గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

141-నట సూత్ర రాసిన జంటకవులు  -శిలానిన్  కృశస్వ (క్రీ.పూ 600)

.క్రీ పూ. 6 వ శతాబ్దానికి చెందిన ‘’శిలాలినన్ ‘’,’’క్రిశ స్వ’’లు నటుల గురించి ,వారి విధులగురించి ‘’నట సూత్ర ‘’అనే గ్రంధం రాశారని పాణిని పేర్కొన్నాడు .కానీ అది లభ్యంకాలేదు .పాణిని ఆ గ్రంధం లో ఉన్న విషయాలను కానీ గ్రంథకర్తల జీవిత విశేషాలు కానీ ఏమీ చెప్పక పోవటం దురదృష్టం.

142-నాట్య శాస్త్ర ప్రామాణికులు -భరతుని పుత్రశతం (క్రీ .పూ. 500 )

నాట్య శాస్త్ర కర్త భరతముని స్వర్గం నుంచి భూమికి రూపక కళను  తెచ్చిన ఋషి అని ,ఆ కళను తన పుత్ర శతం అయినకొహల , దత్తి లక అస్మకుట్ట ,నఖ కుట్ట మొదలైన వారికి బోధించాడని ఐతిహ్యం వీరిలో పేర్కొనబడిన పేరున్నవారు దానిలో ప్రవీణులని ప్రామాణికులని తెలుస్తోంది .వీరు గ్రంధాలు రాశారని అలభ్యమని అంటారు

143-కవిత్వ నియమాలు నిర్దేశించిన -మేధావి ,రుద్ర ,రామశరణు

భామహునికంటే ముందే కవిత్వ నియమాలను చెప్పినవారు మేధావి ,రుద్రా ,రామ శరణు అంటారు .వీరికాలం కానీ రచనలు కానీ తెలియదు

144-శబర భాష్యకర్త -శబరుడు (క్రీ శ 200)

పూర్వ మీమాంస ,ఉత్తర మీమాంస అనే రెండు మార్గాలున్నాయి వాటికి గ్రంధాలున్నాయి మీమాంస అంటే గౌరవమైన ఆలోచన .సత్యాన్ని ,జ్ఞానాన్ని తెలుసుకొనే ఉత్తమ ఆలోచనా మార్గం . వేదాలలో మొదటిభాగాలను పూర్వ  మీమాంస రెండవ భాగాలను ఉత్తర మీమాంస తెలియ జేస్తాయి పూర్వ మీమాంసకు కర్మ మీమాంస అని ఉత్తర మీమాంసకు  బ్రహ్మ  మీమాంస అని అంటారు  ,క్లుప్తంగా పూర్వ మీమాంసకు మీమాంస అని ఉత్తర మీమాంసకు వేదాంతం అని పిలుస్తారు ..మీమాంస సూత్రాలను రాసినవాడు జైమిని మహర్షి .ఇది 12 అధ్యాయాలతో 2500 సూత్రాలతో ఉంటుంది .అర్ధమవటం కష్టం. కనుక భాష్యం అవసరం .మీమాంస పై చాలామంది భాష్యాలు రాసినా కాలగర్భం లో కలిసిపోయాయి .లభించిన మొట్టమొదటి భాష్యం శబర భాష్యం .దీన్ని శబర స్వామి రాశాడు .ఇదే తర్వాత వచ్చిన అన్ని భాష్యాలకు ఆధారమైంది .కుమారుల భట్టు ,ప్రభాకరుడు శబర భాష్యానికి వ్యాఖ్యానాలు రాశారు .మండ న మిశ్రుడు కుమారుల భట్టు ను అనుసరించాడు . భట్టుకూడా దీనిపై వ్యాఖ రాశాడు కానీ ఆది శంకరాచార్యుల చేతిలో ఓటమిపాలై సురేశ్వరాచార్యులై దీన్ని వదిలేశాడు .

145-సాహిత్యకారులు మూలసేన ,సర్వ సేన ,ప్రవర సేనులు -క్రీ శ 600 )

దండి ఉదాహరించిన సాహిత్యకారులలో సర్వ సేన ,ప్రవర సేనులున్నారు ప్రవర సేనుని  ప్రాకృత కావ్యం సేతుబంధం ప్రసిద్ధమైనది .కాళిదాసుతో సమానమైన ప్రతిభ ప్రదర్శించాడు .దీని వ్యాఖ్యాత 16 వ శతాబ్దికి చెందిన రామ దాస భూపతి బాగా మెచ్చాడు .ఇది 15 అష్వకాలలో తో 1291 శ్లోకాల కావ్యం .ఈ కవి రెండవ ప్రవర సేన మహారాజని 410-440 మధ్య రాజ్యమేలాడని అతనికవిత్వ ప్రతిభ శ్రేష్టతరమనే భానుడు దండి కూడా మెచ్చారని అంటారు .

146 -దండికే సమాధానం చెప్పిన -విజ్జిక (క్రీ శ 600)

దండి చెప్పిన సాహిత్యకారులు జాబితాలో కన్నడ దేశ సంస్కృత కవయిత్రి విజ్జిక లేక విజ్జి అనే విదుషీమణి ఉంది ..భావోద్వేగ  రచన లెన్నో చేసింది . బహుశా ఆమె శరీర ఛాయ నలుపు అవ వ చ్చు .ద0డికి సమాధానంగా చెప్పినట్లు ఒక శ్లోకం ప్రచారం లో ఉంది -’’నీలోత్పల దళ శ్యామాం విజ్జాకామ్ మామ జా నతా – వృద్ధై వ దండి నా ప్రోక్తం సర్వ శుక్లా సరస్వతీ ‘’

దండి తనకావ్యం లో సరస్వతీదేవిని శ్వేత  వర్ణం కలదిగా వర్ణించాడు .తాను సరస్వతీ దేవి అవతారమని భావించే విజ్జికకు ఇది నచ్చలేదు నల్లకలువ దళాలవలె నల్లగా ఉన్న సరస్వతీ స్వరూపమైన విజ్జికను యెరుగకుండా దండి సరస్వతి ని తెలుపు వర్ణంగలదాని నిగా వర్ణించాడు అన్నది .విజ్జికయే సరస్వతి అని తెలిస్తే అలా వర్ణించేవాడుకాదు అని భావం -’’ఆచార్య దణ్డినో వాచమాచా నామృత సంపదాం -వికాసో వేధసః పరన్యా విలాపం మణి  దర్పకం  ‘’అంటే మృత వాక్కుల దండి వాక్కు యొక్క తేజస్సు అద్దం  లో మెరిసిన సరస్వతీ దేవి యొక్క ఆభరణాల సోయగమే

147 -ఇద్దరు వామనులు (క్రీ. శ . 700 మరియు 779-813)

పాణిని వ్రాసిన సంస్కృత వ్యాకరణానికి’’కాశిక ‘’పేరుతొ  వ్యాఖ్యానం రాసిన  వామనుడు క్రీ శ  700 కాలం వాడు . రాజశేఖరుడు ,అభినవ గుప్తుడు మరొక వామనుడిని  ప్రస్తావించారు  క్రీ శ779-813 మధ్యకాలం లో కాశ్మీరాన్ని పాలించిన జయప్డుని మంత్రి వామనుడు అనే వాడున్నాడు అయితే ఈ వామనుడి కాశిక రాశాడనటానికి .ఆధారం లేదు . అలంకార శాస్త్రం రాసిన వామనుడు ,పాణినీయం కు కాశిక వ్యాఖ్య రాసిన వామనుడు ఒక్కరు కాదు అని తెలుసుకోవాలి . 7 వ శతాబ్ది కి ప్రారంభం లో .

 హుయాన్ త్సాంగ్ భారత దేశ సందర్శనం ముందే ‘’కాశిక ‘’వ్రాయబడింది

148 -రాజ శేఖరుని పూర్వీకులైన కవులు (క్రీ. శ 900)

    9 వశతాబ్దపు రాజశేఖరుని పూర్వీకులు అకాల జాలాద ,శూరానంద ,తరళ  ,కవిరాజ అనే నలుగురికి తనపూర్వీకులుగా ,కవులుగా పేర్కొన్నాడు .కొన్ని సంస్కృత సంకలనాలలో వారు కొన్ని చాటుపద్యాలు రాసినట్లు ఉంది .వీరు జబల్  పూర్ దగ్గర ఉన్న తివార్ అనే త్రిపుర ను పాలించిన కాలచూరి రాజులకొలువులో ఉండి  ఉండవచ్చు .

149 -శైవ శాస్త్ర నిష్ణాతుడు -అత్రిగుప్తుడు (క్రీశ 720 )

  ప్రముఖ ఆలంకారికుడు అభినవ గుప్తుని పూర్వీకులలో ‘’అత్రి గుప్తుడు ‘’అతి ప్రాచీనుడు ..-730-740 ప్రాంతం లో కనౌజ్ ను పాలించిన యశోవర్మ కాలం లో గంగా యమునాల మధ్య ప్రాంతమైన అంతర్వేది లో ఆయన ఉండేవాడు . అన్ని విద్యలు తెలిసిన పండితుడుగా ,ముఖ్యంగా శైవ శాస్త్రాలలో నిష్ణాతుడుగా అత్రిగుప్తునికి ప్రఖ్యాతి ఉంది .721 -765కకాలం లో కాశ్మీర్ ను పాలించిన లలితాదిత్యుడు అత్రిగుప్తుని పాండిత్యాన్ని విని తెలుసుకొని ,తన ఆస్థాన పండితుని చేసి గౌరవించాలని భావించాడు .యశోవర్మను జయించాక తనతో కాశ్మీరానికి రమ్మని అర్థిస్తే  . ఇలా  వెళ్ళాడు.ఇలా అత్రిగుప్తుని కుటుంబం కన్యా కుబ్జ0  నుంచి కాశ్మీర్ కు వెళ్ళింది .రెండువందల ఏళ్ళ తరవాత శైవాచార్యుడైన అభినవ గుప్తుడు వీరి వంశం లో జన్మించాడు

150 -అభినవ గుప్తుని గురు ప్రముఖులు  (960)

 శైవాచార్య అభినవ గుప్తుని తండ్రి నరసింహ గుప్తుని వద్ద వ్యాకరణం ,వామనాధుని వద్ద ద్వైత తంత్రాలు ,భూతి రాజా వద్ద బ్రహ్మ విద్య ,భూతి రాజు కుమారుని వద్ద ద్వైతాద్వైత సిద్ధాంతం ,లక్షణ గుప్తునిదగ్గర క్రమ ,త్రిక పద్ధతులు ,ఇందురాజా వద్దాధ్వని ,భట్ట తౌత వద్దనాటక కళ ,శంభునాధుని వద్ద కుల సిద్ధాంతం అభ్యసించిన జీవన్ముక్తుడు

151 -రసాను భూతి వివరించిన -శ్రీ శంకుకుడు (850)

అభినవ గుప్తునికి ముందే రస విషయాన్ని వివరించినవారిలో భట్ట లల్లటుడు ,శ్రీశంకుకుడు ,భట్ట నాయకుడు ఉన్నారు .  వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తన రస సిద్ధాంతాన్ని అభినవ గుప్తుడు ప్రతిపాదించాడు .లక్ష్యం తో కూడిన కధా  సంవిధానం ,నాయకుడు ,అభినయానికి సంబంధించిన మార్పులు ,నాటక ప్రదర్శనలో చూసేవారికి కలిగే రసాను భూతి,ఎలా కలుగుతుందో చెప్పాడు .అనుమాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .శిక్షణ ద్వారా విభానుభావాలను అభినయించి సభికునిలో పాతజ్ఞాపకాలను జ్ఞప్తికి తేవచ్చు కానీ ప్రధాన రసాన్ని ప్రదర్శించి చూపలేము .ప్రధానరసం గమ్యం .మిగిలినవి గమకాలు ..ఇతని సిద్ధాంతాలలో అసంగత విషయాలను తెలుసుకొని మార్పు చేసి తనదైన రస సిద్ధాంతం చెప్పాడు అభినవ గుప్తుడు .

152 -ఈశ్వర ప్రజ్ఞాభిజ్ఞ కారిక కర్త -ఉత్పలాచార్యుడు(900).

ఈశ్వర ప్రత్యభిజ్న కారిక రాసిన ఉత్పలాచార్యుడు అయిదు అలౌకిక తత్వాలు శివ ,శక్తి సదాశివ ,ఈశ్వర ,విద్య ,అయిదు ఆత్మాశ్రియస్థితులు ,-కళ  ,విద్య ,రాగనియతి ,కాల ,వేదాంతం గుర్తించిన మాయ ,సాంఖ్యులు ప్రవచించినపురుషుని నుంచి  పృథ్వి వరకు గల 25 తత్వాలు మొత్తం 36 తత్వాలతో కూడిన ది ఈ సృష్టి అని చెప్పాడు .అభినవ గుప్తుడు 37 వ దైన ‘’అమత్తర తత్త్వం ‘’ప్రతిపాదించి ఇదే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని చెప్పాడు  .

153 -మమ్మట కుటుంబ కవులు (1100 )

  కావ్య ప్రకాశిక ర్రాసిన మమ్మటుని కుటుంబం కావ్య కుటుంబానికి చెందినదే .మమ్మటుని తండ్రి జైయట ,తమ్ముళ్లు కైయట ,ఉచట లు వేదాలకు వ్యాకరణ శాస్త్రానికి యేన లేని సేవ చేసిన  కాశ్మీరీయులని . .  వీరికాలానికి 500 ఏళ్ళతరువాతివాడైన భీమసేనుడనే కవి చెప్పాడు కైయటుడు  మహా భాష్యానికి ,ఊచటుడుశుక్ల యజుర్వేద సంహిత కు వ్యాఖ్యానాలు రాశారు . తమ్ముళ్లకు అన్నగారు మ. మ్మటుడే గురువు ..ఊచటుని రచనల వ్రాత ప్రతులలో గద్య లో ముగింపు పద్యం లో తండ్రిపేరు ‘’వజ్రటుడు ‘’అని ఉంది .తాను ఉజ్జయినిలో భోజుని ఆస్థానం లో ఉన్నకాలం లోనే వ్యాఖ్యానం రాసినట్లు చివరిపద్యం లో ఉంది .మమ్మటుడు భోజరాజుకంటే పెద్దవాడే కాక సమా కాలికుడుకూడా .

154 -మమ్మట కావ్య ప్రకాశిక లో కొంత భాగం రాసిన -అల్లట లేక అలక (1100)

  మమ్మటుడు రాసిన కావ్య ప్రకాశిక లో వృత్తి మాత్రమే రాశాడని కొందరు,కొందరు మమ్మటుడు ‘’పరికార ‘’ వరకే రాశాడని మిగతా దాన్ని అల్లటుడో లేక అలకుడో రాశాడని అంటారు

155-అలంకార సర్వస్వ కర్త సముద్ర బంధుడు (1070)

కుంతకుని తర్వాతకాలం 1100 కు చెందిన సముద్ర బంధుడు ‘’అలంకార సర్వస్వము ‘’రాశాడు .సంస్కృత అలంకార శాస్త్రం లో అయిదు భిన్న సంప్రదాయాలున్నట్లు చెప్పాడు అవి అలంకార ,గుణ ,కవి వ్యాపార ,భోజకత్వ వ్యంగ్యాలు .సముద్ర బంధుడు మూడవదైన ఫణి తీ  వైచితర్యా నికి సంబంధించిన కవితాకలాపం కావ్యానికి ఉండే విశిష్ట గుణంగా వక్రోక్తి జీవితకారుడు కుంత కుడుగుర్తించాడని చెప్పాడు .

 ..

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.