అలంకారిక ఆనంద నందనం -7

అలంకారిక ఆనంద నందనం -7

సాహితీ బంధువులకు సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మూడవ భాగానికి స్వాగతం . ఈ రోజు శారదా దేశ0 కాశ్మీర్ కే చెందిన ముగ్గురు ఆలంకారికులు మనమధ్య ఉండటం మరొక వినూత్న విషయం .. వారిలో ‘’అభి వ్యక్తి సిద్ధాంతకర్త ‘’శ్రీ అభినవ గుప్తులవారిని అధ్యక్ష స్థానం వహించి సభా సంచా లనం చేస్తూ తమ సిద్ధాంతవిషయాలను తెలియ జేయవలసినదిగా  వేదిక నలంకరించవలసినదిగా అగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..వ్యంజనా వృత్తికారులు రాజానక మమ్మట పండితులను ,వక్రోక్తి విన్యాసి రాజానక కుంతకులవారినీ తమ సిద్ధాంత వివరణ చేయవలసినదిగా ఆత్మీయం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను . ఇద్దరు రాజానకులు వేదికపై ఉండటమూ మన అదృష్టమే .

అభినవ గుప్తుడు -నా మాతృభూమి భారత దేశ శిరోలంకారమైన కాశ్మీరం అవటం నా అదృష్టం ..నేను క్రీశ 960 ప్రాంతం వాడిని . నా రచనలలో నా జీవితాన్ని రేఖా మాత్రంగా తెలియజేశాను .మొదటి గ్రంధం క్రమ స్తోత్రం మార్గ శిర బహుళ నవమి క్రీశ. 990 లో ను ,భైరవాష్టకం పుష్య బహుళ దశమి క్రీశ. 992 లో ,ఈశ్వ ప్రత్యభీఙ్ఞ వివృతి విమర్శ మార్గశిరమాస చివరి దినాన 1014 లో రాశాను .నేను 30 వ ఏటనే సాహిత్య వ్యాసంగం ప్రారంభించాను ..మా పూర్వీకులలో అత్రి గుప్తుడు అతి ప్రాచీనుడు ..కనౌజ్ పాలకుడు లలతా దిత్యుని శైవ వాజ్మయ పాండిత్యానికి ముగ్ధుడై తనతో కాశ్మీరానికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు .రెండు శతాబ్దాల తర్వాత  నేను కాశ్మీరం లో జన్మించానన్నమాట ..మాతండ్రిగారు నరసింహ గుప్తులు ..తల్లిగారు విమలమ్మ .ధార్మిక వాతావరణం లో ధన్యమైన కుటుంబం లో నేను పుట్టానని గర్వం గా చెప్పుకొంటాను .నా వాగ్ధాటి ,మేధో శక్తికి ఉపాధ్యాయులు నివ్వెర పోయేవారు . ఇదంతా శారదా దేవి కటాక్షం .చిన్నప్పుడే తల్లి చనిపోవటం ,మా తండ్రిగారు సర్వం త్యజించి సన్యాసం స్వీకరించటం తో నేను వివాహం చేసుకో కూడదని నిర్ణయించుకున్నాను  . కాశ్మీర్ లోను బయటా మహా పండితుల వద్ద క్రమ ,త్రిక ,కులపద్దతి సిద్ధాంతానే  కాక ,ఆచరణాత్మక యోగ పద్ధతులూ నేర్చాను ..యోగాభ్యాసం తో ఆత్మ శక్తులు సాధించాను . ఇప్పుడు వరుసగా మమ్మట ,కు0తక మహాశయులను తమ ప్రసంగాలను వరుసక్రంగా చేయవలసినదిగా కోరుతున్నాను .

మమ్మటుడు -అన్నగారు గుప్తుల వారివలెనే నేనూ కాశ్మీరమ్మ ఒడిలో పుట్టాను .నా గురించి నేను ఎక్కడా చెప్పుకోలేదు .కానీ పరిశోధకులు ఊరుకొంటారా ? ఎంతో శోధించి నేను 11 వ శతాబ్ది ఉత్తరార్ధం వాడినని సిద్ధాంతం చేశారు ..నేను రాసిన ‘’కావ్యప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం బహు ప్రశస్తి పొందింది .అది భారతీయ ఆత్మపై చెరగని ముద్ర వేసింది అంటారు విజ్ఞులు . దీనిపై  ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చి నన్ను మరవనివ్వలేదు .సంస్కృతం లో కావ్య ప్రకాశానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇంకా దేనికీ రాలేదని నిర్ధారించారు .నాకు రాజానక బిరుదునిచ్చారు  ..సంస్కృత ,ప్రాకృతాలలో అశేష పాండిత్యమూ ,వ్యాకరణం లో విద్వత్తునూ సాధించాను ..మాతండ్రి గారు జయ్యట పండితులు .నా తమ్ముళ్లు కైయట ,ఊవట లు .తమ్ముళ్ళిద్దరూ వేదాలకు వ్యాకరణానికి వ్యాఖ్యానం రాసిన పండితులు . పెద్ద తమ్ముడు కైయట మహాభాష్యానికి ,చిన్నతమ్ముడు ఊవట శుక్ల యజుర్వేద సంహితకు వ్యాఖ్యలు రాశారు .తమ్ములిద్దరూ నా వద్దే చదివారు .నేను కాశీలో విద్య నేర్చాను ..భోజమహారాజు దాతృత్వాన్ని గురించి ఒక శ్లోకాన్ని కావ్యప్రకాశంలో ఉదాహరించాను .మాతమ్ముడు  మాళవ దేశం లో ఉండటం వలన అది అక్కడినుంచి కాశ్మీరానికి చేరింది .

కుంత కుడు-నేనూ తల్లి కాశ్మీరు బిడ్డనే ..నాకాలం నేనూ చెప్పుకోలేదు .కానీ నన్ను క్రీశ 950-1050 ల మధ్య కూర్చోపెట్టారు .సంతోషం . కాశీతర్వాత గొప్ప సంస్కృత సాహిత్య కేంద్రం కాశ్మీర0 అవటం మాకు గౌరవం ..నా రచనలలో కాళిదాస ,భవభూతి ,హాలా ,బాణ మాఘ ,అమరు  ,మయూర ,శ్రీ హర్ష ,భట్టనారాయణ ,రాజశేఖర ,భామహా రుద్రత ఆనంద వర్ధనాదులను పేర్కొన్నాను ఆనాడే వర్ధనులవారిని ‘’ధ్వనికారులు ‘’అన్నాను .ఉదాత్తరాఘవాన్నీ ప్రస్తావించాను .నేను ‘’వక్రోక్తిజీవితం ‘’రాశాను .అధ్యాయాలను ఉన్మేషా లు అన్నాను . ప్రధాన సిద్ధాంతాలను కారికలుగా శ్లోకాలలో రాశాను . వాటికే వచనం లో వృత్తి అనే వ్యాఖ్యానం రాశాను . వృత్తి లో అనేక పద్యాలు ఉదాహారించాను . నా వక్రోక్తి సిద్ధాంతాన్ని వృత్తి సంపూర్ణంగా వివరిస్తుంది .వక్రత అంటే వైచిత్య్రం .ఉక్తి వైచిత్రమే వక్రోక్తి .వక్రోక్తి అల0కా రాలతో శోభించి హృదయాలను రంజి0పజేస్తుంది. ఇదొక అసాధారణ భావ ప్రకటన అన్నమాట .కావ్యలోకం లోనే ఇది కనిపిస్తుంది .దీన్ని వివిధ సిద్ధాంత కర్తలు వేర్వేరుగా నిర్వ చించారు .కొందరు అలంకారం లో భాగం అంటే మరికొందరు అలంకారాలు వక్రోక్తియే ఆధారం అన్నారు కావ్యానికి వక్రోక్తి ప్రాణం అన్నాను .కవిత్వా నికిది జీవం పోస్తుంది .కావ్యానికి జీవితమే వక్రోక్తి . అందుకే నా రచనకు వక్రోక్తి జీవితం అనే ప్రత్యేక మైన పేరు పెట్టాను .

అభినవ గుప్తుడు -మా కాశ్మీరు సోదరులం ఇలా ఒక చోట కలుసుకొనే మహద్భాగ్యం కలిపించిన సరసభారతి కి కృతజ్ఞతలు . 50 పైగా రచనలు చేశానునేను.  శైవాగమాలపై పంచికలు రాశాను శ్రీ పూర్వ శాస్త్రం ,స్తోత్రాలూ రాశాను ..నా రచనలు మూడు రకాలు .తాంత్రికం ఆలంకారికం ,తాత్వికం . నేను ముఖ్యంగా ఆల0కారి కుడను .అలంకారిక సమస్యలను చారిత్రిక ,విశ్లేషణాత్మక ,మనో వైజ్ఞానిక  తార్కిక ,తాత్విక దృక్పధాలనుంచి పరిశీలించాను .కళాప్రయోజనాలు ఆర్ష సిద్ధా0తమూ  చర్చించాను .నాటక ,కావ్య రచనలో వచ్చే అలంకార సమస్యలకే నేను పరిమితమయ్యాను .నాటక ప్రదర్శనలో సాక్షాత్కరించేది ,అనుభవించేది ఐన రసం ను పురస్కరించుకొని వచ్చే అలంకార సమస్యలను చారిత్రిక దృక్పధం నుంచి ప్రత్యేకించి పరిశీలించి నాకు ముందువారైనభట్ట లొల్లట  ,శ్రీశంకువు  ,భట్టనాయక రసం పై చెప్పిన ప్రసిద్ధ అభిప్రాయాలను ఉటంకించాను . లొల్లటు నిది ఆచరణాత్మకమైనా ,ప్రేక్షకుడిలో రసాను భూతి ఎలా కలుగుతుందో  చెప్పలేదు .కానీ తర్వాత వాళ్ళు ఆయనది భ్రమన్త సిద్ధాంతం అన్నారు . శ్రీ శంకుడు సిద్ధాంత దృక్పథ0 నుంచి అలంకార సమస్యను పరిశీలించాడు .ప్రధాన రసం గమ్యం అయితే మిగిలినవి గమకాలు .రసం పరోక్ష అనుకరణ అయితే మిగిలినవి ప్రత్యక్ష అనుకరణ -’’అనుకరణ రూపత్వదేవచ నామాంతరేణ వ్యాపదిష్టో రసాహ్ ‘’. అన్నాడు అభినవ భారతిలో శ్రీశ0కుడు  .

నేను అలంకార సమస్యను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించి నాటక ప్రదర్శనలో రసాను భూతికలిగించే వస్తువులను విశ్లేషించి ,దానిలో అంశీ భూతంగా ఉన్న అంశాలను బయటికి తీశాను ..రసాత్మక వస్తువు లోని భాగాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో నిరూపించాను . రసికుని వ్యక్తిత్వం సామాన్యునిలో ఎలా భేదిస్తుందో కూడా చెప్పను . రసాత్మక వస్తువుకు ,అనుభవం లో ఉన్న వస్తువుకు మధ్య తేడాను అంతరాన్ని విడమర్చి చెప్పాను .రసికుని వ్యక్తిత్వం అతని మానసిక ,భౌతిక పరిస్థితుల కారణంగా రసాను భూతికలుగుతుందని స్పష్టం చేశాను .ఈ విషయం లో భట్టనాయకుని అభిప్రాయాన్ని కాదన్నాను . సోదరులారా మీరు కొన సాగించండి .

మమ్మటుడు -నా కావ్య ప్రకాశం లో మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం .కావ్య నిర్వ చనం చెప్పి కావ్యభేదాలు తెలియజేసి కావ్య ప్రయోజనాలు ,కవి యోగ్యతలు స్పృశించాను సహజ సిద్ధ ప్రతిభ లేకపోతె కవిత్వం వెక్కిరింపుకు గురి అవుతుందని హెచ్చరించాను.  అలంకారాలతో నిండి గుణాలు కలిగి దోష రహితమైన శబ్దార్ధాల కూర్పుతో కవిత్వం రాయాలి అన్నాను .అలంకారాలు తప్పని సరికాదు . శబ్దార్ధాలు చక్కని పొందిక కలిగి ఉండాలి . స్వచ్ఛమైన కవిత్వానికి అలంకార బంధనాలనుంచి విముక్తికల్గించాను.  శబ్దార్ధ విచారణ తాత్విక చర్చగా చేశాను . అలంకార శాస్త్రం లో ఇలాంటి తాత్విక చర్చ కొత్త వ్యంజనానికి దారితీసింది .కవితాత్మ ధ్వని వ్యంజనమ్ పై ఆధారపడి ఉంటుంది .శబ్దానికి అభిదా ,లక్షణా ,వ్యంజనా అని మూడు రకాల శక్తులుంటాయి .

కుంతకుడు -వక్రోక్తి పై నావి మౌలిక భావనలు .శబ్దార్ధాల పోహళింపు ,కవి సృజనాత్మక భావన  కవితాయోగ్యతలు  కవిత్వ మర్యాద అంటే సాహిత్య ,కవి వ్యాపార ,గుణ ,ఔచిత్యాల ను  సుసంపన్నం చేశాను . భామహుడే  నా ప్రేరణ .వక్రోక్తి కావ్యానికి జీవితం అనే సిద్ధా0తం ప్రతిపాదించాను .వక్రోక్తి విచిత్రమైన భావ వ్యక్తీకరణ . ఈ వైచిత్రియే ఉచ్చస్తితికి తీసుకు వెడుతుంది .పదాలకు ,భావాలకు మరొక అభిప్రాయం కలిగించేది వక్రోక్తి . వైదగ్ధ్య  ఫణితి  లాగా అన్నమాట ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.