గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

170-సంక్షేప శారీరక కర్త -శ్రీ సర్వఙ్ఞత్మానేంద్ర సరస్వతి (407 బీసీ -367 బీసీ )

కంచికామ కోటి పీఠాధిపతి 3 వ జగద్గురువు శ్రీ సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి   శంకర భాష్యం పై వ్యాఖ్య రాశారు .దీనినే’’ సంక్షిప్త  శారీరకం’’ అంటారు . 1267 సరళ భావ గర్భిత శ్లోకాలల్తో ఇది విరాజిల్లింది వీరు పీఠాధిపతి అవటం తమాషాగా జరిగింది .శ్రీ శంకర భగవత్పా దులు దేశం లోని అనేక పండితులతోఅద్వైత  వాదం చేసి ఓడించి ఆ విజయం తో  దక్షిణ మోక్షభూమి కంచికి   వచ్చారు .వారి విజయాన్ని విన్న తమిళనాడు వారంతా చూడాలని కంచికి వచ్చారు .బ్రహ్మదేశం నుంచి చాలామంది వేద శాస్త్ర వేత్తలు వారితో దేవ భేద మూర్తి భేద మొదలైన విషయాలపై వారితో వాదించటానికి వచ్చారు  వారిని అద్వైత భావ పరంపరతతో నిరుత్తరులను చేశారు .సర్వజ్ఞ పీఠం అధిరోహించారు అక్కడకు వచ్చినవారిలో  7 ఏళ్ళ బాలుడు వారిని ఆకర్షించాడు .అతనిలోని బ్రహ్మ తేజస్సును గుర్తించి అతనిని సురేశ్వరాచార్యుల తర్వాత ఉత్తర పీఠాధిపతి చేయ సంకల్పించి తలిదండ్రులకు వర్తమానం పంపారు.  వాళ్ళు వచ్చి విషయం తెలుసుకొని పరమానందం తో తమ అంగీకారం తెలిపారు .శ్రీ శంకరులు ఆబాలునికి సన్యాసం దీక్ష నిచ్చి సర్వజ్ఞాత్మ అనే దీక్షానామమిచ్చి సురేశ్వరాచార్యులకు తీర్చి దిద్దామని బాధ్యత అప్పగించారు .సురేశ్వరుల తర్వాత కామకోటి పీఠాధిపత్యం వహించి చాలాకాలం ఉన్నారు .వీరు ‘’సర్వజ్ఞ విలాస ‘’అనే కావ్య పరిశోధన గ్రంధం కూడా రాశారు

171-పాదుకా శతక కర్త -శ్రీ సత్య  బోదేంద్ర  సరస్వతి(బిసి 367-268 )

కంచికామ కోటి పీఠ 4 వ జగద్గురువులు శ్రీ సత్య బోదేంద్ర సరస్వతి చేర దేశం లో ఫలినీశఅనే పూర్వాశ్రమ నామ దారి .’’తల్లినేశ శర్మ ‘’తనయుడు సాంఖ్య  బౌద్ధ జైనులలను వాదం లో ఓడించి అద్వైత మత  వ్యాప్తి చేశారు .వీరు శంకర భాష్యంపై ‘’పాదక శత ‘’రాశారు .

172-చంద్రిక కర్త -శ్రీ జ్ఞానానందేంద్ర సరస్వతి (బిసి 268-205 )

కామకోటి అయిదవ జగద్గురువులు శ్రీ జ్ఞానా నందేంద్ర సరస్వతి పూర్వనామం జ్ఞానోత్తమ .ద్రావిడ బ్రాహ్మణుడైన నాగేశ కుమారుడు .సురేశ్వరాచార్యుల ‘’నైష్కర్మ సిద్ధి ‘’కి ‘’చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశారు .ఇందులో సత్యబోధ సర్వజ్ఞాత్మ గురువుల ప్రస్తుతి ఉంది ప్రొఫెసర్ హిరణయ్య సంపాదకత్వం లో దీన్ని మైసూర్ యూనివర్సిటీ ప్రచురించింది . కంచి సర్వజ్ఞాశ్రమానికి వీరు వెలుగులద్దారని భావిస్తారు .

173-సురేశ్వర వార్తికా  వ్యాఖ్యాన కర్త -శ్రీ ఆనంద జ్ఞానేంద్ర సరస్వతి (బీసీ 124-55 )

చేర దేశానికి చెందిన సూర్యనారాయణ మఖి కుమారుడు చిన్నయ్య పూర్వాశ్రమనామం .గౌరీదేవి పరమ భక్తులు అమ్మ కరుణాకటాక్షాలతో అద్భుత పాండిత్యం అబ్బింది .శంకర భాష్యం సురేశ్వర వార్తికలపై భాష్యాలు రాశారు .శ్రీశైలం లో ముక్తి పొందారు

174-భక్తి మార్గ ప్రబోధకులు -శ్రీ కృపాశంకరేంద్ర సరస్వతి (క్రీశ 28-69)

గాంగేశో పాధ్యాయ పూర్వనామం.ఆంద్ర బ్రాహ్మణులు .మనసా వాచా కర్మణా అతిపవిత్ర జీవితం గడిపి 9 వ   కామకోటి జగద్గురువులయ్యారు .శంకరాచార్యుల మార్గం లో అడుగులు వేస్తూ షణ్మత పూజా విధానాన్ని వ్యాప్తి చెందించారు .గణపతి స్కంద శివ విష్ణు అంబికా సూర్య దేవతా పూజా విధానాలు రచించి భవిష్యత్ శైవ నయనార్లకు మార్గ దర్శి అయ్యారు .శైవ ,వైష్ణవ మతాలు శ్రీ శంకర ,శ్రీ కృపా చార్యులకు సదా కృతజనులై ఉండాలి .వింధ్య ప్రాంతం లో ముక్తి పొందారు .

175-అభినవ శంకరులు -శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి (క్రీశ 788-840 )

ఆదిశంకరాచార్యుల తర్వాత అంతటి కీర్తి పొందినవారు శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి .వీరి జీవిత చరిత్రను ‘’శం కర విజయం ‘’లో వాక్పతి భట్టు వివరించాడు .తండ్రి చిదంబరానికి చెందిన విశ్వజిత్ . 5వ ఏటనే ఉపనయనం జరిగి,వేదాధ్యయనం ప్రారంభించి సర్వశాస్త్రాలలో అద్వితీయుడనిపించారు .వేదాంత చర్చలంటే మహా ఇష్టం .తర్కం లో వాక్పతి భట్టును ఓడించారు .38 వ కామకోటి జగద్గురువయ్యారు కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం అధిరోహించారు .హిమాలయాలలోని ఆత్రేయ పర్వతాలలో ఉన్న దత్తాత్రేయ గుహలో తపస్సు చేసి అక్కడే జీవన్ముక్తులయ్యారు .

176-కధా  సరిత్సాగర కర్త -శ్రీ సాంద్రా నంద బోదేంద్ర సరస్వతి  1061-1098 )

46 వ కామకోటి జగద్గురువులు శ్రీ సాంద్రా నంద బోదేంద్ర సరస్వతి పూర్వనామ0 సోమేంద్ర.  తండ్రి సూర్య .గురువుపరమశివేంద్ర సరస్వతి తో విస్తుతంగా దేశాటనం చేశారు ‘’కదా సరిత్సాగరం ‘’రచించారు .దీనికి కానుకగా ధారానగర రాజు భోజుడు ముత్యాలపల్లకి కానుకగా అందజేశాడు .అరుణాచల క్షేత్రం లో మోక్షం పొందారు .

177-హేమ చంద్రాచార్యను ఓడించిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -4(1098-1166 )

 4 వ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి 47 వ కామకోటి జగద్గురువు .మరొక పేరు చంద్ర చూడ .కుండీని నది తీర ప్రాంతవాసి.తండ్రి సుఖ దేవుడు .ద్రావిడ బ్రాహ్మణుడు పూర్వాశ్రమనామం శ్రీ కంఠుడు  వాద  దిగ్విజయ యాత్ర చేస్తూ విద్యాలోల కుమారపాల ఆస్థానకవి హేమచంద్రా చార్య అనే కుమారపాల చరిత్ర రాసిన కవి , జైన పండితుని వాదం లో ఓడించారు. కృష్ణ మిశ్రకవి శ్రీక0ఠ  చరిత్ర రాస్తే మంఖకవి ఆరాధించాడు  హేమ చంద్రునిపై వాద  విజయాన్ని జయదేవుడు ‘’భక్తకల్ప లతిక’’లో గొప్పగా వర్ణించాడు .కాశ్మీర్ రాజు జయసింహుడు తానూ ఈ జగద్గురువు శిష్యుడనని వినయంగా చెప్పుకున్నాడు

178-బ్రహ్మ విద్యాభరణం  కర్త -శ్రీ అద్వైతానంద బో దేంద్ర సరస్వతి(1166-1200 )

48 వ కామకోటి జగద్గురువులు శ్రీ అద్వైతానంద బో దేంద్ర సరస్వతి బ్రహ్మ విద్యాభరణం,శాంతి వివరణ ,గురు ప్రదీపం గ్రంధాలు రాశారు .నైషధం ఖండనఖండ కావ్య రచయిత హర్షుని ,అభినవ గుప్తుని వాదం లో జయించారు .చిదంబరం లో ముక్తిపొందారు .

179-ఉపనిషత్తులపై ‘’దీపిక’’లు రచించిన – శ్రీ శంకరానందేశ్వర సరస్వతి -(1385-14 17 )

కామకోటి 52 వ పీఠాధిపతి శ్రీ శంకరానందేశ్వర సరస్వతి మధ్యార్జున లేక తీరు విడై మరుదూర్ లో బాలచంద్ర కుమారునిగా మహేశ నామ ధేయం తో జన్మించారు .పీఠాధిపతి కాకముందు గురువు భారతీ తీర్ధతో హిమాలయ పర్యటన చేశారు .కర్ణాటకలో 8 కొత్త అద్వైత మఠాలను  స్థాపించిన ఘనకీర్తి వారిది ..ఈశ  ,కేన ,ప్రశ్న ,బృహదారణ్యక ఉపనిషత్తులకు ‘’దీపిక’’ వ్యాఖ్యానం రచించారు ..ఆత్మ పూర్ణ ‘’ను ,భగవద్గీత వ్యాఖ్యానాన్ని రచించారు .వైష్ణవ ,మాద్వులు అద్వైతం పై చేసిన వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా ఖండించి ఎదురు నిలిచారు .కంచిలో ముక్తి పొందారు .

180-శివ గీతకు వ్యాఖ్యానం రాసిన -శ్రీ పరమ శివేంద్ర సరస్వతి -(1040-1061 )

పంపాతీరగ్రామంలో పరమశివ కుమారుడు పూర్వాశ్రమంలో శివరామకృష్ణ శ్రీ పరమ శివేంద్ర సరస్వతిగా 57 వ కామకోటి జగద్గురువయ్యారు .గురురత్నమాలిక రాసిన మహా బ్రహ్మజ్ఞాని సదాశివ బ్రహ్మేంద్రునికి గురువు  .ఈ గురువు ఘనత త ఎలాంటిది అంటే సదాశివ బ్రహ్మేంద్రులు వీరి పాదుకలను ఎప్పుడూ శిరస్సుపై పెట్టుకొని తిరిగేవాడు .బ్రహ్మజ్ఞానం తో అవధూతగా మారిన సదాశివేంద్రుని చూసి కొందరు ఆయన కు పిచ్చిపట్టిందని ప్రచారం చేసి గురువు శ్రీ పరమ శివేంద్ర కు తెలిపారు .ఆయన ‘’నాకు కూడా అలా అవ్వాలని ఉంది .ఆయనను తాకితే చాలు అది లభిస్తుంది ‘’అన్నారట .అంతటి గొప్ప అవధూత సదాశివ బ్రహ్మేంద్రులు .అంతగొప్ప సంస్కారి వీరు . వీరి గొప్పతనాన్ని సదాశివ బ్రహ్మేంద్రులు ‘’ఆత్మ విద్యా విలాసం ‘’లో అభి వర్ణించాడు .వీరు శివగీతకు చక్కని వ్యాఖ్యానం రాశారు . తంజావూర్ వద్ద స్వే తారణ్యం  లో మోక్షం పొందారు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.