(పరమ ) హంస ధామం
హిమాలయాలలో గంగోత్రిని మించిన మనోహరమైన ప్రదేశం కనిపించదు .అక్కడే హంసలు దర్శనమిస్తాయి అందుకే దానికి హంసధామం అనిపేరు . అక్కడే జితేంద్రియులైన మహా యోగులు దర్శనమిస్తారు .కనుక అది పరమహంస ధామం కూడా . మంచుతో కప్పబడిన హిమ శృంగాలు కను విందు చేస్తాయి .సుమారు 50 కి పైగా యోగులు చిన్న చిన్న గుహలలో అక్కడ ఉంటారు .ప్రక్కనే గంగమ్మ తల్లి . అంతకంటే వారికి కావలసినదేముంది ఈ యోగులు శీతాకాలం కూడా బట్టలు ధరించరు కొందరైతే చలికాచుకోవటానికి అగ్ని కూడా రాజేయరు .స్వామిరామ ఇక్కడే మూడు శీతాకాలాలు ఒక చిన్నగుహలో గడిపాడు ..ఈగుహకు సుమారు అయిదువందల గజాల దూరం లో మరొక యోగి పుంగవుడు ఒక గుహలో ఉండేవాడు ..వీరిద్దరూ ఒకరికొకరు కనిపించినప్పుడు చూసుకోవటమే కానీ ఒకరికొకరు ఇబ్బందిపెట్టుకొనే వారు కాదు ఎవరి సాదన ధ్యాన యోగాలు వారివే .ఇక్కడ ఉన్నకాలం తనజీవితం లో గొప్ప ఫలవంతమైనకాలంగా రామా భావించాడు .యోగాభ్యాసాలు చేస్తూ ఇంత గోధుమ ,పప్పు మాత్రమే ఆహారంగా జీవించాడు .ఈ రెంటినికలిపి తడిపి ఉంచి రెండురోజులతర్వాత మొలకెత్తగానే కొద్దిగా ఉప్పుకలిపి వాటిని ఆహారంగా తినేవాడు..ఇంతకూ మించి వేరే ఏదీ తినేవాడుకాదు .
రా మా గుహకు దగ్గరలోనే ‘’కృష్ణాశ్రమం ‘’అనే యోగి ఉండేవాడు .ఆయన పేరు భారత దేశమంతటా బాగా తెలుసు ..ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది .వందలాది బాంబులు పేలితే వచ్చే భయ0కర శబ్దం అది ..అది ఆకస్మికంగా జారిపడిన హిమ గండ శిలాపాతం (అవలాంచి).స్వామి రామా తనగుహలోంచి బయటికి వచ్చి ఏం జరిగిందోనని ఆతృతగా చూశాడు ..అది పౌర్ణమి రాత్రికావటం వలన అవతలి ఒడ్డు న క్రష్ణా శ్రమ యోగి ఉండే గుహదగ్గరున్న గంగానది మంచుతో కప్పబడి కనిపించింది. ఈ భారీ అవలాంచీ ని చూసి రామా మనసులో కృష్ణాశ్రమయోగి అందులో కప్పబడి ఉంటాడని అనుమానించాడు .పొడవైన టిబెటన్ కోటు ధరించి చేతి లో టార్చి లైట్ వెలుగుతో ఆయన గుహ వైపుకు వేగంగా అడుగులు వేశాడు .అక్కడ గంగ చిన్న ఇరుకు వాగులా ఉంటుంది ..దాన్ని దాటి ఆయన గుహవైపుకు వెడితే అది సురక్షితంగా ఉందని గ్రహించి లోపల చిరునవ్వుతో కూర్చుని ఉన్న శ్రీ కృష్ణాశ్రమ యోగి కనిపించాడు .హమ్మయ్య అనుకొన్నాడు స్వామిరామా .
ఆ గుహలోకి వెళ్లి ఆయనను పలకరించాడు .ఆయన మాట్లాడకండా చేతులు పైకెత్తి ‘’హం హం హం ‘’అన్నాడు .దగ్గరలో ఉన్న పలకపై ‘’ఏమీ కాలేదు ..నాకు ఏ అపకారము జరగదు .ఇక్కడ చాలా ఏళ్ళనుంచి ఉంటున్నాను .ఈ శబ్దాలు హిమ గండశిలలు నన్ను భయ పెట్టలేవు ..నా గుహ సురక్షితం ‘’అని రాశాడు .ఆయనకే ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉన్న సంగతి తెలుసుకొని భగవంతుని కృపకు అంజలి ఘటించి మళ్ళీ ఆ రాత్రివేళ తన గుహకు చేరుకొన్నాడురామా ..ఒక అతిపెద్ద దేవదారు వృక్షం పూర్తిగా కూలి మంచులో కప్పబడిపోయిందికాని అది ఆయనగుహనూ ఏమాత్రం తాకలేదని గ్రహించాడు .
మధ్యాహ్న సమయాలలో తరచుగా కృష్ణాశ్రమ యోగి గుహకు వెళ్లి తనకున్న అనుమానాలను అడిగి ఆయననుండి సంతృప్తికరమైన సమాధానాలు పొందేవాడు రామ .. ఆయన మౌనంగా ఉండేవాడుకనుక సమాధానాలు పలకపై రాసేవాడు .ఆయన నేత్రాలు అగ్నిగోళాలుగా కాంతి నిచ్చేవి .ఆయన చర్మం ఏనుగు చర్మ మంత దళసరిగా ఉండేది. 80 ఏళ్ళ వయసులోకూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు .గడ్డ కట్టే చలిలో ఊలు బట్టలు, నిప్పు లేకుండా ఎలా ఆయన జీవిస్తున్నాడో ఆశ్చర్యమేసింది .. గుహలో వస్తు సామగ్రికూడా ఏమీ లేదు .గోముఖి దగ్గరుండే ఒక స్వామి రోజూ కొంత ఆహారం తెచ్చి ఇచ్చేవాడు .రోజుకు ఒకసారి మాత్రమే బంగాళాదుంపలు వేయించి తినేవాడు .కొద్దిగా రొట్టెముక్క తినేవాడు .ఈ ప్రాంత వాసులు ‘’గంగా తులసి ‘’అనే ఓషధి మొక్క ఆకులతో తయారు చేసే గ్రీన్ టీ నే తాగుతారు .స్వామిరామా కు ఇక్కడి యోగులు స్వాములు ఓషధులగురించి ప్రయోజనకర మొక్కల గురించి వివరంగా తెలియజేశారు .వనౌషధ శాస్త్రంగురించీ రామా తో చర్చించారు .ఈ జితేంద్రియ యోగులు ఈ హంస ధామం వదిలి మైదానప్రాంతాలకు వెళ్ళటానికి అసలు ఇష్టపడరు .వీరిని దర్శించాలంటే ఆసక్తి భక్తి ఉన్నవారు అత్యున్నత ప్రాంతమైన ఈ ప్రదేశానికి రావాళిందే .బుద్ధి పై మనసు సాధించిన యోగులైన పరమహంసల దర్శనానికి ఈ హంస ధామమే శరణ్యం.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—