గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3

368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

15 వ శతాబ్దం లో సారంగధరుడు రాసిన బృహత్ సారంగధర పధ్ధతి లో ధనుర్వేద విషయాలున్నాయి .దీన్ని ఇంగ్లిష్ లోకి పీటర్ పియర్సన్ అనువదించి 1888 లో బాంబే ప్రెస్ లో ప్రచురించాడు . దీన్ని గురించి కవి ఇలా చెప్పాడు -’’పరమ శివుడు వ్యాసమహర్షికి బోధించిన ధనుర్వేదం నుండి నేను సంగ్రహించి దీన్ని రాస్తున్నాను .సారంగధారుడనే నేను తప్ప ప్రపంచం లో ధనుర్వేదం లో  ప్రావీణ్యం ఉన్నవారులేరు .  కారణం నాకు శివుడు బోధించాడుకనుక .ఇందులోని విషయాలు శక్తి సమర్థులైన  దనుషుకుడైన చింతామణి చెప్పిన విషయాలను చూసి దీనిపై ఎవరికీ సందేహాలు ఉండాల్సిన పని లేదు .విలుకాండ్రు శ్రద్ధగా నేను చెప్పినట్లు సాధన చేసి మహా ధనుష్కులు కావాలి .సింహం గుహలో ఉంటేనే అరణ్యం లోని జంతువులు వణికి దగ్గరకు రానట్లు  మంచి విలువిద్యా వేత్త ఉన్న ఊరిలో కి శత్రువులెవరూ ప్రవేశించే సాహసం చేయరు .శిష్యుల గుణ పరీక్ష చేసి గురువు ఈ విద్య నేర్పాలి .బ్రాహ్మణ శిష్యుడికి ధనుస్సు క్షత్రియునికి ఖడ్గం ,వైశ్యునికి బల్లెం ,శూద్రునికి గదలలో గురువు శిక్షణ నివ్వాలి .బాహుయుద్ధం 7 రకాలు .వీటిని ధనస్సు ,చక్రం, బల్లెం గద,ఖడ్గం చురిక  చివరికి చేతులతో యుద్ధం చేయాలి .వీటన్నిటిలో ప్రావీణ్యం ఉన్నవాడిని ‘’సప్త యోధుడు ‘’అంటారు .నాల్గింటిలో శక్తిఉంటే ‘’భార్గవ ‘’అని రెండు మాత్రమే నేరిస్తే ‘’యోధ  ‘’ అని ఒక్కటే నేరిస్తే ‘’గణక ‘’అనీ అంటారు .హస్త ,పునర్వసు ,పుష్యమి ,రోహిణి ,ఉత్తర ,అనూరాధ అశ్విని రేవతి నక్షత్రాలలోను దశమినాడు  పుట్టినవారు విలువిద్య లో నేర్పరులౌతారు .ధనుర్విద్య నేర్చుకొనే ముందు గురువుకు బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్త్రీలకూ సహ పాఠకులకు విందు నివ్వాలి అంతకు ముందు శివ పూజ చేయాలి .ధనుర్విద్య నేర్చే శిష్యుడు జింక చర్మం ధరించి వింటికి బాణాలకు పూజ చేసి ,రెండు చేతులతో నమస్కరించాలి .గురువు శివమంత్రాలు చదువుతూ శిష్యుని చేతులను శుభ్రపరచి వాటిపై తన చేతులుంచాలి .విఘ్న నివారణకు పూజలు చేయాలి .శిష్యుడి జుట్టుకు ముడివేసి దానిపై శివుని శిరసుపై  కేశవుని రెండుబాహువులలో ,బ్రాహ్ణను నాభిలో  ,వినాయకుని తొడలలో ఆవాహన చేయాలి .ఓం హోమ్ మంత్రం తో  ఈ దేవతలను స్థాపించిన చోట పూజించాలి -పూర్తి మంత్రం –

‘’ఓం హోమ్ శిఖా స్థానే శంకరాయనమః -ఓం హోమ్ బాహువో కేశవాయనమః -ఓం హోమ్ నాభి మధ్యే బ్రాహ్మణే నమః -ఓం హోమ్ జంఘాయోర్ గణపతయే  నమః ‘’

 ఇలా 226 శ్లోకాలతో ‘’శివ ధనుర్వేదం ‘’ను వ్యాస మహర్షి శివుడు బోధించగా రాశాడని సారంగ ధరుడు పేర్కొన్నాడు .

369-మల్ల యుద్ధ పురాణకర్త -జ్యేష్ఠ మల్లుడు (13 వ శతాబ్దం )

మల్లయుద్ధం రామాయణ భారత కాలం నుండే ఉంది .దీనికి సంబంధించిన నీతి నియమాలు ప్రచారం లో ఉన్నాయి .. సిద్దార్ధ గౌతముడు కూడా గొప్ప మల్ల యుద్ధ విశారదుడు . 1124-1138వరకు పాలించిన చాళుక్యరాజు మూడవ సోమేశశ్వరుడు పండుగ పబ్బాలలొ ఖాళీ సమయాలలో’’ మల్ల వినోదం ‘’ ఏర్పాటు చేసినట్లు ఆయనే రాసిన ‘’మానసోల్లాసం ‘’లో ఉంది .మల్లయోధులను వయసు బరువు ,బలం ఆధారంగా విభజిస్తారని ,వాళ్ళు ఎలా వ్యాయామం చేయాలో ఏవి తినాలో కూడా వర్ణించాడు .రాజులే మల్లయోధుల బాధ్యత వహించి వారికి కావలసిన ఆహారపదార్ధాలు పాలు మాంసం పప్పు ధాన్యాలు సమకూర్చాలి .వారిని ఆడవారికి దూరం గా ఉంచి శరీరం రాటు దేలేట్లు బాడీ బిల్డింగ్ కోసం శిక్షణ నిప్పించాలి . మల్ల పోరాటం లో కదలికలు దెబ్బలు వగైరా అన్నీ చర్చించాడు రాజు

 అసలు మల్ల యుద్ధం పై ప్రత్యేక పురాణమే రాశాడు 13 వ శతాబ్దానికి చెందిన గుజరాత్ బ్రాహ్మణ మల్లయోధకవి జ్యేష్ఠ మల్లుడు . ఇందులో మల్లురలో ఉండే తేడాలు వారి ఆహారం ,సాధన ,చేయాల్సిన వ్యాయామాలు ,పాటించాల్సిన టెక్నీక్ లు  కుస్తీ గోదా తయారు చేసేపద్ధతి  కుస్తీ పట్టేవారు ఏ కాలం లో ఏయే పదార్ధాలు తినాలి అన్న అన్ని విషయాలు ఇందులో జ్యేష్టమల్ల రాశాడు .ప్రథమాధ్యాయం లో ప్రారంభ శ్లోకం –

‘’ఏకస్మినన్ కమలాకటాక్ష వివరే సందగ్ధార్యతే – క్షీరాబ్దే రపరత్న దీర్ఘ ధవలైహ్ కల్లోలలోలాత్కరైహ్

వ్యగ్రస్యాపి సామార్దితప్రమ నవ్యాపరాలబ్దో దయా -శ్చత్వారో వితరంతు వాంఛిత ఫలం హరే ర్భగవః ‘’

ధర్మా ధర్మ విదిహ్ ప్రోక్తో బ్రాహ్మన్ సమ్యక్ శ్రుతో మయ -విద్యాశ్చ వివిదాహ్ స్వామిన్ వర్ణ భేదాసత్వనేకధా

మల్ల విద్యా త్వయా ప్రోక్తం మమ సంక్షేపతః పురో -విస్తరేణ  మమ బ్రూహి తస్యాం కౌతూహలం హి మే

 ఈ మల్లపురాణం లో నారద బ్రహ్మ కృష్ణ బలరామ ,సోమేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ల మధ్య జరిగిన సంవాదం వీరు తప్ప ఇంకా ఎవరిపేరూ ఉండదు .చివరలో తాను  కాశ్యప గోత్రీక బ్రాహ్మణుడనని చెప్పుకొన్నాడుకవి .ఇది 18 అధ్యాలున్నగ్రంధం మొదటి అధ్యాయం లో కంసవధ తర్వాత కృష్ణాదులు ద్వారకకు ప్రయాణమవటం దారిలో శ్రీరాముడు తపస్సు చేసి బ్రాహ్మణులకు ఆవాసం కల్పించిన ధర్మారణ్యం లోని మయూరాంబలం  పట్టణానికి రావటం ,రెండవ అధ్యాయం లో గర్గ గోత్రీకుడు సోమేశ్వరుడు అడుగగా కృష్ణుడు మల్లయుద్ధాన్ని గురించి వివరించి అతనినికూడా మల్లయోధుడవమని ప్రోత్సహించటం ,ఆయన సందేహాలు అడగటం వాటిని కృష్ణుడు నివారించి మల్ల యుద్ధాన్ని గురించి బోధించటం ,చివరి అధ్యాయం లో మల్లశాస్త్ర వివరనతర్వాత బలభద్రుడు విసుగుతో అరణ్యానికి వెళ్లబోతుండగా ఆపటం మహేశ్వరి బ్రాహ్మి వైష్ణవి శక్తి లను సృష్టించటం సోమేశ్వరుడు మల్ల విద్యాభ్యాసం చేసి కృష్ణుడిని తనకు  రక్షగా  ఉండమనటం కృష్ణుడు రక్షణకోసం లంబాజా దేవి ‘’ని సృష్టించటం .మొత్తం కాదాంశం .

370- సంస్కృతాన్ని శిరో భూషణంగా శిరసావహిస్తున్న ఉత్తరాఖండ్

కర్ణాటకలో ఒకటి రెండుగ్రామాలలో ప్రజలందరూ సంస్కృతం లోనే మాట్లాడుకొంటారని మనం తెలుసుకున్నాం . దేవతా భూమి అయినా ఉత్తరాఖండ్ తానేమీ వెనకబడి లేదని నిరూపించింది అక్కడ సంస్కృతం రెండవ భాషగా చేసి ప్రోత్సహిస్తున్నారు .స్కూల్స్ లో సంస్కృతం తప్పని సరి చేశారు .పుణ్య స్థలి ఋషీకేశ్ ను సంస్కృత సిటీ ని చేసిందిప్రభుత్వం .అక్కడి ‘’భంటోలీ’’గ్రామ ప్రజలందరూ  ఏడాది న్నర కాలం నుంచి   సంస్కృతం లోనే మాట్లాడుకొంటున్నారు .ముఖ్యంగా మహిళలు  ఫోన్ పలకరింపుల్లో కూడా ‘’హరి ఓం నమస్తే ,భవాన్  కదం అస్థి ‘’అని అంరంటారు . వీళ్ళు కాషాయం కట్టుకున్నవాళ్ళు కాదు సాధారణ గ్రామజీవులు .ఉత్తరాఖండ్ లో భాంటోలి దేహరాడూన్ కు 450 కిలో మీటర్ల దూరం లో ఉన్న కుగ్రామం .వారి మాతృ భాష స్థానిక ‘’కుమోని ‘’కానీ ఇప్పుడు .శతాబ్దాలతరబడి వస్తున్న సంస్కృతం.  భాంటోలి లోని 500 గ్రామస్తులందరు  గీర్వాణమే మాట్లాడుతారు  .దీనికి కారణం సుమారు ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భా0టోలి గ్రామాన్ని ‘’భాంటోలి సంస్కృత గ్రామం ‘’గా ప్రకటించటమే . 30 ఏళ్ళ శ్రీ మనోజ్అధికారి మొదటి సంస్కృత ఆచార్యుడుగా ఇక్కడికి వచ్చి గ్రామస్తులకు సంస్కృతం నేర్పటం ప్రారంభించాడు .ఇప్పుడు దేశం లో 5 వ సంస్కృత గ్రామంగా భాంటోలి రికార్డ్ సృష్టించింది .మిగిలిననాలుగు కర్ణాటకలోని మత్తూర్ ,హోషనహళ్లి  ,మధ్యప్రదేశ్ లోని మొహద్ , ఝిరీ గ్రామాలు . ఈ అయిదు సంస్కృత భారతిఅనే స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యం లో నడుస్తున్నాయి .

  బయటి గ్రామాలనుంచి భాంటోలి గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు అంతా సంస్కృతం లోనే మాట్లాడుతుంటే కలా  నిజమా ,తాము 5 వశతాబ్దం లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది .సంస్కృతం దేవ భాష అని వీరందరూ విశ్వసించి అనుసరిస్తున్నారు .ఇప్పుడు హరిద్వార్ లో ఉన్న ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృతం లో బీఎడ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది .రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి సంస్కృతాన్ని రెండవ భాషగా హిందీని మొదటిభాషగా  డిక్లేర్   చేసి ప్రోత్సహించింది .సంస్కృతం లో శాస్త్రి కోర్సు పూర్తి చేసినవారు డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారికే సంస్కృత బీఎడ్ కు అర్హులు .ఆగస్టు 15నుంచి అడ్మిషన్లు ప్రారంభమై 175 మంది విద్యార్థులతో 12 మంది అధ్యాపకులతో కళకళ లాడుతోంది .హరిద్వార్ -రూర్కీ జాతీయ రహదారిలో సంస్కృత యుని వర్సిటీ నిర్మాణం శరవేగం గా జరుగుతోంది .యూనివర్సిటీ మొదట ఇద్దరు డిగ్రీ సంస్కృత విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు  యోగా ,కంప్యూటర్  జరలిజం లైబ్రరీ సైన్స్  అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కు చెందిన 150 మంది విద్యార్థులతో నిండుగా ఉంది .

  భారత దేశం లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కటే సంస్కృతాన్నిమొట్టమొదటిసారిగా  రెండవ అధికార భాషగా ప్రకటించింది .ఈ బిల్లు 2009 లో పాస్యయింది .కాళిదాస మహాకవి ఉత్తరాఖండ్ లో జన్మించాడని ఇక్కడి ప్రజల పూర్తి విశ్వాసం .రాష్ట్రం లో అనేక సంస్కృత మీడియంపాఠశాలలు కాలేజీలు సంస్కృత విద్యా వ్యాప్తికి సహకరిస్తున్నాయి .ప్రభుత్వం కూడా వీటికి తగినంత సహాయ మందిస్తోంది  . నిత్యవాడకం లో సంస్కృతాన్ని ఉపయోగించటం ,పోటీ పరీక్షలలో పాల్గొనిబహు  మతులు సాధించటం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రదమా ,ద్వితీయ  తృతీయ బహుమతుల కోసం ఒక లక్షా ,యాభై వేలు, 25 వేలు నగదు పారితోషికాన్నిస్తోంది .ప్రభుత్వం ఆధ్వర్యం లో 100 దాకా సంస్కృతపాఠశాలలు కాలేజీలు నడుస్తున్నాయి .వీటన్నిటికీ ప్రాభుత్వం పూర్తి గ్రాంట్ సమకూరుస్తోంది .సంస్కృత యూనివర్సిటీతోపాటు మరి 4 యూనివర్సిటీలలో సంస్కృతం బోధిస్తున్నారు .ఉచిత మధ్యాహ్నభోజనం తోపాటూ కంప్యూటర్లు స్కాలర్షిప్ లు ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తోంది .

 ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమీ కూడా తనదైన శైలిలో సంస్కృతభాషాభి వృద్ధి చేస్తోంది .సంస్కృతనాటకాలు నృత్యాలు సంగీతకచేరీలు ,ఆశుభాషణం  జనరల్ నాలెడ్జి బృందగానం  కార్యక్రమాలు జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించి బహుమతులు అందిస్తోంది .సంస్కృత నాట్య యాత్రలు సంస్కృత కుటుంబ సమ్మేళనాలు ,సంస్కృత గ్రామానిర్మాణం నిర్వహిస్తోంది .

వీటికి మించిహరిద్వార్ లోని  ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమి   భారత దేశం లోనే మొట్టమొదటిసారిగా సంస్కృత టి వి . ఛానల్ ప్రారంభించి ఆదర్శ ప్రాయంగా నిలిచింది .వార్తలేకాక సంస్కృత సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది .ఇది మాత్రమేకాదు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం ను సెప్టెంబర్ లో నిర్వహిస్తోంది .ఇలా గీర్వాణ భాషకు గొప్పతనం అన్ని కోణాలలో అన్ని రూపాలలో సంతరిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభినందనీయం ..

371-త్రిపురా రహస్య కర్త -హరితాయనుడు

దత్తాత్రేయమహర్షి పరశురాముని బోధించిన అద్వైత తత్వమే త్రిపురా రహస్యం .ఒకరకంగా ఏ రహస్యములేనిది అని అర్ధం .త్రిమూర్త్యాతీతమైన విషయం అని భావం .త్రిపురాలు అంటే మూడు పట్టణాలు మాత్రమేకాదు -జాగృతి ,స్వప్న సుషుప్తులు .వీటిలోని అంతశ్చేతన నే  ‘’శ్రీ త్రిపుర సుందరి  ‘’అంటారు  .ఆమెయే  మాతృమూర్తి చండిక.ఈ గ్రంధం అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది . ఈ తత్వాన్ని పరమ శివుడు విష్ణుమూర్తికి బోధిస్తే ,ఆయన మానవ రూపం లో  దత్తాత్రేయ  అవధూతగా  జన్మించి  పరశురాముని బోధిస్తే ,ఆయన హరితయానుడికి చెప్పాడు .దత్తాత్రేయ ,పరశురాముల సంవాదమే త్రిపురారహస్యం .దీనికే ‘’హరితాయన సంహిత ‘’అనే పేరుంది .హరితాయనుడు హరితుని కుమారుడు . ఈ గ్రంధం 3  ఖండాలలో  12 ,000 శ్లోకాలలో ఉంటుంది .మొదటిఖండం మహాత్మ్య ఖండం రెండవది జ్ఞాన ఖండం మూడవది చర్య ఖండం . అత్రి ముని అనసూయ దంపతుల ప్రార్ధనమన్నించి త్రిమూర్తులలో బ్రహ్మ చంద్రుడుగా శివుడు దూర్వాసమహర్షిగా ,విష్ణువు నారాయణుడు అనే దత్తాత్రేయునిగా జన్మిస్తారు .జమదగ్ని రేణుకాదేవి దంపతుల కుమారుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞతోతల్లిని చంపి దేశం లో క్షత్రియ వంశ నిర్మూలనకు దిగి ,శ్రీరాముని చేతిలో పరాభవం పొంది గర్వం ఖర్వమై హిమాలయాలకు వెడుతూ దారిలో బృహస్పతి తమ్ముడైన అవధూత సంవర్తుని దర్శించగా  దత్తాత్రేయుని శరణు వేడ మని హితవు చెబుతాడు .దత్తాత్రేయునికి పరశురాముని జరిగిన జ్ఞాన సంవాదం లో వెలువడింది త్రిపురా రహస్యం .దీనితో ఆత్మ జ్ఞానం పొందిన పరశురాముడు మలయ పర్వతాలలో తపస్సు లో కాలం గడిపాడు . దీనికి ఇంగ్లిష్ అనువాదాలు చాలా ఉన్నాయి .తెలుగు లో లోనూ అనువాదాలు వచ్చాయి . ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’ఏకైక భావ తుస్టై కర  సైకత జనప్రియ -ఏ దమానప్రభా వైదద్భక్త పాతకనాశినీ

ఏలామోద  ముఖై నౌద్రి శక్రాయుధ సమాస్థితః -ఈహాశూన్యే ప్సితే శాది సేవ్యే శానా వరాఙ్గతా ‘’

372-న్యాయ బిందు టీకా కర్త -ధర్మోత్తర (క్రీశ 800 )

బౌద్ధ ప్రమాణాలపై ప్రామాణిక గ్రంధాలురాసిన ధర్మోత్తర 8 వ శతాబ్దికి చెందినవాడు . ధర్మ కృతి పై అనేక వ్యాఖ్యానాలు రాశాడుకాని సంస్కృత న్యాయబిందు టీకా ఒక్కటే దక్కింది .ఇవికాక అపోహ నామ ప్రకారణ ,క్షణ భంగ సిద్ధి, పరలోక సిద్ధి ,ప్రమాణ పరీక్ష ,ప్రమాణ వినిశ్చయాటీకా కూడా రచించాడు .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.