ఇచ్ఛా మరణం ఇచ్ఛా గమనం పొందిన యోగి
స్వామి రామా 17 ఏళ్ళ ప్రాయం లో గురువు బెంగాలీ బాబా ‘’నువ్వు నిజమైన విద్య నేర్వాలని ఉంటె గంగోత్రి వద్ద ఉన్న మహాయోగి వద్దకు వెళ్లి నేర్చుకో ‘’అని పంపాడు ..అక్కడికి వెళ్లి చూస్తే ఆయన మహా అందగాడుగా చక్కని దృఢమైన శరీర సౌష్టవం తో మిసమిసలాడుతూ కనిపించాడు ..ఉక్కు కండలు తిరిగిన శరీరం విశాలమైన ఛాతీ తో 85 ఏళ్ళ వృధుడు ఆయన ..రామా వెళ్ళగానే ఆకలిగా ఉందా ఏమి తింటావని అడిగి ఆయన ఉన్న గుహలోకి వెళ్లి అక్కడున్న దుంపలు తీసుకుని తినమన్నాడు .ఆయన చెప్పినట్లే రామా చేశాడు .అది పాలతో వండిన ఆహారపు రుచి గా ఉంది .. తినటం అవగానే తానేమీ మాటలతో బోధించను అని చెప్పాడు .ఆయన ప్రక్కనే స్వామిరామా మూడు రోజులు కూర్చున్నాడు .ఇద్దరిమధ్య మౌనమే ..మూడవ రోజు మనసులో తాను ఇక్కడికి రావటం శుద్ధ దండగ అని ఈయన నేర్పేది ఏమీలేదని అనుకొన్నాడు వెంటనే ఆ యోగి ‘’నిన్ను ఇక్కడికి మీ గురువు పంపింది జ్ఞానాత్మక విద్య నేర్చుకోవటానికి కాదు అదికావాలంటే బోలెడు గ్రంధాలున్నాయి చదివి గ్రహించవచ్చు నిన్ను పంపింది ఇక్కడ కొంత అనుభవం పొందమని .నేను నా శరీరాన్ని ఎల్లుండి విసర్జింప బోతున్నాను ,’’అన్నాడు ..ఎందుకు శరీరాన్ని త్యాగం చేసుకోవాలో రామాకు అర్ధంకాక అది ఆత్మహత్యగా భావించాడు .ఇది గ్రహించి ఆయన ‘’నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు .సన్యాసులు ఆత్మహత్యకు పాల్పడరు .పుస్తకం అట్ట నలిగిపోతే ,పాడుకాకుండా కొత్తఅట్ట వేసినట్లు ,దిండుగలేబు మాసిపోతేదాన్ని నాశనం చేయకుండా కొత్తది తొడిగినట్లు స్వచ్చంద శరీర త్యాగం అలాంటిదే . రామా కుర్రాడుకనుక ‘’ స్వామీ !ఇంత అందమైన ,దృఢమైన శరీరాన్ని ఎందుకు విసర్జించాలని అనుకొంటున్నారో నాకేమీ అర్ధం కావటం లేదు .వద్దు అది పాపం ‘’అన్నాడు వేడికోలుగా . ఆయన ప్రశాంతంగా వినిఊరుకోగా ,ఒక శిష్యుడు ‘’నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ?ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడో నేనెక్కడో ‘’అని ప్రక్కకు తీసుకు వెళ్లి’’ఆయన ప్రశాంతతకు భంగం కలిగించవద్దు . పిచ్చిప్రశ్నలు అడుగుతున్నావు ఆయనను .యోగులు అంటే ఏమిటో నీకు తెలియదు .ఆయన ను ప్రశాంతంగా దేహ త్యాగం చేయనివ్వు ‘’అన్నాడు ..రామ ఆ శిష్యుడితో ‘’అందమైన ఆదేహాన్ని వదిలెయ్యటం ఎందుకు ?దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటె రిపోర్ట్ ఇచ్చేవాడిని .ఇది చట్ట వ్యతిరేక చర్య ‘’అన్నాడు ..శిష్యుడు యెంత చెప్పినా రామ సంతృప్తి చెందలేదు .అందమైన శరీరం వదలటమేమిటనే ఆయన ఆలోచన ..చివరికి శిష్యుడు ‘’ప్రశాంతంగా ఉండి అన్నీ గమనించు . అంతా నీకే అర్ధమవుతుంది ‘’అన్నాడు .ఆ స్వామి మరొక 24 గంటలు స్వామిరామాతో మాట్లాడనే లేదు .రామా మాత్రం ‘’ఈయన ఇప్పటిదాకా నాకు చెప్పిందేమీలేదు .నేనిక్కడ ఉండటం దండగ నేను వెళ్ళిపోతాను ‘’అని శిష్యుడితో అన్నాడు .
‘’ఆయన ప్రాణ త్యాగం చేసే విధానాన్ని ఎందుకు చూడవు ?’’అన్నాడు శిష్యుడు రామా ‘’ఇది చాలా బుద్ధితక్కువపని నేనైతే హాస్పిటల్ లో చస్తా .ఈ వెర్రి ఏమిటి ?’’అని తన ఆధునిక భావాలు ఆవిష్కరించాడు . .శిష్యుడు ‘’నీకు అర్ధం కాదు .నిన్ను ఇక్కడికి పంపించింది చూస్తూ తెలుసుకోమని .నీ మనసులో వితర్కించుకోవాలంటే నీ ఇష్టం .కానీ ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగించవద్దు ‘’అన్నాడు .చివరికి ఆ స్వామి ‘’నిజంగా నేనేమీ చేయటం లేదు .మనకు శరీర త్యాగం చేసే సమయం వచ్చిందని తెలిసిపోతుంది. ప్రకృతికి అడ్డుపడలేము . అది సహజ ధర్మం . మరణం ప్రకృతికి సాయం చేస్తుంది .చావుకు భయపడరాదు దానివలన ప్రయోజనం ఉండదు .అర్థమైందా ?’’అన్నాడు మౌనాన్ని ఛేదించి .’’నాకు చావాలని లేదు .కనుక అర్ధం చేకుకోవాల్సిన పని లేదు ‘’అన్నాడు మొండిగా .’’.నీ వైఖరి సరైనదికాదు మరణం అంటే ఏమిటో తెలుసుకో .మన0 అనేక భయాలమధ్య బతుకుతున్నాం .చావు అంటే నాశనం చేసేదికాదు అది శరీరాన్నుంచి వేరు చేసేది ‘’అనగా ‘’శరీరం లేకుండా నేనుండలేను ‘’అన్నాడు రామా అప్పుడు ఆయన ప్రశాంతంగా ‘’చావు శరీర ధర్మం .ఎవరూ అంతకాలం ఈ శరీఅరం తో బతికి ఉండలేరు .అది మార్పు చెందాలి శిధిలమవ్వాల్సిందే . ఇది నీకు తెలియాలి. జీవితానికిపట్టుకొని వ్రేలాడకుండా విముక్తిపొందేవారు అతి కొద్దిమందే ఉంటారు . ఆ టెక్నీక్ నే యోగా అంటారు .ఇది ఇప్పుడు అందరూ చేస్తున్న మామూలు యోగా కాదు ఉన్నతమైన యోగా అదిధ్యానం లో సరైన పధ్ధతి . నీకు తెలిస్తే శరీరం మనసు బుద్ధి మొదలైన అన్ని విషయాలపై నీకు నియంత్రణ వస్తుంది .అది ప్రాణ ,అనే ఉచ్వాస నిశ్వాసా ల వలన సాధ్యం.దానివలన మనసుకు శరీరానికి మంచి సంబంధం కలుగుతుంది .ఊపిరిపీల్చటం ఆగిపోతే లంకె తెగిపోతుంది . అదే మృత్యువు .అయినా నువ్వు ఇంకా జీవించే ఉంటావు ‘’అని చెప్పాడు
‘’శరీరం లేకుండా ఎలా ఉంటాం ?’’అడిగాడు రామా . ‘’చొక్కా లేకపోతే ఎలా ఉంటావో అలా ‘’అంతే .అంతకన్నా ఏమీ లేదు ‘’అన్నాడు స్వామిజీ . అయినా అసంతృప్తిగానే ఉన్నాడు రామా . శరీర త్యాగం చేయటానికి ముందురోజు స్వామీజీ కొన్ని సూచనలు చేశాడు ఇద్దరికీ . .తెల్లవారుజామున 5 గంటలకు ప్రాణ త్యాగం చేస్తాను .మీరు నా శరీరాన్ని గంగానదిలో ముంచేయండి .మీ ఇద్దరూ ఆపని చేయగలరా “‘అని అడుగగా ‘’నేనొక్కడినే చేయగలను ‘’అన్నాడు రామా ప్రగల్భ0 గా .ఆ గుహకు గంగ కొన్ని వందల గజాల దూరం లో ఉంది .తెల్లవార్లూ చావు గురించే ఆలోచించాడు మూడుగంటలకే లేద్దామనుకొన్నారు ఇ ద్దరూ. .కానీ నిద్రపట్టక ముందే లేచారు .స్వామీజీ ‘’మీకేమికావాలో కోరుకోండి ఇస్తాను ‘’అన్నాడు .రామా ‘’చచ్చిపోయేవారు మీరేమిస్తారు ?’అన్నాడు వ్యంగ్యంగా సిరివెన్నెల సీమలో లో సర్వదమన బెనర్జీ ‘’ఆది భిక్షువు వాని నేమి కోరేదీ ‘’అన్నటైపులో .అప్పుడు స్వామీజీ ;;యదార్ధ గురువు ను చావు ఏమీ చేయలేదు . మరణం తర్వాత కూడా గురువు శిష్యులకు మార్గ దర్శనం చేస్తాడు ‘’అని చెప్పి శిష్యుడివైపు తిరిగి ‘’ఈ’’ కొత్త పయ్యా ‘’ నీకు తలనెప్పిగా ఉన్నాడా ?’’అని అడిగాడు .అతడు నిర్మొహమాటంగా ‘’నిజమేస్వామీ కానీ నేనేం చేయగలను ‘’అన్నాడు .
తెల్లవారుజామున అయిదు అయిదున్నర మధ్య ఈ ఇద్దర్నీ స్వామీజీ దగ్గరకు పిలిచి ‘’ధ్యానం లో ఉండండి .అయిదు నిమిషాలలో దేహత్యాగం చేస్తాను .ఈ కట్టే పని అయిపొయింది ఇక భరించలేదు కనుక విసర్జించాల్సిందే ‘’అన్నాడు .అయిదు నిమిషాలతర్వాత స్వామీజీ ఓం ‘’అన్నాడు .ఆతరువాత అంతా నిశ్శబ్దమే ..రామా ఆయన నాడి చూసి స్వామీజీ తన నాడిని హృదయ స్పందనను శ్వాసను తాత్కాలికంగా నిలిపేశాడేమో అనుకొన్నాడు .తర్వాత శరీర ఉష్ణోగ్రత కళ్ళు ,వగైరాలు పరీక్షించాడు .శిష్యుడు ఇక చాలు అని గురువు సిద్ధి చెందారని ఆలస్యం చేయకుండా సూర్యోదయానికి ముందే దేహాన్ని గంగలో నిమజ్జనం చేయాలని అన్నాడు .భయపడవద్దని తానే మోసుకొని వెళ్లగలనని అనగా తానూ సహాయపడతానన్నాడుశిష్యుడు .ఇద్దరూ ప్రయత్నించినా ఆ దేహాన్ని కదల్చలేక పోయారు . ఒక పైన్ చెట్టు గట్టి కొమ్మ తెచ్చి తొడలమధ్య పెట్టి కదిల్చే ప్రయత్నం చేశారు ఫలితం కనిపించలేదు .ఒక గంట సేపుఅన్ని ప్రయత్నాలూ చేశారు . కానీ అంగుళం కూడా కదల్చలేక పోయారు .
సూర్యోదయానికి కొన్ని నిమిషాలముందు ‘’ఇప్పుడు మనం శరీరాన్ని మోసుకు పోదాం ‘’అనే మాట వినిపించింది .అక్కడ వాళ్లిద్దరే తప్ప మూడోపురుగు లేదు .బహుశా తాను మనసులో అనుకొంటున్నానేమో అని రామా భావించాడు . శిష్యుడిని అడిగితె తనకూ ఆమాట వినిపించింది అన్నాడు .ఇంతలో స్వామీజీ భారీ అందమైన శరీరం ఒక్కసారిగా దానంతటికి లేచి గాలిలోకి ఎగిరిప్రయాణించి గంగానదిని చేరి అందులో మునిగి అదృశ్యమైంది .ఈ ఇద్దరూ షాకయ్యారు జరిగిన సంఘటన చూసి .సిద్ధ పురుషులకు అసాధ్యమైనది లేదు అని మనం తెలుసుకోవాలి .
సమాప్తం
ఇప్పటిదాకా హిమాలయ యోగుల గురించి చాలా యదార్ధ గాధలు రాసి మీకు తెలియ జేశాను .దీనికి ఆధారం మొదట్లోనే చెప్పినట్లు స్వామిరామా ఆంగ్లం లో రాసిన ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’అని మరొక్కసారి మనవి చేస్తూ ఈ ధారావాహికను సమాప్తి చేస్తున్నాను .ఎందరో ఆత్మజ్ఞానం పొంది విశ్వ శ్రేయస్సును కాంక్షించే మహా యోగులు .అందరికి శిరసువంచి పాదాభివందనాలు.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—