గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 )

కాశ్మీర్ పండిత కుటుంబాలు సంస్కృతానికి  కళా సంస్కృతులకు  చేసిన సేవ నిరుపమానం . 1874 లో కాశ్మీర్ లో జన్మించిన అనేక శైవ గ్రంధాలు రచించిన పండిత హరిభట్ట శాస్త్రి జాదూ  వ్రేళ్ళపై లెక్కింపదగిన ఆధునిక సంస్కృతమహా  పండితుడు .కానీ ఆయన గురించి ఆ కుటుంబంలోని కాశ్మీర పండితులకే చాలామందికి తెలియక పోవటం ఆశ్చర్యం .ఈయనపై అధ్యయనం చేయాలని అమెరికా హార్వర్డ్ యుని వర్సిటీ నుంచి కాశ్మీర్ వచ్చిన ప్రొఫెసర్ డేవిడ్ బ్రేనార్డ్ స్పూనర్ హరిభట్ట శాస్త్రి వంటి ఉద్దండులవద్ద సంస్కృతాధ్యయనం చేయాలని వచ్చి ఆయన గురించి తెలిసిన కొన్ని విశేషాలకే ఉబ్బి తబ్బిబ్బై అంతటి శైవ వాజ్మయ నిర్మాత  ను గురించి లోకానికి పూర్తిగా తెలియక పోవటం బాధకలిగించింది .కాశ్మీర్ రీసెర్చ్ స్కాలర్ల వలన ఆయన జీవితం గురించి తెలిసిన విషయాలు ఇప్పుడు తెలుసుకొందాం .

  హారభట్ట జాదూగా కాశ్మీర్ సంస్కృటానికి విశేష సేవలందించిన పండిత కుటుంబం లో 1874 జన్మించి,శరీరం లోని ప్రత్యణువు  సంస్కృతమ్ పొర్లి పొరలుతుండగా సునాయాసంగా సంస్కృతం అధ్యయనం చేశాడు .తండ్రి పండిట్ కేశవ భట్ట జాదూ కాశ్మీర్ రాజు మహారాజా రన్బీర్ సింగ్ ఆస్థాన జ్యోతిష్కుడు .మహారాజు ఎందరెందరో కవి పండితులకు ఆశ్రయమిచ్చి పోషించి పెంచాడు .ఈయన అన్న కొడుకు జగద్ధార్ జాదూ ‘’నీల మత  పురాణం ‘’మొదటి ప్రతికి ప్రొఫెసర్ కాంజిలాల్ తో కలిసి సంపాదకత్వం వహించాడు .దక్షిణ కాశ్మీర్ లో బ్రిజే హ ర దగ్గరున్న  జాదీపూర్ అనేగ్రామం జాదూ కుటుంబ ఆవాసగ్రామం .తర్వాత  శ్రీనగర్  కు వల్లస వెళ్లి ఇంటిపేరును జాదూగా ఉంచుకొన్నారు . హారభట్టు కాశ్మీర్ లోని రాజకీయ పాఠశాల లో చేరి  1895 లోసంస్కృతం లో  డిగ్రీపొంది హరభట్ట శాస్త్రి అయ్యాడు .ఈతని సునిశిత మేధావితనానికి మెచ్చి మహారాజా జమ్మూ-కాశ్మీర్ ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్ లో మొదట పండిట్ గా నియమించగా   క్రమంగా ఎదిగి  హెడ్ పండిట్ గా 1931లో రిటైర్ అయ్యాడు. విద్యావంతులైన పండితులంటే మహా రాజుకున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది గొప్ప ఉదాహరణ .

 శైవ వాజ్మయం లో హారభట్ట శాస్త్రి కున్న సునిశిత మేధాశక్తి కాశ్మీర్ లోనే కాదు లక్నో యూనివర్సిటీ మహా స0స్కృత   విద్వా0సుడైన కె సి పాండే ,  బాంబే  కాలేజ్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ ఫిలాసఫీ  ప్రొఫెసర్ జేమ్స్ హెడ్ వుడ్ వంటి ఉద్దండులు కూడా అబ్భుర పడ్డారు .అందుకనే ప్రముఖ  భాషా శాస్త్ర వేత్త ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఛటర్జీ భట్టు జాదూ పాండిత్యానికి ఆకర్షితుడై శ్రీనగర్ వచ్చి ఆయన వద్ద  కాశ్మీ రశైవ గ్రందాధ్యయనం చేశాడు.పైన చెప్పిన డేవిడ్ స్పూనర్ కాశ్మీర్ కు వచ్చి ఇక్కడి విషయాలన్నీ పూర్తిగా అవగాహన చేసుకున్నాక అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో మొట్ట మొదటిసారిగా సంస్కృతాన్నిఒక సబ్జెక్ట్ గా1905 నుంచి  బోధించటం ప్రారంభించాడు .ఒకరకంగా ఇది హరభట్ట  శాస్త్రి ప్రభావమహిమే .అప్పుడున్న 5 వేల  మంది విద్యార్థులలో సంస్కృత విద్యార్థులు కేవలం 9 మంది మాత్రమే .

 హారభట్ట శాస్త్రి తన విద్వత్తును వృధా కానీకుండా విస్తృత గ్రంథ  రచన ప్రారంభించాడు .కాశ్మీర్ లోని సంస్కృత భాషా గ్రంధాలపై విస్తృతమైన వ్యాఖ్యానాలు రాశాడు అందులో మొదటిది అమ్మవారిపై ఉన్న ‘’పంచ స్తవి    ‘’కి వ్యాఖ్యానం .తనకున్న అపూర్వ శైవ శాక్తేయ విజ్ఞానమంతా ఈ వ్యాఖ్యానం లోముఖ్యంగా లఘుస్తవం ,చార స్తవం లలో  పొందుపరిచాడు  .వీటినే  ఆయన పేరు మీదు గా ‘హారభట్టి ‘’అని  గౌరవం గా పిలుస్తారు . ఈ మంత్రాలన్నీ అతి ప్రాచీనకాలం నుండి కాశ్మీర్ లో ప్రతి ఇంటా మారు మోగుతూ ఉన్నాయి .ఈయన వ్యాఖ్యలు ‘’త్రిక ‘’సిద్ధాంతానికి వెలుగులనిచ్చాయి .వీటిని రాసింది శంకరాచార్యులా  కాళిదాసా ,అభినవ గుప్తుడా అనే చర్చ చాలాకాలం నడిచింది చివరకు హరభట్ట వీటిని ‘’ధర్మాచార్య ‘’మాత్రమే రాశాడని సాక్ష్యాధారాలతో రుజువు చేశాడు .దీన్ని స్వామి లక్ష్మణ జూ కూడా సమర్ధించాడు .హారభట్ట మొత్తం 9 శైవ గ్రంధాలను వాటి  అర్ధ తాత్పర్యాలతో సహా రాశాడు .ఇదికాక ఉత్పలుడు రాసిన ‘’ఆపద్ ప్రమత్త సిద్ధి ‘’వ్యాఖ్యానాన్ని ,బోధ పంచదశిక ,పరమార్ధ చర్చ ‘’లపై వివరణలు రాశాడు .ఇంతటి శైవ మహా పండిత  విద్వా0సుడు  1951 లో 77 వ ఏట శివ సాన్నిధ్యానికి చేరాడు .ఈయన అమెరికా శిష్యుడు స్పూనర్  తరచుగా హారభట్ట ,ప్రొఫెసర్ నిత్యానంద శాస్త్రి ,పండిత మధుసూదన శాస్త్రి లకు    రాస్తూ తన గురుభక్తిని వ్యక్తపరచేవాడు దురదృష్ట వశాత్తు ఆ లేఖలు కాలగర్భం లో కలిసిపోయాయి .

237- శివ సూత్రం విమర్శిని వంటి 29 గ్రంధాల సంపాదకుడు -మహా మహోపాధ్యాయ పండిత ముకుంద రామ  శాస్త్రి (1880-1921 )

మహా మహోపాధ్యాయ పండిత ముకుందరామ శాస్త్రి గొప్ప కాశ్మీరీ సంస్కృత మహా పండితుడు .తన అసమాన ప్రతిభ చేత దేశం లోను విదేశాలలోనిఅత్యంత ప్రాముఖ్యత పొందాడు .జీవితకాలం లో’’ లెజెండ్ ‘’అని పించుకొన్నాడు .గణేష్ భట్ గంగో పాధ్యాయ ,అమరావతి ద0పతుల   కుమారుడు .స్థానిక ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో  పండిత దయా రామ్ కౌల్ వద్ద చదివి శాస్త్రి డిగ్రీ సాధించి పంజాబ్ ,లాహోర్ ల నుండి ఇక్కడకు వచ్చి చేరి చదివిన వారిని తీర్చిదిద్ది తన ఖ్యాతిని దేశమంతా చాటుకున్నాడు .యవ్వనం లోనే పర్షియన్ గ్రంధాలను సంస్కృతం లోకి పండిట్ రామ్ జూ ధర్ పర్య వేక్షణలో అనువదించాడు .దీన్ని గమనించిన జమ్మూకాశ్మీర్ రాజు రణబీర్ సింగ్ ముకుంద శాస్త్రిని టిబెటన్ బౌద్ధ గ్రంధాలైన ‘’క0గూర్ ‘’తంగుర్  ‘’లను సంస్కృతం లోకి అనువదించమని కోరాడు .థామస్ టాంసెల్ వద్ద టిబెటన్ భాష అభ్యసించి 1 లక్షా 50 వేల  శ్లోకాలలో వాటిని అనువదించి తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .దీనితో ఆయన ప్రతిభ ద్విగుణీకృతమై  మహారాజు నుండి 500 రూపాయల అత్యధిక నగదు పారితోషికం పొందాడు ఆనాడు అదే చాలా గొప్ప బహుమానం

 ఈ ప్రయత్నాన్ని మెచ్చిన మహారాజు కాశ్మీర్ లోని ఖట్వార్ లో ఉన్న పొద్దార్ లో లామా గురే ను అనుసరించమని కోరాడు .అక్కడ నీలం రాళ్లు బాగా లభిస్తాయి దానిపై పరిశోధన చేయాలని రాజు ఆదేశం .ఇక్కడే యూరోపియన్ ఓరియెంటలిస్ట్ పోప్  వేద్ తో పరిచయమైంది .అప్పుడు కాశ్మీర్ వ్యాకారణం పై వేద్ గ్రంధం రాస్తున్నాడు దానికి శాస్త్రి పూర్తిగా సహకరించాడు .కొద్దికాలం తర్వాత శ్రీనగర్  లోక్రిస్టియన్ మిషనరీలు నడిపే  సి ఏం ఎస్  స్కూల్ లో సంస్కృత పండితునిగా నియామకం పొందాడు .ఒక ఏడాదిమాత్రమే పని చేసి కాశ్మీర్ కు వచ్చిన అరుల్ స్టెయిన్ అనే ఆయనకు రాజతరంగిణి అనువాదం లో 1899 లో సహకరించాడు. తర్వాత ఆయన సలహాపై గ్రియర్సన్ కు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా కు 20 ఏళ్ళు తోడ్పడ్డాడు /ఈ సమయం లోనే కాశ్మీర్ భాషా నిఘంటువు ,కృష్ణ జూ  రజ్డా న్  రచన  ‘’శివ పరిణయ ‘’లను తనసంపాదకత్వం లో వెలువరించాడు 1900 లో పంజాబ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ .డబ్ల్యు .స్ట్రాటన్ అభ్యర్థనపై ‘’కటక్ భాషా సూత్ర ‘’అనే  అత్యంత విలువైనగ్రంధం రెండేళ్లు శ్రమించి రాశాడు .

   1912లో మహారాజా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి శాస్త్రిని హెడ్ గా నియమించాడు .రీసెర్చ్ అండ్ అర్కీలాజికల్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ గా 1919 వరకు ఉన్నాడు . 1908  లో భారత ప్తభుత్వ పురావస్తు శాఖ సర్వేకు కాశ్మీర్ లోని శారదా ,దేవనాగర లిపులపై  శాసనాలు శిధిలమవుతుంటే వాటి అర్ధ భావాలను విశ్లేషించి భద్రపరచాడు .జైన రాజు రాసిన ‘’జైన రాజ తరంగిణి ‘’   పై పరిశోధిస్తున్న స్పూనర్ కు సాయమందించాడు .రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ఉండగా కాశ్మీర శైవానికి  చెందిన 23  శైవ గ్రంధాలను తన సంపాదకత్వం లో వెలువరించిన ఘన కీర్తి   పొందాడు .ఇవన్నీ ;;కాశ్మీర్ సిరీస్ ‘’గా వెలువడ్డాయి . ఇవికాకశివ సూత్రం తర0గిణి  స్పందన కారిక  ,తంత్రలోక తంత్ర సారా ,ఈశ్వర ప్రతిభిజ్ఞా ,పరాత్రిమాశిక ,పరార్ధ సార లను కూడా ప్రచురించి అద్వితీయ సాహితీ సేవ చేశాడు ముకుంద శాస్త్రి .అతిప్రాచీన కాశ్మీర్ సంస్కృత గ్రంధం ‘’మహా నయా ప్రకాష్ ‘’కు కూడా సంపాదకుడు .జార్జి గీయర్సన్ లల్లాదేవి రచనలను ‘’లల్లవాక్యాని ‘’గా తీసుకురావటం లో శాస్త్రి తోడ్పాటు మరువ లేనిది .ఇదే కాక ఈశ్వర కౌల్ రచన ‘’సదమృత ‘’ను గీయర్సన్ ప్రచురించటలో యెనలేని సాయమందించాడు

ముకుంద శాస్త్రి అపార శాస్త్ర జ్ఞానానికి తగిన ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు గౌరవం లార్డ్ హార్డింజ్ చేతులమీదుగా  లభించింది . 1921 లో ఈ మహా మేధావి అసామాన్య సంస్కృత పాండితీ గరిమ ఉన్నపండిత ముకుంద శాస్త్రి 1921 లో ముకుంద ధామం చేరుకొన్నాడు

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.