గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
291-గోవింద భాష్య కర్త -బలదేవ్ విద్యాభూషణ (1764
బలదేవ్ విద్యాభూషణ్ ఆనాటి సంస్కృత మహా పండితులలో శ్రేష్ఠుడు . 18 వ శతాబ్దికి చెందినవాడు .రూప గోస్వామి స్తవమాలకు ‘’టీకా రాశాడు వ్యాకరణ అలంకార శాస్త్ర నిధి .చిలక సరసు అవతలి తీరపు ప్రసిద్ధ పండిత శిష్యరికం చేసి ఎన్నో శాస్త్రాలలో పట్టు సాధించాడు ,వేదం న్యాయం నేర్చి మైసూర్ వెళ్లి వేదాంతం అధ్యయనం చేసి తత్వవాది అయి అనేక పండిత ప్రకాండులను వాదం లో ఓడించాడు .పూరి కి తిరిగి వచ్చి , తత్వ వాద మఠ0 లో చేరాడు .రసికానంద గోస్వామి శిష్యుడు రాధా దామోదర్ చేత దీక్ష పొంది ‘’సత్ సందర్భం ‘’అధ్యయనం చేసి సన్యాసం దీక్ష తీసుకొని ‘’ఏకాంతి దాస్ ‘’గా ప్రసిద్ధి పొందాడు .’’గోవింద భాష్యం ‘’రాసి బలదేవ్ విద్యా భూషణ్ ప్రఖ్యాతి చెందాడు .
292-కళానిర్ణయ ,శ్రద్ధానిర్ణయ ధర్మ శాస్త్ర కర్త -రఘునాధ దాస్ ( 1750
18 వ శతాబ్ది ఒరిస్సా కవి రఘునాధ దాస్ వాసుదేవ దాసు కుమారుడు శ్రీనివాసుని మనవడు .సంస్కృత ధర్మ శాస్త్ర గ్రంధాలైన కళా నిర్ణయ ,శ్రద్ధా నిర్ణయ గ్రంధాలు రచించాడు.తత్వ శాస్త్రంగా ‘’న్యాయ రత్నావళి ‘’రాశాడు .తన మనవళ్లు నారాయణ ,సదాశివ ల కోసం ‘’అమర కోశం ‘’కు టీకా రాశాడు .ఇవికాక వ్యాకరణం పై వర్ధమాన ప్రకాశం అనే టీకా ను వర్ధమాన మిశ్ర వ్యాకరణమైన వర్ధమాన ప్రకాశం వ్యాకరణానికి రాస్శాడు తారక నిర్ణయం ఇతని మరొక గ్రంధం .దుశ్శకునాలపై ‘’ఉత్పాత తరంగిణి ‘’రాశాడు ఇతని సాహిత్య భూషణం విశ్వనాధ కవిరాజు సాహిత్య దర్పణానికి పూర్తిగా అనుకరణ
శాస్త్రాలలోనే కాక సాహిత్యం లో కూడా రఘునాథుడు గొప్ప కృషి చేసి మెప్పు పొందాడు .ఇతని ‘’వనదుర్గ పూజ ,కాటన త్రావిస్టారాక్షేపం ,ఛందస్సుపై ‘’భుట్టావళి ‘’,ఆయుర్వేదం పై ‘’వైద్య కల్ప ద్రుమ0 లకు కూడా కర్త .ఇవికాక ఇంకా వ్రాత ప్రతులుగా ఉన్న ఈకవి రచనలు -నిగ్గు ధాత ప్రకాశనం ,సోనీయ దశకారం ‘’, ‘’విలాప కుసుమాంజలి ‘’సంస్కృత మంజరి వంటివి ఎన్నో ఉన్నాయి .ఇవి మాత్రమే ననుకొంటే పొరబడ్డట్టే నీలో దయ టీకా ,రఘు వంశ టీకా ,శిశుపాల వద్ద టీకా భట్టికావ్య టీకా ,వంటి అనేక టీకాలు రాసిన అత్యంత సమర్ధుడైన కవి .ఇవన్నీ చూస్తే రఘునాధ దాస్ కావ్య నాటక అలంకార శాస్త్ర వ్యాకరణ నిఘంటు ,ఛ0దస్ దర్శన ,ఆయుర్వేదాది విద్యా గరిష్ఠుడు అనిపిస్తుంది .ఒక రకంగా’’ ఒరిస్సా మల్లినాథ సూరి ‘’రఘునాధ దాస్ .ఇవన్నీ 18 వ శతాబ్ది పూర్వార్ధం లోనే రచించాడు .
293-అబ్ద దూత కర్త -కృష్ణ శ్రీ చందన (1760
ఒరిస్సా కవులలో దూత కావ్యాలు ప్రారంభించి రాసిన తొలికవి కృష్ణ శ్రీ చందన 18 వ శతాబ్ద తొలికాలపు కవి .కాళిదాసుని మేఘ దూతానికి సమానంగా ఒరిస్సాలో సంస్కృతం లో ఈకవి ‘’అబ్ద దూతం ‘’రాశాడు .ఇది 36 ఫోలియోలలో 149 శ్లోకాల కావ్యం .కధ శ్రీరాముడు దండకారణ్యం నుండి లంక లోని సీతకు మేఘం ద్వారా సందేశం పంపటం .రాముడు సీతా విరహం తో సహజజ్ఞానం కోల్పోయి మాల్యవంత పర్వతం పై సంచరిస్తున్న మేఘానికి బ్రతిమాలి తన సందేశాన్ని అర్ధాంగి సీతకు తెలియజేయమని ప్రార్ధిస్తాడు . మందా క్రాంత శ్లోకాలలో కావ్యం రామ ణీ యకంగా ఉంటుంది .దీనికి ‘’మనోరమ ‘’అనే వ్యాఖ్యానాన్ని కవి ప్రభువైన భీమ ధర్మ దేవ ప్రభువు రాశాడు
294-విద్యా హృదయ నందన కావ్య కర్త -ప్రహరాజ మహా పాత్ర (18 శతాబ్ది మధ్యభాగం )
యోగి ప్రహారాజ్ మహా పాత్ర అని పిలువబడే ఈ కవి సంగీత వైద్య కళా జ్యోతిష శాస్త్రాలలో అపార జ్ఞాన సమున్నతుడు .ఇతనిరచన ‘’విద్యా హృదయ నందన ‘’కావ్యం .దీనివలన రాజా విక్రమ దేవుని రాజధాని ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని నందపూర్ అని తెలుస్తోంది .ఇతనిది మరోకటి స్మృతికావ్యమైన ‘’ సంక్షిప్త స్మ్రుతి దర్పణం ‘’.ఈకవి 18 వశతాబ్ది మధ్యకాలం వాడు . ఈకవి వంశం అంతా తరతరాలుగా ఒరిస్సా ప్రభువుల ఆస్థాన విద్వావంశులే కవులే .
295-త్రికాండ శేష నిఘంటుకర్త -పురుషోత్తమ దేవ
త్రికాండ శేష హారావాలి ఏకాక్షర కోశ ద్విరూప కోశ అనే నాలుగు నిఘంటువల కర్త పురుషోత్తమ దేవుడు .మహా సంస్కృత పండితుడుకనుకనే ఇన్ని కోశాలకు కర్త కాగలిగాడు .వీటిలో అతను ఉపయోగించిన పదజాలాన్ని చూస్తే ఒరిస్సా సముద్ర తీరదక్షిణ ప్రాంత కవి అనిపిస్తాడు .మహేంద్ర పర్వత సమీపం లో రుషికుల్య లోయలో వైతరణి ప్రాంతపు కవి
296-దుర్గా యజ్ఞ దీపిక కర్త -జగన్నాధ ఆచార్య (17 వ శతాబ్దం )
17 వశతాబ్దం లో ఒరిస్సాలో తంత్ర ,శాక్తే యా లు మిగిలిన రాష్ట్రాలలో లాగానే వ్యాప్తి చెంది వాటి గ్రంథ రచన కూడా సాగింది . జగన్నాధ ఆచార్య ‘’దుర్గా యజ్ఞ దీపిక’’సంస్కృతం లో రాశాడు .యితడు గొప్ప తంత్ర శాస్త్ర వేత్త . దీనికి 1695 రాజు గజపతి దివ్య సింగ్ దేవునికాలం లో రంగుని మహాపాత్ర కాపీ రాశాడు .ఈ వ్రాతప్రతివలన ఈకవికాలం 17 వ శతాబ్దంగా భావించారు
297-తంత్ర కళాసుధ కర్త -రామ చంద్ర ఉద్గాత (18 శతాబ్ది
18 శతాబ్దికవి రామ్ చంద్ర ఉద్గాత ‘’తంత్ర కళాసుధ ‘’రాశాడు 8 ఫోలియోల గ్రంధం .ఒరియా అక్షరాలలో సంస్కృతంలో రాయబడింది .మంగళాచరణ శ్లోకాలలో కవి ఏకామ్ర లింగ రాజ.శివ స్తుతి చేశాడు .ఇందులో ‘’రుద్ర యమా కాళికా స్తుతి ,కూళ చూడామణి ,కుమారి తంత్ర ,కాళికాపురాణ ,తంత్ర చూడామణి ఉత్తర తంత్ర ,దక్షిణామూర్తి సంహిత మొదలైన తాత్రిక గ్రంధాలను పేర్కొన్నాడు .దీని నకలు 18-10-1779 నవమి సోమవారం నాడు తీయ బడింది
298-ధర్మ శాస్త్ర గ్రంథ కర్త -శంభుకార వాజపేయి (1260-1330 )
ఒరిస్సాలో 12 ,13 శతాబ్దాలలో గంగ రాజులకాలం లో స్మృతికావ్యాలు బాగా వచ్చాయి .ఇక్కడే కాదు దేశమంతా గాంగేయరాజ్యకాలం లో శాస్త్ర గ్రంధాలు విరబూశాయి .ఒరిస్సాను 1279-1303 కాలం లో పాలించిన గాంగేయరాజు రెండవ నరసింహ దేవా శంభుకార వాజ్ పేయి కవి సమకాలికుడు .రాజు నుంచి ఏ రకమైన పారితోషికాన్ని ఆశించని కవి వాజ్ పేయి .అయితే అమర మైన శాస్త్ర రచనతో చిరస్ధాయి కీర్తి పొందాడు .శ్రద్ధా పద్ధతిలాగా సంస్కృత ధర్మ శాస్త్రం రాశాడు .ఇదికాక విశ్వ పధ్ధతి శంభుకార పధ్ధతి ,శ్రోతద్గ్జ్ఞాన పధ్ధతి ,వివాహపద్ధతి ,అగ్ని హోత్ర పధ్ధతి ,దశ పురాణం శేష్టి ,దుర్వాల కర్మ పధ్ధతి ,స్మార్త రత్నావళి కూడా ఈయన రచనలే .ప్రత్యేక పరిస్థితులలో యోగధ్యానం తో 70 వ ఏట 1330 లో స్వచ్చందంగా శరీర త్యాగం చేశాడు .
299-విద్యాచారపధ్ధతి ధర్మ శాస్త్ర కర్త -విద్యాకార వాజ్ పేయి (1330
శంభుకార వాజ్ పేయి కుమారుడు విద్యాకార వాజ్ పేయి తండ్రిని మించిన శాస్త్ర జ్ఞాన సంపన్నుడు .నిత్యాచార పధ్ధతి అనే శాస్త్ర గ్రంధం రాశాడు తరువాత ఇదే ‘’విద్యాచారపధ్ధతి ‘’గా బహుళ ప్రచారం పొందింది .ఒరిస్సా ధర్మ శాస్త్రాలలో ఇది ఎవరెస్టు శిఖరాయమానం . 1360 కవి విశ్వర భట్టు తన ‘’మదన పారిజాతం ‘’లో దీనిని అపూర్వంగా శ్లాఘించాడు
300-సిద్ధాంత దర్పణం కర్త -మహా మహోపాధ్యాయ సమంత చంద్ర శేఖర్(18 శతాబ్దం )
ఖగోళ శాస్త్రాన్ని అవపోశనపట్టిన మహా మహోపాధ్యాయ సమంత చంద్ర శేఖర’’సిద్ధాంత దర్పణం ‘’అనే గొప్ప ఖగోళ శాస్త్రమ్ రాశాడు .పూరీ జగన్నాధస్వామి మహా భక్తుడైన ఈకవి స్వామిపై ఎన్నో శ్లోకాలు భక్తి పురస్సరంగా రాశాడు .ఇవికాక దర్పణం సార దర్పణం దీపికా కూడా రాశాడు .దర్పణం సారం లో గ్రహాల గమనం పర్వతాల ఎత్తు కొలిచేవిధానం ,అమావాశ్య ,సంక్రాంతి తిధులను గణించే విధానం ఉన్నాయి .
ఒరిస్సా రధోత్సవం గురించి ఆలయ చరిత్ర గురించి తెలియ జేసే గ్రంధం ‘’జగన్నాధ స్థల వృత్తాన్తమ్ ‘’, శిల్ప శాస్త్రం ‘’శిల్ప ప్రకాశం ‘’శిల్ప విద్య కామబంధం ,విశ్వనాధ మహా పాత్రుని ‘’కంచి విజయ మహా కావ్యం ‘’(-ఇందులో పురుషోత్తమ దేవ మహారాజు కంచి రాణిని వివాహమాడటం )గ్రంధాలున్నాయి ..
ఆధునిక కాలం లోకూడా ఒరిస్సాకవులు పండిట్ ప్రబోధ కుమార్ మిశ్ర ,పండిట్ సుదర్శనచర్య ,పండిట్ చంద్ర శేఖర సారంగి ,డా ప్రఫుల్లకుమార్ మిశ్ర ,డా హరేకృష్ణ శత పధి ,పండిట్ గోపాల కృష్ణ దాస్ వంటి వారెందరో సంస్కృతంలో అద్భుత రచనలు చేస్తూ ప్రసిద్ధి చెందారు .
సశేషం
శ్రీ పూరీ జగన్నాధ రధోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-17- కాంప్-షార్లెట్-అమెరికా
—