అలంకారిక ఆనంద నందనం -2
భరత ముని -ఉత్తమ ఉదాహరణాత్మక నాటకం అంటే ధీరోదాత్తుడు నాయకుడుగాకలది లేక శృంగార ప్రధానమైనది .ప్రకరణం అంటే హాస్య రూపకం .జీవితం లో కస్టాలు బాధలతో సతమతమయే సామాన్యులకు వినోదం చేకూర్చటమే నాటక లక్ష్యం . అనుకరణ ,అనుకీర్తనద్వారా నటులు వేషాలు వేసి వినోదాన్నిస్తారు .పాత్రలు పౌరాణికం కావచ్చు ఇతిహాసానికి సంబంధినవి కావచ్చు .లేక నాటక కర్త సృష్టించిన పాత్రలైనా కావచ్చు .మీరందరూ అనుకొంటున్నట్లు అనుకరణ అంటే వెక్కిరింత కాదు .ఉన్నది ఉన్నట్లు చేసి చూపటమూకాదు .ఊహా కల్పనా ద్వారా పాత్రను పునర్నిర్మించి ప్రదర్శించాలి ..దీనినే పునః సమర్పణ అంటారు .కథ లేక ఇతివృత్తం ఉదాత్తం మహిమాన్వితం గా ఉండాలి .నాయికా నాయకులు ఉన్నత కులం లో పుట్టి ధీరగుణం కలిగి ఉండాలి .అప్పుడే గంభీరమైన నాటకం చూడగలరు .నిత్య జీవిత పాత్రలతో ఇతివృత్తం ఉంటె అది ప్రకరణం అవుతుంది .దీన్నే సామాన్య హాస్య నాటకం అన్నాను .నాటకం మాత్రం ప్రకల్పనలో ,ప్రదర్శనం లో మహోన్నతంగా ఉంటుంది . అసాధారణం ,అద్భుతం ,అలౌకికం కూడా చూపటానికి ఇతి వృత్తం లో స్థానం ఉంటుంది .ఏ రూపం లో ఉన్నా నాటకం చివరికి పరిష్కారం లభించే సంఘర్షణ ముఖ్యఅంగం కావాలి .నాటక ప్రారంభం లో అనుకూల ప్రతికూల శక్తులు సమంగా మోహరించి ఉంటాయి ..మధ్యలో ఒక క్లిష్ట దశ ఏర్పడుతుంది ..అప్పుడు నాటకం ఏ ఉద్దేశ్యంతో ప్రారంభమైందో అది చేరటం అసాధ్యమని పిస్తుంది .కానీ చివరికి ఉపసంహారం లో నాయకుడి శ్రమ ఫలి0చి ,విజయం చేకూరుతుంది . నాటక కథా వస్తువును సంధులుగా ,సంధ్యాంగాలు గా సూక్ష్మ0 గా విశ్లేషించి చెప్పాను . చాలా దూరం వచ్చానేమో ?ఇప్పుడు భామహా , దండి మహాశయులు తమ విశ్లేషణ వరుస క్రమంలో చేస్తారు ..
భామహుడు-కావ్యానికి కవితా సామగ్రి ఎలా ఉండాలో నేను స్పష్టంగా చెప్పాను .అవి -వ్యాకరణం ,ఛందస్సు ,నిఘంటువు ,సంప్రదాయంగా వస్తున్న కధలు ,గాథలు ,లౌకిక జ్ఞానం ,తర్కం లలితకళలు . కవి కావ్య నిర్మాణం చేయటానికి ముందే వస్తు నిపుణుల మార్గ దర్శకత్వం లో తన కళకు కావలసిన విషయాలలో ప్రాధమిక జ్ఞానాన్ని అయినా సమ కూర్చుకోవాలి తప్పదు ..కవిత్వం లో ఒక్క దోషం ఉన్నా నేను సహించను .కవిత్వ నియమాలు ఉల్లంఘిస్తే ,తండ్రికి అపఖ్యాతి తెచ్చే కొడుకు లాంటి వాడు అన్నాను నిర్మోహమాటంగా .అధమ కవిత్వ రచన మరణం తో సమానం ..నాది శాస్త్రీయ దృష్టి .మొహమాటం లేనే లేదు .
దండి-వాక్కు అభి వ్యక్తీకరణ అనేక మార్గాలలో జరుగుతుంది . కృతి నిర్మాణ శైలులు సూక్ష్మ భేదాలతో అసంఖ్యాకంగా ఉంటాయి .వైదర్భీ ,గౌడీ రీతులు పూర్తిగా భిన్నమైనవి .-
‘’అస్త్య నేకో గిరాం మామః సూక్ష్మ భేదః పరస్పరం -తత్ర వైదర్భీ గౌడీయో వద్యతే ప్రస్ఫుటాం తరౌ ‘’ వైదర్భీ శైలి ఉత్కృష్టమైనది .దీనిలో దశ గుణాలు ఉన్నందున సుస్పష్టంగా ,మనోహరంగా ఉంటుంది .గౌడీ దీనికి విరుద్ధమైన గుణాలు కలిగి ఉంటుంది . రెండిటిలో వైదర్భీ శైలి ఉత్కృష్టమైంది .నా తర్వాతవాడైన వామనుడు కూడా రీతి యే కవిత్వానికి ఆత్మ -రీతి రాత్మ కావ్యస్య ‘’అని సమర్ధించాడు . ఆ చిన్నారికి నా ఆశీసులు .
భరత ముని -నటుల దృష్టిననుసరించి నాటకాలను అంకాలుగా విభజించాలి . తీవ్ర మార్పులు ,నమ్మశక్యం కానంత సుదూర ప్రాంతాలకు సన్నీ వేశాలు మారటం ఒకే అంకం లో జరగకూడదు . నాటకాన్ని అంతా ఒకే సారి చూస్తుంటే ఈ నియమం పాటించక్కరలేదు ప్రతాప ,శృంగారాలలో నాయికా నాయకులు ఎలా ఉండాలో చెప్పాను . దీని వెనుక వైవిధ్యం అనే కీలక సత్యం దాగి ఉందని గ్రహించాలి .చివరికి దుర్మార్గం పై మంచితనానికి విజయం కలగాలి తప్పదు .. ప్రేక్షకులలో భారతీయ ధార్మిక వాతావరణం కలిగించాలి . నీతి ఐశ్వర్యం మనో వాంఛా పరిపూర్తి ఉత్తమ పాత్రలను నడిపించే శక్తులుగా ఉండాలి . పాత్రలద్వారా చూసేవారు ప్రేరణపొంది ఆదర్శ వంతమై తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి . అందుకే నేను విషాదాంత నాటకాల జోలికి పోలేదు … ఇప్పుడు భామహా దండి లు తమ అనుభవాలను చెబుతారు .
భామహుడు –భరతన్న గారి చూపు యెంత ధార్మికమైనదో యెంత ప్రయోజనకరమైనదో తెలిసిందికదా ..నేనుకూడా కవిత్వ శాఖలలో మహాకావ్యమే ఉత్తమోత్తమ మైనది అని గంట కొట్టి చెప్పాను ..రూపం లో ,వస్తువులో మహాకావ్యం ఉత్కృష్టమైంది . దానిలో పాత్రలు ఉదాత్తమైనవి ఉన్నతమైనవి .శైలి సుందరంగా ఉంటుంది . నాయకుని చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు మహా కావ్యం లో ఉంటాయి .రాజనీతి ,దండ యాత్రలు ,విజయాలు ధర్మోపదేశాలు అన్నీ సులభ శై లిలో వ్యక్తీకరింపబడతాయి ..కథ సుఖాంతమవటం భరతన్నయ్య లా నాకూ ఇష్టం .కావ్యం చతుర్విధ పురుషార్ధాలను ఎంతోకొంత ఉద్బోధిస్తుంది .కానీ ద్వితీయ పురుషార్ధమైన అర్ధానికి కావ్యం ప్రాధాన్య మిస్తుంది .మానవ స్వభావాలలో సత్యానికి కావ్యం ప్రతిబింబమవుతుంది .అన్ని రసాలకు కావ్యం లో చోటు ఉంటుంది .
దండి-నా అవంతీ సుందరి కథ ఆఖ్యాయిక వర్గానికి చెందింది .ఇందులోని సంఘటనలు యదార్ధ జీవిత సత్యాలపై ఆధారపడి ఉన్నాయి .వచనం అంటే’’ ఛందో బద్దమై న పాదాలుగా విభజించటానికి వీలు లేని పదాల కూర్పు’’అని నా నిర్వచనం . మనో వృత్తులు ,భావోద్వేగాలు తో నిండిన కవిత్వం వచనాన్ని పూర్తిగా భిన్నమైంది .మీమాంస శాస్త్ర కర్త శబరుడు అలంకార రహితంగా దర్శన శాస్త్రాలురాసి శంకర భగవతపాదులనే ఆకర్షించాడు .కనుక కవిత్వమే ఆకర్షిస్తుంది అనటానికి వీలు లేదు .వచనము సమర్ధంగా రాయగలిగితే అదే ఫలితాలను ఇస్తుంది అని మర్చిపోరాదు .
భరత ముని -సంతోషం .కావ్య ప్రాధాన్యం సోదరుడు భామహుడు వివరిస్తే ,వచన మనో వికాసాన్ని దండి తమ్ముడు చక్కగా చెప్పాడు .ఎందులో రాశా మనికాదు ఎంతబాగా రాశామనేది ముఖ్యం . ఈ రెండూ రెండు కళ్ళ వంటివే .. ఇప్పుడు నేను నాటకం లో నాందీ ప్రస్తావన గూర్చి చెబుతాను .నాటకానికి నాంది చాలా ముఖ్యం .నాందిలో పాత్రధారులు సుదీర్ఘంగా ఆరాధన చేయాలి అది అయ్యాక నే నిజంగా నాటకం ప్రారంభమవుతుంది .పాత్రలు వాటి హోదాలనుబట్టి . ఎలా సంబోధించాలి ,ప్రాకృత భాషా మాండలికాలను ఎలావాడాలి ,ఏయే భాగాలను ఎలా సముచితమైన సంజ్ఞలు నాట్య ,సంగీత రీతులతో ప్రదర్హించాలి అనే విషయాలను అతి సూక్షంగా పరిశీలించి చెప్పాను .అందుకే ఇప్పటికీ మీరు నన్ను మరచిపోలేక పోతున్నారు .. సోదరులారా ఇక మీరు ఉపక్రమించండి .
భామహుడు -అన్నగారు భరత మునీశ్వరులు ఒక విజ్ఞాన సర్వస్వము వారి నాట్య శాస్త్రం అంతే విలువకలిగింది .మాఅందరికి వారే మార్గ దర్శి ..ఇతర కవిత్వ శాఖలలో దశ విధ రూపకం ,గద్యం లో శృంగార గాథ ,అనిబద్ధ కవితలు ఉన్నాయి శృంగార గాథ లు ఆఖ్యాయిక ,కథ అని రెండురకాలు .ప్రకృతిని ,శృంగారాన్నీ వర్ణించే ఖండకావ్యాలు అని బద్ధ కవిత్వం కిందకు వస్తాయి .ఖండకావ్యం తో ప్రారంభించినా మహాకవి లక్ష్యం ఉత్తమ మహాకావ్య రచనమే .పురాణ ,ఇతిహాస కథలు ,కల్పిత కథలు కావ్య వస్తువులుకావచ్చు .కల్పిత కథలని తేలికగా తీసిపారేయ రాదు . కవి వాటిని తన అనన్య సామాన్యమైన ప్రతిభతో మలిచి మహాకావ్యం చేయవచ్చు .
దండి-కథ ఎలా ఉండాలి అన్న విషయం లో అన్నగారు భామహుడు ,పెద్దన్న భరతముని గారి అభిప్రాయాలు నాకూ నచ్చాయి .. ఇప్పుడు ప్రపంచమంతా వచన కవిత్వం తో పరవళ్లు తొక్కుతోంది .నేను వేసినదారి సవ్యమైనదే అని నమ్మకం కుదిరింది .కావ్యం లో ఆశ్వాసాలు కాండాలు ఉంటాయి కానీ వచన రచనను నేను ఉచ్చ్వాసాలుగా విభజించాము .ఉపోద్ఘాతం ఛందస్సులోపద్య రూపం లో ఉండచ్చు ..శృంగార ఇతివృత్తం ,రాజులమధ్య యుద్ధం ,ప్రేమికుల విరహం జైత్ర యాత్రలు మహత్తర సంఘటనలు చక్కగా వచనం లోనే చిత్రించవచ్చు .కథ ,ఆఖ్యాయిక మధ్య భేదాన్ని పాటించక్కరలేదు . పేర్లు వేరేకానీ రెండూ ఒకటే రకానికి చెందినవని నేను అభిప్రాయపడ్డాను .ఇక్కడమాత్రం అన్న భామహులను కాదంటున్నాను .నా అవంతీ సుందరి కథ భట్ట బాణుని కాదంబరి వచనానికి దగ్గరలో ఉంటుంది .ఈ కథ ద్వారా నా జీవిత కథను తెలుసుకొనే ప్రయత్నం చేశారు పరిశోధకులు .నా యదార్ధ జీవిత కథ చుట్టూ కల్పనా చమత్కృతి తో అల్లిన అనేక కథ లున్నాయని వారు భావించారు .నాకూ మహా కవి కాళిదాసు కూ మధ్య ఎవరుగొప్ప అనే సమస్య వచ్చి మేమిద్దరం సరస్వతీ దేవి దగ్గరకు వెళ్లి అభిప్రాయం అడిగితె ఆమె ‘’కవిర్ద 0డి కవిర్థం డి కవిర్ద0డి న సంశయహ్ ‘’అని బదులు చెప్పగా ,కాళిదాసుకు కోపం వచ్చి –కోహం ముండే ‘’-నేనెవరినీ దద్దమ్మా అని అడిగినట్లు ఆమె నిస్సంకోచంగా ‘’త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ‘’అని మూడుసార్లు అన్నదని తీగంతా లాగి డొంకంతా కదిల్చి వదిలి సంబరం చేసుకొన్నారు జనం . అయినా మా ఇద్దరి మధ్యా స్పర్ధ ఏమిటి ?ఇదంతా కాలక్షేపం బటానీలు . ఎంత గొప్పగా అల్లా రో ఈ కథను .మహాకవులకు తీసిపోరు ఈ పుకారు మనుష్యులు .ఇంతటితో ఆగారా /లేదే -మరో చమత్కారకవి ‘’వాల్మీకితో కవి అనే పదం పుట్టింది .వ్యాసునితో కవిద్వయం ఏర్పడింది డండి రాకతో కవిత్రయం అని లోకంలో వ్యవహారం లోకి వచ్చింది అన్నాడట .. భజన పరులు ఆనాడూ ఉన్నారు స్వామీ ..మరీ చెక్క భజన పనికి రా’’దండీ’’ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్-షార్లెట్-అమెరికా