గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
216-లల్ల వాక్యాని కర్త –లల్లాదేవి (1320-1392 ) )
లల్లేశ్వరి, లల్లాదేవి, లాల్ దీదీ లల్ల యోగీశ్వరీ అని పిలువబడే 14 వ శతాబ్ది సంస్కృత కవయిత్రి కాశ్మీర్ దేశానికి చెందినది . కాశ్మీర్ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన యోగిని .’’.త్వమేవాహం’’మంత్రం తో అందర్నీ మంత్రం ముగ్ధులను చేసింది . కులమతాలకు అతీతంగా వ్యవహరించి అందరి హృదయాలలో స్థానం సాధించింది . .ఒక రకం గా కాలజ్ఞాని . ఆమె చెప్పిన కవితా ఖండికలను ‘’లల్ల వాక్యాని ‘’అంటారు . 14 వ శతాబ్దపు సూఫీ పర్షియన్ యోగి సయ్యద్ ఆలీ హమ్మదానీ కి లల్లాదేవి సమకాలీకురాలు .
లల్లాదేవి కాశ్మీర పండిత కుటుంబం లో’ శ్రీనగర్ కు నాలుగు మైళ్ళ దూరం లో ఆగ్నేయభాగాన ఉన్న పండ్రే న్దన్ లో 1320 లో జన్మించింది .ఆమె పూర్వ జన్మలో కూడా ఇక్కడే జన్మించి అక్కడి కాశ్మీర పండితుని వివాహమాడినట్లు కథ ప్రచారం లో ఉంది ఆ జన్మ లో ఒక కుమారునికన్నప్పుడు 11 వ రోజు బాలసార జరిపించటానికి వచ్చిన పురోహితుడు సిద్ధ శ్రీ కంఠునితో ‘ఈ పిల్లాడికి నాకు సంబంధం ఏమిటి ?అని ప్రశ్నించింది .ఆయన ‘’వీడు నీ కొడుకు ‘’అన్నాడు ఆమె ‘’కాదు ‘’వీడు మళ్ళీ కొన్ని గుర్తులతో మరొక చోట నేను చెప్పిన తేదీనాడు నేను చెప్పిన గంటలకు పుట్టినప్పుడు అప్పుడు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానని చెప్పి వెంటనే చనిపోయింది .పండితుడు వాడి పుట్టుక కోసం ఎదురు చూసి సరిగ్గా ఆమె చెప్పిన సమయానికి చెప్పిన చోట పుట్టిన గుర్రపు పిల్లను గుర్తించి మళ్ళీ ప్రశ్నిస్తే ,తాను కుక్కపిల్లగా పుట్టినప్పుడు అడగమంటే అడిగితె ,అదీ అదే సమాధానం చెబితే ఇక ఓపిక నశించి పండితుడు విచారించటం మానేశాడు .ఇలా ఆరు సార్లు జంతుజన్మ అనుభవించి ఏడవ జన్మ లో లల్లాదేవిగా పుట్టి పూర్వ జన్మ లో తాను కన్న వాడినే వివాహం చేసుకొన్నది .ఆ పురోహితుడే వివాహ తంతు జరిపించాడు ..పెళ్లి రోజున తన జన్మ రహస్యాన్ని ఆయనకు తెలియ జేసింది ..ఆమెకప్పుడు 12 ఏళ్ళు ,పెళ్లికొడుకుకు యుక్త వయసు వచ్చింది ..ఈ గాథ ప్రకారం లల్లాదేవికి పూర్వ జన్మ స్మ్రుతి గొప్పగా ఉందని అర్ధమవుతోంది ..బాల్యం నుంచే జీవితం వేడి పెనంమీద నీటి బిందువు అనే భావన ఏర్పడింది ..పూర్వ జన్మలో ఆమె భర్త ఇప్పుడు మామగారయ్యాడు .లల్లాదేవి దాంపత్యం సవ్యంగా సాగలేదు . కష్టాల కడలి లో అంతూ దరీ లేకుండా గడిపింది .
దీనితో ఆమె మనసు దైవ ధ్యానం పై కేంద్రీకరించింది . అత్తగారు తిండికూడా సరిగ్గా పెట్టేదికాదు ఈ విషయం స్వయంగా చూసిన మామగారు ఆమె తినటానికి కంచంలో ఒక పెద్ద రాయి ముక్క తప్ప ఏమీ లేక పోవటం గ్రహించి మండి పడ్డాడు ..కలిపించుకొందామంటే ఆమె గద్దరితనానికి ఝడిశాడు .ఇలా 12 ఏళ్ళు లల్లాదేవి ఆ కొంపలో ఉండి తన జీవిత గమ్యానికి దారి వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్లి ‘’సెడ్ బాయు ‘’అనే శైవ గురువును చేరి ఉపదేశం పొందింది ..ఈయన ప్రముఖ శివా చార్యుడైన సిద్ధ శ్రీ కంఠుడు అని గత జన్మలలో పరిచయమున్న వాడని కధనం. ఈయన పంపూర్ గ్రామవాసి అని ప్రసిద్ధ శైవా చార్యుడు వసుగుప్తుని శిష్యుడని అంటారు .గురువు కంటే పరిపూర్ణ జ్ఞాన0 కలదని వాద చర్చలలో గురువునే ఓడించి దెబ్బలు కొట్టేదని అంటారు .
చివరికి లల్లాదేవి శైవ యోగిని ,బ్రహ్మ వాదిని అయింది . ,కాశ్మీర్ దేశపు వస్త్ర ధారణ వదిలేసి అర్ధ నగ్నం గా పర్యటిస్తూ ,ఎవరేమన్నా పట్టించుకోక నిశ్చలమనసుతో దైవ ధ్యానం తో తిరిగింది .ఒక రోజు ఒక వస్త్ర వ్యాపారి ఆమెకు ఒక చీర ఇస్తే దాన్ని రెండుగా చింపి రెండు భుజాలమీద వేసుకొని వాటికి ముడులు వేసి మర్నాడు అదే కొట్టుకు వెళ్లి దాని బరువును చూడమంది .చీర అదే బరువు ఉంది .అప్పుడామె వాడితో ‘’భూషణ దూషణలు సరి తూకం లో ఉన్నాయి ‘’అని చెప్పింది .ఇదే వేదాంత ధోరణిలో ప్రశాంత జీవితం గడిపింది .
భక్తి తన్మయత్వం లో పాడుతూ నాట్యం చేస్తూ తిరిగేది .కాశ్మీర్ ప్రజలు ఆమెను తమగుండెల్లో పెట్టుకొన్నారు ..శ్రీనగర్ కు 25 మైళ్ళ దూరం లో బ్రీజ్ బీహార్ అనే చోట ముసలితనం లో72 వ ఏటా1392లో లల్లాదేవి తనువు చాలించింది .ఆమె చెప్పిన ‘’లల్ల వాక్యాని ‘’అతిప్రాచీన కాశ్మీర సంస్కృత భాషలో ఉంటుంది .ఆమె కవిత్వం లో అనేక సామెతలు నుడులు దొర్లి ప్రవహించాయి ..ఆ కవిత్వం లోని భావాన్ని కొంత తెలుసుకొందాం –
‘’నువ్వే స్వర్గం నువ్వే భూమి నువ్వే పగలు రేయి గాలి పుట్టిన ప్రతిదానిలో నువ్వున్నావు .నాలోని నువ్వు నేనూ ఒకటే నేనే నువ్వు నువ్వే నేను మనఇద్దరకు మృత్యువే లేదు .నరుడా అంతా ఆయనే .నువ్వే ఆయన ఆయనే నువ్వు ఎందుకీ భేదాలు వాదాలు?
‘’ఇయి కరు మ్ సూయే -ఇయి రాసిన విచారోమ్ థి మంత్ర-యిహాయి లగామోద హస్ పార్ట్సుణ్ -సూయే పరశివామ్ తన్తార్ ‘భావం -నేనేమి చేసినా అది దైవ కైంకర్యమే అవుతుంది ప్రభూ !నేనేది పలికినా అది నీప్రార్హనే అవుతుంది .ఈ శరీరం అనుభవించింది అంతా శైవ తంత్రమే అయి పరమ శివ మార్గాన్ని తేజోమయం చేస్తుంది .
1900 సంవత్సరానికి ముందు ‘’త్రిక ‘’అని పిలువబడిన కాశ్మీర్ మార్మిక శైవ సంప్రదాయం లల్లాదేవిది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—