గీర్వాణకవుల కవిత గీర్వా ణం -3 243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 )

గీర్వాణకవుల కవిత గీర్వాణం -3

243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 )

సంప్రదాయ సంస్కృత భాషా కుటుంబం లో 4-7-1833 లో పుట్టిన పండిట్ ఈశ్వర కౌల్ మూడేళ్ళ చిన్నతనం లోనే తండ్రిపండిట్  గణేష్ కౌల్ ను కోల్పోయాడు .పండిట్ తిక్కారాం రజ్డా  మొదలైన సంస్కృత  ఉద్దండుల వద్ద  బెనారస్ నుండి మహారాజా రన్బీర్ సింగ్ వద్ద పని చేయటానికి వచ్చిన పండిట్ దయాకృష్ణ జోషీ వద్ద సంస్కృతం నేర్చి,పర్షియన్ భాషా లోతులూ తరచి ,అరబిక్ భాష అంతు చూశాడు . 1861 లో మహారాజా ఈయనకు పర్షియన్ అరేబిక్ గ్రంధాలను సంస్కృతం లోకి హిందీలోకి అనువదించే పని అప్పగించాడు .ఈపని పూర్తి చేశాక 1871 లో రాజు మహారాజా సంస్కృత పాఠశాలలో సంస్కృత హెడ్ టీచర్  గా నియమించాడు .

  కాశ్మీర్ పండిట్ లు అంటే వ్యాకరణ నిష్ణాతులు .టిబెటన్ గుజరాతీ  వ్యాకరణాలను  మొదట రాసింది కాశ్మీర్ పండిట్ లే  . అలాగే మొదటి కాశ్మీర వ్యాకరణాన్ని కౌల్ గ్రియర్సన్ తో కలిసి తయారు చేశాడు .పాణిని అష్టాధ్యాయి ఆధారంగా హేమచంద్ర తన వ్యాకరణం రాశాడు ఇప్పుడు కౌల్ ‘’కాశ్మీర్ శబ్దమిత్ర ‘’అనే వ్యాకరణం రచించాడు .ఇదికాక’’ కాశ్మీరీ -సంస్కృత కోశం ‘’నిఘంటు నిర్మాణం ప్రారంభించి సగం లో ఉండగా మరణిస్తే గ్రియర్సన్ దాన్నిపండిట్ ముకుంద రామ్ శాస్త్రి పండిట్ నిత్యానంద శాస్త్రి సహకారం తో  1932 లో పూర్తి చేశాడు.కాశ్మీరు పదాలను మొట్ట మొదటిసారిగా దేవ నాగర లిపి లో  తన వ్యాకరణం నిఘంటువు లలో రాసిన ఘన చరిత్ర ఈశ్వర కౌల్ ది .క్లిష్టమైన కాశ్మీర హల్లులను ఉచ్ఛరించటానికి మాండలిక గుర్తులను హారిజా0టల్ బార్ ,హాలంతా లను   ఉపయోగించిన భాషావేత్త కౌల్ . 1881 లోకాశ్మీర్ రాజ్య అనువాద శాఖలో డైరెక్టర్ గా నియమించబడ్డాడు మహారాజా రన్బీర్ సింగ్ మరణించేదాకా 1884 వరకు పనిచేశాడు తరువాత ప్రభువు ప్రతాప సింగ్ కౌల్ ను తన ఆస్థానం లో ముఖ్య జ్యోతిష్య పండితునిగా నియమించి గౌరవించాడు .ఈ పదవిలో 28-8-1893 లో మరణించేదాకా ఉన్నాడు  ..పండిత ఈశ్వర కౌల్ వ్యాకరణ సేవను శ్లాఘించిన సర్ అరుల్ స్టెయిన్ ఆయనను ‘’కాశ్మీర్ పాణిని ‘’అని గౌరవనామం తో కీర్తించాడు . 244-ద్వితీయ రాజతరంగిణికర్త -జోన రాజు (1420-1485)

పుట్టిన రోజు సరిగ్గా తెలియపోయినా ‘’ద్వితీయ రాజతరంగిణి’’ రాసిన జోనరాజు 1485 లో మరణించినట్లు తెలుస్తోంది .ఇతను కల్హణ రాజతరంగిణి ని కొనసాగిస్తూ తన రాజు జైన్ ఉల్ అబిదీన్ వరకు(1418-1470 ) ఉన్న కాశ్మీర్ రాజుల చరిత్ర రాశాడు .పూర్తిగా రాయాల్సినవాడు  మరణం వలన పూర్తి చేయలేక పోయాడు .  ఇందులో క్రమముగా తగ్గిపోతున్న హిందూరాజుల గురించి క్రమంగా బలపడుతున్న ముస్లిం రాజుల ప్రాబల్యాన్ని గూర్చి జోనరాజు తెలియ జేశాడు

सिद्धे यत्र सति त्रपाकुलमिव स्पर्धाभिलाषाहतेरन्तर्धि वहति त्रिलोकमहितं शेषं निजार्धद्वयम्।

स्नेहैकीभवदाशयद्बयजयाकाङ्क्षीव गाढं मिलद्देहार्धद्वयमस्तु तद्भगवतोरद्व्यैतसम्पत्तये ।।1।।

రెండు సగభాగాలైన అర్ధ నారీశ్వరులైన శివపార్వతులు ఒకరితో ఒకరుపోటీపడి ముల్లోకాలలో కలిసిపోయి లోకుల చేత ఆరాధింపబడ్డారు .మిగిలిన మిధునం స్నేహం గాఢమైన కోరికలతో కలిసిపోయి మరల మనలను ఆశీర్వ దిస్తున్నారు అనిభావం .

 జోనరాజు సుల్తాన్ సికందర్ చేసిన దేవాలయ నిర్మూలనాలు ,యాత్రాస్ధలా ల పై దాడులు గురించి రాశాడు .23 రాజుల చరిత్ర రాశాడుజోన రాజు .ఇందులో 13 మంది హిందూ ఒక భూటియా ,9 మంది ముస్లిం రాజులున్నారు .  490 సంవత్సరాలు పాలించిన రాజుల చరిత్ర ఉంది .కవి సికందర్ ,జైనములబ్దీ న్ రాజుల సమకాలికుడు .రచన సాధికారికమైనదే .కల్హణుడు ఎక్కడ ఆపేశాడో అక్కడనుంచి  ప్రారంభించాడు  జోనరాజు .రెంచాన్ నుంచి ఇస్లా0 లోకి మారిన ‘’బుల్ బుల్ షా’’ గురించి రాయలేదు  ముస్లిం రాజులకు ముందే కాశ్మీర్ పై 3 సార్లు దాడి చేసిన వారిగురించికూడా రాశాడు.మొదటిసారిగా  దుల్చా రెండవసారి రెంచాన్  మూడోసారి అచల లు దాడిచేశారు .తురుష్కుడైన  దుల్చా  60 వేల  సైన్యం తో దాడి చేశాడు  .అతనిదాడి ‘’లేడి జాతిపై సింహం దూ కుడు ‘’గా ఉందన్నాడు జోన్ రాజు .రెండవ దాడి చేసిన బౌద్ధుడు రెంచాన్ కేవలం కాశ్మీర్ సిరి సంపదలనుదోచుకోవటానికే వచ్చాడు .కాశ్మీర్ గద్దెనెక్కి కోట రాణీ తో లాలూచీపడ్డాడు .మూడవ దాడి చేసిన అచల కోటరాణి ని చంపి ఖాళీగా ఉన్న సింహాసనాన్ని ఎక్కాడు .ఇతని తర్వాత రాజైన షా మీర్ కాశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చేశాడు అన్నాడు జోనరాజు .ముస్లిం లు ఇతనిని ‘’కుల నాధుడు ‘’అని ఆరాధించారుఅన్నాడు . .లల్లేశ్వరి ,షా అందాన్ యోగుల గురించి జోనరాజు ఒక్కమాట కూడా రాయలేదు .అల్లాఉద్దీన్  కాలం లో కాశ్మీర్ లో వచ్చిన ఘోర కరువుగురించిరాశాడు .రాజధానిని అందర్కోట నుంచి అల్లాఉద్దీన్ పురకు మార్చి ,మళ్ళీ బాక్ టు పెవిలియన్ లాగా అందర్ కోట్ అనే జయాపీడా పురానికి  అక్కడినుంచి శ్రీనగర్ కు మార్చాడట .సుల్తాన్ షాబుద్దీన్ ను లలితాదిత్య మహారాజుతో పోల్చాడు

245-తృతీయ రాజ తరంగిణి కర్త -శ్రీవరుడు (1459

జోన రాజు శిష్యుడు ‘’శ్రీవరుడు ‘’గురువు పనిని కొనసాగించి ‘’తృతీయ రాజ తరంగిణి ‘’పేరుతొ 1459-1486వరకు ఉన్న రాజుల చరిత్ర రాశాడు प्रेम्णार्धं वपुषो विलोक्य मिलितं देव्या समं स्वामिनो मौलौ यस्य निशापतिनगसुतावेणीनिशामिश्रितः ।आस्ते स्वाम्यनुवर्तनार्थमिव तत्कृत्वा वपुः खण्डितं देयाद्द्वयभावनां स भगवान्देवोर्धनारीश्वरः

।భావం -శివుని ఫాలం పై  ఉన్న చంద్రుడు పార్వతి నల్లని జడలో సగ భాగం పై కలిసి పోయి తన యజమాని శివునికి ఆనందం కల్గించాడు .ఈ అర్ధనారీశ్వర0 మమ్మల్ని కాపాడుగాక

 కల్హణుడు ప్రారంభించిన అర్ధనారీశ్వర స్తోత్రాన్ని జోనరాజు ఆతర్వాత శ్రీవరుడు కూడా తమ రాజ తరంగిణి భాగాలలో కొన  సాగించారు వారి వారి ధోరణిలో .శ్రీవరుడు 15 వ శతాబ్ది కాశ్మీర్ రాజులు జనాలుబ్దీ న్  ,కొడుకు   హైదర్ షా ,మనవడు హాసన్ షా ల ఆస్థానం లో ఉన్నాడు .సంగీతం లో కూడా ప్రవీణుడు .కేదార గౌళ , గాంధార ,కర్ణాటక రాగాలకు ప్రచారం కల్పించాడు .కాశ్మీర దేశం లోని కరువుకాటకాలు ఉత్సవాలు ,వరదలు వగైరాలగురించికూడా తన రచనలో తెలియ జేశాడు .ఈ కవి కధాకౌతుక ,శుభాషితా వళి  కూడా రాశాడు .కదా కౌతుకం 15 కాండల కావ్యం .కథా  వస్తువు పర్షియన్  శృంగర  కథ .శుభాషితావళి 400 మంది కవుల చరిత్రవంటి కేటలాగ్ మాత్రమే కాక అజ్ఞాత కవుల గురించి తెలియజేసే రిఫరెన్స్ పుస్తకం

246- అరేబిక్ సంస్కృతాలలో అనర్గళ వక్త -పండిట్ సహజ భట్ (1862 -1935 )

కాశ్మీరీ  పండిత కుటుంబం లో 1862 లో జన్మించిన సహజ భట్ సహజంగానే జన్మతహా వచ్చిన సంస్కృతం లో అరేబిక్ భాషల లో నిష్ణాతుడై ,ఒక్క పొరబాటు శబ్దం లేకుండా ఆ రెండుభాషలలో అనర్గళంగా మాట్లాడేవాడు .తండ్రి చిన్నప్పుడే చనిపోతే రాజాస్థానం లో వైద్యుడుగా ఉన్న పెద్దన్న సత్ కాక్ పెంచి పోషించాడు .సీబీఐ ఏం స్కూల్ లో ఆంగ్లం చదవమని చేర్పిస్తే అందులో’’ నో ‘’   ముందు వచ్చి ‘’ఎస్ ‘’తర్వాత వస్తుంది కనుక దాన్ని చదవమని చెప్పి సంస్కృత అరేబిక్ పర్షియన్ భాషాలు చదివి నిష్ణాతుడయ్యాడు .వీటిని ఇంటివద్దే గురువుల వద్ద నేర్చాడు .యునానీ వైద్యమూ నేర్చి గొప్ప భిషగ్వరుడిగా పేరు పొందాడు .మూర్తీభవించిన సంప్రదాయి అయినా భావాలలో చాలా ఉదారుడు .జీవితకాలం లో కాశ్మీర్ దేశం లో మహా గొప్ప  యునానీ  వైద్యుడని ప్రసిద్ధిపొందాడు .పొడవుగా మూర్తీభవించిన కాశ్మీరీ పండిత వస్త్ర ధారణతో ఆయన మహా దర్జాగా కనిపించేవాడు .భట్ బహుభాషా పాండిత్యాన్ని గుర్తించిన మహారాజు అనువాదం శాఖలో ఉద్యోగిగా నియమించాడు .ఈయనసంస్కృతం లో ఉన్న  ఎన్నో వేదాంత ,న్యాయ ,వైద్యగ్రంధాలను పరిశీలించి ముద్రించి అనువాదాలు చేశాడు . 1890  లో డిపార్ట్ మెంట్ హెడ్ అయ్యాడు .సర్ అరుల్ స్టెయిన్ పండిట్ ముకుంద శాస్త్రి లాతోకలిసి భట్ 6 వేల  గ్రంధాల వ్రాతప్రతులు కేటలాగ్ తయారు చేశాడు .దీన్ని 1894 లో బొంబాయి ప్రెస్ లో ముద్రించారు “For the most conscientious and scholarly manner in which Sahaz Bhat discharged it, I feel all the more obliged as I can well realize how irksome a great portion of the work e.g. the careful reproduction of innumerable classical errors and apashabdas of the manuscripts must have been to his Pandit instinct. His learning and thorough acquaintance with the methods of Indian scholarship especially in the shastras traditionally cultivated in Kashmir have on many occasions most usefully supplemented my printed source of references”.అంటూ స్టెయిన్ పండిత సహజ భట్ సాహిత్య ఔన్నత్యాన్ని భాషా పాండిత్యాన్ని తనకు అందజేసిన సహకారాన్ని వేనోళ్ళ పొగిడాడు

 ఇదేకాక కాశ్మీర్ లో ఉన్న సంస్కృత కథనాలను చరిత్రలను హిందీలోకి స్టెయిన్ గోవింద కౌల్ సహాయం తో రాజు అభ్యర్థనపైతర్జుమాచేశాడు . 1899 లో కౌల్ మరణంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది .1935 లో73 వ ఏట పండిట్ సహజ భట్ సహజ మరణం చెందాడు  1905 లో వియన్నా లో ఉన్న అరుల్ స్టెయిన్ తన పూర్వ సహచరుడు భట్ విద్యా వైదుష్యాన్ని గురించి రాసిన ఉత్తరం చిరస్మరణీయం -“I gathered my old entourage. It was pleasure to talk the language of gods and though my interests have now moved far northward, I shall try to keep my old friend Pandit Sahaz Bhat by me when I occupy winter quarters at Gupkar where he had been with me and Govind Kaul in the old days.”

247-డాన్ క్విక్సోట్ ను సంస్కృతం లోకి అనువదించిన -ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ (1890 -1975 )

 ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ కాశ్మీర్ లో బ్రిజేహరాలోని జాదీపూర్ లో జన్మించి తర్వాత శ్రీనగర్ కు వలస  వెళ్లిన  జాదూ కుటుంబానికిచెందినవాడు  .తాత కేశవ భట్టు మహా రాజు ఆస్థాన జ్యోతిష్యుడు ,అధర్వ వేదం లోని పిప్పలాది  శాఖ పరిశోధనలో బ్రూలర్ కు సాయపడిన వాడు

జగద్ధార్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి సంస్కృతం లో 14 వ ఏటా 1904 లో ప్రజ్ఞా పరీక్ష పాసై 1920 లో అదే యుని వర్సిటీ నుంచి సంస్కృతం లో శాస్త్రి డిగ్రీ సాధించి ,1920 లో మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజస్ అయ్యాడు . 1921లో ప్రభుత్వ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లోహెడ్ పండిట్ గా  చేరి 1924 వరకు పనిచేసి 1924 నుండి 27 వరకు జమ్మూలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీ లో సంస్కృత బోధిస్తూ ,1931 లో శ్రీనగర్ ప్రతాపకాలేజి సంస్కృత ప్రొఫెసర్ అయి మళ్ళీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ హెడ్ అయి 1946 వరకు ఉన్నాడు .తర్వాత ప్రభుత్వ మహిళా కాలేజీలో సంస్కృతం బోధిస్తూ 1951-53 వరకు గద్దెపై  ప్రిన్సిపాల్ అయి 1975 వరకు సేవ చేసి రిటైర్ అయ్యాడు

1924 లో ప్రొఫెసర్ ఆర్ కె కాంజిలాల్ తో కలసి ‘’నీలమత పురాణం  మతం ‘’క్రిటికల్ గ్రంధాన్ని మొట్టమొదటిసారిగా తన సంపాదకత్వం లో ప్రచురించి లోకానికి వెల్లడించి సాహిత్య లోకం నుంచి ప్రశ0సలు అందుకొన్నాడు .కాశ్మీర  దేశానికి చెందిన ఆధ్యాత్మిక మత ఆచార నమ్మకాల  సాంఘిక  సాంస్కృతిక సర్వస్వాన్ని లోకానికి మొట్ట మొదటి సారిగా ప్రజలు తెలుసుజానే అవకాశం కల్పించాడు .ఇదికాక బౌద్ధ పంచ దశకం ,పరమార్ధ చర్చ అనే బౌద్ధ వేదాంత గ్రంధాలతోబాటు ,పంచస్తవి టీకా ,పరాత్రి0శిక లఘు వృత్తి ,పరాత్రి0 శిక వివృత్తి ,పరాత్రి0శిక తాత్పర్య దీపిక మొదలైన అతి విలువైన 16 గ్రంధాలను తన సంపాదకత్వం లో వెలువరించి గొప్ప సాహితీ సేవ చేశాడు .భారతీయ వాస్తు శిల్పకళలపై ‘’ప్రసాద మండపం ‘’,ప్రభావతీ ప్రద్యుమ్న నాటకం ,చిత్త ప్రదీప ,అలంకార కుతూహల ,సోమా శంభుని ‘’కర్మ కాండ క్రమావళి ‘’లకు కూడా సంపాదకత్వం వహించాడు .

  జగద్ధార్ కీర్తి కిరీటం లో మరో కలికితురాయి -జాపనీస్ ,రష్యన్ సంస్కృత విద్యావేత్తలతోకలిసి 1913  లో 20 ఏళ్ళ వయసులో కాశ్మీర్ శైవ గ్రంధాలపై పరిశోధన చేయటం .భాసమహాకవి స్వప్న వాసవి దత్త నాటకాని రష్యన్ భాషలో అనువదించటానికి తోడ్పడ్డాడు .ఇదేకాక ప్రముఖ స్పానిష్ రచయిత సెర్వాంటిస్ రాసిన ‘’డాన్ క్విక్సోట్ ‘’నవలను పండిట్ నిత్యానంద శాస్త్రి తోకలిసి సంస్కృతం లోకి 1936 లో అనువాదం చేశాడు .ఒక యూరోపియన్ భాషా గ్రంధాన్ని సంస్కృతం లోకి  కాశ్మీరీ భాషలోకి  అనువదింపబడిన మొట్ట మొదటి గ్రంధమై రికార్డ్ సృష్టించింది .కాశ్మీర కవి పరమానంద రాసిన రాధా స్వయం వరం ,సుధామ చరిత్ర లను హిందీలోకి అనువదించాడు .ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ సంస్కృత పాండిత్య గరిమను మెచ్చి ద్వారకా పీఠాధిపతి 1955 లో ‘’విద్యా మార్తా0డ ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .ప్రయాగ విద్వత్ పరిషత్ ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు నిస్తే శ్రీనగర్ శారదా పీఠ రీసెర్చ్ సంస్థ ‘’గౌరవ డాక్టర్ ఆఫ్ ఇండాలజీ ‘’అందజేసింది 1976 లో జమ్మూ కాశ్మీర్ ప్రాదేశిక సంస్కృత పరిషత్ జాదూ గీర్వాణ గరిమకు గౌరవ సత్కారాలు అందించింది 5 వ ఏటా జ్ఞాన వయో వృద్ధు పండిత జగద్ధార్ జాదూ జగదాధారుని లో  కలిసిపోయాడు .

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.