గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం )

శ్రీరాముడు రావణాసుర సంహారం చేసి ,అయోధ్యలో పట్టాభి షిక్తుడైనతర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపోధ్యానాలకోసం హిమాలయాలకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు శ్రీ రామ గాధ  అంతా జ్ఞప్తికి వచ్చి దానిని బహు సుందరమైన శైలి లో అక్కడి హిమాలయ పర్వతాలలోని రాళ్లమీద  భక్తి భావ బంధురంగా తన చేతి గోళ్ళతో రామాయణ కథ నంతా శ్రీరామ పరాక్రమ ,క్షమాది గుణ సహితంగా రాశాడు .ఒక రోజు వాల్మీకి మహర్షి హనుమ రాయాణం రాస్తున్న సమయం లో అక్కడికి వచ్చాడు .మహర్షికి ఘనస్వాగతం పలికి హనుమ ఆయన్ను గాఢంగా కౌగిలించుకొన్నాడు .హనుమ రాసిన హనుమద్రామాయణం అంతా చదవాలని మహర్షి భావించగా హనుమ తాను శ్లోకాలను అందంగా రాసిన రాళ్లను చూపించాడు  . ఒక్కొక్క రాయిని పరిశీలనగా చూస్తూ వాల్మీకి మహర్షి భక్తహనుమాన రాసిన రామాయణ శ్లోకాలు  చదవటం ప్రారంభించాడు . శిలలపై  హనుమ రాసిన రామాయణ శ్లోకాలన్నీ చదవటానికి వాల్మీకి మహర్షికి వెయ్యి ఏళ్ళు పట్టింది .మహర్షి హనుమ రచనా పాటవానికి భక్తి తత్వానికి చలించిపోయాడు .ఇంతటి ఉత్కృష్ట రచన అంతకు ముందు ఎవరూ చేయలేదని ఆ తర్వాత కూడా చేయలేరని భావించాడు మహర్షి .హనుమద్రామాయణం పూర్తిగా చదివాక వాల్మీకి చాలా నిరాశ చెందాడు . హనుమ మహర్షి బాధకు కారణం అడిగాడు దానికి వాల్మీకి తానూ ఎంతో కస్టపడి శ్రమించి రాసిన శ్రీమద్రామాయణం హనుమద్రామాయణం ముందు ఏ మాత్రం నిలవలేదని తన రామాయణాన్ని లోకం లో ఇక అందరూ మర్చేపోతారని బాధగా ఉందన్నాడు మహర్షి .

 హనుమ  తాను  రాసిన లక్షలాది రాళ్లను, వాటిని కలిగి ఉన్న ఆ పర్వతాన్ని తన భక్తి తాత్పర్య  సర్వస్వాన్ని ఒక్క సారి కలయ తిరిగి చూసి  వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ,ఆ పర్వతాన్ని దానిపై తానూ శ్లోకాలలో రచించిన రామాయణమున్న లక్షలాది రాళ్లతో  సహా క్షణం లో పెకలించి  మారుత వేగం తో మారుతి దగ్గరలో ఉన్న సముద్రం లో ముంచేశాడు . అక్కడ ఏం జరుగుతోందో అని వాల్మీకి గ్రహించేలోపు ఈ పని అంటా పూరైంది మహర్షి తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు .హనుమతో తాను మరొక జన్మ దాల్చి హనుమద్రామాయణం అంతా మళ్ళీ తిరగ రాసి హనుమ కవితా శక్తిని భక్తి గరిమను ,ధైర్య సాహసాలను లోకానికి తెలియ జేస్తానన్నాడు .

 కాలం గడిచిపోయింది .మహాకవి కాళిదాసుకాలం లో హనుమద్రామాయణం రాయబడిన ఒకే ఒక్క రాయి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది .దాన్ని ఒడ్డుకు చేర్చి  అందులోని శ్లోక భావాన్ని విద్యావేత్తలెవరైనా చదివి అర్ధం చెప్పటానికి వీలుగా దాన్ని ఒక బహిరంగ ప్రదేశం లో నెలకొల్పారు .కాళిదాస మహాకవి హనుమద్రామాయణ0 గురించి  అంతకు ముందే విని ఉన్నాడుకానుక అది తన దృష్టంగా భావించి కాలం లో కలిసిపోయిన ఆ లిపిని జాగ్రత్తగా పరిశీలించి ఆది పూర్తి  శ్లోక0 కాదని అందులో ఒక్క పాదమేనని గ్రహించి అందులోని  భావాన్ని అందరకు ఇలా తెలియ జేశాడు -’’ఓ రావణా !శివుని కైలాసాన్ని ఎత్తిన నీ పది తలలు ఇప్పుడు యుద్ధభూమిలో కాకులు గద్దలకు ఆహారంగా భూమి పై పడివున్నాయి .నీ దశగ్రీవాల పొగరు ,గర్వాలు ఒక సత్ప్రవర్తకుని చేతిలో నేలరాలాయని గ్రహించు .’’

మహా పోరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు తమ రామాయణ ,సుందర కాండ ప్రవచనాలతో హనుమద్రామాయణాన్ని ఉదహరిస్తూ చెబుతూ ‘’ఇది హనుమరాసుకున్న రామాయణం ‘’అనటం నేను చాలా సార్లు విన్నాను .కానీ దానిప్రతికోసం నెట్ లో వెతికాను తెలుగు లిపిలో ఉన్నట్లు తెలిసింది కానీ లభ్యం కాలేదు .

 సంస్కృతం లో వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం ‘’కాక ‘’ఆధ్యాత్మ రామాయణం ‘’కూడా ఉంది .ఇది వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం లో ఉంది .ఇవికాక వశిష్ఠ రామాయణం లేక యోగ వాశిష్టం ,ఆనందరామాయణం,అద్భుత రామాయణం  ఉన్నాయి వీటికర్త వాల్మీకి మహర్షి .అగస్త్యుడు రాసినట్లు చెప్పబడుతున్న అగస్త్య రామాయణం కూడా ఉంది .కాశ్మీరకవి అభినందన -యోగవాశిష్టాన్ని సంక్షిప్తీకరించి ‘’లఘు యోగ వాశిష్ఠ ‘’కూర్చాడు .

312-అస్సామ్ లో సంస్కృత వ్యాప్తి

వేద పురాణ కాలం లో అస్సామ్ ను  కామరూప లేక ప్రాగ్జోతిషపురం అనేవారు . భారత దేశం లోని మిగిలిన రాష్ట్రాలలో లాగానే  మేఘాలయ ,మిజోరాం ,నాగా ల్యాండ్ లతో కూడిన ప్రాచీన అస్సామ్ లో సంస్కృతంతో బాటు   ,అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశారు . 7 వ శతాబ్ద ప్రాగ్జ్యోతిష రాజుల కాలం లో లభించిన తామ్ర  శాశనాలను బట్టి అప్పుడు సంస్కృతం ఎన్నో శతాబ్దాలనుండి ప్రజల వాడుక భాషగా ఉన్నట్లు తెలుస్తోంది .మధ్యయుగం లో అంటే 9 వ శతాబ్దం లో ఇక్కడ ‘’కాళికా పురాణం ‘’వంటి సంస్కృత గ్రంధాలు అస్సామ్ లో రాయబడినాయి .అప్పటినుంచే తంత్ర ,ధర్మ ,జ్యోతిష వ్యాకరణ గ్రంధాలుకూడా ఇక్కడ రాయబడినాయి .వీటికి సంస్కృత వ్యాఖ్యానాలు వాటితోపాటు సంస్కృత సాహిత్య రచనలు వచ్చాయి .

 ధర్మ శాస్త్రాలలో కామరూప సిద్ధాంతాన్ని ‘’కౌముది ‘’లు రచించి  మహా మహోపాధ్యాయ పీతాంబర సిద్ధాంత వాగీశుడు సుసంపన్నం చేశాడు .పశ్చిమ అస్సామ్ ను పాలించిన కామాట ,కొచ్చి వంశ రాజులు ,మధ్య అస్సామ్ పాలకులు మహామాణిక్య అతని వారసులు ,ఉత్తర అస్సామ్ రాజులు సంస్కృత భాషను బాగా పోషించారు .ఉత్తర భారతం లోనే  వాల్మీకి రామాయణాన్ని మొదటిసారిగా ప్రాంతీయ భాషలోకి అంటే అస్సామీ భాషలోకి అనువదించి రికార్డ్ సృష్టించాడు మహేంద్ర క0దాలి కవి .సంస్కృత వ్యాకరణ0 లో మాత్రం పెద్దగా గ్రంధాలు రాలేదు కానీ వచ్చినవిమాత్రం బాగా గుర్తింపు పొందాయి .

313-కాతంత్ర కౌముది కర్త -పుండరీకాక్ష విద్యాసాగర (1450-1500 )

శ్రీకంఠ పండితునికుమారుడు ,వాసుదేవ సార్వ భౌముని మారుటి  సోదరుడు పుండరీకాక్ష విద్యాసాగరుడు నవద్వీప0 లో జన్మించాడు అతడు శ్రీపతి దత్త రాసిన ‘’కా తంత్ర పరిశిష్ట ‘’కు ‘’వాక్తవ్య వివేక’’వ్యాఖ్యానం రాశాడు .అలాగే కాతంత్ర వ్యాకరణానికి దుర్గా రాసిన వ్యాఖ్యానానికి ఉప వ్యాఖ్యానం ‘’కాతంత్ర ప్రదీప ‘’రచించాడు . కాతంత్ర కౌముది ఇతని సుప్రసిద్ధ వ్యాకరణ గ్రంధం

314-కౌముది వ్యాఖ్య రచయిత -అభిరామవిద్యా లంకార

వంద్య ఘటీయ కుటుంబానికి చెందిన గాయాఘర శాఖలో అభిరామ విద్యాలంకార జన్మించాడు .సంక్షిప్త సార లేక సార పదీయ కు గోయిచంద్ర రాసిన కారకపద  వ్యాఖ్యానానికి విద్యాలంకార కౌముది వ్యాఖ్యానం రాశాడు .

315-సారార్ధ దీపిక కర్త -గోపాల చక్ర వర్తి (17 వ శతాబ్దం )

వంద్య ఘటీయా గయాఘరా శాఖలో 17 వ  శతాబ్దిలో  జన్మించిన గోపాల చక్రవర్తి కవి చంద్ర శిష్యుడు .క్రమాదీశ్వరుని  సంక్షిప్త  సారకు ‘’సారార్ధ దీపిక’’వ్యాఖ్య రాశాడు .

316-ప్రయోగ రత్నమాల వ్యాకరణ కర్త –మహా మహోపాధ్యాయ పురుషోత్తమ విద్యా వాగీశ  (16 వ శతాబ్దం)

16 వ శతాబ్దం నుండి అస్సామ్ లో సంస్కృత వ్యాకరణం లో కొత్త వ్యాకరణ సిద్ధాంత బోధన మొదలైంది .దీనికి ప్రాతిపదికగా మహా మహోపాధ్యాయ పురుషోత్తమ వాగీశ ‘’ప్రయోగ రత్నమాల వ్యాకరణం ‘’1568 లో రాశాడు .దీనితో అస్సామ్ లోయ ప్రాంతం లో పాణినీయ వ్యాకరణ బోధ మానేసి ఈ వ్యాకరణాన్ని బోధించటం ప్రారంభించారు .బెంగాలీ భాష మాట్లాడే బారక్ లోయలో మాత్రం ‘’కలాపా ‘’ముగ్ధ బోధ ‘’వ్యాకరణాలు బోధిస్తున్నారు .వీటిలోని అక్షరమాల తంత్ర సిద్ధాంతం పై ఆధారపడి ఉంటాయి .ఈ వ్యాకరణమేకాక పురుషోత్తమ వాగీశుడు 1- షడ బేధ ప్రకాశం 2-ఊష్మ భేద 3 ‘’వకార’’ నిర్ణయం 4-అంకురావలి కోశ 5-హారావలి కూడా రాశాడు .

317-లఘురత్నమాల కర్త -పండిత శివ నాధభుజ ర్బారువా (1880-1964 )

1880-1964 కాలపు పండిత శివనాధ భుజ ర్బారువా ‘’లఘురత్నమాల ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు ఇదికాక పీతాంబర సిద్ధాంత వాగీశుని ‘’దయాకౌముది ‘’పై ‘’ప్రబోధిని ‘’వ్యాఖ్య రాశాడు .ఆచార విజ్ఞాన ,హిందూక్రిస్టి మొదలైనవి రచించాడు

318-శబ్ద మంజరి కర్త -చంద్ర కాంత విద్యా లంకార (1870 )

1870 కి చెందిన చంద్ర కాంత విద్యాలంకార 1-శబ్ద మంజరి 2-పదమంజరి 3-ధాతు మంజరి 4-మండలాధ్యాయం రాశాడు .

319-ఆశుభోద వ్యాకరణ కర్త -నారాయణ చంద్ర విద్యాభూషణ (

నారాయణ చంద్ర విద్యా భూషణ -ఆశుభోద వ్యాకరణం రచించాడు .శౌరి దత్త భట్టా చార్య -రత్నమాల వ్యాకరణస్య టీకా తోపాటు ‘’గీతాయాహ్ తత్వ సారాహ్ ‘’రాశాడు .

320-వరరుచి వ్యాకరణ కర్త -మహా మహోపాధ్యాయ వేదాంత వాగీశ భట్టాచార్య (1765)

విద్యా వాగీశ చక్రవర్తి అని పిలువబడే మహా మహోపాధ్యాయ వేదాంత వాగీశ భట్టాచార్య  1765 లో ‘’వరరుచి వ్యాకరణం ‘’రాశాడు

 రామ భద్ర సర్వ భూషణ భట్టాచార్య  ‘’సమాస వివేచనం ‘’రాసి సమాసాలను నవ్య న్యాయం ఆధారంగా విస్తృతంగా చర్చించాడు .

321-విదగ్ధ ముఖ మండన కర్త -ధర్మ దాసు (1748)

 1748 లో ధర్మదాసు ‘’విదగ్ధ ముఖ మండనం ‘’శబ్దం, దాని శక్తి పై గ్రంధాన్ని దానికి వ్యాఖ్యానాన్ని కూడా రచించాడు .ఇందులో సంఖ్య ,లింగం సమ్మేళనం మొదలైనవి చర్చించాడు .

ధాత్వార్థ సాధన ,ప్రయోగ మంజరీలను గంగానాధ దేవ శర్మ రాశాడు .ఆఖ్యాత ప్రకరణం పై ’’ధాతు పాఠం ‘’ను ఒక అజ్ఞాత కవి రాశాడు .

ఈ  విధంగా  అస్సామ్ లో వ్యాకరణ గ్రంధాలు వెలువడి తానూ ఏ రాష్ట్రానికీ తీసిపోనని ప్రాగ్జ్యోతిషం తన వ్యాకరణ జ్యోతిని వెలిగించింది ..

 సశేషం –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.