ఆలంకారిక ఆనంద నందనం -4
భరత ముని-రసాలు సౌందర్యం తో ఉన్న వస్తువు ,సన్నివేశాన్ని ఆశ్రయించి ఉంటాయి .స్థాయీ భావాల ,వ్యభిచారీ భావాల సమ్మిళిత స్వరూపమే వస్తువు లేక సన్నివేశం .వ్యభిచారీ భావాలంటే 33 తాత్కాలిక మానసిక ఉద్వేగాలు .-నిర్వేదం ,దైన్యం ,గ్లాని గర్వం మోహం భ్రమ మొదలైనవి . భావం నుంచి ద్రష్ట లో ఉండాల్సిన ఊహా శక్తియొక్క ప్రాధాన్యత తెలియ జేయటానికే ఈ పదాలను సృష్టించాను చూసేవాడిలో సౌందర్య రసాస్వాదన అనే శక్తి లేకపోతె ఒక అందమైన అమ్మాయిని చూసినా ,రమణీయ సుందర ఉద్యానవనం చూసినా వాడిలో ఏ రకమైన భావోద్వేగం కలగదు .రంగ స్థలం పై వీటిని ప్రదర్శించేటప్పుడు సామరస్యం ,ఔచిత్యం చూపిస్తే అభిరుచి ఉన్న ప్రేక్షకుడికి రసానందం కలుగుతుంది . ఇవి లేకపోతె రస భంగమవుతుంది అనిగ్రహించాలి .నాటకం విజయం కావటానికి ప్రధాన సూత్రం ఏమిటి అంటే వివిధ రసాలమధ్య ఏదో ఒకటి సర్వత్రా ఆవరించి శాసించే విధంగా ఉండాలి .మానసిక స్థితుల వైవిధ్యం మధ్యలో ,అన్నీ ఊహలవలన రూపాంతరం చెందితే ,గాఢమైన భావా వేశం ఒకటి వాటినన్నిటిని సూత్రం లో బంధించినట్లు గా ఐక్యం చేస్తుంది . దీన్ని ఆ కళాకృతి యొక్క అంగిరసం గా భావించాలి . మిగిలినవన్నీ కేవలం క్షణికాలే .నాటకం లో ఒకే రసం అంటూ ఉండదు …ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదని మనవి చేస్తూ సోదరులు భామహా ,దండి లు కొనసాగి0చమని కోరుతున్నాను . మా ముగ్గరినీ ఆహ్వానించి మా ముఖ్తతహా మా సిద్ధాంతాలను తెలియ జెప్పే అవకాశం కలిగించిన సరసభారతివారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను సెలవ్ .
భామహుడు -నేను వక్రోక్తికే పట్టం కట్టాను .సౌందర్య భావోద్దీపకమైన విభావాలుగా పరిణామ చెందాలి అంటే వక్రోక్తి వల్లనే సాధ్యం ..అన్నగారు భరతులవారు చెప్పిన రసాలన్నిటిని అలంకారాలుగా స్వీకరించటానికి నాకేమీ అభ్యంతరం లేదు ..శబ్దార్ధాలను మించి మరేదో జ్ఞానం కావ్యం ఉపదేశిస్తుంది .అందుకే నేను పర్యాయోక్తి విశేషోక్తి వ్యాజస్తుతి అలంకారాలను ఆదరించాను ప్రధాన కథ లో ఔన్నత్యం అద్భుతం దృశ్య రామణీయకత తోపాటు ,నాటకీ య గుణం ,శైలీ వైభవం కూడా ఉండాలి .గుణాలు కూడా అలంకారాలు అన్నాను కవిత్వ విలువలను నాశనం చేసే 12 దోషాలను గుర్తించి వివరించానునేను ..వస్తుజ్ఞానాన్ని పొందేవిధానం ,త్రైపాక్షిక తర్క సాధ్యమైన హేతువు ,నాదం యొక్క అమృతత్వం ,తార్కికమైన భ్రమలు చర్చించటానికి ఒక అధ్యాయం అంతా ఉపయోగించాను .కవిత్వానికి తనదైన తర్కం ఒకటి ఉంటుంది .అలాగే తనదైన అపోహలూ ఉంటాయి ..కావ్యనాయకుని శపథం ధార్మిక లౌకిక ,శృంగార ,ప్రతీకార బద్ధంగా ఉంటుంది మహాకావ్యాలలో ఇవి నెరవేరాలి .దీనికి విరుద్ధంగా వైఫల్యం చెందటం పెద్దపొరబాటే .ఉదాహరణకు-పురువు తండ్రి ముసలితనానికి బదులు తన యవ్వనం ఇవ్వటం ,వత్సరాజు వాసవదత్తను అపహరించటం భీముడు దుస్సాశాసనుడి రక్తాన్ని పానం చేయటం భీష్ముని బ్రహ్మచర్య ప్రతిజ్ఞ వంటివి . నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు .
దండి-సాంకేతిక నైపుణ్యం శైలీ వైభవం నాకు బాగా ఇష్టం .వీటిలో నన్ను మించినవారు లేరని విశ్లేషకులు భావించారు మంత్ర గుప్తుని వృత్తా0తం లో 200 కు పైగా వాక్యాలను ఓస్ట్య ములు లేకుండా రాశాను ఇదొక పెద్ద ఫీట్ ..ఇలా రాయటానికి ఒక విచిత్ర కారణం ఉంది .తన కథ చెబుతున్నప్పుడు మంత్ర గుప్తుడి పెదిమలు అతని ప్రియురాలి ముద్దులతో గాయపడ్డాయి .అందుకని దంత క్షతాలు కనిపించకుండా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని పెదవులు కలిపితే వచ్చే అక్షరాలైన ఓస్ట్య ములు రాకుండా చెప్పించాను ..వర్ణించటం చిత్రించటమే నాపని చర్చించటం నా పనికాదు .నేను చిత్రించిన స్త్రీలలో స్వభావ విరుద్ధ దౌర్జన్య పోకడలు కామ తృష్ణ ,మోహావేశం రతికేళిలో పురుషుల్ని మించిపోవటం కనిపిస్తుంది .ఇవి నేను చూసి రాసినవే .అందుకే నా వర్ణనలు రాజస్థానీ సంక్షిప్త చిత్ర కళ తో , మాటిస్ చిత్రాలతో పోలుస్తారు . ఇంతటి నిశిత పరిశీలన చేసినవారికి అభినందన చందనం . సెలవు
సాహితాభిమానులకు వందనం .ఈ ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొని శ్రద్ధగా విని విషయం సంగ్రహణం చేసిన శ్రోతలకు కృతజ్ఞతలు .మీరు లేనిదే దీనికి విజయం చేకూరదు .మనం ఆహ్వానించగానే మన్నించి తమ అమూల్య సందేశాలను సిద్ధాంతాలను సవివరంగా తెలియజెప్పిన భరత ముని భామహా ,దండి పండితులకు మనఃపూర్వక కృతజ్ఞతాంజలి .సోదరులారా ఒక్కసారి నేను వీరు ముగ్గురు చెప్పినదాన్ని సమీక్ష చేస్తున్నాను ,జాగ్రత్తగా వినండి .
భరత ముని రస సిద్ధాంతం లోని సముచిత భావనలు ఆంగ్లకవి విమర్శకుడు టి ఎస్ ఇలియట్ వస్తుసామ్య భావనకు సన్నిహిత సంబంధం ఉందని అంటున్నారట . ఉత్తమ భావాలు దేశకాలాతీతాలు కదా .. రస సిద్ధాంతం పై అనేక వ్యాఖ్యా గ్రంధాలూ రావటం దానిలో ఉన్న విషయం గరిమకు సాక్ష్యం .బట్టలొల్లటుడు -జీవితం లోనూ కళ లోను వచ్చే భావోద్వేగానికి మధ్య తేడాలేదని ,రసాలు రంగస్థలపాత్రలనుండే ఏర్పడతాయని ,చూసేవారు పాత్రలలో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తాడని చెప్పాడు .శంకుకుడు నటులలో విభావ అనుభవాదులను చూసి ప్రేక్షకుడు తనదైన జ్ఞానం లేక తార్కిక భావనతో కళకున్న ప్రత్యేక ఆకర్షణవలన రసాన్ని అనుభవిస్తాడని అన్నాడు .భట్టనాయకుడు సౌందర్య సాధనలో వచ్చే అన్ని అంశాలను సార్వ జనీనం చేయటం వలన కలిగే అలౌకిక ఆనందమే రసం అని పేర్కొన్నాడు .కాశ్మీర శైవ దార్శనికుడు అభినవ గుప్తుడు రసం కళ లోనుంచే స్వయంగా పుడుతుందని ,అది అద్వితీయమైనదని తేల్చాడు ..భాష యొక్క సౌందర్యోద్దీపనా శక్తికి సమగ్ర వివరణగా ఆనంద వర్ధనునిధ్వని సిద్ధాంతాన్ని అన్వయించటం ద్వారా రసం మానవునికిఅత్యు కృష్ట మైన ఆత్మాశ్రయ ఆధ్యాత్మ్తికానందం కలిగిస్తుందని మరింత విస్పష్టంగా తెలియజేశాడు .సాహిత్యం లో అర్ధానికి ఉన్న బహుళ వ్యాప్తిని ,కవిత్వ భాషకు గల ప్ర త్యేక విశిష్టత గురించి ఆధునికులు చేసిన భావనలు మన ప్రాచీన ఆలంకారికులు ముందుగానే ఊహించి చెప్పినవే అని ఘంటా పదంగా చెప్పవచ్చు . భరత శాస్త్రాన్ని డ్రమాటిక్ ఆర్ట్ ,పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ అన్నారు ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .అరిస్టాటిల్ రాసిన పొయెటిక్స్ ఇలాగే ఉంటుంది .సంగీతాన్ని గురించి విపులంగా చర్చించిన తొలి గ్రంధం నాట్య శాస్త్రమే . 13 వ శతాబ్ది వరకు సంగీతానికి ఇదే ఉపయుక్త గ్రంధం .ఆతర్వాతే దక్షిణాది ఉత్తరాది సంప్రదాయాలేర్పడ్డాయి .శృతుల మధ్య సామరస్యమే సంగీ తమన్నాడు భరతముని .ఈ నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదంగా గుర్తించారు భరత ముని నాటిన రసం అనే బీజం మొలకెత్తి మహావృక్షమై ,శాఖోపశాఖలై విస్తరించి పుష్పఫల సంభరితమై సార్ధక్యాన్ని పొందింది .
భామహుడు పురాణ కావ్య ,శృంగార ప్రబంధాలను వెలకట్టి విలువలను నిర్ణయించటం లో ఆయన కవిత్వ విమర్శ పరాకాష్టకు చేరింది .ఆయన సిద్ధాంతం లోసూత్రాలను తర్వాత వచ్చ్చిన వ్యాఖ్యాతలు శ్రద్ధగా పరిశీలించి ఉంటె కావ్య విమర్శ కొత్త పుంతలు తొక్కి ఉండేది తన అపార విద్వత్తు ద్వారా గ్రహించిన సత్యాలను కవిత్వ సేవకు మళ్లించి తన సామర్ధ్యాన్ని అంతటినీ సద్వినియోగం చేసుకొన్నాడు .భరతుని రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించలేదు . అగ్ని పురాణం లో ఉన్న రసమే కావ్యానికి జీవం అన్నదీ ఆయన స్పృశించలేదు .రసాన్ని ‘’రసదలంకారం .’’అన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహా సిద్ధాంతం .
ఇక దండి లక్ష్య పూరిత నిండైన జీవితం గడిపి ఆచార్యుడనే బిరుదు పొంది ,శిష్య ప్రశిష్యులతో ప్రక్రుతి ఒడిలో జీవించి అద్భుత సాహిత్యనిధిని మనకు అందజేశాడు వకాహనానికి గౌరవం తెచ్చాడు వచనాన్ని సంస్కృతం ప్రాకృత ,అపభ్రంశ మొదలైన స్థానిక భాషలలో కూడా రాయవచ్చు నేనే భరోసా కలిగించాడు కానీసంస్కృతం విశ్వవ్యాప్త గౌరవమున్న భాష -’’దండినః పదలాలిత్యం ‘’అని పేరు పొందాడు .గుణ ప్రస్థాన భావాన్ని దండి వ్యాపింప జేశాడు .కవిత్వం లో శ్లేష ,ప్రసాద గుణం సమతాగుణం ,మాధుర్యం అర్ధ వ్యక్తీ ఓజస్సు అనే గుణాలు ఉంటేనే మహాకావ్యమౌతుందని దండిభావన .
‘’సంస్కృతం నామ దైవీ వాన న్యర వ్యాతా మహర్షిభిః ‘’అంటే సంస్కృతం నిజంగా దేవా భాష అని మహర్షులు సిద్ధాంతీకరించారు .సామాన్య మాండలీకాలు అనేకం దానినుండి పుట్టాయి స్థానిక ప్రజలు వాటిని పోషించారు .అని గొప్ప భాషా విశ్లేషణ చేసిన దండి మాండలిక మార్గ దర్శిఅనిపించాడు
విశ్వ సాహిత్యం లో భరతుని రస సిద్ధాంత ప్రకటన అత్య0త సమ గ్రమైనది మానవుడిలో సహజ స్వాభావికంగా స్పంధించే గుణం ,నాటకీయ సమర్పణలో వివిధ ప్రేరకాల కూర్పు ద్వారా క్రియాత్మకం చేయటం ,దానివలన ప్రేక్షకునిలో వచ్చే స్పందన ,చివరికి స్వచ్ఛమైన రసానుభూతికలగటం భరతముని రస సిద్ధాంతం లో ముఖ్యాంశాలు .కవిత్వ భాషలో విడదీయ రాని అఖండత్వం లోకి శబ్దార్ధాలు పరిణామం చెందటం లోని భామహుడు విడమర్చి చెప్పాడు .కావ్యాన్ని సౌందర్యం తో నింపేది అలంకారాలేన్ని వచనము కూడా శిరోభూషణమే నని దండి మహాశయుని భావం భరతుడు కావ్యాత్మ రసం అంటే ,భామహుడు అలంకారం అంటే దండి కావ్యాత్మ గుణం అని ప్రతిపాదించారని అర్ధం చేసుకోవాలి .సరసభారతి నిర్వహించిన ఈ ప్రత్యేక ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మొదటి సమావేశం సమాప్తం . మరి కొందరు ఆల0 కారికులతో రెండవ సమావేశం లో కలుద్దాం .అంతవరకూ సెలవు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-17-కాంప్-షార్లెట్-అమెరికా
—