కాశ్మీర్ సర్వజ్ఞ శారదా శక్తిపీఠ0
ఆజాద్ కాశ్మీర్ లో నీలం నది ఒడ్డున శారదా గ్రామంలో శారదా దేవి శక్తిపీఠ ఆలయం ఉంది ..కాశ్మీర్ వేద వేదాంత శాస్త్ర విద్యలకు ప్రముఖ స్థానం అందుకే కాశ్మీర్ కు’’ శారదా దేశ0 అని పేరు అక్కడ కొలువైయున్న సరస్వతీ మాత యే శారదాంబ .ఆమెను ‘’కాశ్మీర పూర్వ వాసిని ‘’అంటారు .కాశ్మీర ప్రజలు నిత్యం ఈ శక్తి పీఠాన్ని సందర్శించి ‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ -త్వం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే ‘’అని భక్తితో స్తోత్రం చేస్తారు
14 వ శతాబ్దానికి ఈ ఆలయం చాలా సార్లు శిధిలమైంది . 19 వ శతాబ్దం లో కాశ్మీర్ రాజు మహారాజా గులాబీ సింగ్ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మత్తులు చేశాడు .1 948 లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ ప్రాంతం లో జరిగి ఈ ప్రాంతం ఫస్తూ న్ ‘’తె గల ఆక్రమణకు గురై వాళ్ళ అధీనం లో ఉండి పోయింది .తర్వాత ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వశం లో ఉన్నది .దీనికి తోడు 2005 లో జరిగిన అతిపెద్ద భూకంపం లో ఈ ప్రాంతం దేవాలయం చాలా శిధిలమైపోయింది అప్పటి నుంచి ఇది మరమ్మత్తులకు నోచుకోలేదు .పాకిస్తానీ హిందువులు అరుదుగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు .దీనికంటే వాళ్ళు సింధు బలూచిస్తాన్ పంజాబ్ ప్రాంతాలను సందర్శించటానికి ఇష్టపడతారు .అందుకే ‘’కటాస్ రాజ్ ‘’దేవాలయానికిచ్చిన ప్రాధాన్యాన్ని పాక్ ప్రభుత్వం దీని పై చూపటం లేదు
సతీదేవి శరీర భాగాలు 51 ఎక్కడ పడ్డాయో అక్కడ శక్తి పీఠాలు కాలభైరవ దేవాలయాలు వెలసిన సంగతి మనకు తెలుసు ఇక్కడ అమ్మవారి కుడి చేయిపడి శారదా శక్తి పీఠ మైంది . 18 మహా శక్తిపీఠాలలో ఇదిఒకటి .ఇక్కడ విద్యా దేవతగా శక్తిని ఆరాధిస్తారు అందుకే శారదా పీఠం అయింది .ఈ దేవాలయం బారాముల్లాకు 60 మైళ్ళు ,ముజఫర్ బాద్ కు 40 మైళ్ళ దూరం లో నీలం లోయలో శారదా అనే కుగ్రామం లో ఉంది .ఇది ‘’లైన్ ఆఫ్ కంట్రోల్ ‘’కు వాయవ్య భాగం లో 16 మైళ్ళ దూరం లో ఉంది .ఒకప్పుడు ఈ ప్రాంతం సంస్కృత విద్య కు కాశ్మీరీ పండితులకు గొప్ప ఆవాసభూమి .హిందూ బౌద్ధాలు చక్కగా విలసిల్లిన భూమి .1277-78 కాలపు జైనుల చారిత్రక గ్రంథం ‘’ప్రభావక చరిత్ర ‘’ప్రకారం ఇక్కడ భద్రపరచబడిన వ్యాకరణ గ్రంధాలను చదివి శ్వే తాంబర జైనుడైన హేమచంద్రా చార్య తన ‘’సిద్ధాంత హేమ ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు .భగవద్రామా నుజా చార్యులు శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న బ్రహ్మ సూత్రాలపై బోధాయనుడు రాసిన వృత్తిని పరిశీలించి తాము’’ బ్రహ్మ సూత్ర భాష్యం’’అనే ‘’శ్రీ భాష్యం ‘’రాశారు . శారదా దేవాలయం ప్రక్కన సంస్కృత విశ్వ విద్యాలయం ఉండేది క్రీశ 632 లో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ దీన్ని సందర్శించి రెండేళ్లు అధ్యయనం లో గడిపి దీనికున్న చారిత్రిక సాంస్కృతిక వైభవాన్ని ప్రస్తుతించారు
కాశ్మీర్ శారదా పీఠాన్ని సర్వజ్ఞ పీఠం అంటారు .ఎన్నో అర్హతలున్నవారు మాత్రమే దీనిని అధిరోహిచగలరు భగవాన్ శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వాదాల వారినీ వాదం లో జయించి సర్వజ్ఞ పీఠం అధిరోహించారు . ఇది అతిప్రాచీన ఆలయము, పీఠమూ .సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తున ఉన్నది .భారత ప్రభుత్వాధీన కాశ్మీర్ కు ఇది వేసవి విడిది .శారదాలయం 142 అడుగులపొడవు 95 అడుగుల వెడల్పు లో వెలుపలి గోడలు 6 అడుగుల వెడల్పు 11 అడుగుల పొడవు గా ఉంటాయి . 8 అడుగుల ఎత్తులో ఆర్చీ లుంటాయి .శృంగేరిలో శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిష్టించిన గంధపు చెక్కతో చేయబడిన శారదా దేవి విగ్రాహాన్ని ఇక్కడి నుండే తీసుకు వెళ్లారని అంటారు
1148 కి చెందిన కల్హణ మహాకవి శారదా దేవాలయం గురించి వర్ణించాడు 8 వ శతాబ్దం లో కాశ్మీర్ రాజు లలితాదిత్యునికాలం లో బెంగాల్ ప్రభువు గౌడరాజుఅనుయాయులు శారదాదేవిని దర్శించారని ,శంకరాచార్యులవారి ‘’ ప్రపంచసారం ‘’లో శారదా దేవి స్తుతి ఉందని ఇక్కడే రాసి ఉంటారని అంటారు . 1030 లో లో ఈ దేవాలయాన్ని సందర్శించిన ‘’అల్ బరూని ’’అనే చరిత్రకారుడు శారదా దేవి విగ్రహం గంధపు చెక్క-చంద న చెక్క తో చేయబడి ఉందని,చెప్పి ఈ ఆలయాన్ని ముల్తాన్ సూర్య దేవాలయం ,దానేశ్వర్ లోని విష్ణు చక్రస్వామి దేవాలయం ,గుజరాత్ లోని సోమనాధ దేవాలయం తోను పోల్చి చెప్పాడు . 16 వ శతాబ్దం లో అక్బర్ చక్రవర్తి ఆస్థాన నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫజల్ కవి ఈ దేవాలయాన్ని వర్ణిస్తూ ఇది మధుమతి నది అంటే నేటి నీలం నది ఒడ్డున ఉందని ,ఆలయం బంగార0తో ధగధగా మెరుస్తూ ఉంటుందని ప్రతి శుక్లపక్షం అష్టమినాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని రాశాడు
ఇంత గొప్పగా చరిత్రలో వెలిగిపోయిన శారదాలయం 14 వ శతాబ్దం లోమొ దటిసారిగా ముస్లిం ల దాడికి గురైనది .ఆతర్వాత ఈ ఆలయం ఈ ప్రాంతం ,కృష్ణ గంగ తో సంబంధం పూర్తిగా భారత దేశపు అధీనం నుంచి తప్పి పోయింది . 19 వశతాబ్దపు డోగ్రారాజు శారదాలయాన్ని పునరుద్ధరించారు .తర్వాతమళ్ళీ మామూలే .
.ఈ ఆలయాన్ని, అమ్మవారిని ప్రముఖ కర్ణాటక వాగ్గేయ కారుడు ముత్తుస్వామి దీక్షితులు కళావతీ కమలాసనా ,యువతీ ‘’కీర్తనలో ఘ్ఘనంగా కీర్తించారు ‘’శాండిల్య మహర్షి ఈ దేవాలయం ప్రక్కన శారదా వనం లో తపస్సు చేశాడు .ఆలయం ప్రక్కనే అమర కుండ్ సరస్సు ఉండే. శాండిల్య మహర్షి తపస్సుకు శారదా దేవి ప్రత్యక్షమైంది .కాశ్మీర్ ప్రజల స్థానిక లిపిని అమ్మవారిపేరుతోనే ‘’శారదా లిపి’’ ‘’అని భక్తిగా చెప్పుకొంటారు .ఉగ్రవాదుల దాడులలో అట్టుడికి పోయిన కాశ్మీర్ నుండి కాశ్మీర్ పండితులు వలస పోయారు . 2007 లో కొందరు పండితులు ఆజాద్ కాశ్మీర్ లోని శారదా దేవాలయాన్ని చూడటానికి వెడితే అనుమతించలేదు . అదీ మనచదువులతల్లి శారదా మాతకు పట్టిన దుర్భర పరిస్థితి . మాటల గారడీ చేసే మోడీ కూడా దీనిపై శ్రద్ధ పట్టకపోవడం ,ఇదేకాదు తన గుజరాత్ రాష్ట్రం లోని సముద్ర గర్భం లో ఉన్న ద్వారక పట్టణం పై కూడా ద్రుష్టి సారించకపోవడం బాధ గా ఉంది . ఒకప్పుడు వైభవం గా ఉన్న శారదా దేవాలయ సర్వజ్ఞ శక్తి పీఠం నేడు శిధిలాలుగా చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది ..
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా