నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103

                 మేడూరు ఉద్యోగం -4
రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట
 వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు . నేనూ చూశాను .రావాల్సి నంత కవళికలు రాలేదని పించింది  నాకు అంతగా నచ్చలేదు . కానీ అంతకంటే సమయం లేదు .వారి కుటుంబ సభ్యులు కూడా పెదవి విరిచారని ఉయ్యూరయ్య ఉవాచ .ఇక చేసేదేమీ లేదు . ఆవిష్కరణ జూన్ చివరివారం లో ఆయన మరణించిన నాడు అని నిర్ణయించాం . తేదీ సరిగ్గా గుర్తులేదు .నేనూ స్టాఫ్ సెక్రెటరీ మరో ఇద్దరం కలిసి రుద్రపాక వెళ్లి జిల్లా పరిషత్ చై ర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారిని కలిసి ఆహ్వానించాం తప్పక వస్తామన్నారు .సంతోషంగా తిరిగి వచ్చి ఏర్పాట్ల పై దృష్టిపెట్టాం .విగ్రహానికి సుమారు 6 అడుగుల ఎత్తు  దిమ్మ కట్టించటం ,దానికి నగిషీల పని అంతా  ఉయ్యూరయ్య చూశాడు . పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చిన జ్ఞాపకం . తెలిసిన వారందరికీ ఆహ్వానపత్రాలు పంపాము మండలం లోని అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వెళ్లాయి ఇక్కడ పని చేసి రిటరైన వారికి  వేరొక చోట పని చేస్తున్నవారికి ఎవరినీ వదిలిపెట్టకుండా పూర్వపు టీచర్స్ అటెండెన్స్ ఆధారం గా పంపాము .దాదాపు నాలుగైదు వందల మంది వస్తారని లెక్కవేశాము సర్పంచులకు మండల ప్రెసిడెంట్ లకు కూడా వెళ్లాయి ఆహ్వానాలు . వీరందరికి సాయంత్రం రాగానే టిఫిన్ టీ  ఇవ్వటం రాత్రికి డిన్నర్ కూడా ఏర్పాటు చేసిన గుర్తు . స్కూల్ అలంకరణ అంతా డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్ చూశాడు వచ్చిన వారిని ఆహ్వానించటానికి నేనూ లెక్కల ప్రసాద్ డ్రిల్ మాష్టర్  సుబ్బారావు,లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ ,ఉయ్యూరయ్య శంకరరావు లు చూసాం కమిటీలను ఏర్పరచి బాధ్యతలు అప్పగించాను ఎవరూ ఇందులో నా ప్రమేయం లేదే అనుకోకూడదని నా తలంపు .అందరూ ఇన్వాల్వ్ అయేట్లు ఏర్పాట్లు చేసాం
  ఆవిష్కరణ రోజు రానే వచ్చింది .చైర్మన్ గారు సమయానికే వచ్చారు . ఆహ్వానితులందరూ వచ్చారు రామమోహనరావు గారబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు .వారి బాబాయి కెసిపి రైతు పేరు గుర్తులేదు  ఆయనకూడా అతిధులు వేదిక నెక్కించాం వారి కుటుంబ సభ్యులనూ సగౌరవంగా ఇంటికి వెళ్లి అంతకు ముందే ఆహ్వానించాం .అందరి రాకతో విద్యార్థినీ విద్యార్థులతో ప్రాంగణం కళకళ లాడింది .విగ్రహానికి శాటిన్ కలర్ వస్త్రం తో ఆచ్చాదన (ముసుగు )విషయం డ్రాయింగ్ మాస్టారు తెరపాటు చేశాడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరింప జేయటం నా  సర్వీస్ లో ఇదే మొదటిది .ముసుగు వేయాలని డ్రాయింగ్ మాస్టర్ చెప్పేదాకా నాకు తెలియదు . అనేక మంది రిటైరైన హెడ్ మాస్టర్లు మేస్టార్లు ఆయన పై ఉన్న అభిమానంతో వచ్చారు .అందరినీ ఆహ్వానించి అల్పాహారాలు అందజేశాక సభ ప్రారంభించాం .
   చైర్మన్ గారి తో శ్రీ యలమంచిలి రామమోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించామని కోరగా వచ్చి హర్ష ధ్వానాల మధ్య  ఆవిష్కరించారు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి హారతి పట్టారు కుటుంబ సభ్యులు కూడా వారి వెనుక నిలబడ్డారు . .నా జీవితం లో ఒక గొప్ప ఘనకార్యం చేశానని సంబర పడ్డాను
 చైర్మన్ కోటేశ్వరరావు గారు రామ మోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం తన అ దృష్టం దీనికి పూనుకున్న పాఠ  శాల హెడ్ మాస్టారు అయన నాయకత్వం లో పని చేసిన ఉపాధ్యాయ బృందం అభినందనీయులు  అంటూ  తమకూ, రామ మోహనరావు గారికీ ఉన్న సుదీర్ఘ పరిచయాన్ని ఆయన నిస్వార్ధ జీవిత విశేషాలను ,త్యాగాలను పాఠశాల అభి వృద్ధికి గ్రామాభి వృద్ధికి వారి కృషినీ ప్రశంసిస్తూ వారి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు , తరువాత నేను మాట్లాడుతూ ఆవిష్కరణ పూర్వా పరాలను స్టాఫ్ సహకారాన్ని గ్రామస్తుల అభిమానుల వదాన్యతను తెలియ జేశాను ఇతర ప్రముఖులు రిటైర్ హెడ్ మాస్టర్లు అభిమాన రాజకీయ నాయకులు తక్కువ సమయం లో వారి గొప్పతనాన్ని వివరించారు . సభ తర్వాత అతిధులకు భోజనాలు ఏర్పాటు జరిగింది .చైర్మన్ గారితో సహా అందరూ భోజనం చేసి వెళ్లినట్లు జ్ఞాపకం . ఆవిష్కరణ గ్రాండ్ సక్సెస్ .
   మేడూరు గ్రామకరణం శ్రీ కిండి  శేషగిరిరావు గారు నాకు ఇక్కడ పరిచయమైనా నాటి నుంచి అన్ని విషయాలలో సహాయకారిగా ఉన్నారు ఆయన ఉయ్యూరు షబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దస్తావేజులు  రాసేవారుగా ప్రసిద్ధులు .ఊళ్ళో బ్రాహ్మణ సంఘ నాయకులు . ని చేతిలో డబ్బుతో  మంచిపనులు చాలా ఖర్చు చేసేవారు స్కూల్ ఫంక్షన్ లకు పిలిస్తే ఏదో ఒక రూపం లో విద్యార్థులకు సాయం చేసేవారు .పెద్ద ఆస్తిపరులేమీ కాదు ఎప్పుడూ తెల్ల ఖద్దరుపైజమా లాల్చీ తో   నల్లగా పొడుగ్గా భారీగా నుదుట యెర్ర కుంకుమ బొట్టుతో  నవ్వుతూ కనిపించేవారు .కార్తీకమాసం లో మామిడి తోటలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయమని స్టాఫ్ సెక్రెటరీకి తెలుగు శర్మగారికీ చెప్పగా బాగా ఏర్పాటు చేశారు .ఒక ఆదివారం జరిపాము .తర్వాత శేషగిరిరావు గారు ఏర్పాటు చేసిదానికి  బ్రాహ్మణ మేష్టర్లను ఊరిలోని బ్రాహ్మణులను పిలిచి వనసమారాధన చేస్తే ఉయ్యూరునుంచి వచ్చి పాల్గొన్నా .కానీ వీళ్లంతా పేకాటతో కాలక్షేపం చేయటం నాకు అస్సలు నచ్చలేదు . ఉయ్యూరులో మేము  విష్ణ్వాలయం లో జరిపే బ్రాహ్మణ సంఘ వన భోజనానికి శేషగిరిరావు గారు కూడా వచ్చేవారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో పని చేసేవాడు . రావుగారి భార్య మండలం లో టీచర్ .ఇల్లు పురాతన  మట్టి గోడల మండువా పెంకుటిల్లు .మా ఇంట్లోలాగానే ఎప్పుడు కూలి పోతుందో అనిపించేది .ఒకటి రెండుసార్లు  వీరింట భోజనం చేశా మంచి ఆతిధ్యమిచ్చేవారు .. నేను బదిలీ అయి ఇక్కడినుంచి వెళ్ళిపోయినా ప్రతికార్తీక వనభోజనానికి పిలిచేవారు రెండువందల రూపాయలు ఇచ్చేవాడిని . మహా పెద్దమనిషి .మర్యాదస్తులు .అంతకంటే మేడూరులో నాకెవరూ పరిచయం కాలేదు .రిటరైన ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ ప్రతి నవంబర్ లో ట్రెజరీలో ఇవ్వాలి వాళ్ళు బతికి ఉన్నట్లు గెజిటెడ్ ఆఫిసర్ సర్టిఫై చేయాలి అందుకని చాలామంది వచ్చి సంతకం పెట్టించుకునేవారు  శేషగిరిరావుగారి అమ్మాయి తమ్ముదురామారావు గారి కూతురు ఉయ్యూరు కాలేజీలో చదివేవారు .ఆతర్వాత పదేళ్లకు రామారావుగారు చనిపోయారు
      విగ్రహావిష్కరణ అవగానే బాధ్యతలు అప్పగించిన వారిని లెక్కలు పూర్తి చేసి రెడీగా ఉంచమని  స్టాఫ్ మీటింగ్ లో లెక్కలు చెప్పి అందరి సంతకాలు తీసుకోవాలని చెప్పాను .ఇదిగో అంటూ ఆలస్యం చేశారు .డబ్బు విషయం లో నేను అలసత్వాన్ని సహించను .కనుక ఒక రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆలోపల లెక్క అప్పగించాలని ఒత్తిడి తెచ్చాను .వాళ్లకు మింగుడు పడలేదు .లెక్కలెందుకండి అందరికీ తెలిసిందేకదా అన్నారు అదేమీ కుదరదు అణా  పైసలతో సహా యెంత వసూలైంది దేనికి ఎంత ఖర్చయింది పూర్తి వివరాలు చెప్పాల్సిందే అన్నాను .కొందరు గొణిగారు .ఎవరేమనుకున్నా నా పద్ధతి నాదే  దీనికి తిరుగు లేదన్నాను .అనుకొన్న రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో లెక్కలు రాయించి అందరికి చెప్పించాను . ఒకటి రెండు వేలు మిగిలినాజ్ఞాపకం .దీన్నేమి చేయాలని అడిగాను అందరూ కామన్  గుడ్ ఫండ్ కు జమ చేయమని సలహా చెప్పారు .అలాగే చేసాం అందరితో  జమాఖర్చుల పై సంతకాలు పెట్టించాను .ఇది అగ్రనాయకులు నచ్చలేదని భోగట్టా .నేను దేనికీ భయపడను .ఈ ఊరుకాకపోతే మరో ఊరు .నా కాళ్ళు ఎప్పుడూ చెప్పుల్లోనే ఉంటాయి .
  అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి ఇదివరకు రాసిందే  ఇది . నేను దీనికి ముందు మైలవరం దగ్గర చిలుకూరివారి గూడెం (పుల్లూరు )హై స్కూల్ లో పని చేస్తుండగా అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ వి హనుమంతరావు గారి బామ్మర్ది హైదరాబాద్ లో భారత్ డైనమిక్ లిమిటెడ్ లో  కెమిస్ట్ గా పని చేస్తున్న మా తమ్ముడు మోహన్ కు అటెండర్ గా ఉండేవాడు .అతడు ఎప్పుడూ మా వాడిని సార్ మీ కేదైనా సహాయం కా వాలంటే మా బావ తో చేయిస్తాననేవాడట .ఒకసారి మావాడు నీకు ట్రాన్స్ ఫర్ కావాలంటే చెప్పు హనుమంతరావు తో చేయిస్తానన్నాడు .పుల్లూరు నాకు బాగా నచ్చింది ఎన్నో మంచిపనులు అక్కడ చేశాను .కనుక అక్కడినుంచికదలా లని లేదుకమిటీ వాళ్లకూ నేనంటే  గౌరవం  ఆదరణ  ఉన్నాయి  కానీ మా వాడు అయిదారు సార్లు చెప్పాక సరే అన్నా .అనటం మావాడు వాడి అటెండర్ కు చెప్పటం వాడు హనుమంతరావు చెవిలో ఊదటం జరిగిపోయి నాకు తెలియ కుండానే హనుమంతరావు ఇచ్చిన బదిలీ రికమండేషన్ లెటర్ ఉయ్యూరు మా ఇంటికి రావటం జరిగి నేను దాన్నుచ్చుకుని చర్మన్ గారిని కలవటం .ఉయ్యూరుకాని చుట్టుపక్కలకాని వేయమని అడగటం ఉయ్యూరు తప్ప ఎక్కడా పని చేయరా మీరు అనినవ్వటం మేడూరుకు వారం లోపలే ట్రాన్స్ఫర్ అవటం జరిగిపోయాయి .కనుక ఒకరకంగా ఇష్టం తో వచ్చిన వాడినే .కానీ ముందే చెప్పినట్లు సంకుచితత్వం ఉన్న చోట ఉండలేను . అందుకని విగ్రహావిష్కరణ ఉదంతం మనసును కలత చెందించింది .సమయం కోసం ఎదురు చూస్తున్నాను
ఇక్కడ మరో విషయమూ చెప్పాలి .నా ముందు మేడూరులో పని చేసిన హెడ్ మాస్టర్ జి ఎస్ యెన్ చౌదరి నాకు బీఎడ్ ట్రెయింగ్ మేట్ హాస్టల్ మేట్ కూడా రాజమండ్రిలో .అంతకు ముందు అతని స్థానం లో నేను మానికొండకు సైన్స్ మాస్టర్ గా వెళ్ళా .ఘన చరిత్ర ఉన్నవాడు .  స్కూల్ ఫండ్స్ లో ఎక్యుములేటెడ్ ఫండ్ అని ఉంటుంది .దాని జోలికి ఎవరూ వెళ్లరాదని ఫండమెంటల్ రూల్ ఉంది .ఒక వేళ అందులో అత్యవసర సమయాల్లో తీసి ఖర్చు పెట్టాలంటే రిజల్యూ షన్  రాసి దాని కమిటీతో సంతకం చేయించి హెడ్ మాస్టర్ జిల్లాపరిషత్ కు పంపి అక్కడ ఆమోదం పొంది ఆర్డర్ వస్తేనే తీసి ఖర్చుపెట్టి మళ్ళీ దాన్ని నింపాలి .కానీ మా చౌదరి ఇవేమీ లెక్క చేయకుండా మొత్తం నాకిపారేశాడు  అదేదో సినిమాలో జూ ఏంటి ఆర్ బ్రహ్మానందం తో రమాప్రభ నయన తారలతో ”మా గురువుగారిని  కంప్లీట్ గా నాకి పారేశారన్నమాట ”అన్నట్లు నాకి పారేశాడు ..నేను వచ్చాక చూస్తే ఖాళీ .ఏమయ్యా ఉయ్యూరయ్యా ఇదేంటి అంటే ఆయన మీలాగా లెక్కలు మాతో రాయించేవాడుకాదు ఏమి జరిగిందో జరుగుతోందో మాకే  కాదు బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు అని నెమ్మదిగా చెప్పాడు .కమిటీ వాళ్ళనూ లెక్క చేసేవాడుకాడట . కమ్మవారుగా ”మూసుకు ”కూర్చున్నారు రహస్యం బయట పడకూడదని .నా దగ్గర అప్పుడుడప్పుడు సర్పంచ్ వెళ్లగక్కేవాడు అతి రహస్యం బట్టబయలు అని సామెత .తర్వాత ఇక్కడినుంచి పునాదిపాడువెళ్లి అక్కడా అంతా  నాకేసి చివరికి సస్పెండయ్యి ,ఏదో కిరికిరి చేసి బయటపడ్డాడు . ఇక్కడ నన్ను అందరూ ఆదరిస్తున్నా ఏదో  కూపం లో ఉన్నట్లు అనిపించేది కనుక నేను ఇక్కడ నుంచి అంతా మంచిగా ఉన్నప్పుడే చల్లగా జారుకొంటే మంచిది అని నిర్ణయించుకున్నాను . వెయిటింగ్ ఫర్  ఆపార్ట్యూ నిటి .
     కానీ ఇక్కడ పిల్లలకు సైకిళ్ళు పార్కింగ్ చేయటానికి చోటు లేదు .ఎక్కువమంది చుట్టూ ప్రక్కల నుంచి సైకిళ్ళ మీద వస్తారు . దీనికి పరిష్కారం ఆలోచించాలనిపించింది స్టాఫ్ మీటింగ్ లో చెప్పాను .మంచి ఆలోచన అన్నారు మరి ఫండ్స్ ఎలా ?ఉయ్యూరు కె సిపి ,రోటరీ క్లబ్ లు ఇలాంటి కార్య క్రమాలు చేయటం లో ముందు ఉంది . నేను పెనమకూరు లో సైన్స్ మేస్టారుగా ఉన్నప్పుడు హెడ్మాస్టర్ తో చెప్పి అక్కడ బోరింగ్ వేసి రక్షిత నీటి సరఫరా అవసరం చెప్పి ,కె సిపి వాళ్ళ మా ,గ్రామస్తుల సహకారం తో చేయగలిగాము అది జ్ఞాపకమొచ్చి కెసిపి తొబాగా టచ్ ఉన్న రామమోహనరావు గారి తమ్ముడిని సంప్రదించి ,అందరం కలిసి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారినీ మిగిలిన అధికారులను కలిసి మా ప్రపోజల్ ముందుపెట్టాం . వెంటనే అంగీకరించి వాళ్ళే ఖర్చు పెట్టి హెడ్మాస్టర్ గది  వెనకాల పడమటిభాగం లో గోడ వెంబడి రేకుల షెడ్ వేసి మా కోరిక తీర్చి వచ్చి ఆవిష్కరణ చేశారు . ఇదొక మైలురాయి నాకు ..అయినా వెళ్లాలనే కోరిక తగ్గలేదు
   సశేషం
      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.