర్వహించే పధ్ధతి మొదలుపెట్టాను వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు గా వీటిని చేయించాను సైన్స్ క్లబ్ అంటే కూడా వీళ్లకు తెలీదు సైన్స్ మేష్టర్లతో దాన్ని ఏర్పాటు చేయించి సైన్స్ రూమ్ లో నెలకొక ప్రోగ్రామ్ చేయించాను .ప్రసిద్ధులైన సైన్టిస్ట్ ల జీవితాలను వారి పరిశోధనలను ఒకరిద్దరు విద్యార్థుల చేత సైన్స్ టీచర్ పర్య వేక్షణలో తయారు చేయించి మాట్లాడించాను .ఇవి విద్యార్థులలో బాగా క్లిక్ అయి నాపై విశ్వాసం కలిగించాయి ..అంతా బాగానే ఉంది అనిపించిన సమయం లో ఒక తమాషా జరిగింది .
ఒక రోజు ఉయ్యూరు నుంచి బస్ లో వచ్చి నడిచి స్కూల్ కు వస్తుండగా రోడ్డుమీద చాక్ పీసు తో నాకూ హిందీ పంతులమ్మకు అక్రమ సంబంధం అంటగట్టే రాతలు కనిపించాయి రోడ్డుకు అడ్డంగా రెండుమూడు చోట్ల ఉన్నాయి చదివి కామ్ గా స్కూల్ లోకి వెళ్లి నా పని నేను చేసుకుంటున్నాను . అసెంబ్లీ అయింది క్లాసులు మొదలయ్యాయి .ఒక గంట తర్వాత డ్రిల్ మేస్టర్ సుబ్బారావు గారు నా దగ్గర కొచ్చి ”హెడ్ మాస్టారూ !రోడ్డు మీద ఎలా ఛండాలంగా రాశారో చూశారా ?”అని అడిగాడు .నేను ”ఏమో నండీ తలవంచుకుని నేను రోజూ లాగానే వచ్చాను .ఏమీ చూడలేదు .అని చిన్న అబద్ధం ఆడాను. అసలు విషయం చెప్పాడు . అప్పుడు నేను ”నేను మగాడిని .సర్దుకు పోవచ్చు ఆమె లేడీ టీచర్ ఆమె చదివివుంటే యెంత బాధ పడుతుందో ఆలోచించండి . మా ఇద్దరి ప్రవర్తన పై స్టాఫ్ లోకాని పిల్లలలో కానీ ఊరిజనం లో ఏమాత్రం అనుమానం ఉందని భావి0చినా నేను ఈక్షణమే సెలవు పెట్టి వెళ్ళిపోతాను .ప్రెసిడెంట్ గారికి చెప్పి ఆయనకు ఇష్టమైన వారిని వేయించుకోమని చెప్పండి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా బాధ లేదు ”అన్నాను ..వెంటనే ”కాదు సార్ !ఇలాంటివి ఉపేక్షిస్తే చాలాప్రమాదం .మీకయ్యింది .రేపు వేరెవరికైనా అవచ్చు ఆడపిల్లలపై రాయచ్చు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ”అన్నాడు .”బడి డిసిప్లిన్ చూసేది మీరు కనుక మీరూ లెక్కలమేస్టారు స్టాఫ్ సెక్రెటరీ ,శర్మగారు కలిసి కూర్చుని చర్చించి అసలు రాసిన వాళ్ళు ఎవరో ఏ ఉద్దేశ్యం తో రాశారో కనుక్కుని తేల్చండి వాళ్ళ పేర్లు నాకు ఇస్తే క్రమ శిక్షణ చర్య తీసుకుంటాను .ముందుగా హిందీ పంతులమ్మగారికి మనందరి తరఫున సారీ చెప్పి తర్వాత పనిలో దిగండి ”అన్నాను . మంచి ఆలోచన అని అని ఆపనిలో దిగి దోషుల్ని తేల్చి నాదగ్గరకు పంపించి వాళ్ళూ వచ్చారు . ఇద్దరో ముగ్గురో ఉన్నారు పిల్లలు .వాళ్ళు ఎవరో తమతో చేయించారని నిజం చెప్పారు .కూపీ లాగితే అక్కడ రిటైర్ అయిన హిందీ పంతులు ట్యూషన్ కింగ్ పని అని తేలింది .అందరిదగ్గర క్షమాపణ ఉత్తరాలు రాయించి ,తలిదండ్రులను పిలిపించి ఇది మొదటి తప్పుకానుక వదిలేస్తున్నాను కానీ మా స్టాఫ్ కి ఇది చాలదు ఇంకా మీకుకఠిన మైన పనిష్ మెంట్ ఇవ్వాలంటున్నారు అని బెదిరించి తలో నాలుగు డ్రిల్ మిస్టర్ చేత పీకించి వదిలేశా .ఉడత ఊపులు ఊపుదామని ప్రయత్నం .స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిన విషయం వివరించి హిందీపంతులమ్మగారికి అందరం క్షమాపణ చెప్పాం .ఆమె కన్నీరు మున్నీరు గా ఏడ్చింది .మేమిద్దరం బ్రాహ్మణులం అవటం రోజూ బస్ లో ఉయ్యూరు నుంచి రావటం ,ఆమె మా ఇంటిదగ్గరే రాజా గారి కోటలోని ఇంట్లో అద్దెకుండటం ఇంతటి సీన్ ను క్రియేట్ చేయించింది .మళ్ళీ ఇలాంటి దేదీ నేనుండగా జరగలేదు .అందరం మర్చిపోయి మాపనులు మేము చేసుకు పోతున్నాం .సర్పంచ్ కూడా వచ్చి జరిగిన దానికి బాధపడి పునరావృత్తం కాకుండా జాగ్రత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు . మళ్లీ గాడిలో పడింది స్కూల్ .
సోషల్ మేష్టారు మస్తాన్ గార్ని పిలిచి ”మాక్ పార్లమెంట్ ”జరిపించమన్నాను .ఆయన అలాంటి మాట తానింతవరకు వినలేదని చెప్పాడు .అప్పుడు దానికి కావలసిన అన్ని విషయాలూ నేనే సేకరించి ఆయనకు ఇచ్చి ఎలా నడపాలో నేర్పించి పిల్లలకు శిక్షణ నిప్పించి నెల రోజుల్లో పిల్లల్ని తయారు చేయించి నిర్వ హింప జేశాను అద్భుతంగా చేశారు పిల్లలు ప్రశ్నోత్తరాలు ,బిల్లు ప్రవేశపెట్టడం చర్చ బిల్ పాస్ చేయించటం అన్నీ పార్లమెంట్ లో జరిగినట్లు జరిపించాను .బ్రహ్మానంద పడ్డారు విద్యార్థులు తలిదండ్రులు మేస్టార్లు .అక్కడ ఒక చరిత్ర సృష్టించాను ..వీటితో నేనేది చెప్పినా చేయటానికి అందరూ సిద్ధమయ్యారు .
మేడూరుకు దగ్గరలోనే ఐలూరు పుణ్య క్షేత్రం ఉంది -.దీన్ని ఉభయ రామ లింగేశ్వర క్షేత్రం అంటారు .ఇక్కడా కృష్ణకు అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా చిలుమూరు లో శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు ఏకకాలం లో కృష్ణానది దానిప్రక్కనే ప్రవహిస్తుంది ఐలూరు కు ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగా స్టాఫ్ ని .అలాంటి వాసనే మాకు తెలీదుఅన్నారు .ఆశ్చర్యం వేసింది .సరే దీన్నీ సాధించాలి అనుకోని ఒక రోజు మధ్యాహ్నం ఉదయం పూట బడి అవగానే పిల్లలని తీసుకు వెళ్లే ఏర్పాటు చేసాం .నది ఒడ్డున కూర్చుని ఏదైనా ఫలహారం తింటే బాగుంటుంది అనిపించి సెక్రెటరీకి ఆ బాధ్యత అప్పగించాను .ఈ వార్త ఊర్లో సంచలం కలిగించి మహిళలు ఒక బృందంగా ఏర్పడి అందరికి కావలసిన పులిహోర తయారు చేయించి పెట్టుకు తినటానికి గిన్నెలు గరిటెలు కాగితాలు మంచి పండిన అరటిపళ్ళు వాళ్ళే సిద్ధం చేసి మాకు ముందే తెలియబరచి రిక్షాలో మాతో పంపించే ఏర్పాటు చేశారు . ఇందులో ఉయ్యూరయ్య పాత్ర బాగా ఉంది మంచి చెయ్యాలనుకొంటే కలిసి వచ్చేవారెప్పుడూ ఉంటారు . అందరం బృందాలుగా క్లాస్ వారీగా వెనక ముందు టీచర్లతో నడక సాగించి ఒక అరగంటా ముప్పావు గంటలో ఐలూరు కృష్ణా నది ఒడ్డుకు చేరి సేద తీరి వెంట తెచ్చినవి పిల్లకు మేష్టర్లకు అందరికీ పంచి సంతృప్తి కలిగించాం .ఇక్కడి దేవాలయ చరిత్రను నేను తెలుగు మేష్టారు అందరికి వివరించాం తర్వాత దేవాలయాన్ని సందర్శించి మళ్ళీ బడికి నడిచి వెళ్లాం . ఈ ఫీల్డ్ ట్రిప్ గొప్ప స్పందన కలిగించింది ఊర్లో . ఏపనికైనా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చారు ..
పిల్లల తో బాడ్ మింటన్ వాలీబాల్ కబాడీ బేస్ బాల్ ఖో ఆటలలో డ్రిల్లు మేష్టర్లు మంచి శిక్షణ ఇచ్చి తయారు చేశారు .ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడించాం గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు పంపించాం .బాడ్మింటన్ లో ప్రయిజు వచ్చిందని జ్ఞాపకం . టీచర్స్ కూడా గేమ్స్ ఆడి పాల్గొన్నాం .బాడ్ మింటన్ లో నేను లెఫ్ట్ ఫ్ర0ట్ .శర్మగారు సెంటర్ .బాక్ .సుబ్బారావు ప్రసాదరావు .వాలీ బాల్ కూడా బాగా ఆడేవాళ్ళం నేను ఈ రెండిటిలో ఎప్పుడు సర్వీస్ చేసిన కనీసం మూడు పాయింట్లయినా వచ్చేవి .జనం ఈలలు చప్పట్లతో ఆభినందించేవారు
స్కూల్ పరీక్షలు మొహమాటం లేకుండా కాపీ కొట్టకుండా చాలా పకడ్బందీ గా నిర్వహించాం దీనికి లెక్కలమేస్టారు ప్రసాద్ సహాయం అద్వితీయం అతనికే కొన్ని నిర్దిష్ట భావాలున్నాయి అందుకే మా ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరింది . ఇన్ని విషయాలు బాగానే ఉన్నా క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశరావు విపరీతమైన తాగు బోతు ,బడిపక్కనే ఇల్లు .గంటకో అరగంటకు ఎవరికీ తెలీకుండా మందుకొట్టి వచ్చేవాడు మాటలు తడ బడేవి కళ్ళు చింత నిప్పులు బక్కపలచగా ఉండేవాడు తోస్తే పడిపోయే రకం .అతన్ని కంట్రోల్ పెట్టటం శక్యం కావటం లేదు .అంతకు పూర్వం హెడ్ మాస్టర్లు కూడా ఏమీ పీక లేక వదిలేశారు .అతని కులమూ ఇబ్బంది కలిగించేది ఏ చర్య తీసుకోవలన్నా .మనమే సర్దుకు పోవటం . మనిషి మంచివాడు పిల్లాడు తొమ్మిది చదువుతున్నాడు చురుకైన వాడు . బెదిరించేవాడిని స్టాఫ్ఆర్దర్ వేస్తానని అది రికార్డ్ అయితే జీవితం జీతం ఖాళీ అని పైవాళ్లకు రాస్తానని హెచ్చరించేవాడిని .చెప్పిన పని చేస్తాడు ఇదొక్కటే లోపం బలహీనత . పామర్రులో సైన్స్ మాస్టర్ గా పని చేస్తుండగా ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు తెగ తాగి వచ్చేవారు .ఒకడు రోడ్డుకడ్డంగా నిలబడి బస్సులు ఆపేవాడు .మరోడుఫుల్ గా మందుకొట్టి తెగవాగేవాడు ఇతను నేనంటే బాగా అభిమాన0గా ఉండేవాడు .సముద్రం ఒడ్డు చినగొల్లపాలెం వాడు .అక్కడ రాజకీయ నాయకుడు ఏటూరి బలరామ మూర్తి ఇతనికి కాపు ఏడు గడ .కనుక చైర్మన్లు కానీ ఇంకెవరూ ఇతని జోలికి వచ్చేవాళ్ళు కాదు మనిషి బంగారం .ఖాళీగా ఉన్నప్పుడల్లా అతని రూమ్ లో కూచునేవాడిని .కాఫీలు ఆరగాఆ రగా తెప్పించేవాడు .భార్యబంగారు తల్లి .మంచి టీచర్ . ఈ ఇద్దరు ”డ్రిల్లులు” మను షులు మంచివాళ్ళే గుణం ”గుడి సేటిది ”టైప్ మేడూరునుంచి పామర్రుకు జంపయ్యాను సారీ . ఉపేక్షతప్ప నాకు క్రాఫ్ట్ మేస్టార్ విషయం లో ఏ ఉపాయము కనిపించలేదు . ఇలాంటి వారిమధ్య పని చేయటం ఎంబరాస్మెంట్ గా ఉంది .తరుణోపాయంకోసం మనసులో అన్వేషిస్తున్నాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
శ్రీ దుర్గాప్రసాద్ గారు, మీ అనుభవాలని క్రోడీకరించి మీరు వ్రాస్తున్న ఈ వివరాలు పూర్వ, ప్రస్తుత, భవిష్యత్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బాగా ఉపయోగపడతాయి. ఎంతో కాలంగా మీరు ఉత్సాహంగా ఎన్నో విషయాల గురించి వ్రాస్తున్నారు, నేను చదువుతూఉన్నా. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ, గురు వైభవం మీద మీ వ్యాసాలూ చాలా బావున్నాయి. పరమేశ్వర కృపతో మీరు మరెన్నో ఏళ్ళు ఈ కృషి కొనసాగించాలని నా ప్రార్థన.