అలంకారిక ఆనంద నందనం -1
సాహిత్య సాంస్కృతిక ప్రియులు భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని పించి ,ఇప్పుడు నడుం కట్టాం . ఈ కార్యక్రమం నాలుగు భాగాలుగా జరుగుతుంది .ప్రతికార్యక్రమం లో ప్రసిద్ధ భారతీయ ఆల0కా కరికులు పాల్గొని తమ జీవిత విశేషాలను ,తమ సిద్ధాంతాల పూర్వా పరాలను వారి తోనే చెప్పించాలని సంకల్పించాం .వారందారూ తమ హృదయావిష్కరణకు సరసభారతి చక్కని వేదికగా భావించి ఆనందంగా అంగీకరించటం మన తొలి విజయం . ప్రతి కార్యక్రమం లో పాల్గొనే వారిలో ఒక ఆలంకారికుడు అధ్యక్షస్థానం వహించి నిర్వహిస్తారు .మనమంతా ప్రేక్షకులమై వారి హృదయావిష్కారాన్ని అనుభవిద్దాం . ఈ రోజు మొదటి కార్యక్రమం లో శ్రీ భరత ముని అధ్యక్షత వహి0చి తమ సిద్ధాంతాలను ఆవిష్కరిస్తారు .శ్రీ భామహుడు శ్రీ దండి తమ సిద్ధాంత వివరణ చేస్తారు .ఆలంకారికులకు ఒకమనవి .తమ జనన మరణ కాలాల విషయాల గందర గోళం తో సభాసదులను ఇబ్బంది పెట్టక క్లుప్తంగా చెప్పి తమ కావ్యరచనలు ,తాము ప్రతిపాదించిన సిదాంతాలు ,అంతకు పూర్వమున్న వాటిపై తాము ఆలోచించి చెప్పిన నూతన విషయాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి అలంకారిక ఆనంద నందనాన్ని సు సంపన్నం చేయమని ప్రార్ధిస్తూ ,త్రిమూర్తులైన ఆ ముగ్గురు ఆలంకారికులను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ సభను నిర్వహించవలసినదిగా శ్రీ భరత ముని ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకొంటున్నాను ..
భరత ముని -సరసభారతి సరసమైన కార్యక్రమం నిర్వహిస్తూ ,మమ్మల్ని పాత్ర దారులను చేయటం విలక్షణంగా ఉంది .నిజమే సాహిత్య సభలలో ఆలంకారికులకు స్థానం బహు అరుదుగా ఉంటోంది .సరసభారతి ని ఇందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదికపై నా సహచరులైన భామహా ,దండి లను ఆప్యాయంగా స్వాగతిస్తున్నాను . నన్ను భరత ముని గానే అందరూ సంబోధిస్తారు ..నేను ఋగ్వేద0లో ప్రస్తావించబడిన భరత వంశం వాడిని .స్వర్గం నుంచి రూపక కళను భూమికి తెచ్చాను .నేను రచించిన నాట్య శాస్త్రా న్ని నా నూరుగురు కుమారులు కో హల ,దత్తిల,అశ్మకుట్ట ,నఖ కుట్ట మొదలైనవారికి బోధించాను .వీరందరూ ప్రామాణికులే .వీరు కూడా యధా శక్తి గా నాట్య కళ పై గ్రంధాలు రాశారు .నేను ఋగ్వేదకాలం వాడినైనా చారిత్రిక పరిశోధకులు మాత్రం నేను క్రీపూ 200 కాలం వాడినంటున్నారు . ఇప్పుడు భామహమహానుభావుని ఆతర్వాత దండి మహాశయుని తమ పుట్టు పూర్వోత్తరాలు తెలియ జేయవలసినదిగా కోరుతున్నాను ..
భామహుడు నా పుట్టు పూర్వోత్తరాలు గురించి నేనెక్కడా చెప్పుకోలేదు .నాకు కౌటిల్య భరత కాళిదాస మహాకవులు తెలుసు రామాయణ ,మహాభారత బృహత్కథలు తెలుసు .సంస్కృత కావ్య తత్త్వం పై నేనే మొట్టమొదటి గ్రంధం రాశాను .ఉద్భటుడు దీనిపై ‘భామహా వివరణ ‘’అనే వ్యాఖ్యానం రాశాడు . అది కాలగర్భం లో కలిసిందని అంటున్నారు . అందులో కొన్ని భాగాలు ఇటీవలే రోమ్ నగరం లో గ్నోల్ అనే ఆయన ప్రచురించాడు అయితే అవి అర్ధం చేసుకోవటానికి వీలు లేనంతగా శిధిలమయ్యాయని సాహిత్య పిపాసకులు బాధ పడుతున్నారని తెలిసింది .చరిత్రకారులు నన్ను క్రీశ 600 వాడినని అంటున్నారు .
దండి -సంస్కృత గద్య రచయితగా నన్ను అందరూ అభిమానిస్తారు .భట్ట బాణుడు నా సహచర కవి . నేనూ నా కాలాన్ని గురించి చెప్పలేదు .ఎందుకో మాకప్పుడు మమ్మల్ని గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం ఉండేదికాదు .కానీ పరిశోధకులు ఊరుకుంటారా .వారిలెక్కలప్రకారం నేను క్రీశ 710-720 మధ్యవాడినని తేల్చారు .నేను కావ్యాదర్శం అనే సిద్ధాంత గ్రంధాన్ని వచనం లో రాశాను వచన రచన 1-కథ 2-ఆఖ్యాయిక అని రెండురకాలు ఆఖ్యాయికలో కథా నాయకుడే స్వయంగా కథ చెబుతాడు .కథ లో ఎవరైనా చెప్పవచ్చు ..నాకు ముందే ఇలాంటి సాహిత్యం కొంత ఉంది నేను మెరుగులు పెట్టి ఉంటాను
భరతుడు -సోదరులు సంక్షిప్తంగా తమను పరిచయం చేసుకున్నందుకు ధన్యవాదాలు .ఇప్పుడు నా నాట్య శాస్త్ర విశేషాలు కొన్ని మీతో ముచ్చటిస్తాను ..నా నాట్య శాస్త్రం 37 అధ్యాయాల బృహద్గ్రంథం ..దీన్ని విజ్ఞాన సర్వస్వము అన్నారు సహృదయులు .దీనిలో అనేకరకాల నాట్య శాలల నిర్మాణం ,రంగస్థల దేవతలను నటీ నటులు ఆరాధించటం ,తాండవం మొదలైన నృత్య రీతులు ,కంటి చూపులు ,కరముద్రలువగైరా సూక్ష్మ వివరాలనూ తెలియ జేశాను . నటీ నటుల హావ భావాలు ,ప్రదర్శించే పద్ధతులు ,పాత్రోచిత భాష ,తగిన ఛందోరీతులు వాద్య గానాలకు సంబంధించి శాస్త్ర విషయాలు ,పాత్రోచిత దుస్తులు ,తెరలు వాడే విధానం కూడా చెప్పాను .రూప కాలలో భేదాలు ,నాటకం లో సంధి ,పరిచ్చేదం నాయకీ నాయక భేదాలు ,వివిధరకాల పాత్రలు ,రసాలు భావాలు అలంకారాలు గుణ దోషాలు ఒకటేమిటి సమస్తం వివరించాను. ఇందులో రస భావాదులు సాహిత్య విమర్శకు అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు .నాట్య లేక రంగస్థల ప్రదర్శన పరిధిలో కి రాణి కళ కానీ ,శాస్త్రం, శిల్పంకాని లేవు అని ఘంటాపధంగా చెప్పాను ..ఇప్పుడు భామహుడు పిమ్మట దండి మహాశయులు తమ రచనలలో విశేషాలను వివరిస్తారు .
భామహుడు -కావ్యం లో అలంకారానికి సంబంధించిన నియమాలను నేను సూత్రీకరించాను .ఉత్తమ కావ్యం జీవితం లోను కళ లోను విలువలను పెంచుతుంది .ఆనందాన్ని యశస్సును ఇస్తుంది . కావ్య రచనా ప్రతిభ లేకుండా ఎన్ని శాస్త్రాలలో పాడిత్యం ఉన్నా వ్యర్ధమే . వెన్నెల లేని రాత్రి ,మంచిప్రవర్తన లేని మనిషి సంపద, లాగా కావ్య నిర్మాణ సామర్ధ్యం లేని వాక్కులో ఎంతటి దాటి ఉన్నా వెలవెల బోతుంది .సంస్కృత ఆలంకార శాస్త్ర చరిత్రలో నేనే మొదటిసారిగా శాస్త్ర రచనకంటే కవితా ప్రతిభ యొక్క విశిష్టతను చెప్పాను .ఏ గురువువద్దనైనా చదివి శాస్త్ర పండితుడుకావచ్చు .కవిత్వం లో అది సాధ్యపడదు . కవిత్వం అనేది ఏ కొద్దిమంది ప్రతిభా వంతుల ముఖం నుండో తనంతట తానుగా అనర్గళంగా పొంగిప్రవహించే గంగా ప్రవాహం . కావ్యం అజరామరమైనది . అమృతత్వం కావ్య లక్షణం . కవి కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవిస్తాడు అని స్పష్టంగా చెప్పాను .
దండి-నేను కావ్యాదర్శం ,దశ కుమార చరిత్ర ,అవంతీ సుందరి కథ అనే మూడు ప్రసిద్ధ రచనలు చేశాను .మహా భారత కధలను చెప్పే ద్విసంధాన కావ్యము నా రచనే .కానీ ఇది అలభ్యమంటున్నారు .జాగ్రత్త లేకపోతె అంతే ..అలంకార శాస్త్రానికి ఒక కొత్త దృక్కోణాన్ని నూతనత్వాన్ని ఇచ్చాను .కావ్యానికి శబ్దము అర్ధము అనే రెండు ముఖాలున్నాయి .కావ్య శరీరం రమణీయార్ద భూషిత పద సంఘాతం అని నిర్వచించాను -’’శరీరం తావాదిష్టార్థ వ్యవ చిన్నా పదా వళీ ‘’అన్నాను ఈ పదావళి అనేక రీతులలో వ్యక్తమౌతోంది .అలంకారాలతో దానికి శోభ వస్తుంది .కవికి ,పాఠకుడికి ఆనందాన్ని కలిగించి ,కవికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టటమే కావ్య ప్రయోజనం .వచనం కవిత్వానికి మరో రూపమే నని ఖచ్చితంగా చెప్పాను .కావ్యం లో ఉండాల్సిన గుణాలు పరిహరించాల్సిన దోషాలు చెప్పాను .మా అన్నగారు భామహుల కంటే మౌలికతను ప్రదర్శించాను . అన్నగారి వక్రోక్తీ నాకు ఇష్టమే .అసాధారణ విషయాన్నికానీ వస్తువును కానీ వర్ణించాలనే కోరికకలిగినపుడు అలంకారాలు తన్నుకొంటూ వస్తాయి .అతిశయోక్తిలో వర్ణన పరా కాష్ట కు చేరుతుంది భౌతిక పరిమితులనన్నిటినీ అధిగమిస్తుంది .కావ్యానికి శోభాకూర్చేది అలంకారమే అని నా పూర్తి విశ్వాసం .రసం కావ్యానికి మాధుర్యాన్నిస్తుంది .నేను అందరికంటే భిన్నంగా కావ్య శైలికి ప్రాధాన్యమిచ్చాను ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—