గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
194-అగస్త్య గీత కర్త -అగస్త్య మహర్షి
అగస్త్యుడు అనగానే సప్తసాగరాలను పుడిసిలి పట్టిన మహానుభావుడు ‘’ఛుకులీకృత సకల పాదోది పయస్కుడైన ముని ‘’గా ,వాతాపి ఇల్వల మర్దనుడిగా ,వింధ్యాద్రి గర్వమడచిన లోకోద్ధారకునిగా రావణ సంహారానికి శ్రీరామునికి ‘’ఆదిత్య హృదయం ‘’బోధించిన మంత్ర వేత్తగా ,ఇంద్రుని భార్య శచీదేవిని పొందటానికి పల్లకీలో కూర్చుని సప్తర్షులను బోయీలుగా చేసుకొని వెళ్లిన గర్విష్టి నహుషుని కాలితో తన్ని త్రిశంకు స్వర్గం లో పడేసి గర్వమణచిన వానినిగా మహా పతివ్రతలోపాముద్రా వల్లభునిగా అందరికి తెలుసు .వేదకాలపు మహర్షి అగస్త్యుడు .ఆయన ఋగ్వేదంలో 1-65-నుండి 1-191మంత్ర ద్రష్ట .తమిళ వాజ్మయ పిత .తమిళ వ్యాకరణాన్ని ‘’అగస్త్యం ‘’అంటారు అష్ట మహర్షులలో అగస్త్యుడున్నాడు .రామాయణ ,మహా భారతాలలో అగస్త్యుని పాత్ర విశిష్టం .తమిళ శివమ్ లో అగస్త్యుని మొట్టమొదటి సిద్ధుడు గా భావిస్తారు శాక్తేయ ,వైశ్వాలలో ఆయన పేరు తరచుగా వినిపిస్తుంది .అన్ని భారతీయ ప్రాచీన గ్రంధాలలో ,దక్షిణాసియా ఆగ్నేయాసియా హిందూ దేవాలయాలలో ఆయన శిల్పాలు దర్శనమిస్తాయి .11 వ శతాబ్దికి చెందిన జావా భాషా సాహిత్యం లో ఆయన్ను ప్రాచీన గురు ఋషిగా పూజించినట్లు’’అగస్త్య పర్వం ‘’లో ఉంది
అగస్త్య మహర్షి వరాహ పురాణం లోని ‘’అగస్త్య గీత ‘’కర్త .స్కాందపురాణం లో ‘’అగస్త్య సంహిత ‘’ఉన్నది .’’ద్వై ధ నిర్ణయం తంత్ర ‘’లో ఆయన ప్రశస్తి ఉన్నది .ఆగస్త్యునికి ‘’మన ,కుంభజ ,కుమ్భయోని, కలశజ మైత్రావరుణి’’ అనే పేర్లు కూడా ఉన్నాయి .అయన అయోనిజుడైన మహర్షి .వరుణ ,మిత్ర దేవతలు గొప్ప యజ్ఞం చేస్తే ఊర్వశి కనిపిస్తే చాంచల్యం తో ఇంద్రియాన్ని కారిస్తే అది ఒక మట్టి కుండలో పడి అగస్త్య మహర్షి గా ఆవిర్భవించాడని పురాణకధనం .అగస్త్య అంటే అవిసె అనే పేరుంది .అగస్త్య నక్షత్రం ఆకాశం లో దర్శనమిచ్చినప్పుడు అవిసె పువ్వులు తింటే మంచి ఆరోగ్యం కలుగుతుంది .చీకటిలో కాంతి నిచ్చేదే అగస్త్యం
మహారాష్ట్ర లో నాసిక్ వద్ద గోదావరీ తీరాన అగస్త్యాశ్రమ0 ఉంది .అక్కడే అగస్త్యపురి అక్షోలా పట్టణాలున్నాయి .ఉత్తరాఖండ్ లో రుద్ర ప్రయాగ వద్ద అగస్త్యముని తపస్సు చేసిన ప్రదేశం ఆయన అర్చించిన శివలింగం, గుడి ఉన్నాయి .తమిళ్ నాడులో తిరునవేలి తంజావూర్ మొదలైన చోట్ల ఆయన ఆశ్రమాలు కనిపిస్తాయి .క్రీశ బౌద్ధ గ్రంధాలలో అగస్త్యుని పేరు కనిపిస్తుంది .1 0 వ శతాబ్ది హిందూ గ్రంథం ‘’ అగస్తి మతం ‘’అగస్త్యుడు రాసినట్లు అందులో ముత్యాలు పగడాలు వజ్రాలు మొదలైన విలువైన వాటి లక్షణాలు చెప్పబడినట్లు ఉన్నది .
195-గృహ్య సూత్రాలు రాసిన -అశ్వలాయనుడు
శౌనక మహర్షి శిష్యుడు అశ్వలాయనుడు మానవ జన్మ సంస్కారాలకు కొన్ని సూత్రాలు చెప్పాడు .ఇది నాలుగుభాగాల గ్రంధం .మొదటిభాగం లో గృహకృత్యాలు అగ్నిప్రతిష్టాపన ,వివాహం అగ్నిహోత్రం ,పురుష సంతానం కలగటానికి చేయవలసిన విధులు ,జన్మ సంస్కారాలైన నామకరణం చెవులు కుట్టటం,అన్నప్రాసన విధానాలున్నాయి . రెండవభాగం లో-10 విభాగాలున్నాయి అందులో శ్రావణ ఆశ్వయుజ మార్గశిర ,మాసాలలో పౌర్ణమి నాటి విధులు హేమంత ,శిశిరాలలో నాలుగు కృష్ణపక్షణాలలో చేయాల్సిన అష్టక విధానం ఉంటాయి
మూడవదానిలో -అగ్ని హోత్రం లో వ్రేల్చాల్సిన పదార్ధ వివరణ విధానం ,వేదమంత్ర ఉచ్చారణ పధ్ధతి ,అష్టక విధానం రధప్రయాణం ఇంటి నిర్మాణం వగైరా వివరాలున్నాయి . నాలుగవదానిలో -9 విభాగాలలో అంత్యక్రియల విధానం చెప్ప బడింది
196-శ్రౌత సూత్రాలు రాసిన -బోధాయన(బీసీ 800-500 ) ,కాత్యాయనులు (బీసీ 300)
వేద మంత్రాలను నిత్య విధులలో అంటే’’ కల్పం ‘’లో ప్రయోగించే సూత్రాలు అన్నమాట .ఇవి బ్రాహ్మణాల కాలం లో వచ్చాయి .వేద లో చెప్పిన యజ్ఞ విధులు నిర్వహించటానికి నిర్మించే అగ్ని హోత్ర వేదిక నిర్మాణాలకొలతలను చెప్పే వాటిని సులభ సూత్రాలు అంటారు సులభ అంటే కొలిచేతాడు అన్నమాట .సులభ సూత్రం గ్రంధాలు 5 మాత్రమే మిగిలాయి బోధాయనుడు రాసిన బోధాయన సులభ సూత్రాలు ,కాత్యాయనుడు చెప్పిన కాత్యాయని సులభ సూత్రాలు
197-ధర్మ సూత్రాలు చెప్పిన -ఆపస్తంభ గౌతమ బోధాయన వసిష్ఠ మహర్షులు (బిసి 500-300 )
ఆచారాలు పండుగలు విధులు చట్టం న్యాయం ధర్మ మొదలైనవాటిపై విస్తృతంగా చర్చించి రాసిన వారిలో మొట్టమొదటివారు ఆపస్తంభ మహర్షి తరువాత గౌతమ ,బోధాయన ,వసిష్ఠ మహర్షులు చెప్పారు .ఇవే అతిప్రాచీన ధర్మ సూత్రాలు .
198-ఋగ్వేద ఏడవ మండల ద్రష్ట యోగ వాశిష్టకర్త -వసిష్ఠ మహర్షి (వేదకాలం )
అరుంధతీ దేవి భర్త వశిష్ఠమహర్షి రామాయణం లో రఘువంశ పురోహితుడు ,సప్త ఋషులలో ఒకరు. ఋగ్వేదం లో 7 వ మండల ద్రష్ట వసిష్ఠ మహర్షి ఋగ్వేదం 10-167 -4 లో వశిష్ఠ ప్రస్తుతి ఉంది .ఋగ్వేదం 7-33-9 లో వశిశుడు మహా వేదం వేదాంత పురాణ శాస్త్రాలలో నిష్ణాతుడని సింధు నాదీ ప్రాంతం లో ఒక సాశ్రమం లో ఉండి వేదాంత బోధ చేశాడని ఉంది .వేదాంతానికి మొట్టమొదటి గురువు ఆయనే ,యోగ వాశిష్టం వాశిష్ఠ సంహిత ,అగ్నిపురాణం లో కొంతభాగం విష్ణుపురాణం వశిష్ఠ ధర్మ సూత్రాలు ఆయన రాశాడని నమ్ముతారు .పాఈ భాషలోని బౌద్ధ రచన ‘’దీఘా నికాయ ‘’లో బుద్ధుడు ప్రాచీన హిందూ మహర్షులను స్మరించేవాడని అందులో వశిష్ఠమహర్షి పేరు కూడా స్మరించేవాడని ఉన్నది .
199- –గాయత్రీ మంత్రద్రస్ట -విశ్వా మిత్ర మహర్షి
ఋగ్వేదం లో 3 వ మండలం ద్రష్ట విశ్వా మిత్రుడు . అందులో 3-62- 4వాడైన గాయత్రీ మంత్ర ద్రష్ట స్రష్ట విశ్వామిత్ర మహర్షి ,గాయత్రి మంత్రాన్ని పూర్తిగా అర్ధం చేసుకవారిలో ప్రథముడు విశ్వామిత్రుడు చివరివాడు యాజ్ఞ వల్క్యుడు .రాజర్షి బ్రహ్మర్షిగా మారినవాడు మేనకా విశ్వామిత్రుల కుమార్తె శకుంతలకు జన్మించిన భరతుని పేరే మన భారత దేశం చంద్ర వంశానికిచెందిన కన్యాకుబ్జరాజు విశ్వా మిత్రుడు . కుశుని కుమారుడు కనుక కౌశికుడు .విశ్వానికి మిత్రుడు కనుక విశ్వామిత్రుడయ్యాడు .హరిశ్చంద్రుని కి పరీక్ష పెట్టి ఆయన సత్య ధర్మాన్నిలోకానికి చాటిన వాడు త్రిశంకు స్వర్గం నిర్మించినవాడు . మిరపకాయ వంటి పదార్ధ సృష్టికర్త విశ్వామిత్రుడే . రామాయణంలో తన యాగ సంరక్షణకు రామ లక్ష్మణులను తన వెంట తీసుకు వెళ్లిబల అతిబలాది శస్త్రాస్త్రాలను బోధించినవాడు
200-. ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్త -. శౌనక మహర్షి
అధర్వ వేదం లో శౌనక శాఖకు ఆద్యుడు శౌనక మహర్షి .సంస్కృత వ్యాకరణానికి ఆద్యుడు .ఋగ్వేద ప్రాతిశాఖ్యకు కర్త . దీనికే బృహద్దేవత లేక చరణ వ్యూహం అనిపేరు .ఇదిగాక ఋగ్వేదం లో 6అనుక్రమణికలు ఆయనవే. అశ్వలాయన ,కాత్యాయనుల . గురువు ఈయనే . ఋగ్వేదం లోని భాస్కల శకల శాఖలను ఏకీకృతం చేసినవాడు . ఈయనకే వేదకాలపు గృత్స్నమద .కు సమానుడు అంటారు .ఈయన కుమారుడే శౌనకుడు .. మానవ జీవి తం లోని నాలుగు స్థాయిలున్నాయని చెప్పినవాడు .సూత మహర్షి వద్ద శౌనక మొదలైన మహర్షులు నైమిశారణ్యం లో ఎన్నో పురాణాలు విన్న సంగతి మనకు తెలుసు .
12 రోజులు జరిపే సత్రయాగం లో శౌనకుడు ఋగ్వేద ప్రాతిశాఖ్య ను నైమిశారణ్యం లో తానె కర్తకనుక దానిని మహర్షులకు బోధించాడు .ఈ విషయాన్ని ఋగ్వేద ప్రాతిశాఖ్యకు ఊవటుడు రాసినవ్యాఖ్యానం లో ఉన్నది . మహాభారతం కథలను శౌనకునికి ఉగ్రశ్రవ సౌతి నైమిశారణ్యం లో బోధించినట్లు భారతం లో ఉంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-17-కాంప్-షార్లెట్-అమెరికా