గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
–380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త –కొండవీటి వెంకటకవి (1918 – 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. బాబా లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఈనాడు,లో అనేక వ్యాసాలు రాశారు.
1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ శతకం రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు.
నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరిని ‘కళా ప్రపూర్ణ‘ పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు. కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. 1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు.
వీరు ఏప్రిల్ 7, 1991 సంవత్సరం పరమపదించారు.
పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, హైదరాబాదు ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించారు. ఆయన పురోహితుడు. ఇన్నయ్య తోటి పురోహితుడు.
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.
వెంకటకవి కృతులు
- కర్షకా! (1932)
- హితబోధ (1942)
- భాగవతులవారి వంశావళి (1943)
- ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)
- చెన్నకేశవా! (1946)
- భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953)
- దివ్యస్మృతులు (1954)
- నెహ్రూ చరిత్ర – ప్రథమ భాగము (1956)
- త్రిశతి (1960)
- నెహ్రూ చరిత్ర – ద్వితీయ భాగము (1962)
- బలి (1963)
సశేషం
ఓ కవీ, వేదాంతీ, కొండవీటి వేంకటకవిమట్టినీ, మనిషినీ ప్రేమించినవారే గొప్ప సృజనాత్మక శక్తితో రాణించగలుగుతారు. సత్తెనపల్లి వీధుల్లో రెండు లక్షల అశేష జనవాహిని మధ్య కవితా బ్రహ్మోత్సవం జరిగిన సందర్భం ఒక్కటి చాలు ఆయన సాధించిన విజయమేమిటో తెలుసుకోవడానికి. అదే భారతం. అందరూ అవే మాటలు రాశారు. కానీ నిర్మాణపరంగా లోపాలున్నా ఆయన రాసిన ‘దాన వీర శూరకర్ణ’ చిత్ర సంభాషణలకు అశేష ఆంధ్రావని బ్రహ్మరథం పట్టింది. శ్రీమద్విరాట్‌పర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, తాండ్ర పాపారాయుడు, ఏకలవ్య, విశ్వనాథనాయకుడు, వీరాంజనేయ తదితర సంభాషణల రచయితగా 1983 నుంచీ కీర్తిశేషులయ్యేంత వరకు ‘ఈనాడు’లో రాసిన ‘పరదేశి పాఠాలు’ రచయితగా, అనేక కావ్యాలందించిన కవిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు. తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎంతో దూరం నడిచారు. ఎంతోమందిని చైతన్యవంతం చేశారు. ఆ వైతాళికుడే కొండవీటి వేంకటకవి. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ మాటల్లో చెప్పాలంటే సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి. ఎద్దులు బండియున్ గలిగి యెన్నియొ గేదెలు గాదెలుండినం జద్దికి జాలదయ్యె వ్యవసాయమొనర్చిన నొండు వృత్తి మీ వద్దకు జేరదయ్యె గనుపట్టును దీనికి ముఖ్య కారణం బెద్దియటన్న పాలకుల హీనపుబుద్ధియ సుమ్ముకర్షకా దశాబ్దాలనాడు కవిరాజు చెప్పినది నేటికీ వర్తిస్తుంది… పాలకులే ప్రజల నొసటి రాతలు రాస్తున్నారు. మిరపకు ధర పలుకుతోందని మిరప పైరువేస్తే పంట చేతికి రాగానే దాని ధర తగ్గిపోతుంది. ఒకటా రెండా… ఎన్నో దశాబ్దాలుగా అన్ని పంటల స్థితీ ఇలాగే ఉంది. కొండవీటి వేంకట కవి చెప్పిన మాట పొల్లుపోకుండా నేటికీ వర్తిస్తోంది… ఆయన కవుల బాధ్యతను కూడా స్పష్టం చేశారు. ”కవులై దేశహితమ్ముగోరుచు మహాగ్రంథంబులన్ సర్వ మానవ సౌభ్రాతృత బెంపునింపవలె దానంగల్గు మోక్షమ్ము మూర్ఖవిధిన్ ద్వేషపు బీజ సంతతుల గూర్పన్ లాభమే చెన్నకేశవ మాచెర్ల పురాంతరాలయ నివాసా పాహిమాం పాహిమాం…
కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. ఆచార్య తూమాటి దొణప్ప కొండవీటి వేంకటకవి గురించి ఇలా రాశారు- ”సహృదయాహ్లాదనముగా, సంస్కార ప్రతిపాదనముగా, సమాజ ప్రబోధ సాధనముగా నిర్దిష్టమైన లక్ష్యముతో నిర్దుష్టమయిన సాధన సామాగ్రితో సాహితీ సమారాధనమును సాగించిన సత్కవులు చాల అరుదు. ”ఉత్పాదకా నబహవః కవయః శరభా ఇవ” అన్న బాణోక్తి మేరకు సుకవులు అల్ప సంఖ్యాకులు. ప్రతిభావ్యుత్పత్యభ్యాసములు గల కవులు ద్వాతకులు. ఈ కోటిలో పరాంకోటికెక్కిన మేటి కవి మన కొండవీటి వేంకటకవి…” నిజమే… పద్యం రాసినా గద్యం రాసినా కొండవీటి వేంకటకవి శైలే వేరు. ఆశ్చర్యమేమిటంటే అంతటి ప్రౌఢకవి, కర్షక కవి గురించి తెలుగు సాహిత్యంలో అందుబాటులో ఉన్న జీవితచరిత్రల్లో ఆయనమీద ఒక్క వ్యాసమైనా అందుబాటులో లేకపోవడం. ”ప్రతిభామూర్తులు”, ”తెలుగు పెద్దలు”… ”మహనీయులు”, ”సారస్వతమూర్తులు”… ఇలా అందుబాటులో ఉన్న అనేక వ్యాస సంకలనాల్లో ఆయన గురించి ఒక్క వ్యాసమైనా లేకపోవడం ఈ రంగంలో కృషి చేసిన వారి పక్షపాత వైఖరికి నిదర్శనమనిపిస్తుంది.
నందమూరి తారకరామారావు అనుబంధంతో, ఈనాడు అనుబంధంతో కొండవీటి వేంకటకవి సృష్టించిన ఆలోచనలు, తార్కికత, ప్రాచీన కావ్యాల్ని కొత్తకోణం నుంచి వివేచన చేసే విమర్శనాత్మక దృష్టి ఆయన్ని నిత్య చైతన్య కవిగా మలచిందనడంలో అతిశయోక్తి లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో శేషమ్మ, నారాయణయ్య దంపతులకు 1918 జనవరి 25న జన్మించారు కొండవీటి వేంకటకవి. తండ్రి వద్దే తెలుగు కావ్యాలు చదివారు. మరోవైపు స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొంటున్న మహామహుల్ని చూశారు. వారి జీవన విధానంలో భాగమైన సామాజిక సేవను అవగతం చేసుకొన్నారు. సంస్కరణభావాల్ని ఒంట పట్టించుకొన్నారు. సరికొండ నమ్మాళరాజులు వద్ద సంస్కృతం నేర్చుకుని కావ్యాలు అభ్యసించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రుల వద్ద ఉన్నత విద్య అభ్యసించారు. మహాత్మాగాంధీకి జై అంటూ స్వాతంత్య్రోద్యమంలో ఉరికారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్ని సంఘటితం చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. అందుకే 1936లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి పదవి చేపట్టారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు కావ్యరచన, వృత్తి ధర్మమైన విద్యా బోధన… మూడు రంగాల్లోనూ ఆయన రాణించారు.
1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అక్కడ ఆయన బోధించింది సంస్కృత వ్యాకరణం. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ‘ఈనాడు’ ప్రత్యేక అనుబంధంతో వెలలేని ఆణిముత్యాల వంటి అనేక వ్యాసాలనందించారు. 1953 జనవరిలోనే కవిరాజు బిరుదం పొందిన కొండవీటి వేంకటకవి పలు గ్రంథాల్ని రాశారు. ”పంచీకరణ భాష్యము” వంటి ఆదిశంకరుల రచనలు సైతం అందరికీ అర్థమయ్యేలా అనువదించారు. 1932లో ఆయన ”కర్షకా” అనే నూటొక్క పద్యాల కృతి అందించారు. అప్పుడు ఆయన వయస్సు పధ్నాలుగేళ్లు మాత్రమే. అయినా పండితుల ప్రశంసలందుకొనేలా ఆ కావ్యం రాశారు. ఆ తర్వాత పదేళ్లకి ”హితబోధ” అందించారు. ”భాగవతులవారి వంశావళి గ్రంథాన్ని 1943లో రాశారు. ”ఉదయలక్ష్మి నృసింహ తారావళి” గ్రంథాన్ని 1945లో రాశారు. వీటి తర్వాత కొండవీటి వేంకటకవికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ”చెన్న కేశవ శతకము”. ”చెన్నకేశవ మాచర్లె పురాంతరాలయ నివాసాపాహిమాం పాహిమాం” అన్న మకుటంతో సాగే ఈ కావ్యంలో వేంకట కవి భాషా పటిమ ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది. ఈ కావ్యం తర్వాత ”భావ నారాయణ చరిత్ర” అనే గద్య కావ్యం రాశారు. 1954లో రాసిన ”దివ్య స్మృతులు” ఆయనకు మళ్లీ గొప్ప పేరు తెచ్చింది. యుగకర్తలైన వేమన, వీర గురుడు సిద్ధప్ప, తరిగొండ వేంకమాంబ, అలరాజు కృష్ణదేవరాయలు, గుంటూరు మస్తానయ్య, మూర్తికవి నాగార్జునుడు, చిన్నయసూరి, వీరేశలింగం, గురజాడ అప్పారావు, త్రిపురనేని, కట్టమంచి, ఏటుకూరి వెంకట నరసయ్య, తిరుపతి వేంకటకవులు, పొట్టి శ్రీరాములు… వంటివారి మీద స్మృతి చిహ్నాలైన ఖండ కావ్యాలు రాశారు. తర్వాత ”త్రిశతి” పేరుతో వేమన శతకంలాంటి శతకం రాశారు. నెహ్రూ చరిత్రను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఖండాలుగా మూడు సంపుటాల మనోహర కావ్యం రాశారు. దీన్ని పి.వి.నరసింహారావు హిందీలోకి అనువదించడం విశేషం. రాజర్షి, బలి, మేలుకొలుపు, శ్రీకృష్ణ వ్యాసావళి వంటి కావ్యాల తర్వాత ”పంచీకరణ భాష్యము” రాశారు. ఆయన పలికితే పద్యం, పిలిస్తే పద్యం… అంతగా ఆయనకి పద్యంపై పట్టు ఉండేది. ప్రాచీన సాహిత్యాన్ని మధించి రసాస్వాదన చేసిన కొండవీటి వేంకటకవి కవిరాజుగా, కళాప్రపూర్ణగా పండితుల, సామాన్య పాఠకుల మన్ననలు పొందారు. కొండవీడు అన్న పేరు వింటేనే కదలి ఆశువుగా గలగలా పద్యం చెప్పగల ఆయన…
”ప్రోలయ వేమన ప్రోదిచేసిన నేల
వామనభట్టు దైవాఱుతావు
కాటయ వేమన్న కత్తిపట్టిన చోటు
కొమర గిరీంద్రుండు కుదురు నెలవు
అనవేమసార్వభౌముని విహారస్థలి
శ్రీనాధుసు కవి కాలూను వసతి
శంభుదాసుడు పదాబ్జములు మోపిన యిక్క యోగి వేమన నిల్చు త్యాగభూమి
… ఇటువంటి కొండవీటి సీమ నుంచి ప్రభవించిన వేంకటకవి 1991 ఏప్రిల్ ఏడో తేదీ పరమపదించారు. గురుపీఠాన్ని అలంకరించి వేదాంతోపదేశికులయ్యారు. కవిగా, వ్యాఖ్యాతగా, దేశికునిగా భాష్యకారుడిగా, వేదాంతిగా ఆయన అఖండకీర్తిని పొందారు. అనంత భావదీప్తితో ప్రకాశించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడాయన. ఒక సంస్కర్త… సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒక ఎవరెస్టు శిఖరం.
Kondaveeti Venkatakavi
కొండవీటి వెంకటకవి
(1918-1991)
కొండవీటి వెంకటకవి