అలంకారిక ఆనంద నందనం -3
భరత ముని -నాటకం లోని ప్రతి అంశానికీ అంటే పాత్రీకరణ ,నాటక ప్రణాళిక ,శైలి ,దుస్తులు ,సంగీతం నృత్యం వంటివి ఏదైనా రసం ప్రధానం అని నా అభిప్రాయం . అదే ప్రాణప్రదమైన ఊపిరి .అదిలేకపోతే కళ నిర్జీవమే .రసం భావంతో విడదీయరాన0తగా పెనవేసుకొని ఉండటం వలన ఒకటి లేకుండా రెండవదానిని అర్ధం చేసుకో లేం .వాడుకలో రసభావాలు ఒకే అర్ధం లో పర్యాయ పదా లయ్యాయి .మనిషికి ఉన్న మానసిక ప్రపంచం ,అనుభూతులు ,ఆవేశాలు ,అభిమానాలతో అతడిని ఏదో పనికి పురికొల్పుతాయి . జీవతానికీ ,కళ కూ ఇదే మూల పదార్ధం .దీన్ని తీర్చి దిద్దటానికే కళలు ప్రయత్నిస్తాయి .జీవితాలలో సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి .కానీ కళాకారుడు వాటిని గ్రహించి నప్పుడు తన ఊహలో వాటిని కల్పించుకొని ఒక క్రమ పద్ధతిలో పెడతాడు .ఇలాంటి పధ్ధతి భూమిపై ఉండదు .ప్రతిభా వంతుడైన కవి కల్పించిన దానికి లోబడి ఉన్నప్పుడు వాటిని భావాలు అంటారు ; భావన అంటే సృజనాత్మకమైన కల్పనా విధానమే .ఇదే సౌందర్య రసజ్ఞత .ఇది నాటక కర్తకు ,రసిక ప్రేక్షకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ..ఇలా రస ,సౌందర్య సిద్ధాంతానికి నేనే ఊపిరి పోశాను . నా తర్వాత భామహా దండి తమ్ములు తమ భావావేశాలు వివరిస్తారు .
భామహుడు -అన్న గారి రస సౌందర్య సిద్ధాంతానికి జోహార్లు .అన్నిటా వారు మార్గ దర్శి యే .నా దృష్టిలో కవిత్వం అంటే మహా పురుషులకు కవి అర్పించే ఘన నివాళి .విద్వా0సు డైన కవి ఉన్నత భావ వ్యక్తీకరణ ద్వారా సౌందర్యాన్ని ఉన్మీలనం చేస్తూ తన లక్ష్యాన్ని సాధిస్తాడు .ఉత్తమ కథా నాయకుని చుట్టూ ఉత్తమ శిల్పం తో అల్లిన ఉత్తమకథ మహాకావ్యానికి వస్తువవ్వాలి ..అన్నగారు భరత ముని చెప్పినట్లు పంచ సందుల సిద్ధాంత సారా0శ మైన క్రియకు సంబంధించిన ఏకత,వస్తువులో అంతర్వాహినిగా ఉండాలి .కావ్యం పాఠకుని ఆనంద పరచి నర్మ గర్భంగా ధర్మోపదేశం చేయాలి .ఉద్వేగ భరితమైన కథలను చెబుతూనే లౌకిక జ్ఞానాన్ని ,సాంఘిక ధర్మాలు ఉపదేశించాలి .మొదటినుంచి కావ్య నాయకుని ప్రశంసించటం లో కవి ఔచిత్యం పాటించాలి .ఈ మంచి మాటలు చెప్పానుకనుకనే నా ప్రవచనాలు ప్రాచీన సంస్కృత సాహిత్య లక్షణ సారం అన్నారు విజ్ఞులు ..నాకాలం లో రసాలు కావ్య వస్తువులో భావోద్వేగం కలిగించే అంశాలు మాత్రమే . శబ్దాలంకారం రసం ఎలా అవుతుందని ఆ తర్వాత ఆనంద వర్ధనుడు ప్రశ్నించాడు .నేను ఈ విషయాలు పట్టించుకోలేదు అంతే …
కావ్య సౌందర్యా రాధన శీలురకు నా అలంకార సిద్ధాంతం రస గుళికగా భాసించింది . సౌందర్యం అనే విషయాన్ని అన్న భరతుల వారితర్వాత నేనూ ఆ మార్గమే పట్టాను ..సౌందర్యం రెండురకాల .ఒకటి స్వాభావికమైనది రెండవది కళ ద్వారాసృష్టించేది ..ఆభరణాలవలన సుందరి మరింత సౌందర్యంగా ఎలా భాసిస్తుందో అలాగే రమణీయమైన శబ్దాలవలన సౌందర్యం అభివ్యక్తమౌతుంది .అలంకారాలు కూడా కావ్య సౌందర్యాన్ని ఇనుమడి0ప జేస్తాయి అనటం లో సందేహం లేదు.కావ్య విశిష్టతను శబ్దం అలంకారాలూ రెండూ ఇనుమడింప జేస్తాయి ..కానీ కావ్య సౌందర్యానికి వక్రోక్తి అనేది ప్రాణం అని నేను గట్టిగా నమ్ముతాను .వక్రోక్తి లేకపోతె ఉత్తమ కావ్యరచన సాధ్యంకాదు అని నిర్మొహమాటంగా అన్నాను ..
దండి-దండం చేతిలో ఉన్నవాడు దండి కనుక నా పేరు అదికాదని వేరే ఏదో ఉందని అనుకొన్నారు . దక్షిణాదివాడినని కర్ణాటక వాడినని ,మహారాష్ట్ర భాషను వైదర్భీ రీతిని మెచ్చుకున్నానని సంతోషించారు . దశకుమా ర చరిత్రలో గోమిని వృత్తా0తం బట్టి సంసారాన్ని పొదుపుగా నడుపుకునే అలవాట్లను చెప్పాను . మరొక చోట కోడిపందాలు కూడా వర్ణించాను . వీటన్నిటిబట్టి దాక్షిణాత్యుడను అనే బలమైన భావన కలిగింది . అంతే కాదు నా కావ్యాదర్శం రాసిన వందేళ్లకే కన్నడం లోకి అనువాదం పొందింది .క్రీశ 1250 లో తెలుగు అనువాదము వచ్చింది .కావేరీ తీరపట్టణం ,కళింగాంధ్రాల ప్రస్తావన కూడా దీన్ని బలీయం చేసి ఉంటుంది. అందుకే నన్ను ప్రామాణిక సృజనాత్మక సంస్కృత రచయితలలో ఒకనిగా విశేష స్థానం కల్పించారు . సమాజం లో ఉన్న ఉన్నత బీద వర్గాలు దొంగలు కుట్రలు కుతంత్రాలు అంతఃపుర కేళీ విలాసాలు వేశ్యా పొందు సౌఖ్యాలు ,జూద గృహాలు కోడిపందాలు ఒకటేమిటి జనజీవన స్రవంతిలో ఉన్న ప్రతి విషయాన్ని బొమ్మకట్టి నట్లు కట్టించి చూపాను నా రచనలో .కనుక నేను సామాజిక కవిని అన్నా ఇబ్బందిలేదు. క్రీశ 500 కాలం నాటి శూద్రకమహాకవి మృచ్ఛకటికం నాటకం వర్ణించిన సాంఘిక పరిస్థితులే నాకాలం నాటికీ ఉన్నాయి . అన్నలిద్దరూ రసం సౌందర్యం అంటూ ఆకాశాన విహరిస్తే నేను నేలమీదనే ఉంటూ నా కళ్ళతో చూసిన దృశ్య ప్రపంచాన్నే వర్ణించి సహజ కవిని అయ్యాను . ఇప్పటికే స్వ –మర్దనం చాలా చేశానేమో ..
భరత ముని -లేదు తమ్ముడూ .నేల విడిచి సాము చేయని నిన్ను చూస్తే మా ఇద్దరికీ అభిమానమే .చెప్పాల్సిన విషయాలే చెప్పావు .నీగురించి తెలియనివారికందరికి ఇవి అమూల్యమైన ఊటలు .మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పు తప్పు లేదు .. ఇందాక రస ప్రస్తావన చేశాను ..భావం వస్తు స్వభావం గా ఉంటె సౌందర్య రసజ్ఞత అధమస్థాయి లో ఉంటుంది .చిత్రకళలో దీనికి స్థానం ఉంది .కానీ రంగస్థలం పై కళాకారుడు మానవ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రీ కరించటం లో తృప్తిపడకుండా వాటిని మరింత జటిలం చేస్తాడు .ఈ విధంగా జయప్రదంగా భావ జటిలతమాత్రమే రసం అనిపించుకునే అర్హత పొందుతుంది .కారణం అది ఇచ్చేరుచి ఆనందానుభూతి అనంతమైనది .నా దృష్టిలో భావం లేని రసం లేదు .అలాగే రసం లేకుండా ఏ భావమూ ఉండదు . వీటి పరస్పర సమన్వయము వలననే రంగ స్థల విజయం ఆధార పడి ఉంటుంది . వస్తువు ,లేక భావం సూటిగా ప్రేక్షకుడికి తాకితే అతడిలో వెంటనే ప్రతిస్పందన కలిగితే అది అక్కడికక్కడే రసంగా పరిణామ0 చెందుతుంది ..అప్పుడు అతని శరీరం అంతా ఎండు టాకుకు నిప్పు పెట్టినట్లుగా ప్రజ్వ లిస్తుంది . రసం అంటే సౌందర్య భావ జనిత ఆనందం అని ఏక వచనం లో అర్ధం .బహువచనం లో రసాలు ఉఛ్చ స్థితికి చేరిన స్థాయీ భావాలు అని నా నిర్వచనం .భావోద్రేకాలు ఎనిమిది .రతి ఉత్సాహం మొదలైనవి .వీటినే శృంగార వీర రసాదులు అన్నాను ‘’శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకా -భీభత్సాద్భుత సంజ్నౌ చేత్య స్టౌ నాట్యే రసాహ్ స్మృతాః ‘’
‘’రతి ర్హాసశ్చశోకశ్చ క్రోధో త్సాహో భయం తథా -జుగు ప్సావిస్మయ శ్చేతి స్థాయీ భావాః ప్రకీర్తితాః ‘’
అంటే -శృంగారం హాస్యం ,కరుణ ,రౌద్రం వీరం భయానకం ,భీభత్సం ,అద్భుతం అనేవి 8 రసాలు వీటికి ఉన్న 8 స్థాయీ భావాలూ వరుసగా -రతి ,హాసం ,శోకం ,క్రోధం ,ఉత్సాహం ,భయం ,జుగుప్స ,విస్మయం .చూసేవాడిలో బాధను రగుల్గొల్పే కరుణ , భీభత్సం కూడా నా దృష్టిలో రసాలే .రస సౌందర్య చర్చ అంటే నాకు ఒళ్ళు తెలియదు .చాలా చెప్పి విసిగించానా ? తమ్ముళ్లూ ఇప్పుడు మీ వంతు .
భామహుడు- అన్నగారు భరతులవారు రస వాహినిలో ముంచి తేల్చారు .సౌందర్య దర్శనం తో అప్రతిభులను చేశారు . అన్నగారూ శతకోటి వందనాలు . కావ్య భాషలో సౌందర్యం వెనక ఉన్న రహస్యాలను భేదించటానికి అనుస్యూతం గా ప్రయత్నాలు జరుగు తూనే ఉన్నాయి .అయితే నా భావాలు ఆలోచనాత్మకమైనవి ,అతి నిగూఢమైనవి అంటారు విశ్లేషకులు .కుంతక ,ఉద్భటులు నా భావాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసి మంచి ప్రచారం తెచ్చారు .నా నిశిత దృష్టికి ,భావ వైశాల్యానికి వారి రచననలు అద్ధం పట్టాయి . అది నా అదృష్టం . నా భావ వ్యాప్తికి చేయూతనిచ్చినవారికి హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు . నాకు అనిపించేదేమిటంటే శబ్దార్ధాలు ,కథా వస్తువు ,భావోద్వేగాల సమ్మేళనం వలననే సంపూర్ణ సౌందర్యాను భూతి కలుగుతుంది ..కనుక ఇవన్నీ అలంకారం లోని అంశాలే అంటాను నేను ఈ దృష్టితో చూస్తే కేవలం వాస్తవికత ,కవిత్వం పరస్పరంగా విరుద్ధమైనవి గా కనిపిస్తాయి .కనుక నేను స్వభావోక్తిని ఒక అలంకారంగా గుర్తించలేదు . నేను అలంకారానికి ప్రాధాన్య మిచ్చాను .గుణాలు రీతి అవసరం .వైదర్భీ గౌడీ భేదాలు ఉండాలి . వైదర్భీలో ప్రసాద ,ఋజుత్వ ,కోమలత్వ గుణాలు నాకు ఇష్టం లేదు పురుషార్థం వక్రోక్తి లేకపోతె కావ్యమే కాదు పొమ్మన్నాను . గౌడీయ రీతిలో అలంకారానికి ,భావ ఔచిత్యానికి యుక్తి యుక్తం గా చోటు కలిపిస్తే ఉత్తమ కావ్యమవుతుంది. కేవలం మాటల గారడీ లో అందం లేదు ఉండదు .ద్వివిదాత్మక సౌందర్యం వక్ర శబ్దం అర్ధం వల్లనే ఏర్పడుతుంది అని ఘంటాపధంగా చెప్పాను .సమాస ప్రయోగం ధారాళంగా ఉండచ్చు సమాస బాహుళ్యం వలన ఓజస్సు ఏర్పడుతుంది .కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ప్రాసాద గుణం రాణిస్తుంది .సమాసాలు కర్ణ పేయంగా ఉంటె మాధుర్య గుణం వికసిస్తుంది .
దండి-అన్న లిద్దరూ సౌందర్య పిపాసలో చాలా దూరం కొట్టుకు పోయారు . .పెద్దన్న భరతుడు ముందే అనుజ్ఞ ఇచ్చాడన్న ధీమాతో నేను మాత్రం నా స్వంతగోడు వినిపిస్తున్నాను .అవంతీ సుందరికథ ను నేను కంచిలో రాశాను .పుస్తకాలంటే నాకు వల్లమాలిన అభిమానం.మా అమ్మా నాన్న పోయాక సరస్వతి ,శ్రుతులే నాకు దిక్కు అయ్యాయి ..దేశాటనం చేస్తూ బ్రాహ్మణ క్షత్రియ విద్వద్గోష్ఠిలో పాల్గొన్నాను . వైద్యం పశువైద్యం ,జ్యోతిషం ఖగోళం వాస్తు శిల్పకళతో నైపుణ్యం సాధించాను .కౌటిల్యం కామసూత్రాలు చదివి నిష్ణాతుడనయ్యాను వాస్తు శిల్పం లో నా పరిజ్ఞానాన్ని మిత్ర శిల్పి లలితాదిత్యుడు ఎంతో మెచ్చాడు ..మహాబలి పురం లో త్రివిక్రమ విష్ణు మూర్తి రాతి విగ్రహం చేయి విరిగిపోతే దానికి మలాం పూసి మరమ్మతు చేసిన లలితాదిత్యుడు నన్ను దానిపై అభిప్రాయం కోరాడు అంటేశిల్పకాలపై నాకున్న పరిజ్ఞానం అతనికి నచ్చినట్లేకదా . .ఎన్నో పుస్తకాలు చదవాలని పిస్తుంది కానీ వయస్సు మీదపడిపోతోంది అని నాకు బాధగా ఉంది . నాకుతెలిసిన సాహిత్యకారులు వ్యాస సుబాహు గుణాడ్య మూలదేవ శూద్రక భాస ,సర్వజన ప్రవర సేన కాళిదాస ,నారాయణ భారవి ,బాణ మయూరాదులను నేను స్మరించాను .బహుశా వారికాలాలు కూడా అదే వరుసలో ఉంటాయి .విజ్జిక లేక విజ్జి అనే కవయిత్రినీ గుర్తు చేసుకున్నాను .ఆమె నల్లగా ఉంటుందికనుక నేను సరస్వతీ దేవిని శుక్లాంబరధరం స్వేతవర్ణం గా వర్ణిస్తే ఆమె శ్యామలవర్ణం గల విజ్జికయే సరస్వతి అని భావిస్తే దండి అలా వర్ణించి ఉండేవాడు కాదు అని జవాబు ఇచ్చింది .గంగాదేవి అనే కవయిత్రి ఆచార్య దండి వాక్కు అనే తేజస్సు అద్ధం లో మెరిసిన సరస్వతీ దేవి ఆభరణాల సోయగమే ‘’అని చక్కగా చమత్కరించింది –
‘’ఆచార్య దండి నో వాచ మాచాన్నామృత సంపదాం -వికాసో వేధసః పరన్యా విలాస మణి దర్పణం ‘’.
భరతముని -దండి సోదరా నీ కథ ను దండిగా చెప్పి మాకు కొత్త విషయాలు తెలియజేశావు .సోదరులారా మన కార్యక్రమాన్ని రేపటితో ముగిద్దాం. .తయారుగా రావల సిందిగా కోరుతున్నాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా