గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

            గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశాడు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో[] ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.

కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.

పురస్కారాలు

ప్రముఖుల అభిప్రాయాలు

 • మహాకవి శ్రీశ్రీ – నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.

 • విశ్వనాథ సత్యనారాయణ – మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.

రచనలు

 • కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.

 • ఊర్వశి కావ్యము,

 • అమృతవీణ – 1992 – గేయమాలిక

 • అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి

 • బహుకాల దర్శనం – నాటికలు,కథలు

 • ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు,

 • కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు

 • మంగళకాహళి – దేశభక్తి గీతాలు

 • శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు

 • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993

 • మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996

 • శ్రీ విద్యావతి – శృంగార నాటికలు

 • యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు

 • మహాతి

 • వెండితెర పాటలు – 2008

దేశభక్తి గీతం—భారత మాత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!

జయ జయ జయ…..

జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!

జయ జయ జయ…….

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!

జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!

జయ జయ జయ…….

367-చిన్నలకు పెద్దలకు సంస్కృత0 బోధిస్తున్న టీనేజ్ కుర్రాళ్ళు –అశోక్, సిద్ధార్ధ ( 2000)

9 ఏళ్ళ అశోక్ ,11 ఏళ్ళ సిద్దార్ధ అమెరికాలో పెన్సిల్వేనియా కుర్రాళ్ళు .వాళ్ళ గురువుగారు భారతీయ భోజనం ఎలా చేయాలో  బోధించినందుకు సంస్కృత శ్లోకం లో —’’నమో నమః ఆవయోవ గురు భారతస్య  భోజనస్య పద్ధతిమ్ ఆవామ్ వర్ణిత వాన్ ‘’అంటూ గురు స్తుతి చేసిన వినయ సంపన్నులు .

యు ట్యూబ్ లో ‘’సాంస్క్రిట్  కార్నర్ ‘’ను ఈ చిచ్చర పిడుగులు యెర్ర కుర్తా లతో ఫాలభాగాన విభూతి రేఖలతో పంచామృత ప్రసాదం శ్లోకాలు చదువుతూ వీడియోలో కనిపిస్తారు .ఈ వీడియోని ఇప్పటికి 50 వేలకు పైగా జనం చూసి మెచ్చారు .సంస్కృత కార్నర్ కు 800 కు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు . ఈ లెక్కలు ఇదివరకటి దాకా ఈసోదరులకు ఒక ఇన్స్పిరేషన్ గా  ఉండేది .ఇప్పుడు బాగా ప్రచారం లో ఉన్నారు కనుక వాటిపై దృష్టి లేదు అంటారు ..

 ఇప్పుడు టీనేజ్ లో ఉన్న ఈ సోదరద్వయం ధారాళంగా సంస్కృతం రాస్తారు ధారాళంగామాట్లాడాడుతారు .బి ఏ తో సమానమైన ‘’కోవిద ‘’కోర్సు చదివి డిస్టింక్షన్ లో సిద్దార్ధ ఉత్తీర్ణుడయ్యాడు .ఇప్పుడు సంస్కృత పంచకావ్యాలు అధ్యయనం చేస్తున్నాడు .ఒకప్పుడు హాబీ గా ప్రారంభమైన సంస్కృతం ఇప్పుడు ఈ సోదరుల నిత్య జీవిత వ్యాపకమే అయింది .2010లో సంస్కృతాన్ని తీవ్రంగా అధ్యయనం చేయాలన్న కోరికతో చెన్నై కి చేరుకున్న ఈ సోదరులలో 16 ఏళ్ళ సిద్దార్ధ చెన్నై రామకృష్ణా మఠం లో సంస్కృతాన్ని 10 ఏళ్ళ పిల్లలనుంచి సీనియర్ సిటిజెన్ల వరకు 10 రోజుల ఇంటెన్సివ్ వర్క షాప్ లో బోధిస్తున్నాడు .దీనిపై సిద్దార్ధ స్పందిస్తూ ‘’ఈ వర్క్ షాప్ లో నేను బాలుర నుంచి వృద్ధుల వరకు సంస్కృతం ను ఒక్క తమిళ మాటకాని ఒక్క ఇంగ్లిష్ మాటకాని వాడ కుండా అంతా సంస్కృతం లోనే బోధించటం గొప్ప అనుభూతిగా ఉంది .ఇది నాకు పెద్ద మానసిక శ్రమ కనుక నేను అనేక ఆధారాలు సాంకేతికాలు (ప్రాప్స్ అండ్ సైన్స్)లపై ఆధార పడాల్సి వచ్చింది’’  అని నిజాయితీగా చెప్పాడు .

 ఈ సోదరుల తల్లి శ్రీమతి విజయ విశ్వనాథన్  వీళ్లకోసమే చెన్నైకి వచ్చి వారికి  స్ఫూర్తిగా నిలిచింది .సుమారు 15 ఏళ్ళక్రితం స్వామి దయానంద సరస్వతి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది భగవద్గీత ,ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అధ్యయనం చేస్తూ సంస్కృతంలో గట్టిగా కృషి చేసింది .అమెరికాలో  ‘’సంస్కృత భారతి ‘’లో నేనూ నా పిల్లలతో పాటు సంస్కృతం నేర్చుకున్నాను .మేము ముగ్గురం కలిసి సంస్కృత పరీక్షలు రాశా0 .మా ఇంట్లో సంస్కృతం ఒక అఫీషియల్ సీక్రెట్ మాకు ‘’అంటూ చిరునవ్వుతో ఆమాతృమూర్తి’’ వార్టన్  బిజినెస్ స్కూల్ ‘’పూర్వ విద్యార్థిని , భర్తతో కలిసి ‘’ఫార్మా స్యూటికల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘’నిర్వహిస్తున్న   శ్రీమతి విజయ మాధవన్ చిరునవ్వుతో  చెప్పింది .

 పెన్సిల్వేనియా లో ఉన్నత వర్గాల వారు చదివే ప్రయివేట్ స్కూల్ లో చదువుతున్న తన ఇద్దరు పిల్లలను ఆ స్కూల్ మాన్పించి ఇంటి వద్దనే తానే  వారికి విద్య బోధించటం ప్రారంభించింది .దీనికి ఆమె చెప్పినకారణాలు ‘’మా వాళ్ళు చదివే స్కూల్ ఉన్నత వర్గాల పిల్లలు చదివేది పాప్ కల్చర్ బాగా ఒంటబట్టిన వారి మధ్య మా పిల్లలు ఉంటె మన విలువలు మృగ్యమై పోతాయనే వ్యధతో మాన్పించి నేనే మన విద్యను ఇంటివద్దే నేను ఫిజిక్స్ లెక్కలు నేర్పించాను .ఇంగ్లిష్  ,ఫైన్ ఆర్ట్ లను  ఆన్ లైన్ లో నేర్చుకొన్నారు  .రెగ్యులర్ గా ఆన్ లైన్ పరీక్షలు రాసి పాసవుతున్నారు .అని గర్వంగా చెప్పింది ఆ తల్లి .

 ఇండియాకు తిరిగి వచ్చాక స్కూల్ లో చేరారుకాని కొద్దికాలానికే మానేశారు .ప్రస్తుతం అశోక్ ,సిద్దార్ధ ఇద్దరు ‘’స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ‘’ఆన్ లైన్ హై స్కూల్ కర్రిక్యులం చదువుతూ స్టాన్దర్డ్ పరీక్షలు రాస్తున్నారు . సాధారణ స్కూల్ విద్య చదవ లేదనే దుగ్ధ వారికి లేదని చెప్పారు .సమయం ఎక్కువగా ఉండటం వలన సంగీతం ,వయోలిన్ నేర్చుకొంటూ వేద క్లాసులకు వెడుతూ సంస్కృతం బోధిస్తున్నారు .కర్ణాటక సంగీతాన్ని శ్రీమతి జి సీతా లక్ష్మి అమ్మాళ్ వద్ద ,వయోలిన్ శ్రీమతి చారుమతి రఘురామన్ వద్ద అభ్యసిస్తున్నారు .అరుదైన సంగీత కాంపోజిషన్స్ ను పద్మశ్రీ ఎస్ ఆర్ జానకీరామన్   వద్ద నేర్చుకొంటున్నారు . వేదం పాఠాల తర్వాత తగినంత  సమయం ఉంటోందికనుక తమకిష్టమైనవాటిని కష్టపడకుండా ఇష్టపడి నేరుస్తున్నామని సంతృప్తి వ్యక్తపరిచారు ఈ టీనేజీ కుర్రాళ్ళు ..’’మా ఇంట్లో టి వి లేదు .ఒక సెల్ ఫోన్ ఒక కంప్యూటర్ మాత్రమే ఉన్నాయి వాటినికూడా విద్యా వ్యాసంగానికే వాడుతాము .మా ఇంట్లో వేరే ఏ పరికరము లేదు .అందువల్ల మా అబ్బాయిలు వాళ్లకు కావాల్సిన విషయాలమీద పూర్తిగా దృష్టి పెట్టి చదివి ఉన్నతి సాధిస్తున్నారు .అదే మా అందరికి పరమానందం గా ఉంది అదే మాకు సంతృప్తి ‘’అన్నది ఆ బంగారు బాబుల మహా తల్లి  శ్రీమతి విజయ మాధవన్ . ఈ ఆదర్శ కుటుంబం అందరికీ ఆదర్శం అని పించి వీరి గురించి గీర్వాణం లో రాశాను .

 (ఆధారం -దీపా వెంకట్రామన్ 20-12-16 న ది హిందు  పత్రికలో రాసిన ‘’ది  టీనేజ్ సాంస్క్రిట్  స్కాలర్స్ -’’)

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1Inline image 2

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.