వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )
శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రత వారం
26-6-17 సోమవారం మధ్యాహ్నం శ్రీ మైనేని గారు శ్రీ ఎల్లాప్రగడ వారు ఫోన్ చేసి నా పుట్టిన రోజు 26 అనుకొని ‘’ముందే కోయిలలు కూసినట్లు ‘’శుభాకాంక్షలు తెలియ జేశారు నిన్ననే మా అల్లుడు ,మనవళ్లు కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చారు . …
శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం
27 జూన్ తేదీలప్రకారం నా పుట్టిన రోజు .తిధులప్రకారం జ్యేష్ఠ బహుళ సప్తమి . .మా అమ్మ ఉన్నన్నాళ్ళు, ఆ తర్వాత కూడా చాలా ఏళ్ళు ఈ సప్తమి తిథినాడే పుట్టిన రోజు చేసుకునేవాడిని మా అమ్మ తప్పని సరిగా నాకు చాలా ఇస్టమని మైసూర్ పాక్ చేసేది .మా శ్రీమతీ ఎప్పుడూ చేస్తూనే ఉంది ..ఈ సారి అమెరికాలో ఉండటం మా పెద్ద మనవడు చి సంకల్ప్ (పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు )ఏం ఎస్ పాసవటం ,చికాగోలో ఉద్యోగం వచ్చి చేరటం ,వాడితమ్ముడు చి భువన్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్ పాసై ,కాలేజీలో ఇంటర్ లో చేరటం ,మా రెండవ అబ్బాయి శర్మకొడుకు చి హర్ష టెన్త్ పాసై కాలేజీ లో చేరటం వాడి చెల్లెలు మా మనవరాలు చి హర్షిత టెన్త్ కు రావటం ,మా మూడోవాడు మూర్తికొడుకు చి చరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసవటం వాడి చెల్లెలు మా మనవరాలు చి. రమ్య నైన్త్ క్లాస్ కు రావటం ,మా ఇక్కడి పెద్దమనవడు (మా అమ్మాయి పెద్దకొడుకు )చి శ్రీకేత్ టెన్త్ స్టాండర్డ్ కి రావటం వాడి తమ్ముళ్లు మా బుడ్డి మనవళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు సెవెంత్ స్టాండర్డ్ కు రావటం ,నాకు 77 వెళ్లి 78 ఏళ్ళు రావటం అన్నీ పురస్కరించుకొని 27-6-17 మంగళవారం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉదయం 7-15 నుంచి 11 వరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివా ష్టోత్తర సహస్రనామ పూజ ,బిల్వాష్టోత్తర పూజ చేశాను .ఉదయం 11 గం నుంచి మధ్యాహ్నం 1-15 వరకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నవగ్రహాలకు అష్టోత్తర పూజ తో సహా చేసుకున్నాం .అంటే సుమారు 6 గంటలు ఈ రూపం గా భగవధ్యానం లో గడిపే అదృష్టం కలిగింది … వ్రతం కాగానే మా అమ్మాయి శ్రీ మైనేనిగారు పంపిన ‘’ఘన నగదు ‘’కానుక ,ప్రత్యేక గ్రీటింగ్ ,తాను కొన్న ‘’ఘనవస్తు కానుక ‘’అంద జేసింది .నేను మా ముగ్గురు మనవళ్లను ”యధాశక్తి ”నగదు కానుక అందించాను . భోజనం లోకి మామిడికాయ పప్పు ,బీన్స్ కూర కొబ్బరి పచ్చడి ,పులిహోర ,బొబ్బట్లు చేసింది .ఈ మధ్య చాలాసార్లు మైసూర్ పాక్ చేయటం వలన వెరైటీగా బొబ్బట్లు చేసింది .శ్రీ మతి గోసుకొండ అరుణ ,వాళ్ళబ్బాయిలను భోజనానికి పిలిచాము వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా విషయం చెప్పలేదు మేము .వచ్చి ఆశ్చర్య పోయి0ది అరుణ .. మైనేనిగారికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపాను …మా అబ్బాయిలు శాస్త్రి శర్మరమణ మనవళ్లు మనవరాలు రమ్య .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు . ఇమెయిల్ ద్వారా సాహితీబంధువులు పంపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపాను ..శ్రీ సుంకర అప్పారావు గారు ,అమ్మాయివచ్చి పళ్ళు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు . సాయంత్రం మా ఇంటికి సుమారు 15 మైళ్ళ దూరం లో ఉన్న శ్రీ త్రిమూర్తి దేవాలయానికి వెళ్లి అక్కడి బ్రహ్మా ,శ్రీనివాస ,శివులను ,సరస్వతీ పార్వతీ పద్మావతీ అమ్మవార్లను మా ఆంజనేయస్వామిని దర్శించి మంగళవారం వీరందరి దర్శన భాగ్యం కలిగినందుకు సంతృప్తి చెందాం . 5 ఏళ్ళ క్రితం ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం .రెండు సార్లు వెళ్లి చూశామ్ .ఇప్పుడు నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట జరిగి ఆలయం దర్శనానికి వీలుగా తయారయింది .
బుధవారం రాత్రి మైనేనిగారి బావగారు శ్రీ రాచకొండ శర్మగారికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నాను . ఆ డాక్టర్ దంపతులకు 93 ఏళ్ళు వచ్చిన సందర్భంగా విశాఖ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వారు ఇంటికి వచ్చి ఇద్దరినీ పుష్పహారాలతో సన్మానించారని శర్మ గారు చెప్పారు .వారిద్దరూ మరింత ఆరోగ్యంగా శతాధిక ఆయుస్సుతో ఆరోగ్యంగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధించా .మార్చి 15 న మేము విశాఖ వెళ్లి ఆ ద0పతులతో కొన్ని గంటలు గడిపిన మధురానుభూతి మరువ లేనిది . రాత్రి ‘’గొట్టం’’లో సీతమ్మ అందాలు -రామయ్య చందాలు ‘’ సినిమా చూసాం నీట్ గా ఉంది .జగపతిబాబు ‘’కబడ్డీ కబడ్డీ ‘’ట్రాక్ కథ .
గురువారం గీర్వాణం -3 లో శ్రీ హనుమద్రామాయణం తో పాటు అస్సామ్ గీర్వాణకవుల గురించి రాసి 330 కు చేర్చా .సాయంత్రం అప్పారావు గారింటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఫలాలు ఇచ్చివచ్చాము .మా మనవరాలు చి రమ్య కు హాపీ బర్త్ డే చెప్పాం
రాత్రి రాజేంద్ర ప్రసాద్ చలపతిరావు నటించి కోన వెంకట్ సంభాషణలు రాసిన ‘’ఓనమాలు ‘’సినిమా ట్యూబ్ లో చూసాం చాలా పర్పస్ ఫుల్ పిక్చర్ .అందరూ బాగా చేశారు .ఎవరు ఎంత కు ఎదిగినా జన్మభూమిని మూలలను మరచిపోరద నే చక్కని సందేశం ఉన్న సినిమా ..
శుక్రవారం శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ నటించిన ఆకెళ్ళ నాటకం శ్రీనాధుడు చూసాం .చాలా బాగుంది .గుమ్మడి నటన బాగా నే ఉంది పద్యాలూ మైనేనిగారన్నట్లు కంచుగొంతు తో ఆలాపించాడుకాని బిగుసుకు పోయి నటించినట్లని పించిందినాకు .’’సినిమా గుమ్మడి ‘’రాజసం కొరవడింది .ఏమైనా పద్యనాటకం రాయటం ,దాన్ని ఆడటం ఆషామాషీ కాదు .దాన్ని మెప్పించారు రచయితా నటుడూ ..గీర్వాణం 340 కు చేరింది .
శనివారం -గీ -3 లో 351 మంది కవుల గురించి రాయగలిగా . దాదాపు ఇరవై రోజులకు ఆస్ట్రో ఫిజిక్స్ చదివి పూర్తి చేశా …ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదవటం నత్తనడక లో సాగుతోంది ..గొట్టం లో ఏవేవో సినిమాలు ట్రై చెశాముకాని అవీ ‘’గొట్టంలా’’ ఉండటం తో చూడలేదు .
2-7-17 ఆదివారం -ఉదయంమా అమ్మాయి రమణ ఫోన్ చేసి రాత్రి చెప్పాడని మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఎంసెట్ లో ఏం బి బి ఎస్ కు 1600 రాంక్ వచ్చిన శుభవార్త చెప్పింది వెంటనే మెయిల్ రాయటమేకాక కాకినాడకు ఫోన్ లో వాడికి కంగ్రాట్స్ చెప్పాను .నిరుడు ఎంట్రన్స్ లో ఈ కుర్రాడికి 26000 రాంక్ వచ్చింది . వాడిని బెజవాడ తీసుకొచ్చి ఏడాది ఇన్సెంటివ్ కోచింగ్ లో పెట్టాడు . దానికి తగ్గట్టే కుర్రాడూ కస్టపడి చదివి 1600 రాంక్ సాధించాడు అంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్ వస్తుంది . రూపాయి కూడా డబ్బు కట్టక్కర లేదు .చాలా మంచి వార్తమా అందరికి . మార్చిలోనే మా చిలుకూరి అంటే సి ఎల్ యెన్ శర్మ తల్లీ ,తమ్ముడు రెండు రోజుల తేడాలో ఉయ్యూరులో చనిపోయారు . వారిద్దరి కార్యక్రమాలు వీడే దగ్గరుండి జరిపాడు .చిలుకూరి అంటే మా ఇంట్లో కుర్రాడనే భావన . వాడు వాళ్ళ నాన్నగారు మా కుటుంబానికి చేసిన సేవలు తీర్చుకోలేనిది .అందుకే ఈ కుర్రాడి ఉపనయనానికి రెండేళ్ల క్రితం జోరున వర్షం లో కారులో కాకినాడ వెళ్లి ఆశీస్సులు అందజేశాము . అంతటి అభిమానం మాకు ఆ కుటుంబం అంటే .ఇంతకాలానికి చిలుకూరి దంపతుల కోరిక తీరింది .కొడుకు బాధ్యతగా చదివి వారి కోరిక తీర్చాడు .మంచికాలేజీ లో సీటు వచ్చి చదివి డాక్టరై అందరికి మరింత సంతోషం కలిగిస్తాడని ఆశిస్తున్నాము .
మా కుటుంబం లో డాక్టర్ చదివిన వాళ్ళెవరూ లేరు .మా రేపల్లె బాబాయి శ్రీ రాయ ప్రోలు శివ రామ దీక్షితులుగారి చివరి కొడుకు రామ కృష్ణ -నాకంటే ఐదారేళ్ళ చిన్నవాడు ఏం బి బి ఎస్ చదివి హైదరాబాద్ మల్కాజి గిరిలో ప్రాక్టీస్ చేస్తూ స్వ0త హాస్పిటల్ కట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు ..వీడు తప్ప మాలో ఎవరూ డాక్టర్ కాలేదు . ఇప్పుడు చిలుకూరి కొడుకు చి సాయి డాక్టర్ సీట్ సాధించాడంటే మా కుటుంబలో వాడు సాధించినంత ఆనందంగా ఉంది .
గీర్వాణం 356 కు చేరింది . ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా