గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
377– సమన్వయ యోగ ప్రచారకులు -స్వామి శివానంద (1887-1963
తమిళనాడులో తిరునల్వేలి వద్ద పత్తమదైలో స్వామి శివానంద సరస్వతి కుప్పుస్వామిగా 8-9-1887 న జన్మించారు .త0జావూరు మెడికల్ స్కూల్ లో చదివి ”ఆంబ్రోసియా ”అనే మెడికల్ జర్నల్ నడిపారు .మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ ప్రాక్టీస్ చేశారు .పేదలకు ఉచిత చికిత్స చేశారు .మనసులో ఆధ్యాత్మిక భావనలు పూర్తిగా చుట్టుముట్టి 1923 లో మలయా వెళ్లి ఇండియా తిరిగి వచ్చి కాశీ ప్రయాగ ఋషీకేశ్ చేరి స్వామి విశ్వానంద సరస్వతి ని దర్శించి కైలాస ఆశ్రమ మండలేశ్వర ‘విష్ణుదేవానంద ‘తోకలిసి ”విరజా హోమం;;నిర్వహించి సన్యాసాశ్రమం స్వీ కరించి శివానంద ”ఆశ్రమనామం పొంది,రిషీకేశ్వర్ లో లక్షణ ఝాలా వద్ద 1927 లో స్థిరపడి వైద్య కేంద్రం పెట్టి రోగులకుఉచిత వైద్య సేవ చేస్తూ యాత్రికులకు సాయం చేస్తూ ,తపస్సు ధ్యానాలతో గడిపారు .
పరివ్రాజకునిగా దేశమంతా పర్యటించి ఆధ్యాత్మ ప్రబోధం చేస్తూ సంకీర్తన చేస్తూ ,అరవిందాశ్రమం దర్శించి స్వామి శుద్ధానంద భారతి దర్శనం చేసి ,వారికి ”మహర్షి ”బిరుదుప్రదానం చేసి ,రమణ మహర్షి జన్మదినాన మహర్షిని దర్శించి వారి సన్నిధిలో భజనలు కీర్తనలుతన్మయత్వం తో పాడి కేదారనాధ్ బద్రీనాధ్ మానస సరోవరాలు దర్శించి ఋషీకేశ్ కు తిరిగి వచ్చారు. దేశమంతటా ఆయనకు వేలాది శిష్యులేర్పడ్డారు
1936 లో ఋషీకేశ్ లో ”డివైన్ లైఫ్ సొసైటీ ”ని ఏర్పాటు చేసి తన ప్రవచనాలను పుస్తకాలుగా ప్రచురించి అందుబాటులోకి తెచ్చారు .సత్యానందం సరస్వతి వంటి శిష్యులేర్పడి ”సత్యానందం యోగం ”ప్రచారం చేశారు . 1945 లో శివానంద ఆయుర్వేద ఫార్మసీ ”స్థాపించి ప్రసిద్ధ ఆయుర్వేద మందులను తయారు చేయించారు ..ఆల్ వరల్డ్ రెలిజియన్స్ ఫెడరేషన్ ”ను”ఆల్ వరల్డ్ సాధుస ఫెడరేషన్ ”ను 1947 లో నిర్వహించారు . 1948లో ” యోగ వేదాంత ఫారెస్ట్ అకాడెమి ”ఏర్పాటు చేశారు తన యోగా ను ”యోగా ఆఫ్ సింథసిస్ ”అంటే సమన్వయ యోగం అంటారు .
భారత రాష్ట్రపతులందరికి స్వామి శివానంద ఆరాధ్యులు .వారి దర్శనం తో తరించామని చెప్పేవారు .స్వామి శివానంద 14-7-1963న మహా సమాధి చెందారు .ఋషీకేశ్ లో శివానందాశ్రమ0 తప్పక దర్శించి అనుభూతిపొందాలి .దాదాపు గా 19 60 నుండి వారి పేరు వింటూనే ఉన్నా వారినీ ఆశ్రమాన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక మనసులో ఉండిపోయింది ‘1998 లో మేము అంటే నేనూ మా శ్రీమతి ప్రభావతి , మా అక్కయ్య శ్రీమతి దుర్గ బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ కలిసి కేదార్ నాధ్ బద్రీ నాధ్ యాత్ర చేసినప్పుడు ఋషీకేశ్ లో శివానందాశ్రమ సందర్శించి తరించాము వారి గ్రంధాలను అప్పటి ఆశ్రమాధికారి అయిన స్వామీజీ మాకు కానుకగా ప్రసాదించటం మరువ లేని జ్ఞాపకం
378 గీతా జ్ఞాన యజ్ఞ సారధి – స్వామి చిన్మయానంద సరస్వతి (1916-1993)
కేరళ లోని ఎర్నాకులం లో 8-5-1916న స్వామి చిన్మయానంద బాలకృష్ణ మీనన్ గా జన్మించారు .తండ్రి కుప్పుస్వామి కొట్ట మీనన్ ప్రసిద్ధ జడ్జి ,ఈయన కొచ్చిన్ మహారాజుకు సమీప బంధువు .తల్లి పాఱుకుట్టి అమ్మ .చిన్మయ బాల్యం లోనే చనిపోయింది .కొచ్చి ,త్రిసూర్ ,ఎర్నాకులం లలో చదివి డిగ్రీపొంది లక్నో వెళ్లి లిటరేచర్ ,లా జర్నలిజం లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు .
1936 లో రమణాశ్రమం లో రమణ మహర్షిని సందర్శించినప్పుడు వారి ద్రుష్టి ఈయనపై పడటం తోనే ఆధ్యాత్మిక భావ పరంపరలు మనసంతా నిండిపోయి జ్ఞాన ప్రకాశా నుభూతి పొందారు .క్విట్ ఇండియా ఉద్యమం లో బాలన్ తీవ్రంగా పాల్గొన్న దేశభక్తుడు .అరెస్ట్ చేస్తారని తెలిసి అండర్ గ్రౌండ్ లోకి వెడుతూ సహచరులను స్ట్రైక్ లు చేయమని కరపత్రాలు పంచమని సలహా ఇచ్చారు తర్వాత అరెస్ట్ అయి జైలులో ఉన్నారు .జైల్లో పారిశుధ్యలోపం వలన టైఫాయిడ్ వచ్చి ,మిగతా రోగులతోపాటు రోడ్డుమీద పారేయబడ్డారు .ఒక క్రిస్టియన్ మహిళ జాలిపడి ఇంటికి తీసుకు వెళ్లి డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయించి నయం చేసింది
ఆరోగ్యం బాగుపడగానే ”నేషనల్ హెరాల్డ్ ”పత్రిక పిలిచి ఉద్యోగమిచ్చింది .అందులో ఎన్నెన్నో వ్యాసాలు సాంఘిక విషయాలపై రాశారు .అవి మంచిపేరు ,గుర్తింపు తెచ్చాయి .సాధువుల జీవితాలపై ధారావాహికంగా రాశారు ఋషీకేశ్ వెళ్లి స్వామి శివానందను దర్శించారుకాని ఆధ్యాత్మిక అనుభవం కోసం కాదు అని చెప్పుకున్నారు 1947 లో శివానందా శ్రమానికి కొద్దీ దూరం లో ఉంటూ ఒకసారి కుతూహలంగా వెళ్లి స్వామిని దర్శించి ప్రభావితులై సన్యాసిగా మారిపోయారు .హిందూ గ్రంధాలు అధ్యయనం చేసి స్వామి ఈయనతో దాగిఉన్నజ్ఞానం గ్రహించి ”గీతా కమిటీ ”నిర్వహించామని కోరారు 25-2-1949 లో తిరిగివచ్చి మహా శివరాత్రినాడు సన్యాసం దీక్షపొంది బాలన్ స్వామి చిన్మయానంద ”దీక్షానామం పొందారు
స్వామి శివానంద ఆజ్ఞతో ఉత్తరకాశీ లోని ఆ కాలపు వేదాంత దిగ్గజం ”తపోవనం మహారాజ్ ”వద్ద వేదాంత అధ్యయనం చేశారు .అత్యంత దీక్షతో భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మధించి సారం గ్రహించారు . 1951 లో గురువు ఆదేశంతో సకలమానవాళికీ వేదాంత భావన కలిగించాలని విస్తృత పర్యటన చేస్తూ ప్రసంగిస్తూ ప్రజాభిమానం సంపాదించారు ఆంగ్లం లో స్వామి చిన్మయానంద ప్రసంగాలు గంగా ప్రవాహ సదృశాలు .వారి సభలకు వేలాది మంది అత్యంత శ్రద్దాశాక్తులతో వచ్చి విని తెలుసుకునేవారు విషయాలను విడమర్చి సూటిగా హృదయం లోకి చొచ్చుకొని పోయేట్లు చెప్పే నేర్పు అనితర సాధ్యమనిపిస్తుంది .తిరుమల లో 1970 లో జరిగిన విశ్వ హిందూపరిషత్ సమ్మేళనం లో స్వామి చిన్మయానంద ను చూసి వారి ప్రసంగాన్ని విన్న అదృష్టం నాకు దక్కింది .దీనికి నన్ను ప్రోత్సాహించి తీసుకు వెళ్లిన స్వర్గీయ మండా వీరభద్ర రావు ను మర్చిపోలేను .వారి ”ఉపనిషద్ జ్ఞాన యజ్ఞం గీతా జ్ఞాన యజ్ఞాలు అత్యున్నత అత్యంత ఆధారణం పొందాయి మందార మకరద మే వారి వాగామృతం అందులో తడిసి తరించాల్సిందే
చాలా సార్లు ప్రజలు ఆయన పేర ఒక మిషన్ ప్రారంభించామని కోరినా తిరస్కరిస్తూ వచ్చి చివరికి మద్రాస్ ప్రజలు మరీ పట్టుబడితే ”చిన్మయ మిషన్ ”6-3-1965 లో స్థాపించారు . 18 దేశాలలో 39 ప్రముఖ నగరాలలో 28 ఏళ్ళు ఏక దీక్షగా పర్యటించి హిందూ ధర్మ ప్రచారం చేశారు .అమెరికాలో ప్రత్యేక చిన్మయా మిషన్ ఏర్పాటైంది .ప్రపంచ హిందువుల సమైక్యతకు ప్రత్యేక వ్యాసాలూ రాసేవారు చివరికి వారికోరిక తీరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ బాబా సాహెబ్ ఆప్టే తోకలిసి 1964ఆగస్టు లో పూనాలో ”సాందీపని ఆశ్రమం ”స్థాపించారు .ఇది విశ్వ హిందూపరిషత్ కు దారితీసి దానికి మొదటి అధ్యక్ష్యులుగా స్వామి చిన్మయానంద ఎంపికయ్యారు .
హృదయ వ్యాధి తో చాలాకాలం బాధ పడుతూ 1969 లో మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చింది .బెంగళూర్ లో ఏర్పడిన చిన్మయా నంద హాస్పిటల్లో లో ఆయనే మొదటి పేషేంట్ .ఆరోగ్యం కుదుటపడి 1980 లో అమెరికాలో చాలా జ్ఞానయజ్ఞాలు చేశారు .టెక్సాస్ లో మల్టిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది 26.-7-1993 లో సాన్ డియాగో లో శ్వాస సమస్య ఏర్పడి ఎమర్జెన్సీ హార్ట్ బైపాస్ సర్జరీ తప్పని సరైంది .పరిస్థితి విషమించగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచారు .ఫలించక 3-8-1993 న స్వామి చిన్మయ శాశ్వత చిన్మయానంద సమాధిలోకి వెళ్లిపోయారు .7-8-1993 న వారి పార్థివ శరీరం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరగా వేలాది ప్రజలు కన్నీటితో చివరి దర్శనం చేసుకొన్నారు తరువాత హిమాచల్ ప్రదేశ్ లో సిద్ధ బారి లో వారి అంత్యక్రియలు పరమ వేదోక్తంగా నిర్వహించి మహా సమాధి లో ఉంచారు 24-12-1991 లో వారికి బొంబాయిలో ”స్వర్ణ తులాభారం ”జరిపారు .దీనిని చిన్మయామిషన్ వైద్య ,విద్యా కార్యక్రమ నిర్వహణకు స్వామి అందజేశారు .
భగవద్గీత పై చిన్మయానంద వ్యాఖ్యానం శిరోభూషణంగా నిలిచింది . 34గ్రంధాలు రచించారు 2.-12-1992 న ఐక్య రాజ్య సమితిలో స్వామి చిన్మయ ”ప్లానెట్ ఇన్ క్రైసిస్ ”అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు .అమెరికా మ్యాగజైన్ ”హిందూ యిజం టు డే ”ఆయనకు ”హిందూ రినైసెన్స్ అవార్డు ”తోపాటు ”హిందూ ఆఫ్ ది ఇయర్ ”బిరుదు నిచ్చి సత్కరించింది . 1993 లోచికాగో లో జరిగిన ” ప్రపంచ మత సమ్మేళన;;శత జయంతి”హిందూమత అధ్యక్షునిగా ఎంపిక చేశారు
8-5-2015 న ప్రధాని మోడీ స్వామి చిన్మయ జన్మ దినోత్సవ స్మారక నాణెం విడుదల చేసి గౌరవించారు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా .
