|
ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఒక విశిష్ట స్థానాన్ని పొందినది జీవిత చరిత్ర . తనని తాను మలుచుకుంటూ , తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసిన వారు , ఆ తరానికే కాకుండా భావితరాలకి మార్గ దర్శకులుగా చరిత్రలో నిలిచి పోతారు . అటువంటి వారి చరిత్ర చదవడం , తెలుసుకోవడం ఎంతైనా అవసరం . ఒక మారుమూల ప్రాంతం పుల్లెరులో పుట్టి రష్యాలోని వోల్గా దాకా సాగిన కోలాచల సీతారామయ్య జీవన ప్రస్థానాన్ని “కెమోటాలజి పిత కోలాచల సీతారామయ్య “ పుల్లేరు నుండి వోల్గా దాకా అనే పుస్తకంలో పొందుపరిచారు రచయిత ‘గబ్బిట దుర్గా ప్రసాద్’ .
సీతారామయ్య జీవితాన్ని వారి పెద్ద అల్లుడు ఘెన్ షాంఘీన్ బెరేజో విస్కీ రష్యన్ భాషలో రాసిన పుస్తకాన్ని శ్రీమతి అచలా జైన్ ఆంగ్లంలోకి “ ఏ రీత్ ఫర్ డాక్టర్ రామయ్య “ గా అనువదిస్తే …..దానిని తెలుగులోనికి గబ్బిట దుర్గా ప్రసాద్ అనువదించారు .
సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి 1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కష్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దాని వలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించకుండా చేస్తూ శ్రద్ధగా చదివిగా కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఆ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభివృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశ్యంతో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు,పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42 ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42 రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్ర దృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య .
కోలాచల మూలం మెదక్ జిల్లాలోని కోలాచల గ్రామం . 18 99 జూలై 15 న జన్మించారు . చదువులో ఫిజిక్స్ , గణితం ఇష్టపడే కోలాచలం , పై చదువులు మద్రాస్ లో చదువుకోవాలని ఆశ పడేవారు . మదనపల్లి డాక్టర్ అనిబిసెంట్ నేషనల్ యూనివర్సిటీలో 1917 లో 18 ఏళ్ల వయస్సులో ప్రవేశ పరీక్షలు అన్నింటిలోను అర్హత సాధించడంతో యునీవర్సితిలో చేర్చుకొన్నారు . 1921 లో బ్యాచలర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ అందుకున్నారు రామయ్య .
తండ్రి మరణంతో అన్నయ్య సహాయంతో అతికష్టం మీద అమెరికాకు ప్రయాణం అయ్యాడు రామయ్య . ఎర్ర సముద్ర దాటి అట్లాంటిక్ సాగరం మీదుగా అమెరికాలోని న్యుయార్స్ లో అడుగు పెట్టాడు రామయ్య .అక్కడ ఎంతో పట్టుదలతో సీటు సాధించాడు . 1924 జనవరిలో 1న రామయ్యను గ్రాడ్యుయేట్ స్కూల్ కు బదిలీ చేశారు . చికాగోలో చదువుకోవాలంటే పని చేయాల్సిందే అనుకుని బరువులు మోస్తూ , రెస్టా రెంట్స్ లోని కిచెన్ లో పని చేస్తూ చదువును కొనసాగించాడు . అనతి కాలంలోనే 1924 జూన్ 10 న 25 ఏళ్ల వయస్సులో కెమిస్త్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నారు .
కొంత కాలం అమెరికా ఉద్యోగం, అమెరికన్ సారాతో వివాహం తర్వాత సీతా రామయ్య రష్యా ప్రయాణం సాగించాడు . ఆ నిర్ణయిం రామయ్య జీవితంలో పెద్ద మలుపు . తర్వాత కాలంలో సారాతో వైవాహిక జీవితం బలహీనమైంది . 1930 డిసెంబరు 17 న కోలాచల సీతా రామయ్య సోవియట్ యోనియన్ రాజధాని మాస్కో నగరంచేరారు . రష్యా వెళ్ళగానే సోవియట్ జీయాలజీ పెట్రోలియం ఉత్పత్తి మీద గుబ్బిన్ అధారిటీ నుంచి పిలుపు రావడం సీతా రామయ్య ఆనందం కలిగించింది . తకువ కాలంలో NAMI కి అధిపతిని చేసింది . అన్ని రకాల శీతోష్ణస్థితిలో సమర్ధవతంగా పని చేసే ప్తత్యేక కిరోసిన్ ఇంధనాన్ని తయారు చేయడం , సోవియట్ దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీతో చేసిన టాంక్ యుద్ధాలలో విజయాలను అందుకునేలా చేసింది .
DKNAMI అనే పేరుతో క్రొత్త పరికరాన్ని తయారు చేయడం . తర్వాత ప్లాస్టిక్ మీడియా సిద్ధాంతం ఆవిష్కరణ , తర్వాత కాలంలో సైన్స్ లో కొత్త అధ్యాయం ఆరంభమైంది . కొంతకాలం గడిచిన తర్వాత దానికి కెమోటాలజి అనే ఒక ప్రత్యేకమైన పేరు వచ్చింది . రామయ్య పరిశోధనలతో లూబ్రికంట్ చరిత్రలో విప్లవమే వచ్చింది . అందుకే రామయ్యని కెమోటాలజీ పీత “Father of chemotology “అయ్యారు .
ఇండియా నుంచి రష్యా వెళ్లిన వారు తప్పని సారిగా రామయ్య ఇంట్లో ఆతిధ్యం స్వీకరించే వారు . సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది రామయ్యకి . ఏటుకూరి బలరామమూర్తి రాసిన “ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర “అనే పుస్తాన్ని రామయ్య రష్యన్ భాషలోకి అనువదించారు . తెలుగు రష్యన్ నిఘంటు నిర్మాణానికి కూడా కృషి చేసారు .
1963 లో ఏప్రెల్ 22 నుండి జూన్ 5 వరకు 42 రోజులు మాతృ దేశమైన భారత్ లో గడిపి రష్యా చేరుకున్నారు సీతసీతా రామయ్య . తాను రష్యా కి ,ఇండియాకి చెందిన ఉమ్మడి పౌరుడిని అని చెప్పుకుని గర్వ పడేవారు . రష్యాలో ఆయనను ఆంధ్రా సీత రామయ్య అంటే ఇండియాలో ఆయన్ను రష్యా సీతా రామయ్య అనే వారు . 14 సవత్సరాలుకు ఉబ్బసం తీవ్రమైన న్యుమోనియాతో బాధపడి 1977 అక్టోబరు 29 న తన 78 వ ఏట మరణించారు .
కోలాచల సీతారామయ్య విదేశీ గడ్డపై తన ప్రతిభని నిరూపించుకోవడం అద్భుతం . అమెరికా రష్యా దేశాలతో తన ప్రతిభను తో ఉన్నత పదవులను పొందారు . పుల్లేరు నుండి ఓల్గా వరకు సాగిన ఆయన ప్రస్థానంలో ఎదుర్కొన్న సంఘటనలు చిన్నవేమీ కాదు , ధైర్యంతో ఎదురించి వాటిని పూలుగా మలుచుకుని నడిచిన ఘనత సీతా రామయ్యది .
ఈ పుస్తక చదువుతున్నప్పుడు సీతా రామయ్య జీవిత ప్రస్థానం తోపాటు అమెరికా , రష్యా దేశాలలో ని ఆర్ధిక , రాజకీయ పరిస్థితులపై ఒక అంచనా ఏర్పడుతుంది . మన ప్రాంతం దాటి పరాయి దేశాలలో తన ఖ్యాతిని , తన ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తం చేసిన కోలాచల సీతా రామయ్య భావితరాల వారికి మార్గ దర్శకుడు .
-అరసి
ప్రతులకు : గబ్బిట దుర్గా ప్రసాద్
ఇంటి .నెం :2-405 , శివాలయం వీధి , రాజు గారి కోట దగ్గర ,
ఉయ్యూరు,
కృష్ణా జిల్లా -521165
సంచార వాణి : 9989066375
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
—
|
|
|