గణిత వేదాంతం
గణితానికి వేదాంతానికి సంబంధం ఏమిటి ?బోడిగుండుకు మోకాళ్ళకు ముడి పెట్టటం లాగా ఉందనుకొంటున్నారా .దిగితేకాని లోతు తెలియదు .లెక్కలలో 1 సంఖ్య ఉంది .మిగిలిన అన్ని సంఖ్యలు దీని గుణకాలే .అలాగే ఉన్నది ఒకే ఒక్క శుద్ధ సత్యం .ఆ శుద్ధ సత్యం యొక్క గుణకాలే విశ్వం లో విభిన్న నామాలు, రూపాలు ..జీవితం సమ భుజ త్రిభుజం .శరీర కోణం ,శరీరాంతర్గత స్థితి కోణాలు ,బాహ్యప్రపంచ కోణం కలిస్తే సమాన కోణ సమానభుజాలున్న జీవితం యొక్క సమబాహు త్రిభుజం ..సంఖ్య లన్నీ ఒక స్థిర బిందువునుంచి వచ్చినట్లే ,ఆ బిందువును కొలవలేనట్లే ,ఈ విశ్వమంతా గణింప శక్యం కాని శూన్యం నంచి ఏర్పడింది .జీవితం ఒక చక్రం .దీన్ని సున్నా లేక వృత్తం తో పోల్చవచ్చు. వృత్తం అంటే బిందువు యొక్క పరి వ్యాప్తి అన్నమాట .అయితే జీవితం లో రెండు బిందువులున్నాయి ఇవే పుట్టుక ,మరణం .ఈ రెండు బిందువులను కలిపే సరళ రేఖయే జీవితం.జీవితం యొక్క తెలియని భాగమంతా అనంతం రేఖ .
ముందు ఒక సున్నా పెట్టి దానితరువాత 1 అంకె వేస్తే 01 అవుతుంది .ఒకటి వేసి దానితర్వాత సున్నా పెడితే 10 అవుతుంది .సున్నాలు పెంచిన కొద్దీ విలువ పెరుగుతుంది 100 1000 వగైరా ..ముందు ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా ఆ సున్నాకు విలువే లేదు .సృష్టిలో అన్ని వస్తువులు సున్నాలే .ఏక పరబ్రహ్మ సత్య భావన లేకపోతే ఈ వస్తువులకు దేనికీ విలువ లేదు .ఆ ఏక సత్య పరబ్రహ్మ ఎరుక కలిగితే జీవితం విలువైనది అవుతుంది .లేకపోతే భారమవుతోంది .
కనుక గణితం ధనాత్మక సైన్స్ .అన్ని సైన్స్ లకు మూలాధారం .ఇది సాంఖ్య వేదాంతం పై ఆధార పడిందే ..వేదాంతాలలో అతి ప్రాచీనమైనది సాంఖ్య 0 . ఇది శరీరాన్ని అందలి లోపలి విషయాలను మనసు చేసే క్రియలను తెలుసుకోవటానికి ఉపయోగ పడుతుంది యోగ అనేది ఆచరణాత్మక విజ్ఞానం (ప్రాక్టికల్ సైన్స్ ).ఇది అతీంద్రియ చేతన(సూపర్ కాన్షస్ ) కలిగిస్తుంది .సందేహ నివృత్తికి సాంఖ్య యోగం తప్పని సరి .
ఈ విషయాలన్నీ స్వామి రామాకు ”చక్ర వర్తి ”అనే గణిత శాస్త్ర వేత్త అయిన స్వామి బోదించాడు .ఆయన గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ .చక్రవర్తీస్ మాధేమాటిక్స్ ”గ్రంథ రచయిత..తర్వాత జీవితం లో సారం లేదని గ్రహించి సన్యసించి హిమాలయ గుహలలో తపస్సులో గడిపాడు .ఆయనకు మరొక గొప్ప శక్తి ఉంది అదే ”తదేక దృష్టి ”. దేనిమీద అయినా ఆయన దృష్టిపెడితే దానిప్రభావం గొప్పగా ఉంటుంది .దీనిని ”త్రాటకం ”అంటారు ..ఇంగ్లీష్ లో గేజింగ్ అంటారు .ఈ దృష్టి బయట వాటిపై కేంద్రీకరిస్తే దాన్ని త్రాటకం అంటారు అదే దృష్టిని అంతర్ముఖ చేస్తే దాన్ని ఏకాగ్రత అంటారు ..కేంద్రీక రింపబడిన మనసుకు అత్యంత శక్తి లభిస్తుంది .కొందరు దృష్టిని భృమధ్యమం లో కేంద్రీకరిస్తారు .శివుడు మూడవ కంటి దృష్టిని కేంద్రీకరిస్తేనే మన్మధుడు కాలి బూడిదయ్యాడు .భూతద్ద0 తో సూర్యకాంతిని కేంద్రీకరిస్తే కాగితం ఫిలిం దూది మొదలైనవి తగలబడటం మనకు అనుభవమే ..
స్వామిరామా దీన్ని ప్రత్యక్షం గా చూపించమనికోరాడు .సరేనని దగ్గరలో ఉన్న కోర్టులో ఏ ఖైదీ అయినా అనవసరంగా అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్నాడేమో చూసి వచ్చి చెప్పమన్నాడు .సరే అని వెళ్లి అక్కడి లాయర్లద్వారా పాపం ఒకతను ఏ నేర మూ చేయకుండా కోర్టులో విచారణకు గురౌతున్నాడని తెలుసుకొని స్వామి చక్రవర్తి కి చెప్పాడు .అప్పుడు చక్రవర్తి ”ఆ ఖైదీ విడుదలవుతాడు .జడ్జి చెప్పే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నీకు ప్రత్యక్షరం తెలియ జేస్తాను కాగితం మీద రాసి టైప్ చేసి ఎవరికీ తెలియ కుండా జాగ్రత్త చేయి .జడ్జిమెంట్ రాగానే నేను చెప్పింది జడ్జి చెప్పింది పోల్చి చూడు ”అని చెప్పటం రామా రాయటం టైప్ చేయటం అందులో మూడు టైప్ తప్పులు దొర్లటం జరిగాయి .రెండుమూడు రోజులతర్వాత జడ్జి తీర్పు చెప్పాడు దాని కాపీ తెప్పించి రామా తానూ టైప్ చేసిన దానితో పోల్చి చూశాడు అక్షరం పొల్లు పోకుండా తానూ చేసిన మూడు తప్పులతో సహా జడ్జి మెంట్ కాపీ ఉంది . ఆశ్చర్యపోయి చక్రవరి త్రాటక విద్య అమోఘమైనది గ్రహించాడు .అంటే ఎక్కడో సుదూరం లో ఉండికూడా మనసును కేంద్రీకరించి అవతలి వారిపై ప్రభావం చూపించవచ్చు అని అర్ధమయింది .అప్పుడు రామా ”స్వామీ !మీరు ఈ ప్రపంచ గతిని మార్చగలరా ?”అని అడిగాడు .దానికాయన ”అది నా పనికాదు అతడు అన్యాయంగా కేసులో ఇరుక్కున్నాడనే జాలితో నా దృష్టిని జడ్జి మనసుపై కేంద్రీకరించి ప్రభావం చూసి జడ్జి మెంట్ అలా వచ్చేట్లు చేయగలిగాను ..మనిషి నిగ్రహం తో ఉంటె ఎక్కడున్నా ,యెంత దూరం లో ఉన్నా అవతలివారి మనసుపై ప్రభావం కలిగించవచ్చు అని నీకు తెలియ జేయటానికే ఇలా చేశాను ”అన్నాడు
చక్రవర్తి యోగి సంఖ్యామానం లోని సున్నా నుంచి 100 వరకు ప్రతి అంకెను ఉపనిషత్ లోని ఒక్కొక్క శ్లోకం తో జత చేసి వ్యాఖ్యానించి చెప్పేవాడు .వాటిలోని వేదాంత భావనలను విశదీకరించేవాడు
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .. ..